L-1 Visa
-
వీసా ఫీజులు పెంచిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ, ఎల్–1, ఈబీ–5 తదితర నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపు ప్రకారం..భారతీయ టెక్కీలు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే హెచ్–1బీ వీసా ఫీజు ప్రస్తుతమున్న 460 డాలర్ల నుంచి ఏకంగా 780 డాలర్లకు పెరిగింది. హెచ్–1బీ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా 10 అమెరికన్ డాలర్ల నుంచి 215 డాలర్లకు పెరగనుంది. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. అదే విధంగా, ఎల్–1 వీసా ఫీజు 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు, ఇన్వెస్టర్ల వీసాగా పిలిచే ఈబీ–5 కేటగిరీ వీసా ఫీజును ప్రస్తుతమున్న 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచుతున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం బుధవారం ఒక నోటిఫికేషన్లో వివరించింది. 2016 తర్వాత మొదటిసారిగా చేపట్టిన వీసా ఫీజుల పెంపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కానుంది. -
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీసాల జారీ విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2022 సంవత్సరానికి గానూ..హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వీసాలకోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. తాజా నిర్ణయంతో.. వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు కాన్సులేట్‌కు వెళ్లి భౌతికంగా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. హెచ్-2 వీసా, ఎఫ్-ఎమ్ వీసా, ఎకాడమిక్ జే వీసాలపై ఇప్పటికే అమల్లో ఉన్న ఈ నిబంధనను.. 2022 డిసెంబర్ 31 వరకు పొడగిస్తూ కాన్సులర్ అధికారులకు విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ ఆదేశాలు జారీ చేశార. అయితే స్థానిక పరిస్థితులు, అవసరాల మేరకు కాన్సులేట్ అధికారులు ఇన్‌పర్సన్ ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశముంది. అందువల్ల సంబంధిత వెబ్సైట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని విదేశాంగశాఖ సూచించింది. చదవండి: విషాదం: నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 32 మంది సజీవ దహనం -
అదే ఉద్యోగమైతే అమెరికా రావొచ్చు
వాషింగ్టన్: అమెరికా వెళ్లాలనుకునే భారత్ టెక్కీలకు కాస్త ఊరట లభించింది. హెచ్–1బీ, ఎల్–1 వీసాలపై ప్రయాణం ఆంక్షల్ని ట్రంప్ సర్కార్ స్వల్పంగా సడలించింది. వీసాల నిషేధానికి ముందు పనిచేసిన యాజమాన్యాల దగ్గరే తిరిగి ఉద్యోగాలు లభిస్తే విదేశీ వర్కర్లని అమెరికా రావడానికి అనుమతినిచ్చినట్టు విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు వీసా ప్రయాణాల ఆంక్షల్ని సవరించింది. అమెరికాలో మళ్లీ పాత ఉద్యోగాలే దొరికితే ఉద్యోగితో పాటు, జీవిత భాగస్వామి, పిల్లలు కూడా అమెరికాకి రావచ్చునని విదేశాంగ విడుదల చేసిన ట్రావెల్ అడ్వయిజరీలో స్పష్టం చేసింది. కోవిడ్–19 సంక్షోభ పరిస్థితుల్లో అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోవడంతో హెచ్–1బీ, ఎల్–1 ఇతర వీసాదారులు అమెరికాలో అడుగు పెట్టకుండా జూన్ 22న అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు కాపాడడానికే ఈ ఆంక్షలు వి«ధించినట్టు అప్పట్లో ట్రంప్ వెల్లడించారు. దీనిని ప్రముఖ టెక్కీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ సడలింపులు చేస్తున్నట్టుగా విదేశాంగ శాఖ వెల్లడించింది. అదే ఉద్యోగమైతే వీసాల మంజూరు అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ట్రంప్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలతో తిరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. గతంలో ఎవరైనా ఉద్యోగం కోల్పోయి, మళ్లీ ఇప్పుడు అదే సంస్థలో, అదే ఉద్యోగాన్ని పొందితే అమెరికా రావడానికి వీసాలు జారీ చేస్తామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా కరోనా వైరస్‌పై పోరాటానికి ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారు, ప్రాణాంతక వైరస్‌లపై పరిశోధనలు చేస్తున్న వారిని కూడా ఆంక్షల నుంచి మినహాయించింది. ఐటీ సంస్థలతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా హెచ్–1బీ వీసాలపై పూర్తి స్థాయి ఆంక్షల్ని వ్యతిరేకించడం వల్ల ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. -
ఈ ఏడాది హెచ్1బీ లేనట్లే
వాషింగ్టన్: అమెరికాలో పని చేసేందుకు విదేశీ వర్కర్లకు అనుమతినిచ్చే హెచ్–1బీ, ఎల్–1 , ఇతర తాత్కాలిక వీసాలపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. విదేశాల నుంచి వచ్చే ఉద్యోగుల రాకపై నియంత్రణ విధిస్తే దేశంలో స్థానికులకు అవకాశాలు వస్తాయన్నారు. ఫాక్స్ న్యూస్ చానెల్‌కి శనివారం ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ ఒకట్రెండు రోజుల్లో ఈ ఉత్తర్వులపై సంతకం చేస్తానన్నారు. అయితే ఈ ఆంక్షల్లో కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.. ‘‘ఈ వీసాల అనుమతుల్లో కచ్చితంగా కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా ఏళ్లుగా అమెరికాలో ఉండి వ్యాపారాలు చేసే సంస్థలకు సంబంధించి ఎంతో కొంత మినహాయింపులు ఉంటాయి. కానీ మొత్తంగా చూస్తే వీసా విధానాన్ని బాగా కఠినతరం చేస్తాం. కరోనా వైరస్ కారణంగా అమెరికాలో కనీవినీ ఎరుగని స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయింది. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటే, విదేశీయులకు అడ్డుకట్ట తప్పనిసరి’’అని ట్రంప్ చెప్పారు. ఏడాది చివరి వరకు వీసాలపై ఆంక్షలు కొనసాగే అవకాశాలున్నాయి. డాలర్ డ్రీమ్స్‌తో అమెరికా వెళ్లాలనుకొని హెచ్–1బీ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఏడాదికి వీసా వచ్చే అవకాశాలు ఇక ఉండవు. కోవిడ్–19తో అల్లాడిపోయిన అగ్రరాజ్యంలో నిరుద్యోగం రేటు కనీవినీ ఎరుగని స్థాయిలో 4.1శాతం నుంచి 13.5శాతానికి పెరిగిపోయింది. కంప్యూటర్‌కు సంబంధించిన రంగాలలో నిరుద్యోగం రేటు 2020 జనవరిలో 3% ఉంటే, మే నాటికి 2.5% తగ్గింది. విదేశాల నుంచి నిపుణులైన పనివారిని తీసుకోకపోతే అమెరికా ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇప్పటికే ఎన్నో టెక్కీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ► ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపించనుంది. ఏటా జారీ చేసే 85 వేల హెచ్–1బీ వీసాల్లో 70శాతం ఇండియన్ టెక్కీలే. ► ట్రంప్ నిర్ణయంతో ఇండియన్ సర్వీసు కంపెనీలకంటే అమెరికా టెక్ సంస్థలపై ప్రభావం అధికంగా చూపించనుంది. గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన నిపుణులైన టెక్కీలకు హెచ్–1బీ ద్వారా ఉద్యోగాల్లో తీసుకుంటున్నారు. ఇక ఇండియన్ సంస్థలు స్థానిక అమెరికన్లకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ► ఇప్పటికే అమెరికాలో హెచ్–1బీతో ఉన్నవారికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చునని ఇమిగ్రేషన్ లాయర్లు వెల్లడించారు. ► అమెరికా పౌరసత్వం మరియు ఇమిగ్రేషన్ సర్వీసు గణాంకాల ప్రకారం 2016–19 మధ్య హెచ్–1బీలో భారత కంపెనీల వాటా 51% నుంచి 24%కి తగ్గిపోయింది. -
హెచ్1బీ వీసాలు దుర్వినియోగం కాకుండా చూడండి
వాషింగ్టన్: హెచ్1బీ, ఎల్1 వీసాలు దుర్వినియోగం కాకుండా చూడాలని ద్విపక్ష ఎంపీల బృందం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను అభ్యర్థించింది. ఔట్సోర్సింగ్ కంపెనీలు ఈ వీసాలతో విదేశీయులకు ఉద్యోగాలు ఇప్పించి అమెరికన్లకు ఉపాధి లేకుండా చేస్తున్నాయని ఆరోపించాయి. ఈ మేరకు ట్రంప్‌నకు లేఖ రాశాయి. హెచ్1బీ వీసాల వ్యవస్థల లోపాలను సరిదిద్దడానికి తాము ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టామని ఎంపీలు తెలిపారు. వీసాల చట్టంలోనే లోపాలు ఉన్నందున తమ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేందుకు చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడిని కోరాయి. ఇదిలా ఉంటే, గత పదకొండేళ్లలో హెచ్ 1 బీ వీసాకు 21 లక్షలమందికి పైగానే భారతీ యులు దరఖాస్తు చేసుకున్నారని తాజా గణాంకాలు వెల్లడించాయి. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నివేదిక ప్రకారం 2007 నుంచి ఈ ఏడాది జూన్ వరకు వివిధ దేశాల నుంచి 34 లక్షలమంది హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు అందగా అందులో 21 లక్షల మంది భారత్ నుంచే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీసాల వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలను ఆరంభించింది.