అగ్నిగుండం..
♦ పిట్టల్లా రాలుతున్న జనం
♦ వడదెబ్బకు 22 మంది మృతి
సాక్షి,గుంటూరు : ఎండ గండంగా మారింది. జిల్లాలో రికార్డు స్థాయిలో ఎండలు మండుతున్నాయి. శుక్రవారం గుంటూరులో 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బకు తాళలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. ఒకే రోజు వడదెబ్బకు 22 మంది మృతి చెందారు. మాచర్ల పట్టణంలోని ఏడవ వార్డుకు చెందిన వేముల గురవయ్య (80), మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన పేర్ల లింగయ్య (50)లు ఇంటివద్ద మరణించారు. పాత మాచర్లకు చెందిన కొమర సైదమ్మ (40)అనే కూలీ పొలం వద్ద మరణించింది. దుర్గి గ్రామంలో పెద్దశెట్టి సుబ్రహ్మణ్యం భార్య పుల్లమ్మ(74)మృతి చెందింది. ముటుకూరు గ్రామానికి చెందిన తిప్పాబత్తుల చెన్నయ్య(45), దుర్గికి చెందిన శింగు పద్మావతి (52)లు మృతి చెందారు.
వెల్దుర్తి మండలం చినపర్లపాయ గ్రామానికి చెందిన వడితె హేమిలీబాయి (70) గ్రామ సమీపంలోని పొలంలో పుల్లలు ఏరుతుండగా వడదెబ్బకు గురై మృతిచెందింది. వట్టిచెరుకూరు మండలం పల్లపాడు గ్రామ దళితవాడకు చెందిన ఉండ్రాతి సుబ్బారావు (80) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. అమృతలూరు మండలం మోపర్రుకు చెందిన కంచర్ల సత్యవతి (59) వడగాలులకు మృతి చెందారు.
పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెంలో సయ్యద్ పఠాన్ మస్తానమ్మ (80), గొల్ల ఆదిమ్మ (60) శుక్రవారం మృతిచెందినట్లు వీఆర్వో ఎం.భార్గవి తెలిపారు. శావల్యాపురం మండలం కనమర్లపూడిలో ఓ యాచక వృద్ధురాలు (65) గురువారం స్థానిక ఆంజనేయస్వామి ఆలయం పక్కన మృతి చెందింది. భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన దేవినేని బాపనయ్య(60) వడదెబ్బకు గురై శుక్రవారం మృతి చెందారు.
వడదెబ్బకు నరసరావుపేట పట్టణంలో శతాధిక వృద్ధురాలు దాసరి సీతమ్మ(107) మృతి చెందింది. మండల కేంద్రమైన మాచవరంలో బండారుపల్లి కోటేశ్వరమ్మ(85), చల్లాపల్లి తిరుపతమ్మ(90), క్రోసూరి తిరుపతమ్మ(80)లు ఎండ తీవ్రతను తట్టుకోలేక మరణించినట్లు బంధువులు తెలిపారు. రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలేం గ్రామంలో సత్తెనపల్లికి చెందిన వేమలు వీరయ్య(55) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. యడ్లపాడు మండలం పరిధిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
మండంలోని జగ్గాపురానికి చెందిన ముద్దన శివరామయ్య (70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పెరిగిన వేడిగాలులకు మృతి చెందాడని స్థానికులు తెలిపారు. కన్నతల్లికి అనారోగ్యంతో ఉందన్న సమాచారం అందుకుని ద్విచక్రవాహనంపై వెళుతున్న గుంటూరు బ్రాడీపేటలోని వైస్రాయ్ హోటల్ సూపర్‌వైజర్ చెర్లోపల్లి రాము (45) వడదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయాడు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. వడదెబ్బ తాళలేక ఉండవల్లి గ్రామానికి చెందిన కనసాని రోశయ్య (80) శుక్రవారం మృతిచెందాడు. జయవాడ మొఘల్‌రాజపురానికి చెందిన అరవపల్లి పరంధామయ్య కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన ఆయన గురువారం రాత్రి పెదకాకాని తోట ఎదురుగా ఆగి ఉన్న కారులో మృతి చెంది ఉన్నాడు.