
ఢిల్లీలో మధ్యవయస్కుడి హఠాన్మరణం
న్యూఢిల్లీ: ఢిల్లీని చుట్టుముట్టిన వడగాలులు ఒక మధ్యవయస్కుడి ప్రాణం తీశాయి. వడదెబ్బతో ఆస్పత్రిలో చేరిన అతడి శరీర ఉష్ణోగ్రత చూసి వైద్యులు హుతాశులయ్యారు. అతని శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువ ఉండటం గమనార్హం. సోమవారం రాత్రి జరిగిన ఘటన వివరాలను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి డాక్టర్ రాజేశ్ శుక్లా వెల్లడించారు.
‘‘ బిహార్‌లోని దర్భాంగా పట్టణానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి సోమవారం ఢిల్లీలో వడదెబ్బకు గురయ్యారు. వెంటనే ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో చేరారు. ఆయన శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీ ఫారన్‌హీట్‌కు చేరుకోవడం చూసి ఆందోళనకు గురయ్యాం. ఆయనను ఎలాగైనా కాపాడాలని శతథా ప్రయతి్నంచాం. కానీ శరీరంలో అతివేడి కారణంగా ఆయన మూత్రపిండాలు, కాలేయం విఫలమయ్యాయి. ఇలా వెంటవెంటనే పలు అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయన కన్నుమూశారు’ అని డాక్టర్ వివరించారు.
ఒకే ఆస్పత్రిలో 2 గంటల్లో 16 మరణాలు
పట్నా: ఉగ్ర ఉష్ణోగ్రత బిహార్‌లోని ఒకే ఆస్పత్రిలో 16 మంది ప్రాణాలను బలితీసుకుంది. గురువారం ఔరంగాబాద్‌లోని జిల్లా ఆస్పత్రిలో ఈ విషాద ఘటన జరిగింది. గురువారం అక్కడ 44, బుధవారం 48.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంతటి వేడికి తాళలేక జనం పిట్టల్లా రాలిపోయారు. చాలా మంది అక్కడి జిల్లా ఆస్పత్రిలో చేరగా గురువారం రెండు గంటల వ్యవధిలో 16 మంది చనిపోయారు.