ఏబీ వెంకటేశ్వరరావు.. ఐపీఎస్! పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వార్తల్లోకి ఎక్కిన వివాదాస్పద అధికారి. రిటైర్ అయిన తరువాత కూడా తన వ్యాఖ్యలు, వైఖరితో మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటున్న వ్యక్తి కూడా. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్‌ల అండతో ఆయన ఈ మధ్య కాలంలో మరింత చెలరేగిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
తాజాగా ఆయన తన ‘కమ్మ’ కులం వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, హితబోధ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎవరేమనుకుంటే తనకేమన్నట్టుగా ఆయన మాట్లాడటం.. తన మాటల వల్ల ఇతర కులాల వారి మనోభావాలు ఎంత దెబ్బతింటున్నాయో ఆలోచించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కులం వారు ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడాన్ని అడ్డుకోగలరా?. కులమతాలకు అతీతంగా అందరూ ఓట్లేస్తేనే ఒక పార్టీ ఎన్నికవుతుంది కదా?.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా కమ్మ కులం వాళ్లు అన్ని రకాలుగా అడ్డుకోవాలన్నది ఏబీ వెంకటేశ్వరరావు ఇచ్చిన పిలుపు! ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని, అహర్నిశలు కష్టపడాలని కూడా ఆయన తన కులం వారిని కోరుకున్నారు. కమ్మ వారికి ఏదో పెద్ద సందేశం ఇచ్చానని ఆయన అనుకుంటున్నారేమో తెలియదు కానీ, దీనివల్ల కమ్మ వారిపై మిగిలిన వారికి మరింత వ్యతిరేకత వస్తుంది. అసహ్యం ఏర్పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈయన లాంటి వ్యక్తులు కమ్మ కులం వారిని భ్రష్టు పట్టిస్తున్నట్లుగా ఉంది.
ఈ క్రమంలోనే ఆయన వైఎస్ జగన్‌పై పరుష పదాలతో విమర్శించారు కూడా. సభ్య సమాజం ఏమాత్రం అంగీకరించని విమర్శలివి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన రెడ్డి, ఇతర కులాల వారిని ఏకం చేస్తున్నారని, వైఎస్ జగన్‌ను అభిమానించే బలహీన వర్గాల వారందరూ ఒక్కతాటిపైకి వచ్చేలా చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పనితీరుకు ఏబీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని కూడా అంటున్నారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను చూస్తే అసలు ఆయన ఐపీఎస్ అధికారేనా? అన్న అనుమానం వ్యక్తం చేసిన వాళ్లూ ఉన్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు వెనుక కీలక పాత్రధారి ఈయనే అన్న అనుమానమూ వస్తోంది.
వాస్తవానికి ఏబీ వెంకటేశ్వరరావు ఒకప్పుడు ఇంత వివాదాస్పదుడు కానేకాదు. ఇంత చెడ్డ పేరూ లేదు. తెలుగుదేశంతో జత కట్టిన తర్వాతే ఇలా తయారయ్యారు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. రెడ్‌బుక్ సృష్టికర్త లోకేష్ కనుసన్నలలో పనిచేస్తూ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల కమ్మ వర్గం వారు ఇతర సామాజికవర్గాల దృష్టిలో విలన్ల మాదిరి కనిపించేవారు. తత్ఫలితంగా మిగిలిన కులాలన్నీ ఏకమై తెలుగుదేశం పార్టీని ఓడించాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్లీ ఇదే ధోరణి ఆరంభమైనట్లుగా ఉంది.
వీరి రెడ్‌బుక్‌లో ఉన్న పేర్లలో ఎక్కువ భాగం రెడ్డి లేదా షెడ్యూల్ కులాల వారే. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారన్న కారణంగా ఈ వర్గాల అధికారులు కొందరికి ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు. ఐఏఎస్ టాప్ ర్యాంకర్ ముత్యాలరాజు వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగల అవకాశం ఉన్న మహిళా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు. అలాగే టీడీపీ ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌లను బయటకు తీశారన్న కోపంతో ఏదో ఒక నెపం పెట్టి కొంతమంది ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడం, కేసు పెట్టి అరెస్టు చేయాలన్న ఆలోచన కూడా చేశారు. ఇదంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందని ఏబీ వెంకటేశ్వరరావు ఫీల్ అవుతుండవచ్చు.
కానీ, ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌కు ఎంపికై సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించిన ఈయనకు రాజ్యాంగంపై అవగాహన ఉండాలి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి పేషీ, మంత్రులు ఎలా పనిచేస్తారో తెలిసి ఉండాలి. లోకేష్ వంటి అనుభవం లేని వారు కక్ష సాధింపు చర్యలకు దిగుతుంటే, వారించవలసిన ఈయనే స్వయంగా కుల ప్రస్తావన తెచ్చి ప్రసంగాలు చేయడం శోచనీయం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కాకుండా అడ్డుకునేందుకు దేనికైనా సిద్ధపడాలన్న ఏబీ వ్యాఖ్య వెనుక ఉద్దేశం ఏమిటన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. హింసకు కూడా వెనుకాడవద్దని పరోక్షంగా పిలుపునిస్తున్నారా? అంటూ మీడియాలో కథనాలూ వచ్చాయి.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల మ్యానిప్యులేషన్ జరిగిందన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ అదే పద్ధతి అవలంబించాలన్నది ఆయన చేస్తున్న సూచనా?. సమాజంలో కులాల కొట్లాటలు ఉంటే ఉండవచ్చు కానీ.. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత హోదాల్లో పనిచేసే వాళ్లు కూడా ఇంత తక్కువ స్థాయి ఆలోచనలు చేయడం, చెత్త ప్రకటనలు చేయడం ఎంత వరకూ సబబు?. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు వద్ద ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఏబీ శాంతి భద్రతల విషయాన్ని పక్కనబెట్టి రాజకీయంగా వైఎస్సార్‌సీపీని ఎలా దెబ్బ తీయడమన్న విషయంపైనే దృష్టిపెట్టేవారని చాలా మంది టీడీపీ నేతలు చెబుతారు. ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ సమావేశంలో ఒకసారి మాట్లాడుతూ తెలుగు యువత అధ్యక్ష పదవిని పొందడానికి ఏబీ వెంకటేశ్వర రావు క్లియరెన్స్ తీసుకోవాలని ఆశావహులకు సూచించిన వీడియో అప్పట్లో కలకలం రేపింది.
వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకురావడానికి ప్రలోభాలు పెట్టడంలో ఏబీతో పాటు ఒక మీడియా అధినేత విశేష పాత్ర పోషించారని చెబుతారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయనపై ఇజ్రాయిల్ నుంచి గూఢచర్య పరికరాల కొనుగోలులో జరిగిన అక్రమాలపై కేసు పెట్టి సస్పెండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై విచారణకు ఓకే చేసింది. తనపై ఆ కేసు పెట్టినందుకు ఏబీకి ఆగ్రహం ఉండవచ్చు. కానీ, ఆ కేసులో తాను సచ్ఛీలుడినని రుజువు చేసుకోవచ్చు. ఎటూ ప్రభుత్వం వారిదే కనుక తమకు కావల్సిన జీవోలను తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. కోర్టు ద్వారా రిటైర్మెంట్ రోజున సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వు పొందారు. దాన్ని గౌరవించి గత ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఏబీ తన వ్యాఖ్యల్లో వైఎస్ జగన్‌తోపాటు వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా విమర్శించారు.
అయితే, వైఎస్సార్ హాయంలో ఈయనకు వచ్చినవన్నీ దాదాపు మంచి పోస్టులేనని సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చిన వివరాలను బట్టి అర్ధం అవుతుంది. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు కర్నూలు రేంజి డీఐజీ పోస్టు ఇచ్చింది. వైఎస్సార్ సొంత జిల్లా అయిన కడప కూడా ఈ రేంజ్‌లోనే ఉంది. మరి ప్రాముఖ్యత లభించినట్లా? కాదా? హైదరాబాద్‌లో జాయింట్ కమిషనర్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిక్రూటింగ్, వైజాగ్ రేంజ్ ఐజీ వంటి బాధ్యతలను కూడా అప్పట్లో అప్పగించారు. వైఎస్సార్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఈయనను అంతగా ప్రాధాన్యం లేని ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీగా నియమించారు. అయినా వైఎస్సార్‌పై ఈయన విమర్శలు చేయడం ధర్మమా? అన్నది కొందరి ప్రశ్న.
ఇక్కడ మరో మాట చెప్పాలి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి అవమానించినప్పుడు కమ్మవారికి అవమానం జరిగినట్లు కాదా?. చంద్రబాబుకో, ఏబీ వంటివారికో ఏదైనా ఇబ్బంది వస్తే, వారిపై ఆరోపణలు వస్తే కమ్మ వారందరికీ వచ్చినట్లా? ఏ కులంలో అయినా లాభం కొందరికే లభిస్తూంటుంది. సంపాదన, పెత్తనం కూడా కొందరికే దక్కుతుంది. అలాంటివారు ఆ కులంలోని ఇతరులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు. ఏబీ కూడా సరిగ్గా అదే పని చేసినట్లుగా కనిపిస్తుంది.
ఏబీ వెంకటేశ్వరరావు, చంద్రబాబు, లోకేష్ వంటివారి ధోరణి వల్ల రెడ్లతో సహా మిగిలిన పలు కులాల వారిలో అభద్రతాభావం ఏర్పడుతుంది. పైకి కాపులను కలుపుకున్నట్లు కనిపిస్తున్నా వారికి క్షేత్రస్థాయిలో అనేక అవమానాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణ పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఎదుటే ఒక జనసేన నేత ఆత్మహత్యాయత్నం చేయడం. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటి సీఎంగా ఉంటే, ఆయనకు పోటీగా లోకేష్‌ను కూడా ఆ హోదాలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు కాపులలో కాక రేపుతోంది.
జనసేన, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఏబీ వెంకటేశ్వరరావు ఈ తరహా అసందర్భ ప్రసంగాలు చేసి సమాజంలో మరింత అశాంతికి దోహదపడడం ఐపీఎస్ హోదాకే అవమానం కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చిన ఈయన రిటైరయ్యాక వ్యవహరిస్తున్న తీరు చూశాక, పదవి బాధ్యతలలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నారని ఎవరైనా అనుకోగలరా?.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment