ఈ ఏడాది హెచ్‌1బీ లేనట్లే | Donald Trump Expected To Suspend H-1B and Other Visas Until End Of Year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది హెచ్‌1బీ లేనట్లే

Published Mon, Jun 22 2020 5:12 AM | Last Updated on Mon, Jun 22 2020 9:59 AM

Donald Trump Expected To Suspend H-1B and Other Visas Until End Of Year - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో పని చేసేందుకు విదేశీ వర్కర్లకు అనుమతినిచ్చే హెచ్‌–1బీ, ఎల్‌–1 , ఇతర తాత్కాలిక వీసాలపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. విదేశాల నుంచి వచ్చే ఉద్యోగుల రాకపై నియంత్రణ విధిస్తే దేశంలో స్థానికులకు అవకాశాలు వస్తాయన్నారు. ఫాక్స్‌ న్యూస్‌ చానెల్‌కి శనివారం ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్‌ ఒకట్రెండు రోజుల్లో ఈ ఉత్తర్వులపై సంతకం చేస్తానన్నారు.

అయితే ఈ ఆంక్షల్లో కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.. ‘‘ఈ వీసాల అనుమతుల్లో కచ్చితంగా కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా ఏళ్లుగా అమెరికాలో ఉండి వ్యాపారాలు చేసే సంస్థలకు సంబంధించి ఎంతో కొంత మినహాయింపులు ఉంటాయి. కానీ మొత్తంగా చూస్తే వీసా విధానాన్ని బాగా కఠినతరం చేస్తాం. కరోనా వైరస్‌ కారణంగా అమెరికాలో కనీవినీ ఎరుగని స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయింది. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటే, విదేశీయులకు అడ్డుకట్ట తప్పనిసరి’’అని ట్రంప్‌ చెప్పారు.

ఏడాది చివరి వరకు వీసాలపై ఆంక్షలు కొనసాగే అవకాశాలున్నాయి. డాలర్‌ డ్రీమ్స్‌తో అమెరికా వెళ్లాలనుకొని హెచ్‌–1బీ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఏడాదికి వీసా వచ్చే అవకాశాలు ఇక ఉండవు. కోవిడ్‌–19తో అల్లాడిపోయిన అగ్రరాజ్యంలో నిరుద్యోగం రేటు కనీవినీ ఎరుగని స్థాయిలో 4.1శాతం నుంచి 13.5శాతానికి పెరిగిపోయింది. కంప్యూటర్‌కు సంబంధించిన రంగాలలో నిరుద్యోగం రేటు 2020 జనవరిలో 3% ఉంటే, మే నాటికి 2.5% తగ్గింది. విదేశాల నుంచి నిపుణులైన పనివారిని తీసుకోకపోతే అమెరికా ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇప్పటికే ఎన్నో టెక్కీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

► ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపించనుంది. ఏటా జారీ చేసే 85 వేల హెచ్‌–1బీ వీసాల్లో 70శాతం ఇండియన్‌ టెక్కీలే.

► ట్రంప్‌ నిర్ణయంతో ఇండియన్‌ సర్వీసు కంపెనీలకంటే అమెరికా టెక్‌ సంస్థలపై ప్రభావం అధికంగా చూపించనుంది. గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీల్లో భారత్‌ సహా వివిధ దేశాలకు చెందిన నిపుణులైన టెక్కీలకు హెచ్‌–1బీ ద్వారా ఉద్యోగాల్లో తీసుకుంటున్నారు. ఇక ఇండియన్‌ సంస్థలు స్థానిక అమెరికన్లకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి.  

► ఇప్పటికే అమెరికాలో హెచ్‌–1బీతో ఉన్నవారికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చునని ఇమిగ్రేషన్‌ లాయర్లు వెల్లడించారు.  

► అమెరికా పౌరసత్వం మరియు ఇమిగ్రేషన్‌ సర్వీసు గణాంకాల ప్రకారం 2016–19 మధ్య హెచ్‌–1బీలో భారత కంపెనీల వాటా 51% నుంచి 24%కి తగ్గిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement