హెచ్-1బీ టార్గెట్ గా ట్రంప్ సంతకం
హెచ్-1బీ టార్గెట్ గా ట్రంప్ సంతకం
Published Tue, Apr 18 2017 12:40 PM | Last Updated on Wed, Sep 26 2018 6:40 PM
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసాలను కఠినతరం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగం సిద్ధం చేశారు. నేడు హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ మార్పులపై రూపొందించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేయనున్నారు. మరికాసేపట్లో ట్రంప్ ఈ సంతకం చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో దేశీయ ఐటీ రంగం దశదిశ పూర్తిగా మార్పులకు లోనై, కఠినతరమైన నిబంధనలు అమల్లోకి రానున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిల్వాకీ, విస్కాన్సిన్ విచ్చేస్తున్న ట్రంప్, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్నట్టు అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్పారు. ''బై అమెరికన్, హైర్ అమెరికన్'' పేరుతో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను రూపొందించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మెయిన్ టార్గెట్ హెచ్-1బీ వీసాలేనని అధికారులు చెప్పారు.
ఈ ఆర్డర్ తో ''అత్యంత ప్రతిభావంతుల్ని లేదా అత్యధిక వేతన అప్లికెంట్స్'' ను మాత్రమే తీసుకునే లక్ష్యం నెరవేరుతుందని ట్రంప్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. కంపెనీల్లో ప్రతిభావంతులైన విదేశీయులను నియమించుకునేందుకు వీలుగా ఈ హెచ్-1బీ వీసాలను 1990లో అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం కంపెనీలు హెచ్-1బీ వీసాల్లో దుర్వినియోగానికి పాల్పడుతూ అమెరికన్ ఉద్యోగాలకు గండికొడుతున్నాయని ప్రస్తుత ప్రభుత్వ వాదన. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకోనున్నట్టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ తక్కువ వేతనంతో అమెరికన్ లేబర్ ను భర్తి చేసేలా గెస్ట్ వర్కర్లను నియమించుకోనివ్వమని హెచ్చరించారు. దీంతో పాటు ఫెడరల్ నిర్మాణ ప్రాజెక్టులో కూడా అమెరికా తయారుచేసిన ఉత్పత్తులే వాడేలా ఆర్థికవ్యవస్థకు ఊతం కల్పించనున్నామన్నారు.
Advertisement
Advertisement