న్యూయార్క్:భారత్, కెనడా దేశాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రికత్తల నేపథ్యంలో ప్రతిస్పందనగా భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించాలని అమెరికా పరిశీలిస్తున్నట్లు ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి. అయితే వాటిపై తాజాగా అమెరికా స్పందించింది. సదరు వార్తలను అమెరికా విదేశాంగశాఖ తోసిపుచ్చింది.
సిక్కు వేర్పాటువాది, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భారతీయ హైకమిషన్ పేరును కెనడా చేర్చిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇతర దౌత్యవేత్తల ప్రమేయం ఉన్నట్లు కెనడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో అమెరికా సైతం భారత దౌత్యవేత్తలను బహిష్కరించాలని యోచిస్తున్నట్లు ఆ కథనాల సారాంశం.
అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. భారత దౌత్యవేత్తలపై చర్యలు తీసుకోవాలని అమెరికా పరిశీలిస్తున్నట్లు వెలువడిన కథనాలను ఖండించారు.‘‘ మేం భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించినట్లు వెలువడ్డ నివేదికల విషయం గురించి నాకు తెలియదు. అటువంటి బహిష్కరణ గురించి మేం ఆలోచించలేదు. అంతా ఊహాగానాలు మాత్రమే’’ అని అమెరికా వైఖరిని స్పష్టం చేశారు.
ఈ నెల ప్రారంభంలో భారత దౌత్యవేత్తలపై కెనడా ఆరోపణలు చేయటంతో ప్రతిస్పందనగా భారతదేశం కెనడాలో ఉన్న తన ఆరుగురు దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. అదేవిధంగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను కూడా భారత్ బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రక్తలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇక.. ఈ పరిణామాలు కెనడా, భారత్ మధ్య సంబంధాలను మరింత దెబ్బతీశాయి.
Comments
Please login to add a commentAdd a comment