అది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచు ఫలకం. ఎంతలా అంటే.. ముంబైలాంటి మహానగరాలు ఆరు కలిస్తే ఇది ఏర్పడిందట. అంతటి ఐస్‌బర్గ్ ఓ ద్వీపం వైపుగా దూసుకొస్తోంది. అలాంటప్పుడు ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుంది కదా. అది ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడు చర్చిద్దాం.
A23a.. అంటార్కిటికా ఫ్లిచెనర్ రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి 1986 ఆగష్టులో విడిపోయింది. అప్పటి నుంచి 34 ఏళ్లుగా అక్కడే స్థిరంగా ఉండిపోయింది. అయితే 2020 నుంచి వెడ్డెల్ సముద్రం పశ్చిమం వైపు అది నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. కిందటి ఏడాది జనవరిలో అది సుడిగుండంలో చిక్కుపోయింది. అయితే అనూహ్యంగా డిసెంబర్ మధ్యలో అది అక్కడి నుంచి బయటపడింది. బలమైన గాలుల ప్రభావమే దాన్ని అక్కడి నుంచి బయటపడేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ మధ్యే యూఎస్ నేషనల్ ఐస్ సెంటర్ దీనిని ఈ భూమ్మీద అతిపెద్ద ఐస్‌బర్గ్‌గా ప్రకటించింది కూడా.
ఇక.. సుమారు 4వేల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ఐస్‌బర్గ్.. బ్రిటీష్ సరిహద్దుల వైపు ప్రయాణిస్తోంది. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న సౌత్ జార్జియాను అది ఢీ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దీవికి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మంచు ఫలకం.
ఈ ఐస్‌బర్గ్ పైభాగానికి పదిరెట్లు సముద్రంలో ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే.. ట్రిలియన్ టన్నుల బరువుండొచ్చనేది ఒక అంచనా. ప్రపంచంలోనే భారీ మంచు ఫలకం కావడంతో.. అందరి కళ్లు దీని మీదే ఉన్నాయి. అందుకే దానిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే గంటకు ఒక మైలు వేగంతో పయనిస్తోందట!.
ఢీ కొడితే ఏమౌతుందంటే..
సౌత్ జార్జియా పెద్దగా జనావాసం లేని ద్వీపం. కానీ, వైవిధ్యమైన జంతుజాలం అక్కడ ఉంది. కింగ్ పెంగ్విన్స్, సాధారణ సీల్స్‌తో పాటు ఎలిఫెంట్ సీల్స్ ఈ దీవి ఆవాసం. అయితే గతంలో ఈ దీవిని ఈ తరహాలోనే ఐస్‌బర్గ్‌లు ఢీ కొట్టాయి. ఆ టైంలో పక్షులు, సీల్ చేపలు లాంటివి లెక్కలేనన్ని మరణించాయి. అలాగే ఇప్పుడు ఈ భారీ ఐస్‌బర్గ్ ఢీ కొడితే.. ఆ నష్టం ఊహించని స్థాయిలో ఉండొచ్చనే ఆందోళన నెలకొంది. అంతేకాదు.. అది అక్కడి నౌకాయాన రంగంపైనా తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దిశ మార్చుకుంటుందా?
అయితే సౌత్ జార్జియాకు చేరుకునేలోపే మెగాబర్గ్.. ముక్కలయ్యే అవకాశం ఉందని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే అంచనా వేస్తోంది. అలాగే.. దీవి వైపు కాకుండా దిశ మార్చుకుని పయనించే అవకాశమూ లేకపోలేదని చెబుతోంది. ఇందుకు గతంలో జరిగిన పరిణామాలనే ఉదాహరణలుగా చెబుతోంది. అయితే..
ఢీ కొట్టనూ వచ్చు!
మరోవైపు.. శాటిలైట్ వ్యవస్థ ద్వారా దీని కదలికలను పరిశీలించిన బ్రిటిష్ అంటార్కిటికా సర్వే ప్రతినిధి ఆండ్రూ మెయిజెర్స్ మాత్రం పై వాదనలతో ఏకీభవించడం లేదు. ఇది మిగతా ఐస్‌బర్గ్‌లాగా ముక్కలు కాకపోవచ్చనే ఆయన అంటున్నారు. పైగా అది దిశ మార్చుకునే అవకాశాలను ఆయన కొట్టిపారేశారు. ఇది గతంలోని ఐస్‌బర్గ్‌ల మాదిరి కనిపించడం లేదని అంచనా వేస్తున్నారాయన. ద్వీపాన్ని ఢీ కొట్టిన తర్వాత అది దక్షిణాఫ్రికా వైపు దారి మళ్లొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
ఏ23ఏ ఏర్పాటునకు క్లైమేట్ ఛేంజ్‌తో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ.. భవిష్యత్తులో ఈ తరహా భారీ మంచు ఫలకలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. అంటార్కిటికాలో సముద్ర మట్టం పెరగడం, ఉష్ణోగ్రతల పెరుగుదల.. భవిష్యత్తులో ఈ తరహా భారీ ఐస్‌బర్గ్‌లను మన ముందు ఉంచే అవకాశాలే ఎక్కువ.
A68aకి ఏమైందంటే..
ఏ68ఏ.. A23a కంటే ముందు ప్రపంచంలో అతిపెద్ద ఐస్‌బర్గ్‌గా రికార్డుల్లో నమోదైంది. పరిమాణంలో లండన్ నగరం కంటే మూడు రెట్లు పెద్దది. బరువు ఒక ట్రిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా. ఇది కూడా సౌత్ జార్జియాను ఢీ కొట్టవచ్చని అప్పట్లో ఆందోళన చెందారు. అయితే.. ఐల్యాండ్‌కు సరిగ్గా వంద మైళ్ల దూరంలో ఉండగానే దానికి భారీగా డ్యామేజ్ అయ్యింది. ఆపై అది సముద్రంలోనే కరిగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment