ఎండ తీవ్రతకు నిర్మానుష్యంగా మారిన విజయవాడ భవానీపురం రోడ్డు
సాక్షి, అమరావతి/విశాఖ సిటీ: రోహిణి రాలేదు.. అయినా రోళ్లు పగిలే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. రోడ్లు కొలిమిలా మండుతుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నెల మొదటి వారంలోనే భగభగ మండేలా ఎండలు వేస్తుండటంతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి తలెత్తుతోంది. పొడి వాతావరణం, వేడిగాలులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్నీ ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తున్నాయి. సాధారణంగా ప్రతి వేసవిలో రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ.. ఈసారి కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా భానుడి భగభగలకు అన్ని జిల్లాలూ మలమలా మాడిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్న ఉక్కపోత సాయంత్రం 7 గంటలు దాటినా తగ్గడం లేదు. ఆదివారం కృష్ణా, గుంటూరుతోపాటు ఉభయగోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వడగాలులు బలంగా వీచాయి. రాష్ట్రంలో ప్రతి చోటా సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. అనేక ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గరిష్టంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారిందనడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనాలు. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ మధ్యాహ్నం 10 గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గే వరకూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వాతావరణ నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.
మరో మూడు రోజులు వడగాలులు
తొమ్మిది జిల్లాల్లో మరో మూడు రోజులు వడగాలులు నమోదయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రజలను హెచ్చరించింది. ‘కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 6 నుంచి 8 తేదీ వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందువల్ల వడగాలుల ముప్పు ఉంటుంది. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి’ అని ఐఎండీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కూడా ప్రజలను, ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఇదే విషయమై అప్రమత్తం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కూడా ఇదే రకమైన హెచ్చరికలు జారీ చేసింది.
చెట్ల కింద సేదదీరుతున్న వ్యవసాయ కూలీలు
ఉదయం 11 గంటల తర్వాత ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నవారికి తగులుతున్న వేడిగాలులు వడదెబ్బబారిన పడేలా చేస్తున్నాయి. వ్యవసాయ కూలీలు ఎండను భరించలేక ఆముదం ఆకులు, రాగి ఆకులను తలపాగాగా చుట్టుకుని పనిచేస్తున్నారు. గతంలో సాయంత్రం వరకూ వ్యవసాయ పనులు చేసే కూలీలు పెరిగిన వేడిని భరించలేక మధ్యాహ్నం 12 గంటలకే పనులు ఆపేసి చెట్ల నీడన సేదదీరుతున్నారు. ‘పైన సూరీడు, కింద భూమాత తాపానికి తట్టుకోలేక పనివేళలు మార్చుకున్నాం. తెల్లవారుజామునే పొల్లాల్లోకి చేరుకుని పనులు ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలకే ఆపేస్తున్నాం. ఆ తర్వాత ఎండలో పనిచేస్తే వడదెబ్బకు పడిపోవాల్సి వచ్చేలా పరిస్థితి ఉంది. ఆముదం, రావి, కానుగ ఆకులను తలపాగాగా చుట్టుకుని పనిచేస్తున్నాం. మధ్యాహ్నం భోజన సమయంలో తీస్తే ఆకులు రంగుమారిపోతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉందనడానికి ఇది నిదర్శనం’ అని గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన కూరపాటి వరప్రసాద్ అన్నారు.
కూల్.. కూల్..
వేడి తీవ్రత పెరిగిన నేపథ్యంలో కొబ్బరి బోండాలకు బాగా గిరాకీ పెరిగింది. పండ్ల రసాలు, శీతల పానీయాల దుకాణాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మజ్జిగ విక్రయాలు గతంలో పోల్చితే రెండు రెట్లు పెరిగా>యని తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోని శీతల పానీయాల దుకాణం యజమాని వెంకటేశ్ ‘సాక్షి’కి తెలిపారు. రహదారులపై శీతల పానీయాలు, నన్నారి, సాల్ట్ సోడా, సుగంధ షర్బత్ అమ్మే దుకాణాలు భారీగా పెరిగాయి. జ్యూస్ కోసం పుచ్చకాయలు, అనాస, చీనీ, ద్రాక్ష, అరటి పండ్లకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు పేర్కొన్నారు. ఎండ పెరిగిన నేపథ్యంలో టోపీలకు కూడా డిమాండ్ పెరిగింది. మహిళలు గొడుగులతో రక్షణ పొందుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే మహిళలు, యువతులు స్కార్ప్ చుట్టుకుని కళ్లకు రక్షణ కోసం చలువ అద్దాలు ధరిస్తున్నారు. పురుషులు కూడా తలకు నూలు వస్త్రం చుట్టి హెల్మెట్ ధరించడం ద్వారా కొంతవరకు ఉపశమనం పొందుతున్నారు.
