- వేసవికి ముందే భానుడి భగభగ
- గుంతకల్లులో 41.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
- రానురాను మరింత కష్టం
-జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
అనంతపురం అగ్రికల్చర్ / మెడికల్ : చలి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ‘సూర్య’ ప్రతాపం మొదలైంది. ఉదయం తొమ్మిది నుంచే ఎండలు మండుతున్నాయి. వేసవికి ముందే పరిస్థితి ఇలా ఉండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఈసారి భానుడి భగభగలు తీవ్రంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. జిల్లాలో గత ఏడాది నవంబర్ మధ్యలో చలి ప్రభావం మొదలైంది. డిసెంబర్, జనవరి మాసాల్లో గజగజ వణికించింది. మడకశిర, హిందూపురం, కదిరి, పెనుకొండ, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 7 నుంచి 10 డిగ్రీల లోపు పడిపోయాయి.
అయితే.. గత వారం రోజులుగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. ఉష్ణోగ్రతల్లో రోజురోజుకూ పెరుగుదల కన్పిస్తోంది. గురువారం గుంతకల్లులో 41.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శింగనమల 41.8 డిగ్రీలు, ఎన్‌పీ కుంట 41.8, పామిడి 41.6, బుక్కరాయసముద్రం 41.6, తనకల్లు 41.4, యాడికి 41.2, తాడిపత్రి 41, చెన్నేకొత్తపల్లి 40.8, ఆత్మకూరులో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం బెంబేలెత్తారు. మిగతా మండలాల్లోనూ 36 నుంచి 40 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు 16 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. గాలిలో తేమశాతం ఉదయం 58 నుంచి 78, మధ్యాహ్నం 12 నుంచి 22 మధ్య ఉంటోంది. ఎండలు మండిపోతుండటంతో చల్లని పానీయాలు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లకు డిమాండ్ ఏర్పడింది.
తస్మాత్ జాగ్రత్త!
ఎండల తీవ్రత వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడిమికి చెమటలు పట్టడం, మూత్రవిసర్జన ఎక్కువగా జరగడం వల్ల శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోతాయి. గొంతు ఎండిపోతుంది. శరీరం ముడతలు పడిపోయి నిర్జలీకరణకు గురయ్యే ప్రమాదముంది. దేహం పొడిబారి చర్మంపై దద్దుర్లు, కురుపులు వంటి సమస్యలు తలెత్తుతాయి. కావున ఓఆర్‌ఎస్ వంటి ద్రవ పదార్థాలను అధికంగా తీసుకోవాలి. దుస్తులు పూర్తిగా ధరించడంతో పాటు ఎండలో వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగులు, ఇతర వస్తువులతో రక్షణ పొందాలి. నీటి శాతం అధికంగా ఉండే కర్బూజాతో పాటు సిట్రస్ జాతి పండ్లు తీసుకోవాలి.
చిన్నపిల్లల విషయంలో అప్రమత్తత అవసరం
ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నపిల్లల్లో జ్వరం, అతిసారం, చర్మవ్యాధుల వంటి సమస్యలు వస్తాయి. ఏడాదిలోపు పిల్లల కదలికల అధారంగా వారి పరిస్థితిని గమనించాలి. చర్మం పొడిబారుతుంటే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. తగిన జాగ్రత్తలు తీసుకుని, ఎండలో తిరగనీయకుండా చూడాలి. ఎప్పటికప్పుడు పండ్లు, పానీయాలు అందజేయాలి.
– డాక్టర్ హేమలత, చిన్నపిల్లల వైద్యురాలు, సర్వజనాస్పత్రి
‘సూర్య’ ప్రతాపం
Published Thu, Feb 23 2017 11:11 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement