ట్రంప్ మరో వివాదాస్పద ఆర్డర్: ఫేస్ బుక్ బ్యాన్
ట్రంప్ మరో వివాదాస్పద ఆర్డర్: ఫేస్ బుక్ బ్యాన్
Published Sat, Apr 1 2017 4:24 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికన్లకు, విదేశీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఒక్క ప్రజలే కాక, దిగ్గజ కంపెనీలు సైతం ట్రంప్ అంటే వణుకుతున్నాయి. ఏడు ముస్లిం మెజార్టి దేశాలపై ట్రావెల్ బ్యాన్ వంటి పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ట్రంప్, తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికా వ్యాప్తంగా ఫేస్ బుక్ వాడకంపై నిషేధం విధిస్తూ మరో కార్యవర్గ ఆదేశాలను జారీచేయడానికి ట్రంప్ సిద్ధమయ్యారు. ఫేస్ బుక్ పై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీచేయనున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఈ నిషేధాన్ని కొంతమంది రిపబ్లిక్ లీడర్లు అసలు ఒప్పుకోవడం లేదట. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫేక్ న్యూస్(తప్పుడు వార్తలకు)కు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు ట్రంప్ వారికి చెప్పారట. ఫేక్ న్యూస్ కు వ్యతిరేకంగా ఫేస్ బుక్ కూడా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం పాలనలో భాగమని ట్రంప్ పేర్కొన్నారు. చాలా తప్పుడు కథనాలు, నిజాలకు ప్రత్యామ్నాయ స్టోరీలు ఈ సైట్లో ఎక్కువగా సర్క్యూలేట్ అవుతున్నట్టు చెప్పారు. ట్రంప్ జారీచేయబోతున్న ఆదేశాల్లో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లను తప్పించినట్టు తెలుస్తోంది. ట్రంప్ ఈ నిర్ణయంతో ఫేస్ బుక్ ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున్నఫేస్ బుక్ యూజర్లు ఆందోళనలను ప్రారంభించారు.
ఒకవేళ ట్రంప్ ఈ ఆర్డర్ ను పాస్ చేస్తే, తాము దానికి మద్దతిస్తామని వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ చెప్పారు. ఈ ప్రతిపాదిత ఆర్డర్ పై స్పందించిన ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, అమెరికాలో బ్యాన్ చేసినప్పటికీ కాలిఫోర్నియా నుంచి తమ ఆపరేషన్లు కొనసాగిస్తామని చెప్పారు. తప్పుడు కథనాలపై పోరాటం చేసే పద్ధతి ఇది కాదని మండిపడ్డారు. ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వచ్చే వలసదారులు, శరణార్థులపై ట్రంప్ నిషేధం విధించినప్పుడు, ఆ నిషేధాన్ని ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ తీవ్రంగా తప్పుబట్టారు. విమర్శలతో ట్రంప్ పై మండిపడ్డారు కూడా. మరోవైపు తమ వెబ్ సైట్లో వచ్చిన తప్పుడు సమాచారం కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు మేలు జరిగిందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఇవన్నీ ఇప్పుడు ఫేస్ బుక్ ప్రతికూలంగా మారబోతున్నాయి.
Advertisement
Advertisement