సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికోడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు(ఆదివారం) రేపు(సోమవారం) రెండు రోజుల పాటు రాష్టానికి తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పుల హెచ్చరికలను ఐఎండీ జారీచేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు బయటకు రావద్దని ఐఎండీ హెచ్చరించింది. ఇక.. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటంతో ఈరోజు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులంబ గద్వాల జిల్లాలకు వడగాల్పుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు (సోమవారం) రాష్ట్రంలో వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు విచే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో భిన్న పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
కాస్త ఉపశమనం.. నాలుగు రోజుల వర్ష సూచన
ఇప్పటికే తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం లభించనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు(ఆదివారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈరోజు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పలు జిలాల్లో కురిసే అవకాశం ఉంది, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచనతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.
రేపు అదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment