హెచ్1బీ వీసాలు దుర్వినియోగం కాకుండా చూడండి
వాషింగ్టన్:
హెచ్1బీ, ఎల్1 వీసాలు దుర్వినియోగం కాకుండా చూడాలని ద్విపక్ష ఎంపీల బృందం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను అభ్యర్థించింది. ఔట్‌సోర్సింగ్ కంపెనీలు ఈ వీసాలతో విదేశీయులకు ఉద్యోగాలు ఇప్పించి అమెరికన్లకు ఉపాధి లేకుండా చేస్తున్నాయని ఆరోపించాయి. ఈ మేరకు ట్రంప్‌నకు లేఖ రాశాయి. హెచ్1బీ వీసాల వ్యవస్థల లోపాలను సరిదిద్దడానికి తాము ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టామని ఎంపీలు తెలిపారు. వీసాల చట్టంలోనే లోపాలు ఉన్నందున తమ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేందుకు చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడిని కోరాయి.
ఇదిలా ఉంటే, గత పదకొండేళ్లలో హెచ్ 1 బీ వీసాకు 21 లక్షలమందికి పైగానే భారతీ యులు దరఖాస్తు చేసుకున్నారని తాజా గణాంకాలు వెల్లడించాయి. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నివేదిక ప్రకారం 2007 నుంచి ఈ ఏడాది జూన్ వరకు వివిధ దేశాల నుంచి 34 లక్షలమంది హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు అందగా అందులో 21 లక్షల మంది భారత్ నుంచే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీసాల వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలను ఆరంభించింది.