వాషింగ్టన్: వలసవచ్చిన వారికి అమెరికా గడ్డపై పుడితే వచ్చే జన్మతః పౌరసత్వ హక్కును ట్రంప్ ఒక్క ఉత్తర్వుతో తొలగించడాన్ని విపక్షపాలిత రాష్ట్రాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ విషయంపై 22 రాష్ట్రాలు మంగళవారం కోర్టును ఆశ్రయించాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. విపక్ష డెమొక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్న 22 రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఫెడరల్ జిల్లా కోర్టుల్లో వేర్వేరుగా రెండు దావాలు వేశాయి.
22 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ నగరాలు కలిపి మసాచుసెట్స్‌లోని ఫెడరల్ డిస్టిక్ట్ర్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశాయి. రాజ్యాంగంలోని 14వ సవరణప్రకారం జన్మతః పౌరసత్వం అనేది ఆటోమేటిక్‌గా అమలవుతుందని వాదించాయి. అధ్యక్షుడిగానీ పార్లమెంట్‌లోని ప్రజా ప్రతినిధులసభ(దిగువ సభ) లేదంటే సెనేట్(ఎగువ సభ)కు కూడా ఈ హక్కు విషయంలో సవరణలు చేసే అధికారం లేదని వాదించాయి.
మిగతా నాలుగు రాష్ట్రాలు వాషింగ్టన్‌లోని వెస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశాయి. మీకు ఉన్న ‘తాత్కాలిక నిలుపుదల’, ‘ముందస్తు ఆదేశం’అధికారాలను ఉపయోగించి అధ్యక్షుడి ఉత్తర్వు అమలుకాకుండా అడ్డుకోండి’’అని న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ ష్ట్రాలు అభ్యర్థించారు. ‘‘పుట్టగానే పౌరసత్వం రాదు అని ప్రకటించడమంటే మీరంతా అమెరికన్లు కాబోరు అని వివక్షచూపడమే’’అని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా వాదించారు.
ట్రంప్ ఉత్తర్వును తప్పుబట్టిన భారతీయ అమెరికన్ చట్టసభ్యులు
ట్రంప్ ఉత్తర్వును అమెరికా చట్టసభల్లోని భారతీయమూలాలున్న నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్రమంగా వలసవచ్చిన వారి పిల్లలను మాత్రమేకాదు చట్టబద్ధంగా హెచ్–1బీ, హెచ్2బీ, బిజినెస్, స్టూడెంట్ వీసాల మీద వచ్చి అమెరికాలో ఉంటున్న వలసదారుల సంతానంపైనా పెను ప్రభావంచూపుతుంది. చట్టబద్ధ వలసవిధానానికి రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకం అనే అపవాదు సైతం పడుతుంది.
ఏదేమైనా జన్మతః పౌరసత్వం అనేది చట్టబద్ధం. దీని కోసం ఎంతకైనా తెగించి పోరాడతాం’’అని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకుడు రో ఖన్నా ప్రకటించారు. ‘‘ఒక్క కలంపోటుతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం. ఇది నిజంగా అమల్లోకి వస్తే దేశంలోని మిగతా చట్టాలను, రాజ్యాంగ నియమాలను అవమానించినట్లే’’అని ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకురాలు ప్రమీలా జయపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే ట్రంప్ ఉత్తర్వుపై వలసదారుల హక్కుల సంఘాల కూటమి కోర్టులో దావావేసింది.
Comments
Please login to add a commentAdd a comment