temperature hike
-
వడదెబ్బ... 108 డిగ్రీల జ్వరం
న్యూఢిల్లీ: ఢిల్లీని చుట్టుముట్టిన వడగాలులు ఒక మధ్యవయస్కుడి ప్రాణం తీశాయి. వడదెబ్బతో ఆస్పత్రిలో చేరిన అతడి శరీర ఉష్ణోగ్రత చూసి వైద్యులు హుతాశులయ్యారు. అతని శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువ ఉండటం గమనార్హం. సోమవారం రాత్రి జరిగిన ఘటన వివరాలను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి డాక్టర్ రాజేశ్ శుక్లా వెల్లడించారు. ‘‘ బిహార్‌లోని దర్భాంగా పట్టణానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి సోమవారం ఢిల్లీలో వడదెబ్బకు గురయ్యారు. వెంటనే ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చేరారు. ఆయన శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీ ఫారన్‌హీట్‌కు చేరుకోవడం చూసి ఆందోళనకు గురయ్యాం. ఆయనను ఎలాగైనా కాపాడాలని శతథా ప్రయతి్నంచాం. కానీ శరీరంలో అతివేడి కారణంగా ఆయన మూత్రపిండాలు, కాలేయం విఫలమయ్యాయి. ఇలా వెంటవెంటనే పలు అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయన కన్నుమూశారు’ అని డాక్టర్ వివరించారు. ఒకే ఆస్పత్రిలో 2 గంటల్లో 16 మరణాలు పట్నా: ఉగ్ర ఉష్ణోగ్రత బిహార్‌లోని ఒకే ఆస్పత్రిలో 16 మంది ప్రాణాలను బలితీసుకుంది. గురువారం ఔరంగాబాద్‌లోని జిల్లా ఆస్పత్రిలో ఈ విషాద ఘటన జరిగింది. గురువారం అక్కడ 44, బుధవారం 48.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంతటి వేడికి తాళలేక జనం పిట్టల్లా రాలిపోయారు. చాలా మంది అక్కడి జిల్లా ఆస్పత్రిలో చేరగా గురువారం రెండు గంటల వ్యవధిలో 16 మంది చనిపోయారు. -
సుర్రుమన్న సూరీడు..
సాక్షి,హైదరాబాద్: ఎండలు భగ్గున మండుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే సూరీడు నిప్పులు కక్కతున్నాడు. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. తాజాగా సోమవారం మియాపూర్‌లో అత్యధికంగా 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమో దు కాగా, కందుకూరు, చందానగర్, నాగోల్‌లో 41.6 డిగ్రీలు, చిలుకూరు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 41.5 డిగ్రీలు, ఇబ్రహీంపట్నంలో 41.5, డిగ్రీలు, షాబాద్, రాచలూరు, అత్తాపూర్ తదితర మండలాల్లో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతల చొప్పున రికార్డు అయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో 40 నుం చి 40.9 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మీటరు గిరగిర.. భగ్గున మండుతున్న ఎండలకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు రోజంతా ఆన్‌లో ఉండటం, సామర్థ్యానికి మించి విద్యుత్ వినియోగిస్తుండటంతో సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో పాటు కండకర్లు, ఇన్సులేటర్లు వేడికి పేలిపోతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య అత్యధిక డిమాండ్ నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గత ఏడాది ఏప్రిల్ 1న 2954 మెగావాట్లు నమోదు కాగా, తాజాగా సోమవారం ఏకంగా 3738 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. -
A23a: అతి పెద్ద ఐస్‌బర్గ్... 40 ఏళ్ల తర్వాత కదిలింది
అది ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్‌బర్గ్. పేరు ఏ23ఏ. విస్తీర్ణం ఏకంగా 4,000 చదరపు కిలోమీటర్లు. మరోలా చెప్పాలంటే పరిమాణంలో గ్రేటర్ లండన్‌తో పోలిస్తే రెండింతలకు పై చిలుకే. అంతటి విస్తీర్ణంతో, ఏకంగా 400 మీటర్ల మందంతో భారీ సైజుతో అలరారుతూ చూసేందుకది ఓ మంచు ద్వీపకల్పంలా కని్పంచేది. అలాంటి ఐస్‌బర్గ్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కదలడం మొదలు పెట్టింది. ఈ పరిణామం పర్యావరణ నిపుణులను ఆందోళన పరుస్తోంది. గ్లోబల్ వార్మింగ్ తాలూకు దుష్పరిణామాలకు దీన్ని తాజా సంకేతంగా వారు భావిస్తున్నారు... 1986 నుంచీ... ఏ23ఏ ఐస్‌బర్గ్ అప్పుడెప్పుడో 1985 చివర్లో అంటార్కిటికా తీరం నుంచి విడిపోయింది. అంటార్కటికా తాలూకు అతి పెద్దదైన ఫిల్‡్షనర్ మంచు ఫలకం నుంచి విడిపోయిన భారీ ఐస్బర్గ్ల్లోకెల్లా పెద్దదిగా ఇది రికార్డులకెక్కింది. అప్పటికే ఏ23ఏపై సోవియట్ యూనియన్ ఒక పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేసుకుంది! అందులోని సామగ్రినంతటినీ అది హుటాహుటిన తరలించడం మొదలు పెట్టింది. కానీ కొద్దిపాటి ప్రయాణం అనంతరం 1986కల్లా అంటార్కిటికా పరిధిలోని వెడెల్ సముద్రంలో ఐస్‌బర్గ్ నిశ్చలంగా నిలిచిపోయింది. ఒకరకంగా సముద్రం తాలూకు అడుగు భాగంతో కలిసిపోయి అలా నిలబడిపోయింది. కరిగిపోతోంది... ఇంతకాలం నిశ్చలంగా ఉన్నది కాస్తా ఏ23ఏ ఇప్పుడు మరోసారి కదులుతోంది. దీనికి కారణాలపై సైంటిస్టులంతా దృష్టి సారించగా, ఇది అంటార్కిటికా సముద్ర జలాల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతున్న ఫలితమేనని తేలింది! ‘‘దాదాపు 40 ఏళ్ల కాలగమనంలో ఐస్‌బర్గ్ పరిమాణంలో కుంచించుకుపోయింది. దానికి గ్లోబల్ వార్మింగ్ తోడైంది’’ బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే రిమోట్ సెన్సింగ్ నిపుణుడు డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు. వాస్తవానికి ఏ23ఏలో 2020లోనే అతి తక్కువ స్థాయిలో కదలికలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. సముద్ర పవనాల హోరు, ప్రవాహాల జోరుకు అదిప్పుడు వేగం పుంజుకుందన్నారు. ఇప్పుడది క్రమంగా అంటార్కిటిక్ ద్వీపకల్పపు ఉత్తరాగ్రంకేసి కదులుతోంది. చివరికది ఐస్‌బర్గ్‌ల క్షేత్రంగా పిలిచే అంటార్కిటికా దక్షిణ ప్రాంతానికి చేరేలా కని్పస్తోంది. ప్రమాద ఘంటికే...! ఎంత పెద్ద ఐస్‌బర్గ్‌లైనా కాలక్రమంలో చిక్కిపోవడం, క్రమంగా కనుమరుగవడం పరిపాటే. కానీ అందుకు వందలు, కొన్నిసార్లు వేలాది ఏళ్లు కూడా పడుతుంటుంది. అలాంటి ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ఏ23ఏ ఐస్‌బర్గ్ ఇలా శరవేగంగా కరుగుతుండటం, కదిలిపోతుండటం ప్రమాద సూచికేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది దక్షిణ జార్జియాకేసి సాగితే అక్కడి జీవావరణానికి పెద్ద సమస్యగా కూడా మారవచ్చని చెబుతున్నారు. దాని నుంచి కరిగే నీటితో పెరిగిపోయే సముద్ర మట్టం ఆ ద్వీపకల్ప తీరంలో లక్షలాది సీల్స్, పెంగ్విన్లు, సముద్ర పక్షుల పునరుత్పత్తి ప్రాంతాలను ముంచెత్తవచ్చన్నది వారి ఆందోళన. అయితే ఈ పరిణామంతో కొన్ని లాభాలూ లేకపోలేదట! ‘‘ఐస్‌బర్గ్‌లు జీవనప్రదాలు కూడా. కరిగే క్రమంలో వాటినుంచి విడుదలయ్యే ఖనిజ ధూళి సమీప సముద్ర జీవజాలానికి ప్రాణాధారంగా మారుతుంది’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డేంజర్లో ఉన్నామా?.. సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్..
లండన్: శిలాజ ఇంధనాల వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల, ప్రకృతి విపత్తులు.. వీటి గురించి తరచుగా వింటూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రపంచ దేశాలు నష్టనివారణ చర్యలు చేపట్టిన దాఖలాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ప్రమాదకరమైన గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం గరిష్ట స్థాయికి చేరినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా వెలువడుతున్న గ్రీన్‌హౌజ్ వాయువులు 54 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్తో సమానమని తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా 50 మంది అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు భూ ఉష్ణోగ్రతలపై విస్తృత అధ్యయనం నిర్వహించి, ఉమ్మడిగా నివేదిక విడుదల చేశారు. మానవ చర్యలు, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం భూతాపం, వాతావరణ మార్పులకు కారణమవుతున్నట్టు పేర్కొన్నారు. జీవజాలానికి ఇన్నాళ్లూ ఆవాసయోగ్యంగా ఉంటూ వస్తున్న భూగోళం క్రమంగా అగ్నిగుండంగా మారిపోతోందని హెచ్చరించారు. సైంటిస్టులు తమ నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే.. ► 1800వ సంవత్సరంతో పోలిస్తే భూఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగాయి. ► ఉష్ణోగ్రత ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూతాపం మానవాళిని కబళించడం ఖాయం. ► గతంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని యథాతథంగా కొనసాగిస్తే భూ ఉపరితల ఉష్ణోగ్రత సమీప భవిష్యత్తులోనే 2 డిగ్రీలు పెరిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ► పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకు మించి పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని సాధించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలి. మునుపెన్నడూ లేనిస్థాయిలో తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ► భూతాపం ముప్పు నుంచి మానవళి బయటపడాలంటే 2035 నాటికి ప్రపంచదేశాలు తమ గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను 60 శాతానికి తగ్గించుకోవాలని సైంటిస్టు పియర్స్ ఫాస్టర్ చెప్పారు. -
మూడోరోజూ మంటలే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వరుసగా మూడో రోజూ వాతావరణం మంటపుట్టించింది. ఒకవైపు ఎండలు ఠారెత్తించగా, మరోవైపు వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు విలవిల్లాడారు. శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికితోడు తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వడగాడ్పులు విపరీతంగా వీయడంతో ప్రజలు అల్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం విజయవాడలో అత్యధికంగా 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాల్లోనూ 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. -
వచ్చే ఐదేళ్లూ సెగలే!
లండన్: ప్రపంచవ్యాప్తంగా రానున్న ఐదేళ్ల పాటు సూర్యుడు సెగలు పుట్టించనున్నాడు. 2020 నుంచి 2024 మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెల్సియస్ నుంచి 1.60 డిగ్రీల వరకు పెరుగుతుందని బ్రిటన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీంతో చరిత్రలో ఎన్నడూ లేనంత వేడితో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతుందని హెచ్చరించింది. దీని కారణంగా పారిస్ ఒప్పందానికి ఉల్లంఘనలు తప్పవని తెలిపింది. ఇప్పటివరకు అత్యంత అధిక ఉష్ణోగ్రత నమోదైన 2016 సంవత్సర రికార్డు రానున్న ఐదేళ్లలో మాసిపోతుందని పేర్కొంది. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ప్రాంతాలు అధిక వేడికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. కేవలం ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రతలు పెరిగితేనే కార్చిచ్చులు, కరువు ఇతర అనర్థాలు జరుగుతున్నాయని, అలాంటిది రానున్న ఐదేళ్లలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల ఎలాంటి విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందో అని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
సుర్‌రీడు
ప్రచండ భానుడి సెగలతో సింహపురి అల్లాడుతోంది. వారం రోజులుగా అధిక ఉష్ణ్రోగ్రతలతో జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఒక వైపు సూర్యతాపం.. వడగాలులు.. మరో వైపు పడమటి గాలులు ఠారెత్తిస్తున్నాయి. కావలిలో అత్యధికంగా 44.6 డిగ్రీలు నమోదైంది. ఎండలు మండిపోతుండడంతో జనాలు బయటకు రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటని ప్రజలు భయపడుతున్నారు. నెలాఖరుకు 46.5 డ్రిగీలు దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రెండు, మూడు రోజులు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఎండలకు చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో వారం రోజుల నుంచి ఎండల తీవ్రత తార స్థాయికి చేరుకుంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు వడగాలుల అధికంగా ఉంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ఊరించిన ఫొని తుపాను ఉసూరుమనిపించింది. వర్షాలు కురుస్తాయని ఆశ పడిన జనానికి ఎండతీవ్రత ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరో వైపు పరిశ్రమల కాలుష్య తీవ్ర కూడా అధికంగా ఉన్న క్రమంలో రుతుపవనాల జాడ ఇక్కడ కనిపించని పరిస్థితి. ఫలితంగా మే మూడో వారం నమోదయ్యే ఉష్ణోగ్రతలు నెల ప్రారంభం నుంచే నమోదు అవుతున్నాయి. వాస్తవానికి మే 3 వారం చివర్లో వచ్చే రోహిణి కార్తెతో 43 డిగ్రీల నుంచి అత్యధికంగా 46 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ ఏడాది రోహిణి కార్తెకు ముందే ఎండలు మండుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి 38 డిగ్రీలు నమోదయ్యాయి. భానుడు సెగలతో భయ పెడుతున్నాడు. ఉదయం 8 గంటల దాటిన తర్వాత బయటకు రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. సాయంత్రం 6.30 గంటల తరువాత కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదు. రాత్రులు సైతం వేడిగాలు ఉంటున్నాయి. రాబోవు వారం రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీసే అవకాశం ఉంది. మెట్ట ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. వేసవి ముందు నుంచే పూర్తిగా అప్రమత్తం కావాల్సిన వైద్యఆరోగ్య శాఖ ఇంకా ఆ దిశగా దృష్టి సారించని పరిస్థితి. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ఎండ తీవ్రత నేపథ్యంలో వడ దెబ్బ తగలకుండా ముందస్తుగా ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ మొదలు అవగాహన కార్యక్రమాల వరకు అన్నీ నిర్వహించాల్సి ఉన్నా దానిని పట్టించుకోలేదు. వడదెబ్బ బాధితులు ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వడగాలుల తీవ్రత అధికంగా ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారగణం ప్రకటించింది. ఈ నెల 6న జరిగే రీపోలింగ్ వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. రీపోల్ జరిగే రెండు కేంద్రాల్లో టెంట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంతో పాటు మంచి నీటి వసతి కూడా ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా సాధారణ వర్షపాతమే జిల్లాలో సగటు వర్షపాతం అతి తక్కువగా నమోద అవుతుంది. ఏటా సగటున 1,080 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా సగటున 60 శాతం వరకు లోటు వర్షపాతం నమోదు అవుతోంది. నాలుగేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి. ఈ ఏడాది 57.5 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. 2015లో వచ్చిన తుపాన్ మినహా ఇప్పటి వరకు ఆ స్థాయిలో వర్షాలు లేకపోవడంతో జిల్లాలో 20కి పైగానే మండలాలు కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. వడగాల్పులుకూడా వీస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వడదెబ్బకు గురయ్యే పరిస్థితి ఉంది. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ వాడుకోవాలి. తెలుపు లేదా లేత రంగు దుస్తులు ధరిస్తే మంచిది. కూలి పనులు చేసేవారు ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకుని ఎండ తీవ్రత తగ్గిన తర్వాత పనిచేయాలి. దాహం వేయకపోయినా గంటకో సారి చొప్పున రోజులో 5 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. ఉప్పుతో కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ నీరు తరచుగా తాగుతూ ఉంటే ఇంకా మంచిది. వడదెబ్బకు గురైతే వెంటనే చల్లగాలి వీచే ప్రాంతానికి చేరుకోవాలి. చల్లని నీటితో ముంచిన వస్త్రంతో శరీరాన్ని తుడవాలి. ఆరోగ్య పరిస్థితి ఆశించిన మార్పు లేకపోతే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తగిన చికిత్స పొందాలి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఎండలో తిరగకుంటేనే మంచిది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వెళ్లడం మంచిది. – డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యుడు -
పెరిగిన ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. 34 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలు ఇటీవల రెండు మూడు డిగ్రీలు పెరగడంతో కొన్ని ప్రాంతాలు వేసవిని తలపిస్తున్నాయి. ఆదివారం శింగనమల మండలం తరిమెలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. తాడిపత్రి, ఎన్పీ కుంట, అనంతపురం, గుమ్మగట్ట, పెద్దవడుగూరు, యాడికి, బెళుగుప్ప, కళ్యాణదుర్గం, గుత్తి తదితర మండలాల్లో కూడా 38 డిగ్రీలపై ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 35 నుంచి 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. అక్కడక్కడ తేలికపాటి వర్షం : శనివారం రాత్రి భారీ వర్షాలు పడేలా వాతావరణం నెలకొన్నా 20 నుంచి 25 మండలాల్లో తేలికపాటి నుంచి చిరుజల్లులు నమోదయ్యాయి. గుంతకల్లు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి, యాడికి, రాప్తాడు, అనంతపురం, హిందూపురం, కూడేరు, తాడిపత్రి, గార్లదిన్నె, ఉరవకొండ, గుత్తి, కొత్తచెరువు, బత్తలపల్లి, శింగనమల, పుట్టపర్తి, ధర్మవరం, బెళుగుప్ప, గాండ్లపెంట తదితర మండలాల్లో వర్షపాతం నమోదైంది. జూలై నెల సాధారణ వర్షపాతం 67.4 మి.మీ కాగా ప్రస్తుతానికి కేవలం 27.1 మి.మీ నమోదైంది. ఈ క్రమంలో ఖరీఫ్ పంటల సాగు పడకేయగా, వేసిన పంటలు ఎండుముఖం పడుతున్న పరిస్థితి నెలకొంది. -
స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : వారం రోజులతో పోల్చుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గురువారం స్వల్పంగా పెరిగాయి. అనంతపురం 37.6 డిగ్రీలు అత్యధికం కాగా, కూడేరు 36.7 డిగ్రీలు, శెట్టూరు, ఉరవకొండ, బత్తలపల్లి 36.4 డిగ్రీలు, బుక్కపట్నం 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో గరిష్టంగా 34 నుంచి 36 డిగ్రీలు, కనిష్టంగా 25 నుంచి 27 డిగ్రీల మధ్య కొనసాగింది. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 75, మధ్యాహ్నం 35 నుంచి 45 శాతం మధ్య రికార్డయ్యింది. గాలులు గంటకు 8 నుంచి 16 కిలో మీటర్ల వేగంతో వీచాయి. తనకల్లు, గుత్తి, తాడిపత్రి, గుంతకల్లు, యాడికి, శింగనమల, పుట్లూరు, వజ్రకరూరు, కూడేరు, గార్లదిన్నె, కనేకల్లు తదితర మండలాల్లో తుంపర్లు పడ్డాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 40 మి.మీ నమోదైంది. నైరుతి రుతుపవనాలు జిల్లా అంతటా విస్తరించడం, ఆకాశం మేఘావృతమవుతున్నా చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. -
‘సూర్య’ ప్రతాపం
- వేసవికి ముందే భానుడి భగభగ - గుంతకల్లులో 41.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత - రానురాను మరింత కష్టం -జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు అనంతపురం అగ్రికల్చర్ / మెడికల్ : చలి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ‘సూర్య’ ప్రతాపం మొదలైంది. ఉదయం తొమ్మిది నుంచే ఎండలు మండుతున్నాయి. వేసవికి ముందే పరిస్థితి ఇలా ఉండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఈసారి భానుడి భగభగలు తీవ్రంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. జిల్లాలో గత ఏడాది నవంబర్ మధ్యలో చలి ప్రభావం మొదలైంది. డిసెంబర్, జనవరి మాసాల్లో గజగజ వణికించింది. మడకశిర, హిందూపురం, కదిరి, పెనుకొండ, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 7 నుంచి 10 డిగ్రీల లోపు పడిపోయాయి. అయితే.. గత వారం రోజులుగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. ఉష్ణోగ్రతల్లో రోజురోజుకూ పెరుగుదల కన్పిస్తోంది. గురువారం గుంతకల్లులో 41.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శింగనమల 41.8 డిగ్రీలు, ఎన్పీ కుంట 41.8, పామిడి 41.6, బుక్కరాయసముద్రం 41.6, తనకల్లు 41.4, యాడికి 41.2, తాడిపత్రి 41, చెన్నేకొత్తపల్లి 40.8, ఆత్మకూరులో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం బెంబేలెత్తారు. మిగతా మండలాల్లోనూ 36 నుంచి 40 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు 16 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. గాలిలో తేమశాతం ఉదయం 58 నుంచి 78, మధ్యాహ్నం 12 నుంచి 22 మధ్య ఉంటోంది. ఎండలు మండిపోతుండటంతో చల్లని పానీయాలు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లకు డిమాండ్ ఏర్పడింది. తస్మాత్ జాగ్రత్త! ఎండల తీవ్రత వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడిమికి చెమటలు పట్టడం, మూత్రవిసర్జన ఎక్కువగా జరగడం వల్ల శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోతాయి. గొంతు ఎండిపోతుంది. శరీరం ముడతలు పడిపోయి నిర్జలీకరణకు గురయ్యే ప్రమాదముంది. దేహం పొడిబారి చర్మంపై దద్దుర్లు, కురుపులు వంటి సమస్యలు తలెత్తుతాయి. కావున ఓఆర్ఎస్ వంటి ద్రవ పదార్థాలను అధికంగా తీసుకోవాలి. దుస్తులు పూర్తిగా ధరించడంతో పాటు ఎండలో వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగులు, ఇతర వస్తువులతో రక్షణ పొందాలి. నీటి శాతం అధికంగా ఉండే కర్బూజాతో పాటు సిట్రస్ జాతి పండ్లు తీసుకోవాలి. చిన్నపిల్లల విషయంలో అప్రమత్తత అవసరం ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నపిల్లల్లో జ్వరం, అతిసారం, చర్మవ్యాధుల వంటి సమస్యలు వస్తాయి. ఏడాదిలోపు పిల్లల కదలికల అధారంగా వారి పరిస్థితిని గమనించాలి. చర్మం పొడిబారుతుంటే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. తగిన జాగ్రత్తలు తీసుకుని, ఎండలో తిరగనీయకుండా చూడాలి. ఎప్పటికప్పుడు పండ్లు, పానీయాలు అందజేయాలి. – డాక్టర్ హేమలత, చిన్నపిల్లల వైద్యురాలు, సర్వజనాస్పత్రి