sun stroke deaths
-
వడదెబ్బ... 108 డిగ్రీల జ్వరం
న్యూఢిల్లీ: ఢిల్లీని చుట్టుముట్టిన వడగాలులు ఒక మధ్యవయస్కుడి ప్రాణం తీశాయి. వడదెబ్బతో ఆస్పత్రిలో చేరిన అతడి శరీర ఉష్ణోగ్రత చూసి వైద్యులు హుతాశులయ్యారు. అతని శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువ ఉండటం గమనార్హం. సోమవారం రాత్రి జరిగిన ఘటన వివరాలను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి డాక్టర్ రాజేశ్ శుక్లా వెల్లడించారు. ‘‘ బిహార్‌లోని దర్భాంగా పట్టణానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి సోమవారం ఢిల్లీలో వడదెబ్బకు గురయ్యారు. వెంటనే ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చేరారు. ఆయన శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీ ఫారన్‌హీట్‌కు చేరుకోవడం చూసి ఆందోళనకు గురయ్యాం. ఆయనను ఎలాగైనా కాపాడాలని శతథా ప్రయతి్నంచాం. కానీ శరీరంలో అతివేడి కారణంగా ఆయన మూత్రపిండాలు, కాలేయం విఫలమయ్యాయి. ఇలా వెంటవెంటనే పలు అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయన కన్నుమూశారు’ అని డాక్టర్ వివరించారు. ఒకే ఆస్పత్రిలో 2 గంటల్లో 16 మరణాలు పట్నా: ఉగ్ర ఉష్ణోగ్రత బిహార్‌లోని ఒకే ఆస్పత్రిలో 16 మంది ప్రాణాలను బలితీసుకుంది. గురువారం ఔరంగాబాద్‌లోని జిల్లా ఆస్పత్రిలో ఈ విషాద ఘటన జరిగింది. గురువారం అక్కడ 44, బుధవారం 48.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంతటి వేడికి తాళలేక జనం పిట్టల్లా రాలిపోయారు. చాలా మంది అక్కడి జిల్లా ఆస్పత్రిలో చేరగా గురువారం రెండు గంటల వ్యవధిలో 16 మంది చనిపోయారు. -
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బతో ముగ్గురి మృతి
సాక్షి ముంబై: తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల దేశంలోని అన్ని ప్రాంతాలు ఉడికిపోయాయి. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. విదర్భ, మరాఠ్వాడాలో 20 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వడగాడ్పులు వీస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. వీరిలో జల్గావ్ జిల్లాలోని రావేర్‌లోని నమ్రతా చౌదరి, అమల్నేర్లోని రూపాలి రాజ్‌పుత్ ఉండగా.. నాందేడ్ జిల్లాలోని విశాల్ మాదస్‌వార్ ఉన్నారు. ఈ ముగ్గురు వడదెబ్బతోనే మృతి చెందినట్లు సంబంధిత డాక్టర్లు తెలిపారు. ఈ వార్త భయాందోళనతోపాటు విషాదాన్ని నింపింది. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
మూడు రోజుల్లో 8 మంది మృతి
తూర్పుగోదావరి :గత వారం రోజుల్లో ఎండ తీవ్రత పెరగడంతో వడదెబ్బలకు గురై జిల్లాలో పిట్టల్లా రాలిపోతున్నారు. గత మూడు రోజుల్లో 8 మంది వడదెబ్బకు మృతి చెందారు. ఆరో తేదీన నలుగురు మృతి చెందగా, ఏడో తేదీన ఒకరు, ఎనిమిదో తేదీన ముగ్గురు మృతి చెందారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలకు పైగా నమోదవుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకోకపోవడంతో మండుటెండలో స్పృహతప్పిపోతున్నారు. పిఠాపురం రైల్వే స్టేషన్లో ఇద్దరు యాచకులు సోమవారం ప్లాట్‌ఫారంపైనే ఊపిరులొదిరారు. నెల్లిపాక, కడియం, తొండంగి మండలాల్లో బుధవారం ముగ్గురు మృతి చెందారు. ఇలా రోజుకు ఒకరిద్దరు వడదెబ్బకు బలవుతుండడంతో జిల్లా వాసులు హడలిపోతున్నారు. జిల్లాలో పెరుగుతున్న వడదెబ్బ మృతులు మండుటెండలు మనుషుల ప్రాణుల తీస్తున్నాయి. వడదెబ్బతో జనం మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో ఈ మూడు రోజుల వ్యవధిలో సుమారు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తాపీమేస్త్రి మృతి తూర్పుగోదావరి, నెల్లిపాక (రంపచోడవరం): ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై ఓ ఓ తాపీ మేస్త్రి మృతి చెందిన ఘటన బుధవారం ఎటపాక మండలంలోని సీతా పురం గ్రామంలో జరిగింది. కోడిదాసు భాస్కర్ (39) రోజూలాగే నెల్లిపాక గ్రామంలో గృహనిర్మాణ పనులకు సోమవారం కూడా వెళ్లాడు. అయితే ఎండలో పనిచేస్తున్న క్రమంలో వడదెబ్బ తగిలి తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అతడిని భద్రాచంలోని ఓవైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అయినా భాస్కర్ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో పరిస్థితి విషమించి బుదవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మాజీ సర్పంచ్ సుకోనాయక్, వైఎస్సార్ సీపీ, జనసేన నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. దుళ్లలో వృద్ధుడి మృతి కడియం (రాజమహేంద్రవరం రూరల్): వడగాడ్పులకు మండలంలోని దుళ్లలో కామిరెడ్డి అప్పారావు (72) అనే వృద్ధుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బుధవారం ఎప్పటిలాగే తన పనుల్లో నిమగ్నమైన అప్పారావు మధ్యాహ్నం సమయానికి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు స్థానిక వైద్యులను పిలవగా అప్పటికే అతడు మృతి చెందినట్టు తెలిపారు. వడగాడ్పుల కారణంగానే అస్వస్థతకు గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులు వివరిస్తున్నారు. వడదెబ్బకు వృద్ధుడి మృతి తొండంగి (తుని): మండలంలోని పైడికొండలో బుధవారం వదదెబ్బకు గురై వృద్ధుడు మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసినట్టు తొండంగి ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కె.వీర్రాజు(68) గ్రామంలో ఉపాధిహామీ మట్టిపనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు అందరూ అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మృతి చెందడంతో రెవెన్యూ అధికారులు, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. -
నిప్పుల కుంపటిలా రాష్ట్రం!
సాక్షి, అమరావతి/విశాఖ సిటీ: రోహిణి రాలేదు.. అయినా రోళ్లు పగిలే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. రోడ్లు కొలిమిలా మండుతుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నెల మొదటి వారంలోనే భగభగ మండేలా ఎండలు వేస్తుండటంతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి తలెత్తుతోంది. పొడి వాతావరణం, వేడిగాలులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్నీ ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తున్నాయి. సాధారణంగా ప్రతి వేసవిలో రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ.. ఈసారి కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా భానుడి భగభగలకు అన్ని జిల్లాలూ మలమలా మాడిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్న ఉక్కపోత సాయంత్రం 7 గంటలు దాటినా తగ్గడం లేదు. ఆదివారం కృష్ణా, గుంటూరుతోపాటు ఉభయగోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వడగాలులు బలంగా వీచాయి. రాష్ట్రంలో ప్రతి చోటా సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. అనేక ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గరిష్టంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారిందనడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనాలు. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ మధ్యాహ్నం 10 గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గే వరకూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వాతావరణ నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. మరో మూడు రోజులు వడగాలులు తొమ్మిది జిల్లాల్లో మరో మూడు రోజులు వడగాలులు నమోదయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రజలను హెచ్చరించింది. ‘కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 6 నుంచి 8 తేదీ వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందువల్ల వడగాలుల ముప్పు ఉంటుంది. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి’ అని ఐఎండీ వెబ్సైట్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కూడా ప్రజలను, ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఇదే విషయమై అప్రమత్తం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కూడా ఇదే రకమైన హెచ్చరికలు జారీ చేసింది. చెట్ల కింద సేదదీరుతున్న వ్యవసాయ కూలీలు ఉదయం 11 గంటల తర్వాత ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నవారికి తగులుతున్న వేడిగాలులు వడదెబ్బబారిన పడేలా చేస్తున్నాయి. వ్యవసాయ కూలీలు ఎండను భరించలేక ఆముదం ఆకులు, రాగి ఆకులను తలపాగాగా చుట్టుకుని పనిచేస్తున్నారు. గతంలో సాయంత్రం వరకూ వ్యవసాయ పనులు చేసే కూలీలు పెరిగిన వేడిని భరించలేక మధ్యాహ్నం 12 గంటలకే పనులు ఆపేసి చెట్ల నీడన సేదదీరుతున్నారు. ‘పైన సూరీడు, కింద భూమాత తాపానికి తట్టుకోలేక పనివేళలు మార్చుకున్నాం. తెల్లవారుజామునే పొల్లాల్లోకి చేరుకుని పనులు ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలకే ఆపేస్తున్నాం. ఆ తర్వాత ఎండలో పనిచేస్తే వడదెబ్బకు పడిపోవాల్సి వచ్చేలా పరిస్థితి ఉంది. ఆముదం, రావి, కానుగ ఆకులను తలపాగాగా చుట్టుకుని పనిచేస్తున్నాం. మధ్యాహ్నం భోజన సమయంలో తీస్తే ఆకులు రంగుమారిపోతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉందనడానికి ఇది నిదర్శనం’ అని గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన కూరపాటి వరప్రసాద్ అన్నారు. కూల్.. కూల్.. వేడి తీవ్రత పెరిగిన నేపథ్యంలో కొబ్బరి బోండాలకు బాగా గిరాకీ పెరిగింది. పండ్ల రసాలు, శీతల పానీయాల దుకాణాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మజ్జిగ విక్రయాలు గతంలో పోల్చితే రెండు రెట్లు పెరిగా>యని తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోని శీతల పానీయాల దుకాణం యజమాని వెంకటేశ్ ‘సాక్షి’కి తెలిపారు. రహదారులపై శీతల పానీయాలు, నన్నారి, సాల్ట్ సోడా, సుగంధ షర్బత్ అమ్మే దుకాణాలు భారీగా పెరిగాయి. జ్యూస్ కోసం పుచ్చకాయలు, అనాస, చీనీ, ద్రాక్ష, అరటి పండ్లకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు పేర్కొన్నారు. ఎండ పెరిగిన నేపథ్యంలో టోపీలకు కూడా డిమాండ్ పెరిగింది. మహిళలు గొడుగులతో రక్షణ పొందుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే మహిళలు, యువతులు స్కార్ప్ చుట్టుకుని కళ్లకు రక్షణ కోసం చలువ అద్దాలు ధరిస్తున్నారు. పురుషులు కూడా తలకు నూలు వస్త్రం చుట్టి హెల్మెట్ ధరించడం ద్వారా కొంతవరకు ఉపశమనం పొందుతున్నారు. కుండనీరే ఉత్తమం వేసవి నేపథ్యంలో రిఫ్రిజిరేటర్లోని నీటి కంటే మట్టి కుండలోని చల్లని నీరు సేవించడం అత్యుత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘ఎండ వల్ల డీహైడ్రేషన్ (చెమట రూపంలో లవణాలు బయటకు వెళ్లడం) ఎక్కువగా ఉంటుంది. పోయిన లవణాలకు ప్రత్యామ్నాయంగా శరీరానికి అందించేందుకు వీలుగా ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మకాయ రసం కలిపిన నీరు ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. వేడివల్ల వృద్ధులు, పిల్లలు ఎక్కువగా బడలికకు గురవుతారు. అందువల్ల కొబ్బరి నీరు, మజ్జిగ వీలైనన్ని ఎక్కువసార్లు తీసుకోవడం ఉత్తమం. ఇళ్లలో కూడా వేడి ఎక్కువగా ఉన్నట్లైతే కిటికీలకు జనపనార గోనె సంచులు, లేదా వట్టి వేళ్ల చాపలు కట్టి చల్లని నీరు చల్లాలి. దీనివల్ల గది వాతావరణం కొంత వరకూ చల్లగా అవుతుంది. ముతక రంగు వస్త్రాలు వేడిని ఆకర్షిస్తాయి. అందువల్ల వదులైన తెల్లని లేదా లేత రంగు కాటన్ వస్త్రాలు ధరించాలి. సాధ్యమైనంత వరకూ ఎండ సమయంలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. వృద్ధులు, గర్భిణులు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి’ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగత్రలు రాష్ట్రంలోని అనేక చోట్ల ఆదివారం 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయిదు జిల్లాల పరిధిలోని 20 ప్రాంతాల్లోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో ఆదివారం 46 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయిన రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఆదివారం విజయవాడలో 45.6 , ఒంగోలులో 44.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణ్రోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఎండలు భగభగ మండుతున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనాలు. వడదెబ్బకు 19 మంది మృతి రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రం విలవిలాడిపోతోంది. ఓవైపు ఎండవేడి మరోవైపు ఉక్కపోత జనాలకు ఊపిరాడనీయకుండా చేస్తోంది. నానాటికీ వడగాడ్పుల తీవ్రత పెరుగుతోంది. దీంతో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అల్లాడిపోతున్నారు. శని, ఆదివారాల్లోనే రాష్ట్రంలో పందొమ్మిదిమంది మృత్యువాత పడ్డారంటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. గుంటూరు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి జిల్లాలో వృద్ధ దంపతులు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఈపూరుకు చెందిన కొల్లి అంజయ్య (53) తన ఇంటి సమీపంలోని టీ స్టాల్ వద్ద టీ తాగుతూ కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే నగరం మండలం వెనిగళ్లవారిపాలేనికి చెందిన కర్రా వెంకట సుబ్బారావు (60) అస్వస్థతకు గురై మృతి చెందాడు. అదే విధంగా దాచేపల్లి మండలం శ్రీనగర్‌కు చెందిన గోళ్ల శేషమ్మ (80), కొల్లూరుకు చెందిన గరికపాటి బసవపూర్ణమ్మ (62) వడదెబ్బకు తాళలేక మృతి చెందారు. వృద్ధ దంపతుల మృతి.. తూర్పు గోదావరి జిల్లాలో భార్య మృతి చెందిన అరగంటలోనే భర్త మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పాతకోరంగిలో రత్నాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో నివసిస్తున్న దంపతులు గుబ్బల కామరాజు (75), సుభద్రమ్మ (70) కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ బారిన పడ్డారు. రాత్రి నుంచీ అనారోగ్యంగా ఉండడంతో సుభద్రమ్మ ఆదివారం ఉదయం కన్నుమూసింది. భార్య మృతిని జీర్ణించుకోలేని కామరాజు అరగంట గడవకుండానే కుప్పకూలిపోయి మృతి చెందాడు. అనంతలో ముగ్గురు.. అనంతపురం జిల్లా గుత్తిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన తపిల నాగేశ్వరరావు (62), బత్తలపల్లి ప్రభుత్వాస్పత్రి ఉద్యోగి పెద్దన్న (60), కొత్త చెరువుకు చెందిన గోవిందు (43) వడదెబ్బకు మృతి చెందారు. కాగా, చిత్తూరు జిల్లాలో ముగ్గురు మరణించారు. పిచ్చాటూరు మండలంలోని సీరామాపురం ఏఎడబ్ల్యూ గ్రామానికి చెందిన రాంబాబు (49), పిచ్చాటూరుకు చెందిన మణి మొదలియార్ (65), కార్వేటినగరంలో కోటదళితవాడకు చెందిన టి.పురుషోత్తం (60) మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాలో ముగ్గురు.. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన దర్శనం కోటయ్య (70), గిద్దలూరు అర్బన్ కాలనీలో 55 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి, ఇంకొల్లులో అబ్దుల్ జబ్బార్ (78) మృతి చెందారు. శ్రీకాకుళంలో వృద్ధుడి మృతి.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని కొరసవాడ గ్రామానికి చెందిన ఈద్దుం కర్రయ్య (88) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు ఎస్ఐ ఇ.చిన్నంనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తామరాపల్లికి చెందిన వృద్ధుడు సారిపల్లి దేవుడు(60) మృతిచెందాడు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కాకావారిపాళేనికి చెందిన గిరిజనుడు మీరయ్య(62) వీడదెబ్బకు మృత్యువాత పడ్డాడు. వైఎస్సార్ జిల్లాలో యువకుడి మృతి.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని నడింపల్లె ప్రాంతానికి చెందిన టి.నాగేంద్ర (33) స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందాడు. -
మరో ఐదు రోజులు ఎండ మంటలు!
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల ప్రజలు మరో ఐదు రోజులు ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వచ్చే వారంలో వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ వడగాల్పుల కారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండవచ్చని శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణలో రాత్రిపూట 20-30 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో అయితే నెల్లూరులో 44.3 డిగ్రీలు, అనంతపురంలో 43.5 డిగ్రీలు, కర్నూలులో 43.6 డిగ్రీల ఉంది. తెలంగాణ జిల్లాల్లో వరంగల్ లో 43.3 డిగ్రీలు, హైదరాబాద్ లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలుగురాష్ట్రాల్లో రోజుకు పది మందికిపైగా మృత్యువాత పడుతుండగా, మరో ఐదు రోజులు వీచే వడగాల్పులతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. -
అగ్నిగుండం..
♦ పిట్టల్లా రాలుతున్న జనం ♦ వడదెబ్బకు 22 మంది మృతి సాక్షి,గుంటూరు : ఎండ గండంగా మారింది. జిల్లాలో రికార్డు స్థాయిలో ఎండలు మండుతున్నాయి. శుక్రవారం గుంటూరులో 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బకు తాళలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. ఒకే రోజు వడదెబ్బకు 22 మంది మృతి చెందారు. మాచర్ల పట్టణంలోని ఏడవ వార్డుకు చెందిన వేముల గురవయ్య (80), మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన పేర్ల లింగయ్య (50)లు ఇంటివద్ద మరణించారు. పాత మాచర్లకు చెందిన కొమర సైదమ్మ (40)అనే కూలీ పొలం వద్ద మరణించింది. దుర్గి గ్రామంలో పెద్దశెట్టి సుబ్రహ్మణ్యం భార్య పుల్లమ్మ(74)మృతి చెందింది. ముటుకూరు గ్రామానికి చెందిన తిప్పాబత్తుల చెన్నయ్య(45), దుర్గికి చెందిన శింగు పద్మావతి (52)లు మృతి చెందారు. వెల్దుర్తి మండలం చినపర్లపాయ గ్రామానికి చెందిన వడితె హేమిలీబాయి (70) గ్రామ సమీపంలోని పొలంలో పుల్లలు ఏరుతుండగా వడదెబ్బకు గురై మృతిచెందింది. వట్టిచెరుకూరు మండలం పల్లపాడు గ్రామ దళితవాడకు చెందిన ఉండ్రాతి సుబ్బారావు (80) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. అమృతలూరు మండలం మోపర్రుకు చెందిన కంచర్ల సత్యవతి (59) వడగాలులకు మృతి చెందారు. పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెంలో సయ్యద్ పఠాన్ మస్తానమ్మ (80), గొల్ల ఆదిమ్మ (60) శుక్రవారం మృతిచెందినట్లు వీఆర్వో ఎం.భార్గవి తెలిపారు. శావల్యాపురం మండలం కనమర్లపూడిలో ఓ యాచక వృద్ధురాలు (65) గురువారం స్థానిక ఆంజనేయస్వామి ఆలయం పక్కన మృతి చెందింది. భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన దేవినేని బాపనయ్య(60) వడదెబ్బకు గురై శుక్రవారం మృతి చెందారు. వడదెబ్బకు నరసరావుపేట పట్టణంలో శతాధిక వృద్ధురాలు దాసరి సీతమ్మ(107) మృతి చెందింది. మండల కేంద్రమైన మాచవరంలో బండారుపల్లి కోటేశ్వరమ్మ(85), చల్లాపల్లి తిరుపతమ్మ(90), క్రోసూరి తిరుపతమ్మ(80)లు ఎండ తీవ్రతను తట్టుకోలేక మరణించినట్లు బంధువులు తెలిపారు. రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలేం గ్రామంలో సత్తెనపల్లికి చెందిన వేమలు వీరయ్య(55) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. యడ్లపాడు మండలం పరిధిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండంలోని జగ్గాపురానికి చెందిన ముద్దన శివరామయ్య (70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పెరిగిన వేడిగాలులకు మృతి చెందాడని స్థానికులు తెలిపారు. కన్నతల్లికి అనారోగ్యంతో ఉందన్న సమాచారం అందుకుని ద్విచక్రవాహనంపై వెళుతున్న గుంటూరు బ్రాడీపేటలోని వైస్రాయ్ హోటల్ సూపర్వైజర్ చెర్లోపల్లి రాము (45) వడదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయాడు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. వడదెబ్బ తాళలేక ఉండవల్లి గ్రామానికి చెందిన కనసాని రోశయ్య (80) శుక్రవారం మృతిచెందాడు. జయవాడ మొఘల్రాజపురానికి చెందిన అరవపల్లి పరంధామయ్య కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన ఆయన గురువారం రాత్రి పెదకాకాని తోట ఎదురుగా ఆగి ఉన్న కారులో మృతి చెంది ఉన్నాడు.