A23a: అతి పెద్ద ఐస్‌బర్గ్‌... 40 ఏళ్ల తర్వాత కదిలింది | A23a: World biggest iceberg on the move after 30 years | Sakshi
Sakshi News home page

A23a: అతి పెద్ద ఐస్‌బర్గ్‌... 40 ఏళ్ల తర్వాత కదిలింది

Published Sat, Nov 25 2023 5:22 AM | Last Updated on Sat, Nov 25 2023 8:29 AM

A23a: World biggest iceberg on the move after 30 years - Sakshi

అది ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్‌బర్గ్‌. పేరు ఏ23ఏ. విస్తీర్ణం ఏకంగా 4,000 చదరపు కిలోమీటర్లు. మరోలా చెప్పాలంటే పరిమాణంలో గ్రేటర్‌ లండన్‌తో పోలిస్తే రెండింతలకు పై చిలుకే. అంతటి విస్తీర్ణంతో, ఏకంగా 400 మీటర్ల మందంతో భారీ సైజుతో అలరారుతూ చూసేందుకది ఓ మంచు ద్వీపకల్పంలా కని్పంచేది. అలాంటి ఐస్‌బర్గ్‌ దాదాపు 40 ఏళ్ల తర్వాత కదలడం మొదలు పెట్టింది. ఈ పరిణామం పర్యావరణ నిపుణులను ఆందోళన పరుస్తోంది. గ్లోబల్‌ వార్మింగ్‌ తాలూకు దుష్పరిణామాలకు దీన్ని తాజా సంకేతంగా వారు                భావిస్తున్నారు...

1986 నుంచీ...
ఏ23ఏ ఐస్‌బర్గ్‌ అప్పుడెప్పుడో 1985 చివర్లో అంటార్కిటికా తీరం నుంచి విడిపోయింది. అంటార్కటికా తాలూకు అతి పెద్దదైన ఫిల్‌‡్షనర్‌ మంచు ఫలకం నుంచి విడిపోయిన భారీ ఐస్‌బర్గ్‌ల్లోకెల్లా పెద్దదిగా ఇది రికార్డులకెక్కింది. అప్పటికే ఏ23ఏపై సోవియట్‌ యూనియన్‌ ఒక పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేసుకుంది! అందులోని సామగ్రినంతటినీ అది హుటాహుటిన తరలించడం మొదలు పెట్టింది. కానీ కొద్దిపాటి ప్రయాణం అనంతరం 1986కల్లా అంటార్కిటికా పరిధిలోని వెడెల్‌ సముద్రంలో ఐస్‌బర్గ్‌ నిశ్చలంగా నిలిచిపోయింది. ఒకరకంగా సముద్రం తాలూకు అడుగు భాగంతో కలిసిపోయి అలా నిలబడిపోయింది.

కరిగిపోతోంది...
ఇంతకాలం నిశ్చలంగా ఉన్నది కాస్తా ఏ23ఏ ఇప్పుడు మరోసారి కదులుతోంది. దీనికి కారణాలపై సైంటిస్టులంతా దృష్టి సారించగా, ఇది అంటార్కిటికా సముద్ర జలాల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతున్న ఫలితమేనని తేలింది! ‘‘దాదాపు 40 ఏళ్ల కాలగమనంలో ఐస్‌బర్గ్‌ పరిమాణంలో కుంచించుకుపోయింది. దానికి గ్లోబల్‌ వార్మింగ్‌ తోడైంది’’ బ్రిటిష్‌ అంటార్కిటిక్‌ సర్వే రిమోట్‌ సెన్సింగ్‌ నిపుణుడు డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ తెలిపారు. వాస్తవానికి ఏ23ఏలో 2020లోనే అతి తక్కువ స్థాయిలో కదలికలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. సముద్ర పవనాల హోరు, ప్రవాహాల జోరుకు అదిప్పుడు వేగం పుంజుకుందన్నారు. ఇప్పుడది క్రమంగా అంటార్కిటిక్‌ ద్వీపకల్పపు ఉత్తరాగ్రంకేసి కదులుతోంది. చివరికది ఐస్‌బర్గ్‌ల క్షేత్రంగా పిలిచే అంటార్కిటికా దక్షిణ ప్రాంతానికి చేరేలా కని్పస్తోంది.

ప్రమాద ఘంటికే...!
ఎంత పెద్ద ఐస్‌బర్గ్‌లైనా కాలక్రమంలో చిక్కిపోవడం, క్రమంగా కనుమరుగవడం పరిపాటే. కానీ అందుకు వందలు, కొన్నిసార్లు వేలాది ఏళ్లు కూడా పడుతుంటుంది. అలాంటి ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ఏ23ఏ ఐస్‌బర్గ్‌ ఇలా శరవేగంగా కరుగుతుండటం, కదిలిపోతుండటం ప్రమాద సూచికేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది దక్షిణ జార్జియాకేసి సాగితే అక్కడి జీవావరణానికి పెద్ద సమస్యగా కూడా మారవచ్చని చెబుతున్నారు. దాని నుంచి కరిగే నీటితో పెరిగిపోయే సముద్ర మట్టం ఆ ద్వీపకల్ప తీరంలో లక్షలాది సీల్స్, పెంగ్విన్లు, సముద్ర పక్షుల పునరుత్పత్తి ప్రాంతాలను ముంచెత్తవచ్చన్నది వారి ఆందోళన. అయితే ఈ పరిణామంతో కొన్ని లాభాలూ లేకపోలేదట! ‘‘ఐస్‌బర్గ్‌లు జీవనప్రదాలు కూడా. కరిగే క్రమంలో వాటినుంచి విడుదలయ్యే ఖనిజ ధూళి సమీప సముద్ర జీవజాలానికి ప్రాణాధారంగా మారుతుంది’’ అని సైంటిస్టులు చెబుతున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement