
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. వర్షాలతో చల్లదనం పంచాల్సిన కాలంలో వడగాడ్పులు విజృంభిస్తూ మరింత మంటెక్కిస్తున్నాయి.. ఇప్పటికే ఉష్ణతాపంతో కోస్తాంధ్ర భగ్గుమంటోంది. సాధారణం కంటే 3నుంచి6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. ఇదే పరిస్థితి శనివారం కూడా కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది.
కోస్తాంధ్ర అంతటా శనివారం వడగాడ్పులు వీస్తాయని, రాయలసీమలో సాధారణంకంటే 2నుంచి4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని పేర్కొంది. అలాగే శనివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు గానీ, వర్షం గానీ కురుస్తుందని వివరించింది. అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 30నుంచి40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల వడగాడ్పులు వీచాయి.
Comments
Please login to add a commentAdd a comment