వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి చట్టపరమైన రక్షణలను తొలగించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. సోషల్ మీడియా ఆన్‌లైన్ కంటెంట్‌ను తనిఖీ చేయడంపై చర్యలు తీసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ట్విటర్ తో బాటు ఫేస్‌బుక్ లాంటి సంస్థలపై చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు రెగ్యులేటర్స్ కు అధికారం లభించనుంది. (ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్)
అమెరికా ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇతర హక్కులను పరిరక్షించడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. ట్విటర్ లాంటి సోషల్ మీడియా దిగ్గజాలు తటస్థ వేదిక అనే సిద్ధాంతం వాడుకోలేరని గురువారం ఉత్తర్వుపై సంతకం చేసిన తరువాత ట్రంప్ విలేకరులతో అన్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కమ్యూనికేషన్స్ డిసెన్సీ యాక్ట్ ప్రకారం, కొత్త నిబంధనలు రాబోతున్నాయని, ఇక సెన్సార్, లయబిలిటీ ముసుగులో వారి ఆటలు సాగవని, ఇది చాలా పెద్ద విషయమని ట్రంప్ నొక్కి చెప్పారు. అంతేకాదు ఈ విషయంలో రాష్ట్రాలతో కలసి పనిచేయాలని అటార్నీ జనరల్‌కు దిశానిర్దేశం చేస్తున్నామన్నారు.
మెయిల్-ఇన్ బ్యాలెట్ విధానానికి వ్యతిరేకంగా ఇటీవల తాను పెట్టిన పోస్టులపై ట్విటర్ ఫ్యాక్ట్ చెక్ లేబుల్ వేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. కాగా ఫేస్‌బుక్, ట్విటర్, గూగుల్ లాంటి సామాజిక మాధ్యమాలు పక్షపాతపూరితంగా వ్యవహరిస్తున్నా యంటూ గతం కొంత కాలంగా ఆయన మండిపడుతున్నారు. తాజాగా ట్విటర్ ఫ్యాక్ట్ చెక్ వ్యవహాంతో వివాదం మరింత ముదిరి చివరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కు దారి తీసింది. అయితే ఈ ఉత్తర్వులకు న్యాయపరమైన సవాళ్లు తప్పవని నిపుణులు భావిస్తున్నారు.
చదవండి : ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన
Comments
Please login to add a commentAdd a comment