కుండనీరే ఉత్తమం
వేసవి నేపథ్యంలో రిఫ్రిజిరేటర్‌లోని నీటి కంటే మట్టి కుండలోని చల్లని నీరు సేవించడం అత్యుత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘ఎండ వల్ల డీహైడ్రేషన్ (చెమట రూపంలో లవణాలు బయటకు వెళ్లడం) ఎక్కువగా ఉంటుంది. పోయిన లవణాలకు ప్రత్యామ్నాయంగా శరీరానికి అందించేందుకు వీలుగా ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మకాయ రసం కలిపిన నీరు ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. వేడివల్ల వృద్ధులు, పిల్లలు ఎక్కువగా బడలికకు గురవుతారు. అందువల్ల కొబ్బరి నీరు, మజ్జిగ వీలైనన్ని ఎక్కువసార్లు తీసుకోవడం ఉత్తమం. ఇళ్లలో కూడా వేడి ఎక్కువగా ఉన్నట్లైతే కిటికీలకు జనపనార గోనె సంచులు, లేదా వట్టి వేళ్ల చాపలు కట్టి చల్లని నీరు చల్లాలి. దీనివల్ల గది వాతావరణం కొంత వరకూ చల్లగా అవుతుంది. ముతక రంగు వస్త్రాలు వేడిని ఆకర్షిస్తాయి. అందువల్ల వదులైన తెల్లని లేదా లేత రంగు కాటన్ వస్త్రాలు ధరించాలి. సాధ్యమైనంత వరకూ ఎండ సమయంలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. వృద్ధులు, గర్భిణులు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి’ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
46 డిగ్రీలకు పైగా ఉష్ణోగత్రలు
రాష్ట్రంలోని అనేక చోట్ల ఆదివారం 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయిదు జిల్లాల పరిధిలోని 20 ప్రాంతాల్లోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో ఆదివారం 46 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయిన రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఆదివారం విజయవాడలో 45.6 , ఒంగోలులో 44.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణ్రోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఎండలు భగభగ మండుతున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనాలు.
వడదెబ్బకు 19 మంది మృతి
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రం విలవిలాడిపోతోంది. ఓవైపు ఎండవేడి మరోవైపు ఉక్కపోత జనాలకు ఊపిరాడనీయకుండా చేస్తోంది. నానాటికీ వడగాడ్పుల తీవ్రత పెరుగుతోంది. దీంతో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అల్లాడిపోతున్నారు. శని, ఆదివారాల్లోనే రాష్ట్రంలో పందొమ్మిదిమంది మృత్యువాత పడ్డారంటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. గుంటూరు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి జిల్లాలో వృద్ధ దంపతులు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఈపూరుకు చెందిన కొల్లి అంజయ్య (53) తన ఇంటి సమీపంలోని టీ స్టాల్ వద్ద టీ తాగుతూ కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే నగరం మండలం వెనిగళ్లవారిపాలేనికి చెందిన కర్రా వెంకట సుబ్బారావు (60) అస్వస్థతకు గురై మృతి చెందాడు. అదే విధంగా దాచేపల్లి మండలం శ్రీనగర్‌కు చెందిన గోళ్ల శేషమ్మ (80), కొల్లూరుకు చెందిన గరికపాటి బసవపూర్ణమ్మ (62) వడదెబ్బకు తాళలేక మృతి చెందారు.
వృద్ధ దంపతుల మృతి..
తూర్పు గోదావరి జిల్లాలో భార్య మృతి చెందిన అరగంటలోనే భర్త మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పాతకోరంగిలో రత్నాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో నివసిస్తున్న దంపతులు గుబ్బల కామరాజు (75), సుభద్రమ్మ (70) కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ బారిన పడ్డారు. రాత్రి నుంచీ అనారోగ్యంగా ఉండడంతో సుభద్రమ్మ ఆదివారం ఉదయం కన్నుమూసింది. భార్య మృతిని జీర్ణించుకోలేని కామరాజు అరగంట గడవకుండానే కుప్పకూలిపోయి మృతి చెందాడు.
అనంతలో ముగ్గురు..
అనంతపురం జిల్లా గుత్తిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన తపిల నాగేశ్వరరావు (62), బత్తలపల్లి ప్రభుత్వాస్పత్రి ఉద్యోగి పెద్దన్న (60), కొత్త చెరువుకు చెందిన గోవిందు (43) వడదెబ్బకు మృతి చెందారు. కాగా, చిత్తూరు జిల్లాలో ముగ్గురు మరణించారు. పిచ్చాటూరు మండలంలోని సీరామాపురం ఏఎడబ్ల్యూ గ్రామానికి చెందిన రాంబాబు (49), పిచ్చాటూరుకు చెందిన మణి మొదలియార్ (65), కార్వేటినగరంలో కోటదళితవాడకు చెందిన టి.పురుషోత్తం (60) మృత్యువాత పడ్డారు.
ప్రకాశం జిల్లాలో ముగ్గురు..
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన దర్శనం కోటయ్య (70), గిద్దలూరు అర్బన్ కాలనీలో 55 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి, ఇంకొల్లులో అబ్దుల్ జబ్బార్ (78) మృతి చెందారు.
శ్రీకాకుళంలో వృద్ధుడి మృతి..
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని కొరసవాడ గ్రామానికి చెందిన ఈద్దుం కర్రయ్య (88) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు ఎస్‌ఐ ఇ.చిన్నంనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తామరాపల్లికి చెందిన వృద్ధుడు సారిపల్లి దేవుడు(60) మృతిచెందాడు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కాకావారిపాళేనికి చెందిన గిరిజనుడు మీరయ్య(62) వీడదెబ్బకు మృత్యువాత పడ్డాడు.
వైఎస్సార్ జిల్లాలో యువకుడి మృతి..
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని నడింపల్లె ప్రాంతానికి చెందిన టి.నాగేంద్ర (33) స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment