Iceberg
-
అతి పెద్ద ఐస్‌బర్గ్... మళ్లీ కదిలింది!
ఏ23ఏ. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐస్‌బర్గ్. తాజా కొలతల ప్రకారం దాని విస్తీర్ణం 3,672 చదరపు కిలోమీటర్లు! చూపు తిప్పుకోనివ్వని ఆర్చిలు, అందమైన గుహలతో పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది 1986లో ఫిల్క్నర్ రోన్ మంచుఫలకం నుంచి విడివడింది. కొన్నాళ్లపాటు కాస్త దూరం కదిలాక అంటార్కిటికాలోని వెడ్డెల్ సముద్ర ఉపరితలంపై సెటిలైపోయింది. 30 ఏళ్లపాటు అక్కడే స్తబ్ధుగా ఉండిపోయింది. అందులోని అందమైన గుహలను, దాని పొడవునా ఏర్పడే రకరకాల ఆకృతుల మంచు ఆర్చిలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ ఏటా పర్యాటకులు పోటెత్తుతుంటారు. అలాంటి ఏ23ఏ 2020లో స్వల్పంగా కరిగిపోవడంతో మళ్లీ కదలడం మొదలు పెట్టింది. అంటార్కిటికాలోని టైలర్ కాలమ్‌లో ఉపరితలానికి తాకడంతో కొద్ది నెలలుగా అక్కడే నిలిచిపోయింది. మంచు కరుగుతుండటంతో కొద్ది రోజులుగా అది మళ్లీ కదలడం మొదలుపెట్టినట్టు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే (బీఏఎస్) బృందం వెల్లడించింది. ‘‘ఏ23ఏ ఐస్‌బర్గ్ సముద్ర ప్రవాహాల తాకిడికి క్రమంగా వెచ్చని జలాలవైపు సాగుతోంది. సౌత్ జార్జియాలోని మారుమూల దీవుల గుండా వెళ్తూ క్రమక్రమంగా కరిగి కొన్నాళ్లలో పూర్తిగా కనుమరుగవుతుంది’’అని ప్రకటించింది. దాంతో సైంటిస్టులందరి దృష్టీ దానిమీదే కేంద్రీకృతమైందిప్పుడు. ఏ23ఏను సైంటిస్టులు 1986లో తొలిసారిగా గమనించారు. అప్పట్లో అది 3,900 చ.కి.మీ. పై చిలుకు విస్తీర్ణంతో ఉండేది. నాటినుంచీ చాలాకాలం పాటు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐస్బర్గ్గా నిలుస్తూ వచ్చింది. మధ్యలో దానికంటే పెద్ద పరిమాణంలో ఏ68 (2017లో), ఏ76 (2021లో) వంటివి పుట్టుకొచ్చినా అవన్నీ చూస్తుండగానే కరిగి చిన్నవైపోయాయి. ఏ23ఏ దర్జా మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. తాజా కదలికల పుణ్యమా అని అది ఇక మూణ్నాళ్ల ముచ్చటేనంటున్నారు సైంటిస్టులు. అయితే అది కరగడం వల్ల సముద్రమట్టం పెరగడం వంటి ముప్పు ఉండకపోవచ్చని వాళ్లు చెబుతున్నారు. ఏ23ఏ కరుగుదలకు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులే కారణమని వాపోతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేదార్నాథ్ సమీపంలో భారీ హిమపాతం
రుద్రప్రయాగ్: కేదర్నాథ్లో దైవదర్శనం కోసం విచ్చేసిన భక్తులకు అద్భుత దృశ్యం ఆహ్వానం పలికింది. హిమాలయ పర్వత శిఖరాల నుంచి భారీ ఎత్తున మంచు కిందకు కూలుతున్న ‘హిమపాతం’ దృశ్యం అక్కడి వారిని ఆశ్చర్యం, ఒకింత ఆందోళనకు గురిచేసింది. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని కేదర్నాథ్ ఆలయం వెనకవైపు నాలుగు కిలోమీటర్లదూరంలోని పర్వతం నుంచి ఒక్కసారిగా భారీ ఎత్తున మంచు విరిగిపడటం ప్రారంభమైంది. భక్తులు ఒకింత భయపడుతూనే ఆ దృశ్యాలను మొబైళ్లలో బంధించేందుకు పోటీపడ్డారు. మేరు–సుమేరు పర్వతశ్రేణుల్లోని చోరాబారీ హిమానీనదం పరిధిలో గాంధీ సరోవర్‌పై హిమపాతం పడింది. మంచంతా లోయలో పడిపోవడంతో కేదర్నాథ్ ఆలయం దాకా దూసుకురాలేదు. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు ఐదు నిమిషాలపాటు గుట్టలకొద్దీ మంచు కిందకు పడుతున్న వీడియో వైరల్‌గా మారింది. -
Nature Geoscience: అంటార్కిటికాలో ‘కరిగిన నీటి’ ముప్పు
లండన్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలతో సముద్రాలు వేడెక్కుతున్నాయి. మంచు కరిగిపోతోంది. సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే మరికొన్ని దశాబ్దాల్లో సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాలు జల సమాధి కావడం తథ్యమన్న హెచ్చరికలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. అతిపెద్ద మంచు కొండలకు నిలయమైన అంటార్కిటికా సముద్రంలో వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంటార్కిటికా మంచు కొండలపైనా, అంతర్భాగంలో కరిగిన నీరు, మంచు మిశ్రమం(స్లష్) గతంలో అంచనా వేసిన దానికంటే అధికంగా ఉన్నట్లు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం పూర్తి వివరాలను నేచర్ జియోసైన్స్ పత్రికలో ప్రచురించారు. కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతతో స్లష్ పరిమాణాన్ని తేల్చారు. అంటార్కిటికాలో వేసవి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో కరిగిన నీరు 57 శాతం స్లష్ రూపంలో, మిగతా 43 శాతం చెరువులు, కుంటల పైభాగంలో ఉన్నట్లు గుర్తించారు. మంచు కొండలపై ఉన్న నీరంతా సముద్రంలోకి చేరితే అంటార్కిటికా నీటి మట్టం మరింత పెరుగుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన స్కాట్ పోలార్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి డాక్టర్ రెబెక్కా డెల్ వివరించారు. ఇప్పుటిదాకా ఉన్న అంచనాల కంటే 2.8 రెట్లు అధికంగా స్లష్ ఉన్నట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే మంచు కొండలపై కరిగిన నీటి పరిమాణం వేగంగా పెరుగుతుంది. దాంతో బరువు పెరిగి మంచు కొండలు కూలిపోవడం, ముక్కలు కావడం మొదలవుతుంది. నీరంతా సముద్రంలోకి చేరుతుంది. -
మంచు పాన్పు
చలికాలపు రాత్రి నిద్రొస్తే మనమంతా బిర్రుగా ముసుగు తన్నిపడుకుంటాం. కానీ ఈ మంచు ఎలుగుబంటి మాత్రం సుఖమనిన ఇదియెగాద అనుకుంటూ మంచుపాన్పుపై హాయిగా నిద్రపోయింది. ఐస్‌బర్గ్‌పై ఎలుగు నిద్రపోతున్న ఫొటోను బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ నీమా సరిఖానీ తీశారు. ఈ ఫొటో.. పీపుల్స్ ఛాయిస్ సంస్థ చేపట్టిన ఓటింగ్‌లో పాల్గొన్న వేలాది మందికి తెగ నచ్చేసింది. దీంతో నీమాను పీపుల్స్ ఛాయిస్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించారు. నార్వేకు చెందిన స్వాల్బార్డ్ ద్వీపసమూహంలో ఉత్తర ధృవానికి అత్యంత సమీప ఐస్‌బర్గ్‌ల వద్ద ఈ ఫొటోను తీశారు. -
A23a: అతి పెద్ద ఐస్‌బర్గ్... 40 ఏళ్ల తర్వాత కదిలింది
