ప్రచండ భానుడి సెగలతో సింహపురి అల్లాడుతోంది. వారం రోజులుగా అధిక ఉష్ణ్రోగ్రతలతో జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఒక వైపు సూర్యతాపం.. వడగాలులు.. మరో వైపు పడమటి గాలులు ఠారెత్తిస్తున్నాయి. కావలిలో అత్యధికంగా 44.6 డిగ్రీలు నమోదైంది. ఎండలు మండిపోతుండడంతో జనాలు బయటకు రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటని ప్రజలు భయపడుతున్నారు. నెలాఖరుకు 46.5 డ్రిగీలు దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రెండు, మూడు రోజులు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఎండలకు చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో వారం రోజుల నుంచి ఎండల తీవ్రత తార స్థాయికి చేరుకుంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు వడగాలుల అధికంగా ఉంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ఊరించిన ఫొని తుపాను ఉసూరుమనిపించింది. వర్షాలు కురుస్తాయని ఆశ పడిన జనానికి ఎండతీవ్రత ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరో వైపు పరిశ్రమల కాలుష్య తీవ్ర కూడా అధికంగా ఉన్న క్రమంలో రుతుపవనాల జాడ ఇక్కడ కనిపించని పరిస్థితి. ఫలితంగా మే మూడో వారం నమోదయ్యే ఉష్ణోగ్రతలు నెల ప్రారంభం నుంచే నమోదు అవుతున్నాయి. వాస్తవానికి మే 3 వారం చివర్లో వచ్చే రోహిణి కార్తెతో 43 డిగ్రీల నుంచి అత్యధికంగా 46 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ ఏడాది రోహిణి కార్తెకు ముందే ఎండలు మండుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి 38 డిగ్రీలు నమోదయ్యాయి. భానుడు సెగలతో భయ పెడుతున్నాడు. ఉదయం 8 గంటల దాటిన తర్వాత బయటకు రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. సాయంత్రం 6.30 గంటల తరువాత కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదు. రాత్రులు సైతం వేడిగాలు ఉంటున్నాయి. రాబోవు వారం రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీసే అవకాశం ఉంది.
మెట్ట ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. వేసవి ముందు నుంచే పూర్తిగా అప్రమత్తం కావాల్సిన వైద్యఆరోగ్య శాఖ ఇంకా ఆ దిశగా దృష్టి సారించని పరిస్థితి. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ఎండ తీవ్రత నేపథ్యంలో వడ దెబ్బ తగలకుండా ముందస్తుగా ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ మొదలు అవగాహన కార్యక్రమాల వరకు అన్నీ నిర్వహించాల్సి ఉన్నా దానిని పట్టించుకోలేదు. వడదెబ్బ బాధితులు ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వడగాలుల తీవ్రత అధికంగా ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారగణం ప్రకటించింది. ఈ నెల 6న జరిగే రీపోలింగ్ వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. రీపోల్ జరిగే రెండు కేంద్రాల్లో టెంట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంతో పాటు మంచి నీటి వసతి కూడా ఏర్పాటు చేశారు.
నాలుగేళ్లుగా సాధారణ వర్షపాతమే
జిల్లాలో సగటు వర్షపాతం అతి తక్కువగా నమోద అవుతుంది. ఏటా సగటున 1,080 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా సగటున 60 శాతం వరకు లోటు వర్షపాతం నమోదు అవుతోంది. నాలుగేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి. ఈ ఏడాది 57.5 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. 2015లో వచ్చిన తుపాన్ మినహా ఇప్పటి వరకు ఆ స్థాయిలో వర్షాలు లేకపోవడంతో జిల్లాలో 20కి పైగానే మండలాలు కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. వడగాల్పులుకూడా వీస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వడదెబ్బకు గురయ్యే పరిస్థితి ఉంది. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ వాడుకోవాలి. తెలుపు లేదా లేత రంగు దుస్తులు ధరిస్తే మంచిది. కూలి పనులు చేసేవారు ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకుని ఎండ తీవ్రత తగ్గిన తర్వాత పనిచేయాలి. దాహం వేయకపోయినా గంటకో సారి చొప్పున రోజులో 5 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. ఉప్పుతో కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ నీరు తరచుగా తాగుతూ ఉంటే ఇంకా మంచిది. వడదెబ్బకు గురైతే వెంటనే చల్లగాలి వీచే ప్రాంతానికి చేరుకోవాలి. చల్లని నీటితో ముంచిన వస్త్రంతో శరీరాన్ని తుడవాలి. ఆరోగ్య పరిస్థితి ఆశించిన మార్పు లేకపోతే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తగిన చికిత్స పొందాలి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఎండలో తిరగకుంటేనే మంచిది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వెళ్లడం మంచిది. – డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యుడు
Comments
Please login to add a commentAdd a comment