అది ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్‌బర్గ్. పేరు ఏ23ఏ. విస్తీర్ణం ఏకంగా 4,000 చదరపు కిలోమీటర్లు. మరోలా చెప్పాలంటే పరిమాణంలో గ్రేటర్ లండన్‌తో పోలిస్తే రెండింతలకు పై చిలుకే. అంతటి విస్తీర్ణంతో, ఏకంగా 400 మీటర్ల మందంతో భారీ సైజుతో అలరారుతూ చూసేందుకది ఓ మంచు ద్వీపకల్పంలా కని్పంచేది. అలాంటి ఐస్‌బర్గ్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కదలడం మొదలు పెట్టింది. ఈ పరిణామం పర్యావరణ నిపుణులను ఆందోళన పరుస్తోంది. గ్లోబల్ వార్మింగ్ తాలూకు దుష్పరిణామాలకు దీన్ని తాజా సంకేతంగా వారు భావిస్తున్నారు... 1986 నుంచీ... ఏ23ఏ ఐస్‌బర్గ్ అప్పుడెప్పుడో 1985 చివర్లో అంటార్కిటికా తీరం నుంచి విడిపోయింది. అంటార్కటికా తాలూకు అతి పెద్దదైన ఫిల్‡్షనర్ మంచు ఫలకం నుంచి విడిపోయిన భారీ ఐస్బర్గ్ల్లోకెల్లా పెద్దదిగా ఇది రికార్డులకెక్కింది. అప్పటికే ఏ23ఏపై సోవియట్ యూనియన్ ఒక పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేసుకుంది! అందులోని సామగ్రినంతటినీ అది హుటాహుటిన తరలించడం మొదలు పెట్టింది. కానీ కొద్దిపాటి ప్రయాణం అనంతరం 1986కల్లా అంటార్కిటికా పరిధిలోని వెడెల్ సముద్రంలో ఐస్‌బర్గ్ నిశ్చలంగా నిలిచిపోయింది. ఒకరకంగా సముద్రం తాలూకు అడుగు భాగంతో కలిసిపోయి అలా నిలబడిపోయింది. కరిగిపోతోంది... ఇంతకాలం నిశ్చలంగా ఉన్నది కాస్తా ఏ23ఏ ఇప్పుడు మరోసారి కదులుతోంది. దీనికి కారణాలపై సైంటిస్టులంతా దృష్టి సారించగా, ఇది అంటార్కిటికా సముద్ర జలాల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతున్న ఫలితమేనని తేలింది! ‘‘దాదాపు 40 ఏళ్ల కాలగమనంలో ఐస్‌బర్గ్ పరిమాణంలో కుంచించుకుపోయింది. దానికి గ్లోబల్ వార్మింగ్ తోడైంది’’ బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే రిమోట్ సెన్సింగ్ నిపుణుడు డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు. వాస్తవానికి ఏ23ఏలో 2020లోనే అతి తక్కువ స్థాయిలో కదలికలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. సముద్ర పవనాల హోరు, ప్రవాహాల జోరుకు అదిప్పుడు వేగం పుంజుకుందన్నారు. ఇప్పుడది క్రమంగా అంటార్కిటిక్ ద్వీపకల్పపు ఉత్తరాగ్రంకేసి కదులుతోంది. చివరికది ఐస్‌బర్గ్‌ల క్షేత్రంగా పిలిచే అంటార్కిటికా దక్షిణ ప్రాంతానికి చేరేలా కని్పస్తోంది. ప్రమాద ఘంటికే...! ఎంత పెద్ద ఐస్‌బర్గ్‌లైనా కాలక్రమంలో చిక్కిపోవడం, క్రమంగా కనుమరుగవడం పరిపాటే. కానీ అందుకు వందలు, కొన్నిసార్లు వేలాది ఏళ్లు కూడా పడుతుంటుంది. అలాంటి ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ఏ23ఏ ఐస్‌బర్గ్ ఇలా శరవేగంగా కరుగుతుండటం, కదిలిపోతుండటం ప్రమాద సూచికేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది దక్షిణ జార్జియాకేసి సాగితే అక్కడి జీవావరణానికి పెద్ద సమస్యగా కూడా మారవచ్చని చెబుతున్నారు. దాని నుంచి కరిగే నీటితో పెరిగిపోయే సముద్ర మట్టం ఆ ద్వీపకల్ప తీరంలో లక్షలాది సీల్స్, పెంగ్విన్లు, సముద్ర పక్షుల పునరుత్పత్తి ప్రాంతాలను ముంచెత్తవచ్చన్నది వారి ఆందోళన. అయితే ఈ పరిణామంతో కొన్ని లాభాలూ లేకపోలేదట! ‘‘ఐస్‌బర్గ్‌లు జీవనప్రదాలు కూడా. కరిగే క్రమంలో వాటినుంచి విడుదలయ్యే ఖనిజ ధూళి సమీప సముద్ర జీవజాలానికి ప్రాణాధారంగా మారుతుంది’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అతిపెద్ద ఐస్‌బర్గ్ అంతర్ధానం!
వాషింగ్టన్: భూతాపానికి ఫలితం ఈ ఉదాహరణ. అంటార్కిటికాలోని అట్లాంటిక్ తీరప్రాంతంలో ఉన్న రొన్నే మంచు పలక నుంచి విడివడిన ఒక భారీ ఐస్‌బర్గ్ త్వరలోనే కనుమరుగు కానుంది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఈ ఐస్‌బర్గ్ 2021 మేలో విడిపోయాక మరో మూడు ముక్కలైంది. అమెరికాకు చెందిన టెర్రా ఉపగ్రహం ఈ ఐస్బర్గ్లోని అతిపెద్ద భాగం ఫొటో తీసింది. దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరం పయనించిన ఈ ఐస్‌బర్గ్ భారీ శకలం ప్రస్తుతం దక్షిణ అమెరికా ఖండంలోని కేప్ హార్న్‌కు, అంటార్కిటికాలోని దక్షిణ షెట్లాండ్ దీవులు, ఎలిఫెంట్ దీవులకు మధ్యలోని డ్రేక్ పాసేజీలో ఉంది. ఎ–76ఎ గా పిలుస్తున్న దీని పొడవు 135 కిలోమీటర్లు కాగా వెడల్పు 26 కిలోమీటర్లు.. లండన్ నగరానికి ఇది రెట్టింపు సైజు అని అమెరికా నేషనల్ ఐస్ సెంటర్ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇది తన ఆకారాన్ని కోల్పోలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, భూమధ్య రేఖ వైపు పయనించి అక్కడి సముద్ర జలాల వేడికి త్వరలోనే అంతర్థానం కానుందని అంటున్నారు. ఐస్‌బర్గ్‌లను సర్వసాధారణంగా బలమైన ఆర్కిటిక్ ప్రవాహాలు డ్రేక్ పాసేజ్ గుండా ముందుకు తోసేస్తాయి. అక్కడి నుంచి అవి ఉత్తర దిశగా భూమధ్య రేఖ వైపు పయనించి వేగంగా కరిగిపోతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
సముద్రాల గుండె చప్పుడు విందాం!
వాషింగ్టన్: వాతావరణ మార్పులు.. భూగోళంపై మానవళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించాయి. ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లోని మంచు వేగంగా కరిగిపోతోంది. ఫలితంగా సముద్రాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. తీర ప్రాంతాల్లో ముంపు భయం వెంటాడుతోంది. వీటన్నింటికి మానవుల అత్యాశే కారణమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సముద్రాల గుండె ఘోష వినేందుకు ఐర్లాండ్‌కు చెందిన కళాకారిణి సియోభాన్ మెక్‌డొనాల్డ్ నడుం బిగించారు. సముద్రాల అడుగు భాగంలో సంభవించే భూకంపాలు, విరిగిపడే కొండ చరియలు, జీవజాలం మనుగడ, కాలుష్యం, కరిగిపోతున్న మంచు గురించి సమగ్రంగా తెలుసుకొనేందుకు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సముద్రం వివిధ ప్రాంతాల్లో మైక్రోఫోన్లు(హైడ్రోఫోన్స్) జార విడుస్తున్నారు. ఇందుకోసం గ్రీన్‌ల్యాండ్, కెనడా మధ్య ఉన్న డెవిస్ అఖాతాన్ని ఎంచుకున్నారు. ఇప్పటిదాకా 12 మైక్రోఫోన్లను జారవిడిచారు. ఈ ప్రయోగానికి అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. ఈ ప్రయోగం ఒక టైమ్ క్యాప్సూల్ మైక్రోఫోన్లు రెండేళ్లపాటు సముద్రంలోనే ఉంటాయి. 2024లో బయటకు తీస్తారు. ఇవి ప్రతి గంటకోసారి సముద్ర అడుగు భాగంలోని శబ్దాలను స్పష్టంగా రికార్డు చేస్తాయి. ఈ శబ్దాలన్నింటిని కలిపి ఒక ఆడియోను రూపొందిస్తారు. ఇది ‘సముద్ర జ్ఞాపకం’గా మెక్‌డొనాల్డ్ అభివర్ణించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ విపత్తుల విషయంలో ఇదే మొట్టమొదటి సైన్స్, ఆర్ట్స్ ఉమ్మడి ప్రయోగమని చెబుతున్నారు. సముద్రాల గుండె చప్పుడు వినడం ద్వారా భూమిపై సమీప భవష్యత్తులో సంభవించే విపరిణామాలను ముందే అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రయోగం ఒక టైమ్ క్యాప్సూల్ లాంటిదేనని మెక్‌డొనాల్డ్ అన్నారు. పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ తనను ఈ ప్రయత్నానికి పురికొల్పిందని చెప్పారు. గ్రీన్‌ల్యాండ్‌లో పెద్ద ఎత్తున మంచు పేరుకొని ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు శిలాజ ఇంధనాల వాడకం ఆపేసినా సరే గ్రీన్‌ల్యాండ్‌లో 110 క్వాడ్రిలియన్ టన్నుల మంచు కరిగిపోయి సముద్ర మట్టం 27 సెంటీమీటర్లు(10.6 అంగుళాలు) పెరుగుతుందని అంచనా. -
‘థ్వాయిట్స్ హిమానీనదం’.. కరిగిపోతే ప్రళయమే!
సాక్షి, నేషనల్ డెస్క్: థ్వాయిట్స్ హిమానీనదం. అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలోని అత్యంత భారీ మంచు కొండ. వైశాల్యం ఎంతంటే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిట్స్ కొంతకాలంగా వాతావరణ మార్పుల కారణంగా శరవేగంగా కరిగిపోతోందట. ఎంతలా అంటే ఇప్పుడిది మునివేళ్లపై నిలబడి ఉందట! అందుకే శాస్తవేత్తలు థ్వాయిట్స్కు ప్రళయకాల హిమానీనదం (డూమ్స్‌డే గ్లేసియర్) అని మరోపేరు పెట్టారు. ఈ గ్లేసియర్తోపాటు సమీప ప్రాంతాల్లోని మంచు మొత్తం కరిగిపోతే ప్రపంచమంతటా సముద్ర మట్టం ఏకంగా 3 మీటర్ల మేర పెరిగి, తీర ప్రాంతాలు చాలావరకు నీట మునిగి నామరూపాల్లేకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు. థ్వాయిట్స్ తాజా స్థితిగతులపై అమెరికా, యూకే, స్వీడన్ సైంటిస్టులు సంయుక్తంగా అధ్యయనం చేశారు. గత 200 ఏళ్లలో కరిగిన దానికంటే ఇప్పుడు రెండింతలు ఎక్కువ వేగంగా కరిగిపోతున్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను ‘నేచర్ జియోసైన్స్’ పత్రికలో ప్రచురించారు. సైంటిస్టులు అత్యాధునిక పరికరాలతో థ్వాయిట్స్ గ్లేసియర్ పరిమాణాన్ని గణించారు. ప్రతిఏటా 1.3 మేళ్లకుపైగా(2.1 కిలోమీటర్ల) కరిగిపోతున్నట్లు తేల్చారు. ‘‘గ్లేసియర్ చివరి దశకు చేరుకుంటోందని చెప్పొచ్చు. సమీప భవిష్యత్తులో పెద్ద మార్పులను మనం అంచనా వేయొచ్చు’’ అని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేకు చెందిన మెరైన్ జియోఫిజిసిస్ట్ రాబర్ట్ లార్టర్ చెప్పారు. ఐరాస సమాచారం ప్రకారం ప్రపంచ జనాభాలో 40 శాతం సముద్ర తీరాలకు 60 మైళ్ల పరిధిలోనే నివసిస్తున్నారు. సముద్ర మట్టం పెరిగితే సమీపంలోని ఆవాసాలు మునిగిపోతాయి. మనుషులకు, ఇతర జీవజాలానికి పెను ముప్పు తప్పదు. గ్రేట్ బ్రిటన్ అంత పెద్దది! ► పశ్చిమ అంటార్కిటికాలోని థ్వాయిట్స్ గ్లేసియర్ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మొత్తం పరిమాణం కంటే కొంత తక్కువ పరిమాణంలో ఉంటుంది. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంతో దాదాపు సమాన పరిమాణంలో ఉంటుంది. ► గ్లేసియర్ మొత్తం చుట్టుకొలత 74,131 చదరపు మైళ్లు(1,92,000 చదరపు కిలోమీటర్లు). అంటే గ్రేట్ బ్రిటన్ చుట్టుకొలతతో సమానం. ► ఇక దీని మందం ఎంతంటే 4,000 మీటర్లు (13,100 అడుగులు). ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాల పెరుగుదలలో థ్వాయిట్స్ వాటానే అధికం. ► థ్వాయిట్స్ మొత్తం మందం 4 కిలోమీటర్లు కాగా, ఇందులో రెండు కిలోమీటర్లకు పైగా సముద్ర ఉపరితలం నుంచి దిగువ భాగాన ఉంది. ► థ్వాయిట్స్ హిమానీనదం పూర్తిగా కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటిమట్టం దాదాపు మూడు మీటర్ల మేర(10 అడుగులు) పెరుగుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇదీ చదవండి: 1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతం -
‘కిమ్’ కర్తవ్యం?
సియోల్: కొరియన్లకు పవిత్రమైన స్థలం ఉత్తరకొరియాలోని అత్యంత ఎత్తయిన మంచుకొండల మధ్య శ్వేతవర్ణపు అశ్వంపై రాచరికపు ఠీవీని ఒలకబోస్తోన్న ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ చిత్రాలు మీడియాలో హఠాత్తుగా దర్శనమిచ్చాయి. ఆ దేశపు కీలక నిర్ణయాల సమయంలో గతంలో కూడా కిమ్ ఇలాగే చేయడంతో ఈ చిత్రాల వెనుక మతలబేమిటనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గోధుమ రంగు పొడవాటి కోటులో మంచుకొండల మధ్య కిమ్ పోజిచ్చిన స్థలం, ఆయన స్వారీ చేస్తోన్న తెల్లటి గుర్రం కిమ్ కుటుంబ రాచరికపు అధికారదర్పాన్ని ప్రదర్శిస్తున్నాయి. 2,750 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మంచుకొండల ప్రాంతానికి కిమ్ రావడం ఇది తొలిసారి కాదు. గతంలో దేశ రాజకీయాలను మలుపుతిప్పే అరుదైన నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో ఈ స్థలాన్ని సందర్శించే అలవాటు కిమ్‌కి ఉంది. మౌంట్ పీక్టూ కిమ్ జాంగ్ ఉన్ తండ్రి నివాస స్థలమే కాకుండా ఉత్తర కొరియా విప్లవంలో ఈ స్థలానికి చారిత్రక ప్రాధాన్యత సైతం ఉన్నట్టు బుధవారం విడుదల చేసిన కెసీఎన్ఏ రిపోర్టు వెల్లడించింది. దక్షిణ కొరియాతో దౌత్య సంబం«ధాలపై ప్రకటన చేయడానికి కొన్ని వారాల ముందు 2017లో నూతన సంవత్సరం సందర్భంగా మౌంట్ పీక్టూని కిమ్ సందర్శించారు. ఆ సందర్భంగా దక్షిణకొరియాతో దౌత్యసంబంధాలకు సంబంధించిన అంశాలను సూచనప్రాయంగా చెప్పారు. అలాగే 2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయీ ఇన్‌తో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అణ్వస్త్ర ప్రయోగానికి సంబంధించిన బటన్ ఎప్పుడూ తన టేబుల్‌పైన సిద్ధంగా ఉంటుందని కిమ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. సుదూర లక్ష్యాలను చేరే క్షిపణులను, అణ్వాయుధ పరీక్షలను తలపెట్టబోమన్న కిమ్ వాగ్దానాన్ని ఆయన పునరాలోచించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికాతో ఉత్తరకొరియా చర్చలు ప్రస్తుతం ప్రతిష్టంభనలో ఉన్నవిషయం తెలిసిందే. -
ఇనార్సూట్ గ్రామ సమీపంలో భారీ మంచుకొండ
-
భారీ మంచుకొండ.. భయం గుప్పిట్లో గ్రామం..
ఇనార్సూట్, గ్రీన్లాండ్ : కేవలం 170 మంది జనాభా కలిగిన గ్రీన్లాండ్లోని ఇనార్సూట్ గ్రామం సునామీ భయంతో వణికిపోతోంది. ఇందుకు కారణం దాదాపు 100 మీటర్లు(330 అడుగులు) ఎత్తైన భారీ మంచుకొండ సదరు గ్రామాన్ని సమీపిస్తుండటం. దాని నుంచి మంచు చరియ గనుక విరిగితే భారీ ఎత్తున అలలు గ్రామంపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధికారులు అక్కడి ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. అయితే, కొందరు స్థానికులు మాత్రం ఈ తరహా భారీ మంచు తునకలు గ్రామానికి సమీపంలో కనిపించడం కొత్తేమీ కాదని అంటున్నారు. గతంలో దీని కంటే అతి పెద్ద మంచు చరియలు అటువైపుగా పయనించాయని వెల్లడించారు. మంచు చరియకు భారీ స్థాయిలో పగుళ్లు ఉండటమే మాత్రం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించే స్టేషన్, ఇంధన వనరు ప్రదేశం తీరానికి అతి చేరువలో ఉన్నాయి. మంచు చరియ దాదాపు కోటి 10 లక్షల టన్నుల బరువు ఉంటుందని భావిస్తున్నారు. నీటిపై భాగంలో దాదాపు 100 అడుగుల ఎత్తు వరకూ మంచుకొండ ఉంది. అప్పుడప్పుడూ చిన్నచిన్న మంచు ముక్కలు విరిగి నీళ్లలో పడిన శబ్దాలు సైతం స్థానికులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. -
రంగు పడింది
తెల్లగా వెండిలా మెరిసిపోవాల్సిన మంచుకొండలు నారింజ రంగు పులుముకున్నాయి. రష్యా, ఉక్రెయిన్, బల్గేరియా,రుమేనియాలతోపాటు తూర్పు యూరప్ అంతటా ఇదే తీరు! భూమ్మీద కాకుండా అరుణగ్రహంపై ఉన్నామా? అనేంత నారింజ రంగు! ఎందుకిలా? పోటెత్తిన పర్యాటకులకు వచ్చినా.. సమాధానం మాత్రం నాసా తీసిన ఫోటోల ద్వారా శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి ఎగసిన ఇసుక గాలులే ఈ మార్పునకు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. అక్కడి దుమ్ము, ధూళి, ఇసుక రేణువులు మంచుకొండల్ని చుట్టేయడంతో అవి నారింజ రంగులోకి మారిపోయాయని చెబుతున్నారు. యూరప్‌లో ఇలా జరగడం ఇదే మొదటి సారి. దీంతో పర్వతారోహకులు, మంచులో స్కేటింగ్ చేసే వాళ్లు ఈ అరుదైన కొండల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇది సర్వసాధారణమైన విషయమని ప్రతీ అయిదేళ్లకు ఒకసారి ఇలా జరుగుతుందని చెబుతున్నారు. ఒక ప్రాంతంలో ఎగిసిపడే దుమ్ము, ధూళి ఇంకో ప్రాంతంలో వాతావరణంపై ప్రభావం చూపించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2007లో దక్షిణ సైబీరియాలోనూ ఇలాగే మంచు ఆరెంజ్ రంగులోకి మారిపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. -
మంచుసీమలో మనువాద సెగ
కొత్త కోణం నేపాల్ దేశ జనాభాలో దళితులు 13.6 శాతం. కానీ ఈ గణాంకాలు వాస్తవం కాదనీ, వారు అంతకన్నా ఎక్కువేననీ దళిత సంఘాల వాదన. భౌగోళిక ప్రాంతాల వారీగా, మదేశి (తరాయి) హిల్(కొండలు), మౌంటెన్స్(పర్వతాలు)లలో దళితులు విస్తరించి ఉన్నారు. భారతదేశానికి ఆనుకొని ఉన్న తరాయి ప్రాంతంలోనే వీరు అధికంగా నివసిస్తున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. దళితుల్లో అక్షరాస్యత తక్కువ. జాతీయ సగటు అక్షరాస్యత 65.9 శాతం ఉండగా, దళితుల అక్షరాస్యత 52.40 శాతం. మంచుకొండల మధ్య నేపాల్ ప్రజల జీవితం ప్రశాంతంగానే కనిపిస్తుంది దూరం నుంచి చూసేవారికి. కానీ పదేళ్ల క్రితం అక్కడ జరిగిన సాయుధ తిరుగుబాటు ఇంకో విషయం చెబుతుంది. నాటి నెత్తుటి వరదలను చూసిన వారికి ప్రజలెదుర్కొన్న అణచివేత, దోపిడీ, పీడనల తీవ్రత గుర్తుకు వస్తాయి. మావోయిస్టుల నాయకత్వంలో రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పేద ప్రజల భాగస్వామ్యం చరిత్రాత్మకమైనది. అందులో దళితుల భాగస్వామ్యాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆ సాయుధ తిరుగుబాటులో పాల్గొన్న దాదాపు 19 వేల మంది సైన్యంలో, 7వేలకు పైగా అంటరాని కులాల వారే. వీరిలో 1100 మంది ప్రాణాలు కోల్పోయారు. నిరాశ్రయులైనవారు, నేటికీ ఆచూకీ లేనివారు వందల మంది ఉన్నారు. 2006లో ముగిసిన ఆ ప్రజాయుద్ధంలో దళితుల పాత్ర ప్రముఖమైనది. ఆ యుద్ధంలో పాల్గొన్న దళితులం దరూ మంచి సమాజం కోసం కలలుగన్నారు. అయితే యుద్ధం ముగిసినా నేటికీ స్థిరమైన రాజకీయ ప్రభుత్వం ఏర్పడలేదు. ఇంతటి స్తబ్దతలో కూడా నేపాలీలు రాజ్యాంగాన్ని రూపొందించుకోగలిగారు. వారం క్రితం గౌతమ బుద్ధుని జన్మస్థలి లుంబిని (నేపాల్) వెళ్లిన సందర్భంగా కొంతమంది దళిత మేధావులతో మాట్లాడినప్పుడు అనేక విషయాలు తెలిశాయి. కుల వివక్ష, అంటరానితనపు వికృత రూపాలు అర్థమయ్యాయి. లోకానికి తెలియని వివక్ష ఎన్నో రూపాలలో వేళ్లూనుకొని ఉంది. జనాభాలో దళితులు దాదాపు 15 శాతం. తరతరాలుగా ఎదుర్కొంటోన్న అణచివేత, దోపిడీ, వివక్ష, అంటరానితనం వారిచేత ఆయుధాలను పట్టించింది. చిన్న చిన్న పోరాటాల రూపంలో ప్రారంభమై, అంతిమంగా సాయుధ పోరాట రూపం దాల్చింది. భారత్ నమూనాలోనే నేపాల్ కుల సమాజం ఆవిర్భావానికీ, భారతదేశ కులాల పుట్టుకకూ దగ్గరి సంబంధం ఉంది. నేపాల్ భారతదేశానికి కొనసాగింపు, ఒక నమూనా మాత్రమే. మనుస్మృతిని ఇక్కడ తు.చ. తప్పకుండా అమలు చేశారు. బ్రాహ్మణ, చెత్రి(క్షత్రియ), నెవారి కులాలను జంధ్యం ధరించే ద్విజులుగాను; దాహం తీర్చుకోవడానికి నీరు కూడా పుచ్చుకోకూడని కులాలను నిమ్నకులాలుగా, ఆ తర్వాత అంటరాని కులాలుగా ప్రకటించారు. ఈ అంతరాలను చట్టబద్ధం చేస్తూ 1854లో అప్పటి ప్రధానమంత్రి జంగ్ బహుదూర్ రాణా ఒక పౌర చట్టాన్ని తీసుకొచ్చారు. అలా మతపరంగా ఉన్న కుల కట్టుబాట్లు, చట్టబద్ధ రూపాన్ని తీసుకున్నాయి. ఆపై దాదాపు వందేళ్ల తర్వాత నేపాల్ దళిత ఉద్యమానికి రూపకల్పన జరిగింది. భారత దేశంలో రగిలిన దళిత చైతన్యం, అంబేడ్కర్ ఆలోచనా విధానం అక్కడి విద్యావంతులైన అతి కొద్దిమంది దళితులకు ఒక స్ఫూర్తి. 1946లో సర్బజిత్ బిశ్వకర్మ బిశ్వ సర్బజన్ సంఘ్‌ను, నేపాల్ సమాజ్ సుదార్ సంఘ్‌ను, సద్‌బిర్ బిశ్వకర్మ, సహర్షనాథ్ నాయకత్వంలో 1947లో మరొక సంఘాన్ని స్థాపించి కుల వివక్షకు సవాలు విసిరారు. 1950 సంవత్సరం వచ్చేనాటికల్లా నేపాల్ అంటరాని కులాల్లో చైతన్యం రగిలి, ప్రజాస్వామిక ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఈ సంఘాల నాయకత్వంలో మొట్టమొదటిసారిగా 1952లో ఖట్మాండులోని పశుపతినాథ దేవాలయంలో దళితుల ప్రవేశం కోసం ఆందోళన జరిగింది. ఈ క్రమంలోనే మరిన్ని సంఘాలు, సంస్థలు ఈ ఉద్యమంలో చేరాయి. ఆ సంస్థలలో సమాజ్ సుదార్ సంఘ్ నేపాల్ రాష్ట్రీయ దళిత్ జన బికాస్ పరిషత్గా పేరు మార్చుకున్నది. 1972లో మొదటి మహాసభ జరిపి దళితులకు రిజర్వేషన్లు అనే అంశంపై వాణిని వినిపించింది. 1990 నుంచి నేపాల్ దళితుల ఉద్యమం నూతన శకంలోకి అడుగుపెట్టింది. ఆ ప్రయాణమే 1996 నుంచి 2006 వరకు మావోయిస్టు ప్రజాయుద్ధంగా కొనసాగింది. మావోయుస్టులు బలంగా ఉన్న ప్రాంతంలో దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారనీ, కొన్ని ప్రాంతాల్లో భూములను కూడా దక్కించుకున్నారనీ నివేదికలున్నాయి. నేపాల్ అంతర్యుద్ధం ముగిసి, శాంతి ఒప్పందాలు జరిగి, రాజ్యాంగం ఏర్పాటయ్యే వరకు కూడా దళిత సంఘాలు, సంస్థలు, మేధావులు తమ హక్కుల కోసం కృషి చేశారు. దాని ఫలితంగానైతేనేమి, ప్రపంచ వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా భారతదేశంలో అంబేడ్కర్ రూపొం దించిన రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో వల్లనైతేనేమి– నేపాల్ రాజ్యాంగంలో ప్రజాస్వామిక హక్కులు భాగమయ్యాయి. అప్పటి వరకు అధికారికంగా హిందూదేశంగా ఉన్న నేపాల్ లౌకికదేశమైంది. ఇది గొప్ప విజయం. ఈ విజయం వెనుక నేపాల్ దళిత జాతుల రక్తతర్పణం కూడా ఉన్నదన్న వాస్తవం విస్మరించలేనిది. కొత్త రాజ్యాంగంతో ఊరట నూతన రాజ్యాంగం కోసం 2007లో ప్రారంభమైన ప్రక్రియ 2015 వరకు సాగింది. 2015, సెప్టెంబర్ 20న నేపాల్ రాజ్యాంగం అధికారికంగా ఆవిర్భవించింది. దీనికి ఒక సుదీర్ఘ పీఠికను రాసుకున్నారు. స్వేచ్ఛగా పాలించుకునే స్వతంత్రదేశంగా నేపాల్ రూపొందుతుందనీ, అన్ని రకాల వివక్షలను నిర్మూలిస్తుందనీ, ప్రజాస్వామిక విలువలపై ఆధారపడి సోషలిజాన్ని నిర్మించుకునే కార్యక్రమానికి అంకితమవుతామనీ పీఠిక గర్వంగా ప్రకటించింది. ప్రజాస్వామ్య, రిపబ్లిక్, ఫెడరల్ విధానాల ద్వారా సుపరిపాలనను అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నది. రాజ్యాంగంలోని మూడవ విభాగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. గౌరవప్రదంగా జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వ హక్కు, సమాచార హక్కు, న్యాయాన్ని పొందే హక్కులతో పాటు అంటరానితనం, వివక్షను వ్యతిరేకించే హక్కులను ఇందులో పొందుపరిచారు. దళిత హక్కుల గురించి 40వ ఆర్టికల్ ప్రస్తావిస్తున్నది. విద్య, ఉద్యోగ సంబంధమైన అవకాశాలను కల్పించే నిబంధనలను కూడా ఇందులో చేర్చారు. భూమిలేని దళితులకు భూవసతి కల్పించే అంశానికి కూడా ఇందులో చోటు ఇచ్చారు. 40వ ఆర్టికల్‌ను ప్రాథమిక హక్కులలో భాగం చేయడం విశేషం. అయితే రాజ్యాంగం ఇచ్చేది హక్కులు మాత్రమే. వీటి అమలుకు మళ్లీ ప్రత్యేక చట్టాలు కావాలి. సామాజిక అసమానతల వికృత రూపాలను నిర్మూలించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. నేపాల్ దేశ జనాభాలో దళితులు 13.6 శాతం. కానీ ఈ గణాంకాలు వాస్తవం కాదనీ, వారు అంతకన్నా ఎక్కువేననీ దళిత సంఘాల వాదన. భౌగోళిక ప్రాంతాల వారీగా, మదేశి(తరాయి)హిల్(కొండలు), మౌంటెన్స్ (పర్వతాలు)లలో దళితులు విస్తరించి ఉన్నారు. భారతదేశానికి ఆనుకొని ఉన్న తరాయి ప్రాంతంలోనే వీరు అధికంగా నివసిస్తున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. దళితుల్లో అక్షరాస్యత తక్కువ. జాతీయ సగటు అక్షరాస్యత 65.9 శాతం ఉండగా, దళితుల అక్షరాస్యత 52.40 శాతం. పదవ తరగతి చేరుకున్న వాళ్లు 1.6 శాతం, డిగ్రీ చేసిన వాళ్లు 0.8 శాతం మాత్రమే. దళితుల్లో మరింత వెనుకబాటుతనానికీ, వివక్షకూ గురవుతున్న ముషాహర్, డోమ్ కులాల్లో అక్షరాస్యత 17 శాతమే. దళిత బాలబాలికల పట్ల ఉపాధ్యాయులు చూపిస్తున్న వివక్ష కూడా వీరిని విద్యకు దూరం చేస్తున్నది. ఇప్పటికీ దళిత బాలబాలికలను ప్రత్యేకంగా కూర్చోబెడుతున్న పరిస్థితి. నీటి కుండల నుంచి, కుళాయిల నుంచి నీటిని తాగే హక్కు దళితులకు లేదు. అదేవిధంగా పిల్లలను హీనంగా చూడడం, మాట్లాడడం వల్ల చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. యాభై శాతం దారిద్య్ర రేఖకు దిగువనే... జీవనాధారమైన భూమి కూడా వీరికి చాలా తక్కువ. అరకొర భూమి కలిగిన వాళ్లను వదలిపెడితే దాదాపు 50 శాతానికిపైగా ఎటువంటి భూమీ దళితుల చేతిలో లేదని తేలింది. దానితో వీళ్లందరూ కూడా రోజు కూలీలుగా బతుకుతున్నారు. అంతే కాకుండా గల్ఫ్ దేశాలకు, ఇండియాకు కూలీలుగా వలసపోయి దుర్భర దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. దాదాపు దళితులంతా దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. ప్రతి అయిదుగురిలో ముగ్గురు కటిక దారిద్య్రంలో, పౌష్టికాహార లోపంతో కుంగి కృశించి పోతున్నారు. కులవృత్తులకు ఆదరణలేక, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ప్రవేశం లేక ఉపా«ధి, ఉద్యోగం కరువైపోయాయి. ఇప్పటి వరకు ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు లేకపోవడంతో. దీనితో ఆధిపత్య కులాలే నూటికి నూరు శాతం ఉద్యోగాలు అనుభవిస్తున్నారు. ఆరోగ్యరంగంలో కూడా దళితులు తీవ్రమైన అవస్థలు భరిస్తున్నారు. దళితులకు వైద్య సౌకర్యాలు అందించే సమయంలో కూడా అవమానాలు, వివక్షలు ఎదురవుతున్నాయి. మరుగుదొడ్ల లాంటి సౌకర్యాలు గగన కుసుమమే. భారతదేశంలో వలెనే దళిత మహిళలు మూడు రకాల వివక్షలకు గురవుతున్నారు. మహిళగా కుటుంబంలో, దళితురాలిగా, దళిత మహిళగా సమాజంలో వివక్షను, అణచివేతను భరిస్తున్నారు. ఇప్పటికీ దళితుల్లో ఉన్న పేదరికాన్ని ఆసరాచేసుకొని వీరిని సెక్సువర్కర్లుగా మారుస్తున్నారు. ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. మదేశి, తరాయి ప్రాంతంలోని దళితులు మరింత వివక్షకు గురవుతున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో గానీ హోటళ్లకు వెళితే, దళితులకు విడిగా గ్లాసులు, పళ్లాలు ఉంటాయి. బస్సుల్లో, ఆటోల్లో కూడా వీరికి అవమానాలే ఎదురవుతుంటాయి. వీళ్లు బస్సుల్లో ఎక్కి కూర్చుంటే ఆధిపత్య కులాల వాళ్లు వస్తే లేచి నిలబడాలి. లేదంటే దిగి వెళ్లిపోవాలి. ఒకవేళ ఎవరైనా ధైర్యంగా అలాగే కూర్చుంటే, ప్రాణం తీసేవరకు ఆధిపత్య కులాలు వెనకాడవు. కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లను ప్రాణాలతో వదిలిపెట్టరు. కానీ, 2015లో అమలులోనికి వచ్చిన రాజ్యాంగం దళితులకు కొంత ఊరట. ఈ రాజ్యాంగం సరిగా అమలు కావాలన్నా మళ్లీ దళితులు నూతన ఉద్యమాన్ని ప్రారంభించాల్సిందే. అందుకోసమే నేపాల్ దళితులు ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలను కరదీపికగా మార్చుకోవాలని చూస్తున్నారు. గౌతమ బుద్ధుని జన్మస్థలమైన లుంబినిలో అంబేడ్కర్ సోషల్ ఫౌండేషన్‌ను స్థాపించి, దాని నాయకత్వంలో దళితుల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని కల్పించి, రాజ్యాంగం ఆధారంగా అనేక అంశాలపై ప్రత్యేక చట్టాల కోసం పోరాడాలని భావిస్తున్నారు. ఆ విధంగా నేపాల్ దళిత రాజకీయ ఉద్యమంలో అంబేడ్కర్ సోషల్ ఫౌండేషన్ మైలురాయి అవుతుందని వారి విశ్వాసం. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
ముక్కలైన మరో అతి పెద్ద మంచు ఫలకం
వాషింగ్టన్ : ఈ భూగోళంపై ప్రకృతి రచించిన దృశ్య కావ్యం అంటార్కిటికా. అది ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశం మాత్రమే కాదు... నిత్యం వీచే పెనుగాలులతో, విరిగిపడే మంచు చరియలతో సందర్శకులను భీతావహుల్ని చేసే ప్రాంతం కూడా. రకరకాల పరిశోధనల్లో నిత్యం నిమగ్నమై ఉండే అయిదారువేల మంది శాస్త్రవేత్తలు తప్ప అక్కడ వేరే జనాభా ఉండదు. భూతల్లి చల్లగా నాలుగు కాలాలపాటు వర్ధిల్లాలంటే అంటార్కిటికాలో పెనుమార్పులు చోటు చేసుకోకుండా ఉండాలని పర్యావరణవాదులు చెబుతుంటారు. దాని పరిరక్షణకు ఏమేం చర్యలు అవసరమో వివరిస్తుంటారు. కానీ ప్రకృతితో మనిషి ఆడుతున్న వికృత క్రీడల కారణంగా అంతా తారుమారవుతోంది. క్షణానికి వెయ్యి టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతూ భూమిని వేడెక్కిస్తున్న పర్యవసానంగా ఆ మంచు ఖండం ఛిద్రమవుతోంది. వచ్చే నూరేళ్లలో ఊహించ శక్యం కూడా కాని ఉత్పాతం మానవాళికి చేరు వవుతోంది. మొన్నటికిమొన్న అంటార్కిటికాలో ఉన్న అతి పెద్ద మంచు ఫలకం ‘లార్సెన్–సి’ హిమపర్వతం నుంచి వేరుపడిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. తాజాగా మరో అతి భారీ మంచు ఫలకం రెండు ముక్కలైన దృశ్యాన్ని నాసా కెమెరాలో బంధించింది. అంటార్కిటికాలో మంచు ఫలకాలు ముక్కలవుతున్న వరుస ఘటనలు పర్యావరణ వాదులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా వేరుపడిన మంచు ఫలకం గ్రీన్లాండ్ దేశంలో ప్రతి ఏటా కరుగుతున్న మంచుకు సమానమని నాసా పేర్కొంది. హిమ పర్వతం నుంచి వేరుపడిన మంచు ఫలకం కొట్టుకుపోతున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జులైలో ఓ హిమ పర్వతం నుంచి వేరుపడిన లార్సెన్-సి బరువు దాదాపు లక్ష టన్నుల కోట్లు. వైశాల్యంలో న్యూఢిల్లీ నగర పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెద్దదని శాస్త్రవేత్తులు లెక్కగట్టారు కూడా. లార్సెన్–సి కి పగుళ్లు ఏర్పడుతున్న వైనాన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా చాన్నాళ్ల క్రితమే శాస్త్రవేత్తలు గమనించారు. ఈ ఏడాది జూన్‌లో ఈ మంచు ఫలకం ప్రధాన పర్వతంతో దాదాపుగా విడిపోయిందని, కేవలం బలహీనమైన బంధం మాత్రమే మిగిలి ఉన్నదని చెప్పారు. జులై నెలలో అది కూడా తెగిపోయింది. వరుసగా భారీ మంచు ఫలకలు ఖండాన్ని విడిపోతున్నందువల్ల అంటార్కిటికా ద్వీపకల్పం రూపురేఖలు మారిపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సముద్రమట్టం పెరిగే ప్రమాదం.. వరుసగా మంచు ఫలకలు ముక్కలై కరిగిపోతుండటం ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. విడిపోయిన ఫలకాలు అక్కడి నుంచి పెనువేగంతో ముందుకు కదులుతాయో లేక ఎక్కడో నిలిచిపోయి దానికదే ఒక మంచు పర్వతంలా మారుతాయో లేక క్రమేపీ శకలాలుగా విడిపోయి కరుగుతూ అంతరిస్తుందా అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేని పరిస్థతి నెలకొంది. శాస్త్రవేత్తల అసలు ఆందోళనంతా హిమ ఫలకాలు తెగిపడుతున్నాయని కాదు. ఈ పరిణామాల పర్యవసానంగా పైనుంచి విరుచుకుపడే హిమనీ నదులు ముందుకు పోకుండా ఈ హిమ పర్వతాలు సీసా బిగించే బిరడాలా అడ్డుకుంటాయి. ఫలితంగా ఆ నదులు ముందుకెళ్లలేక ఉన్నచోటే నిలిచిపోయి అక్కడే క్రమేపీ గడ్డకట్టుకుపోయి మంచు పర్వతంలో భాగమైపోతాయి. మంచు పర్వతం దగ్గర ఏ అవరోధమూ లేకపోయినా, ముందుకెళ్లడానికి ఎంతో కొంత దారి కనబడినా హిమనీ నదులు ఒక్కసారిగా విజృంభించి అంటార్కిటికా మహా సముద్రంలో కలిస్తే సముద్ర నీటి మట్టాలపై అది చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. ఆ మట్టాలు ఒక్కసారిగా 10 సెంటీమీటర్లు పెరుగుతాయి. తాజా విరిగిన మంచు ఫలకం వల్ల సముద్ర మట్టం మూడు మిల్లీమీటర్ల పాటు పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇదంతా భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా... అసంఖ్యాకమైన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా చేస్తున్నదే. 2002లో లార్సెన్–సి కి పక్కనుండే లార్సెన్–బి శకలాలుగా విడిపోయి చిన్నదై పోయింది. అనంతరకాలంలో హిమానీ నదుల ప్రవాహ వేగం రెండు నుంచి ఆరు రెట్లు పెరిగింది. ప్రమాదంలో పర్యావరణం.. లార్సెన్–ఏ, లార్సెన్–బి, లార్సెన్–సి వంటి హిమ పర్వతాల్లో మంచు మేటలు వేయడానికి దోహదపడుతున్న హిమనీ నదాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిల్లో ఫ్లెమింగ్ పేరుతో ఉన్న హిమనీ నది అతి పెద్దది. అనేక చిన్న నదుల సంగమంగా ఉండే ఫ్లెమింగ్ దాదాపు 80 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ నది వద్ద 60వ దశకంతో పోలిస్తే ఇప్పుడు మంచు వేగంగా సముద్రంలో కలుస్తున్నదని శాస్త్రవేత్తలు లెక్కేస్తున్నారు. కరిగే మంచుకూ, హిమానీ నదుల్లోని ప్రవాహానికీ మధ్య ఉండే నిష్పత్తి స్థిరంగా కొనసాగుతున్నంతకాలం అక్కడ యధాస్థితికి ముప్పుండదు. అందులో ఏమాత్రం తేడా వచ్చినా పర్యావరణం ప్రమాదంలో పడుతుంది. మంచు ఫలకాలు వేరు పడినప్పుడు జరిగే ఉత్పాతం అంతా ఇంతా కాదు. అక్కడ నివసించే పెంగ్విన్ పక్షులు మొదలుకొని వివిధ రకాల జీవాల వరకూ అన్నిటిపైనా అది పెను ప్రభావం చూపుతుంది. నిరుడు ఒక మంచు ఫలకం విరిగిపడి లక్షన్నర పెంగ్విన్ పక్షుల ప్రాణాలు మంచులో శిథిలమైపోయాయి. -
దక్షిణ ధ్రువంలో కల్లోలం
ఈ భూగోళంపై ప్రకృతి రచించిన దృశ్య కావ్యం అంటార్కిటికా. అది ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశం మాత్రమే కాదు... నిత్యం వీచే పెనుగాలులతో, విరిగిపడే మంచు చరియలతో సందర్శకులను భీతావహుల్ని చేసే ప్రాంతం కూడా. రకరకాల పరిశోధనల్లో నిత్యం నిమగ్నమై ఉండే అయిదారువేల మంది శాస్త్రవేత్తలు తప్ప అక్కడ వేరే జనాభా ఉండదు. భూతల్లి చల్లగా నాలుగు కాలాలపాటు వర్ధిల్లాలంటే అంటార్కిటికాలో పెనుమార్పులు చోటుచేసుకోకుండా ఉండాలని పర్యావరణవాదులు చెబుతుంటారు. దాని పరిరక్షణకు ఏమేం చర్యలు అవసరమో వివరిస్తుంటారు. కానీ ప్రకృతితో మనిషి ఆడుతున్న వికృత క్రీడల కారణంగా అంతా తారుమారవుతోంది. క్షణానికి వెయ్యి టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడు దలవుతూ భూమిని వేడెక్కిస్తున్న పర్యవసానంగా ఆ మంచు ఖండం ఛిద్రమ వుతోంది. నూరేళ్లక్రితం ఊహించ శక్యం కూడా కాని ఉత్పాతం మానవాళికి చేరు వవుతోంది. అంటార్కిటికాలో ఉన్న అతి పెద్ద మంచు ఫలకం ‘లార్సెన్–సి’ హిమ పర్వతం నుంచి వేరుపడిందని తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన పర్యావరణ వాదులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ వైపరీత్యం గత మూడురోజుల్లో ఏదో ఒక సమయంలో చోటు చేసుకుని ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు లక్ష టన్నుల కోట్ల బరువుండే ఈ ఫలకం న్యూఢిల్లీ నగర వైశాల్యంతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెద్దదని లెక్కలు కడుతున్నారు. లార్సెన్–సి కి పగుళ్లు ఏర్పడుతున్న వైనాన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా చాన్నాళ్లక్రితమే శాస్త్రవేత్తలు గమనిం చారు. నెలక్రితం ఈ మంచు ఫలకం ప్రధాన పర్వతంతో దాదాపుగా విడిపోయిం దని, కేవలం బలహీనమైన బంధం మాత్రమే మిగిలి ఉన్నదని చెప్పారు. అది కూడా ఇప్పుడు తెగిపోయింది. ఇందువల్ల అంటార్కిటికా ద్వీపకల్పం రూపురేఖలే మారిపోవచ్చునంటున్నారు. ఈ ఫలకం అక్కడి నుంచి పెను వేగంతో ముందుకు కదులుతుందా, ఎక్కడో నిలిచిపోయి దానికదే ఒక మంచు పర్వతంలా మారుతుందా, క్రమేపీ శకలాలుగా విడివడి కరుగుతూ అంతరిస్తుందా అన్నది శాస్త్రవేత్తలు ఊహించలేకపోతున్నారు. అసలు వారి ఆందోళనంతా ఈ ఫలకం తెగిపడిందని కాదు. ఈ పరిణామం పర్యవసానంగా లార్సెన్–సి అస్తిత్వమే ప్రమాదంలో పడవచ్చునని వారు కలవర పడుతున్నారు. ఎందుకంటే పైనుంచి విరుచుకుపడే హిమానీ నదులు ముందుకు పోకుండా ఈ హిమపర్వతాలు సీసా బిగించే బిరడాలా అడ్డుకుంటాయి. ఫలితంగా ఆ నదులు ముందుకెళ్లలేక ఉన్నచోటే నిలిచిపోయి అక్కడే క్రమేపీ గడ్డకట్టుకుపోయి మంచు పర్వతంలో భాగమైపోతాయి. ఇప్పుడు తాజాగా విరిగిపడిన ఫలకం కారణంగా లార్సెన్–సి ఎంతో కొంత బలహీనమవుతుంది. ఆ మంచు పర్వతం దగ్గర ఏ అవరోధమూ లేకపోయినా, ముందుకెళ్లడానికి ఎంతో కొంత దారి కన బడినా హిమానీ నదులు ఒక్కసారిగా విజృంభించి అంటార్కిటికా మహా సము ద్రంలో కలిస్తే సముద్ర నీటి మట్టాలపై అది చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. ఆ మట్టాలు ఒక్కసారిగా 10 సెంటీమీటర్లు పెరుగుతాయి. అలాంటి పెను ముప్పు ఏర్పడవచ్చునన్నదే శాస్త్రవేత్తల ఆందోళన. అయితే ఇదంతా భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా... అసంఖ్యాకమైన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా చేస్తున్నదే. 2002లో లార్సెన్–సి కి పక్కనుండే లార్సెన్–బి శకలాలుగా విడిపోయి చిన్నదై పోయింది. అనంతరకాలంలో హిమానీ నదుల ప్రవాహ వేగం రెండు నుంచి ఆరు రెట్లు పెరిగింది. లార్సెన్–ఏ, లార్సెన్–బి, లార్సెన్–సి వగైరా హిమ పర్వతాల్లో మంచు మేటలు వేయడానికి దోహదపడుతున్న హిమానీ నదాలు అసంఖ్యాకంగా ఉన్నా వాటిల్లో ఫ్లెమింగ్ పేరుతో ఉన్న హిమానీ నది అతి పెద్దది. అనేక చిన్న నదుల సంగమంగా ఉండే ఫ్లెమింగ్ దాదాపు 80 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ నది వద్ద 60వ దశకంతో పోలిస్తే ఇప్పుడు మంచు వేగంగా సముద్రంలో కలుస్తున్నదని శాస్త్రవేత్తలు లెక్కేస్తున్నారు. కరిగే మంచుకూ, హిమానీ నదుల్లోని ప్రవాహానికీ మధ్య ఉండే నిష్పత్తి స్థిరంగా కొనసాగు తున్నంతకాలం అక్కడ యధా స్థితికి ముప్పుండదు. అందులో ఏమాత్రం తేడా వచ్చినా పర్యావరణం ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు లార్సెన్–సి మంచు పర్వతం నుంచి ఒక ఫలకం విడిపోయిన కారణంగా ఆ పర్వతానికేమవుతుందో, విడివడ్డ ఫలకం చివరకు ఏ రూపు తీసుకుంటుందో అంచనా వేయడానికైనా మరి కొన్నాళ్లు పడుతుంది. ఆ తర్వాతే దానివల్ల కలిగే పర్యవసానాలేమిట న్నది శాస్త్రవేత్తలు పరిశీలించగలుగుతారు. మంచు ఫలకాలు వేరు పడినప్పుడు జరిగే ఉత్పాతం అంతా ఇంతా కాదు. అక్కడ నివసించే పెంగ్విన్ పక్షులు మొదలుకొని వివిధ రకాల జీవాల వరకూ అన్నిటిపైనా అది పెను ప్రభావం చూపుతుంది. నిరుడు ఒక మంచు ఫలకం విరిగిపడి లక్షన్నర పెంగ్విన్ పక్షులు నేలరాలాయి. ఇప్పుడు అంటార్కిటికాలో అతి పెద్ద మంచు ఫలకం విడివడ్డ సంగతిని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ఆక్వామోడిస్ ఉపగ్రహ పరికరం ద్వారానే శాస్త్రవేత్తలు గుర్తించారు. పర్యావణానికి ముప్పు ఏర్పడటమన్నది పనిలేని శాస్త్రవేత్తలు కల్పిస్తున్న కట్టుకథగా కొట్టిపారేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తాజా పరిణామం కళ్లు తెరిపించాలి. రెండేళ్లక్రితం పారిస్‌లో కుదిరిన పర్యావరణ ఒడంబడిక నుంచి తప్పుకుంటున్నట్టు ఈమధ్యే ట్రంప్ ప్రకటించారు. విచ్చలవిడిగా పెరిగిపోతున్న ఉద్గారాలు భూగోళాన్ని నిప్పుల కొలి మిలా మారుస్తున్నాయని, దాన్నుంచి మానవాళి బయటపడటానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఎన్నేళ్లుగానో పర్యావరణవేత్తలు ఆందోళనపడ్డారు. ఆ విషయంలో ఏదోమేరకు అంగీకారం కుదిరిందన్న సంతోషం ట్రంప్ రాకతో ఆవిరైంది. అంటార్కిటికాలో జరిగిన ఉత్పాతం పర్యావరణ పరిరక్షణ చైతన్యానికి దోహదపడితే మానవాళికి అంతమించిన చల్లని కబురుండదు. అది జరగాలని అందరం ఆశిద్దాం. -
మబ్బులతో మాట్లాడవచ్చు!
టూర్‌దర్శన్ మంచుకొండల మనోహర సోయగాలు... మైమరపించే పచ్చని వనాల సొగసులు... గుర్రపు జీను ఆకారంలో ఉన్న కొండల మీద వెలసిన అందమైన ఊరు అల్మోరా. అక్కడి కొండల మీదకు వెళ్లి చూస్తే మబ్బులు చేతికందుతాయా అనిపిస్తాయి. ఊరికి ఇరువైపులా పారే కోసీ, సుయాల్ నదుల జలకళ నయనానందం కలిగిస్తుంది. ఇక్కడి కొండలపై కనిపించే ‘కిల్మోరా’ మొక్క కారణంగా ఈ ఊరికి అల్మోరా అనే పేరు వచ్చింది. ఇక ఇక్కడి పురాతన ఆలయాల శిల్పసౌందర్యాన్ని చూసి తీరాల్సిందే. ఏం చూడాలి? * హిమగిరి సొగసులను తనివితీరా చూసి ఆస్వాదించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సముద్ర మట్టానికి దాదాపు ఆరువేల అడుగుల ఎత్తున ఉండే అల్మోరాలో వేసవిలోనూ వాతావరణం చల్లగా ఉంటుంది. * అల్మోరా పట్టణంలోను, సమీప పరిసర ప్రదేశాల్లోనూ సుప్రసిద్ధ పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. కాసర్‌దేవి, నందాదేవి, జాఖన్దేవి, పాతాళదేవి, చితాయి గోలుదేవత, బనరీదేవి వంటి పురాతన శాక్తేయ ఆలయాలకు సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. * దేశంలో అతి తక్కువగా కనిపించే సూర్యదేవాలయాల్లో ఒకటి అల్మోరాకు చేరువలోని కటార్మల్ గ్రామంలో ఉంది. కట్యూరి వంశానికి చెందిన కటారమల్ క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో నిర్మించిన ఈ ఆలయ కుడ్యాలపై కనిపించే శిల్పకళా సంపద సందర్శకులను ఆకట్టుకుంటుంది. * అల్మోరాకు చేరువలోని చితాయి గ్రామంలో గోలుదేవత ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడి అమ్మవారికి తమ కోరికలను దరఖాస్తులుగా సమర్పించుకుంటారు. అవి తీరితే తిరిగి ఇక్కడకు వచ్చి, తీరిన కోరికకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో గంటలు కడతారు. * అల్మోరా చేరువలోని పాండుఖోలి మరో ప్రసిద్ధ ఆలయం. లాక్షాగృహ దహనం తర్వాత దుర్యోధనుడి బారి నుంచి తప్పించుకోవడానికి పాండవులు కొన్నాళ్లు ఇక్కడ తలదాచుకున్నారని ప్రతీతి. * అల్మోరాలోనే పుట్టిపెరిగిన స్వాతంత్య్ర సమరయోధుడు, ఉత్తరప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి గోవిందవల్లభ్ పంత్ జ్ఞాపకార్థం ఇక్కడ ఆయన పేరిట నిర్మించిన మ్యూజియంలోని పురాతన వస్తువులను, కళాఖండాలను చూసి తీరాల్సిందే. * ఇక్కడకు చేరువలోని లఖుడియా ప్రాంతంలోని కొండగుహలలో చరిత్రపూర్వయుగం నాటి కుడ్యచిత్రాలు ఇక్కడి పురాతన నాగరికతకు ఆనవాళ్లుగా నేటికీ నిలిచి ఉన్నాయి. * అల్మోరాలోని కొండ శిఖరాలపై ఉన్న జీరోపాయింట్, బ్రైట్ ఎండ్ కార్నర్ వంటి ప్రదేశాలకు చేరుకుని సూర్యాస్తమయ దృశ్యాలను, చుట్టుపక్కల కనిపించే దట్టమైన అడవుల పచ్చదనాన్ని తిలకించడం పర్యాటకులకు మధురానుభూతినిస్తుంది. * ఇక్కడకు చేరువలోని బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యంలో విహరిస్తూ ఇక్కడ సంచరించే అరుదైన వన్యప్రాణులను తిలకించవచ్చు. పులులు, చిరుతలు, జింకలు వంటి అరుదైన జంతువులతో పాటు రకరకాల అరుదైన పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఏం చేయాలి? * ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ప్రశాంత వాతావరణంలో గడపాలనుకునే పర్యాటకులకు ఇది పూర్తిగా అనువైన ప్రదేశం. ఇక్కడి హోటళ్లలో, రిసార్టుల్లో ఎక్కడ బస చేసినా ఆరుబయటకు చూస్తే కనుచూపు మేర చుట్టూ పరుచుకున్న పచ్చదనం, సుదూరాన మంచుకొండల ధవళకాంతులు కనువిందు చేస్తాయి. * పర్వతారోహకులకు ఇక్కడి కొండలు సవాలుగా నిలుస్తాయి. ట్రెక్కింగ్‌పై ఆసక్తి గల ఔత్సాహిక పర్యాటకులు ఇక్కడి కొండలపైకి ఎక్కి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతారు. * ఆలయ సందర్శనంపై ఆసక్తిగల పర్యాటకులకు ఇక్కడ అడుగడుగునా కనిపించే అత్యంత పురాతన ఆలయాలు, ఆ ఆలయాల్లోని ఆచార వ్యవహారాలు ఆకట్టుకుంటాయి. * అల్మోరాలోను, ఇక్కడి పరిసరాల్లోని గోవిందవల్లభ్ పంత్ మ్యూజియం, కుమావో రెజిమెంటల్ మ్యూజియం, జగేశ్వర్ ఆర్కియాలాజికల్ మ్యూజియం వంటివి చూసి తీరాల్సిందే. వీటిలో భద్రపరచిన పురాతన వస్తువులు, కళాఖండాల ద్వారా ఇక్కడి ప్రాచీన నాగరికతా వికాసాన్ని ఆకళింపు చేసుకోవచ్చు. ఏం కొనాలి? * మంచుకొండలకు చేరువగా ఉండటంతో అల్మోరాలో ఊలు దుస్తుల వాడకం ఎక్కువ. ఇక్కడి నేతగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసిన స్వెట్టర్లు, మఫ్లర్లు, శాలువలు వంటి ఊలు దుస్తులు ఇక్కడ చౌకగా దొరుకుతాయి. * అల్మోరా రాగి వస్తువులకు కూడా ప్రసిద్ధి పొందిన ఊరు. ఇక్కడి కళాకారులు రాగితో తయారు చేసిన పాత్రలు, సంప్రదాయ కళాకృతులు, విగ్రహాలు వంటివి సరసమైన ధరలకే దొరుకుతాయి. * ఇక్కడ ప్రత్యేకంగా దొరికే సింగొరా, బాల్ మిఠాయి వంటి నోరూరించే మిఠాయిలను కూడా కొనుక్కోవచ్చు. ఎలా చేరుకోవాలి? * దూర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు డెహ్రాడూన్‌లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా అల్మోరా చేరుకోవచ్చు. * రైళ్లలో వచ్చేవారు అల్మోరాకు సమీపంలోని కఠ్గోదాం స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు. * ఉత్తరాదిలో ఢిల్లీ, చండీగఢ్ వంటి నగరాలతో పాటు ఉత్తరాఖండ్‌లోని దాదాపు అన్ని పట్టణాల నుంచి అల్మోరా వరకు నేరుగా బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. -
మంచు కొండల్లో క్లిక్!
వీళ్లిద్దరూ తల్లీకూతుళ్లా? అక్కాచెల్లెళ్లా? అనే డౌటు శ్రీదేవి, ఆమె పెద్ద కూతురు జాన్వీని చూసినప్పుడు కలగడం సహజం. ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న శ్రీదేవి టీనేజ్‌లో ఉన్న తన కూతురికి అక్కలానే కనిపిస్తారు. ఆ రేంజ్లో ఫిజిక్‌ని మెయింటైన్ చేస్తున్నారామె. తన ఇద్దరు కూతుళ్లు జాన్వీ, ఖుషీలను దాచి దాచి పెంచలేదు శ్రీదేవి. తల్లితో పాటు ఈ కూతుళ్లిద్దరి దర్శనాలు కూడా బాగానే దొరికాయి. కానీ, దాదాపు ఏడాదిన్నరగా జాన్వీ కెమెరాలకు చిక్కడం లేదు. దానికి కారణం అమెరికాలో చదువుకుంటోంది. వీలున్నప్పుడల్లా కూతురి దగ్గరికి వెళ్లి వస్తుంటారు శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్. ప్రస్తుతం శ్రీదేవి అక్కడే ఉన్నారు. మరి.. బోనీ కూడా వెళ్లారో లేదో తెలియదు కానీ, శ్రీదేవి మాత్రం కూతురితో కలిసి దిగిన సెల్ఫీలో కనిపించారు. ఈ తల్లీకూతుళ్లిద్దరూ సరదాగా మంచుకొండల్లో విహరించినట్లున్నారు. ఆ సందర్భంగా కూతురితో శ్రీదేవి దిగిన సెల్ఫీ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. టీనేజ్‌లో శ్రీదేవి ఎంత అందంగా ఉండేవారో ఇప్పుడు జాన్వీ కూడా అంతే అందంగా ఉంది కదూ. చూడబోతుంటే తల్లిలానే జాన్వీలో కూడా మంచి హీరోయిన్ మెటీరియల్ ఉందనిపిస్తోంది. కూతుళ్లు సినిమాల్లోకి వస్తానంటే బోనీ, శ్రీదేవి కాదనరు. ఈ విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారీ దంపతులు. సో.. చదువు ముగిశాక జాన్వీ అరంగేట్రం కావడం ఖాయమే అని కొందరి ఊహ.