temperature in telugu states
-
నిప్పుల కుంపటిలా తెలంగాణ
-
సిటీ.. నిప్పుల కుంపటి
సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు ఎండ ప్రచండం.. మరోవైపు వాహన కాలుష్యం నగర వాసులను ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యం 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు వాహనాలు వెదజల్లుతున్న పొగతో బ్లాక్ కార్బన్ కాలుష్యం పంజా విసురుతుండటంతో సిటీజనులు విలవిలలాడుతున్నారు. గ్రేటర్‌తోపాటు శివారు ప్రాంతాల్లో ప్రతిరోజూ సుమారు 50 లక్షల వాహనాలు రహదారులపై తిరుగుతున్నాయి. ఎండ వేడిమితో పాటు వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో తల్లడిల్లుతున్నారు. వాహన విస్ఫోటనం.. దశాబ్దం క్రితం ఔటర్ రింగ్‌రోడ్డు లోపలున్న 190 గ్రామ పంచాయతీలు, నగరపాలక సంస్థల పరిధిలో వాహనాల సంఖ్య ఐదు లక్షలు మాత్రమే. రియల్ ఎస్టేట్, ఐటీ, బీపీఓ, కేపీఓ, ఫార్మా రంగాలకు ఆయా పంచాయతీలు చిరునామాగా మారాయి. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. వాహనాల సంఖ్య దశాబ్ద కాలంలోనే ఐదురెట్లు పెరిగింది. వాహనాల సంఖ్య పెరగడం వరకు బాగానే ఉన్నా.. ప్రధానంగా కాలం చెల్లిన వాహనాలు, డీజిల్ ఇంధనంగా నడిచే బీఎస్3 వాహనాలు వెదజల్లుతున్న కాలుష్య ఉద్గారాల్లో శివారు ప్రాంతాల్లో ఇటీవల బ్లాక్‌కార్బన్ కాలుష్యం పంజా విసురుతున్నట్లు కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) తాజా అధ్యయనంలో తేలింది. నగర వాతావరణంలో బ్లాక్ కార్బన్ మోతాదుపై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో 24 చోట్ల వాయు నమూనాలను పరిశీలించిన పీసీబీ ఈ విషయాన్ని వెల్లడించింది. వామ్మో బ్లాక్ కార్బన్.. సూక్ష్మ ధూళికణాల మోతాదు వార్షిక సరాసరి ఘనపు మీటరు గాలిలో 75 మైక్రో గ్రాములు కాగా.. బ్లాక్‌కార్బన్ మోతాదు 34 మైక్రో గ్రాములుగా నమోదవడం గమనార్హం. ప్రధానంగా నగరంలో సూక్ష్మ ధూళి కణాలు అత్యధికంగా 58 శాతం ఉండగా.. బ్లాక్ కార్బన్ మోతాదు 42 శాతంగా నమోదవడం గమనార్హం. వాయు కాలుష్యానికి కారణాలివే ♦ గ్రేటర్ పరిధిలో వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై దుమ్మూ ధూళి పేరుకుపోవడం ♦ బహిరంగ ప్రదేశాల్లో చెత్త తగులబెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి ♦ శివారు ప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడం ♦ బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజాగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వాయు కాలుష్యం శృతిమించుతోంది ♦ శివారు ప్రాంతాలైన బొంగళూరు, పెద్దఅంబర్‌పేట్, పటాన్చెరు, ఆదిభట్ల, ఘట్కేసర్, మేడ్చల్, శంషాబాద్, కీసర తదితర ప్రాంతాల్లో వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. ♦ గ్రేటర్ పరిధిలో రాకపోకలు సాగించే 50 లక్షల వాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత పెరుగుతోంది ♦ సుమారు 10 లక్షల కాలం చెల్లిన వాహనాలు రోడ్లపైకి ముంచెత్తుతుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ♦ వాహనాల సంఖ్య లక్షలు దాటినా..గ్రేటర్లో 10 వేల కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ పెరిగి సగటు వాహన వేగం గంటకు 15 కి.మీకి పడిపోతోంది. ♦ వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, అమ్మోనియా, బెం జీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం (ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది. ధూళి కాలుష్యంతో అనర్థాలివే.. ♦ పీఎం10,పీఎం 2.5,ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ,స్థూల ధూళి రేణువులు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, పొడి దగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతాయి ♦ దుమ్మూ ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బ తింటుంది చికాకు, అసహనం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందితలనొప్పి,పార్శ్వపు నొప్పి కలుగుతుందిఊపిరితిత్తుల కేన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ♦ ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి వాతావరణ మార్పులు, వాయు కాలుష్యమే ప్రధాన కారణం ♦ ముఖానికి, ముక్కుకు మాస్క్‌లు, కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా ఆర్‌ఎస్‌పీఎం వల్ల కలిగే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. -
చావుదెబ్బ..!
భానుడు భగభగమంటున్నాడు.. ఉదయం 7 గంటలనుంచే తన ప్రతాపం చూపిస్తున్నాడు.. మధ్యాహ్నం 12 దాటిందంటే నిప్పులు కక్కుతున్నాడు. సాయంత్రం 5 గంటలైనా వగడాల్పులు, సెగలు తగ్గడంలేదు. ఎండలో పనిచేసే కూలీలు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు ఎండ దెబ్బకు చావుదెబ్బ తింటున్నారు. అత్యవసర పనిమీద బయటికి వచ్చిన వారు ఎండ వేడిమిని తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. వారం రోజులుగా 44 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సుమారు పది మందికి పైగా వడదెబ్బతో చనిపోయారు. ఎందరో ఆస్పత్రుల పాలయ్యారు. ఈ మూడు నెలల్లోనే సుమారు 50కి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారంటే నమ్మశక్యం కాదు. పాలమూరు: ఉమ్మడి జిల్లాల్లో మండుతున్న వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు.సోమవారం గత మూడు రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో 43 నుంచి 44 ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యం లో రోజువారీ పనులకు ఎప్పటిలాగే వెళ్తున్న ప్రజలు.. వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. మార్చి నుంచి జిల్లాలో వడదెబ్బకు గురై మృతిచెందిన వారు 50కిపైగా ఉన్నా అధికారికంగా ఒక్కటీ నమోదు చేయలేదు. మార్చి నుంచే మార్పులు ఈ ఏడాది భానుడు ఉగ్రరూపం దాల్చాడు. జిల్లావ్యాప్తంగా భానుడు భగభగలాడుతూ ప్రజలను ఉక్కిరిబిక్కరి చేస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ముందుగానే ఎండల తీవ్రత మొదలైంది. మా ర్చి నుంచి వేసవి ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పు చోటుచేసుకుంది. దీంతో మే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఓవైపు వైద్య ఆరోగ్య శాఖ వడదెబ్బ నివారణకు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా.. మరణ మృదంగం మాత్రం మోగుతూనే ఉంది. బాధితుల్లో యువత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది గణాంకాలను పరిశీలిస్తే వడదెబ్బ బాధితుల్లో 15 నుంచి 35ఏళ్లలోపు యువతే అధికంగా ఉన్నట్లు తేలింది. గతేడాది మార్చి, ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉంది. తీవ్ర అనారోగ్యం గల వ్యక్తులు, చిన్నారులు, వృద్ధులు ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు. వీరి లెక్కలేవీ..? ఉమ్మడి జిల్లాలో ఈ నెల 16న వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటకు చెందిన బాలకిష్టమ్మ(48), 17న కొల్లాపూర్ పట్టణంలోని జమ్మాన్గండ్ల కాలనీకి చెందిన వెంకటస్వామి(60), కొత్తకోటకు చెందిన వెంకటస్వామి(60), 22న మక్తల్ మండ లం సంగంబండకు చెందిన కాలప్ప(28), కోడేరు మండలం మైలారం బాలయ్య(65), 24 గోపాల్పేట మున్ననూర్‌కు చెందిన చక్రవర్తి(27), పెద్దచింతకుంటకు చెందిన రాములు(46) వడదెబ్బతో మృతిచెందారు. అయితే వీరు వడదెబ్బతో మృతిచెందినట్లు అధికారిక లెక్కల్లో నమోదు కాలేదు. ఉమ్మడి జిల్లాలో గత ఐదేళ్లలో వడదెబ్బతో ఇప్పటి వరకు 1,082 మంది మరణించినట్లు అంచనా. కానీ వీరిలో కేవలం 75 మంది మాత్రమే వడదెబ్బతో మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ నివేదిక రూపొందించింది. ఓ వైపు వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన చర్యల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఆరు లక్షల వరకు పంపిణీ చేశామని, మరో లక్ష అందుబాటులో ఉంచామని అధికారులు ప్రకటించారు. వడదెబ్బపై కరపత్రాలతో ప్రచారం చేశామని, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటున్నారని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులకు వెళ్తే సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మే నెల చివరి వరకు ఉష్ణోగ్రతల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వదులైనా కాటన్ దుస్తులను ధరించాలి. లవణాలతో కూడిని నీటిని అధికంగా తీసుకోవాలి. ముందస్తు చర్యలేవీ..? ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, ప్రజలు వేడిగాలులకు మరణించడం జరుగుతున్న తంతు. ఈ క్రమంలో వేసవికి ముందే చర్యలు చేపట్టాల్సిందిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. వడదెబ్బ మరణాలు సంభవిస్తే.. తేరుకోవడం లేదన్నది స్పష్టం. వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రధాన కూడళ్లు, ప్రయాణ ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల్లో విస్తృతంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంతోపాటు ఏఎన్ఎంల ద్వారా పంపిణీ చేయాలి. అర్ధరాత్రి దాకా ఉక్కపోత గతేడాదితో పోల్చితే ఈసారి వేసవిలో భానుడు విశ్వరూపం చూపుతున్నాడు. సాయంత్రం వరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. రాత్రివేళ చల్లగాలులు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ నెల మొదటి వారం నుంచే ఎండలు మండిపోతుండటంతోపాటు అర్ధరాత్రి వరకు ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా జిల్లాలో వేసవిలో కొనసాగుతున్న అనూహ్య వాతావరణం కారణంగా ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడి ప్రజలు అవస్థలు కాసింత ఎక్కువే ఎదుర్కొంటున్నారు. ఏటా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పరిశోధకులు హెచ్చరించిన విధంగానే మార్పును ప్రజలు అనుభవించారు. ఊపిరాడనంత కష్టం గత వారం రోజులుగా ఎండ తీవ్రతకు స్వేచ్ఛ గా ఊపిరాడని అనుభవాలను మూటగట్టుకుంటున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌తోపాటు జడ్చర్ల, పేట, దేవరకద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. జిల్లా ఉత్తర దిశలో 19.23 డిగ్రీలు, తూర్పున 81.15 డిగ్రీల స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వేడెక్కిన ఉపరితలలా నుంచి వెలువడే వాయువులు ఇక్కడే తిరుగుతుంటాయి. ఇలాంటి స్థితిని ఎదుర్కొనేందుకు విరివిరిగా ఎదుగుతున్న చెట్లు రావాలి. అలా కాకుంటే ఆక్సిజన్ శాతం తగ్గి ఉక్కిరిబిక్కిరవ్వడం, ముఖం మండుతున్న అనుభవాలు ఎదురవుతా యని వా తావరణ నిపుణులు వివరిస్తున్నారు. ఐదేళ్లలో ఇలా.. గతంలో త్రీమన్ కమిటీ (ఎస్ఐ, తహసీల్దార్, వైద్యాధికారి) నివేదికతోపాటు ఎఫ్ఐఆర్, పంచనామా, పోస్టుమార్టం నివేదిక తప్పనిసరి అవసరం ఉండేది. 2014లో 150 మందికిపైగా మరణిస్తే ఎఫ్ఐఆర్, పంచనామా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేవలం 10 మందికి మాత్రమే పరిహారం ఇచ్చారు. ఆ తర్వాత ఆ నివేదికలు అవసరం లేదని త్రీమన్ కమిటీ నివేదికే ప్రామాణికమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, 2015లో దాదాపు 200 మంది వరకు వడదెబ్బతో మరణించగా కేవలం 12 మంది మాత్రమే మృతి చెందారని వాళ్ల లెక్కలో రాసుకున్నారు. 2016లో 300 వరకు మృతి చెందితే 22 మంది, 2017లో 245 మందికి గాను 18, 2018లో 187 మందికి గాను 13 మందిని అధికారికంగా గుర్తించారు. ఇక 2019లో ఇప్పటి వరకు దాదాపు 50 మందికిపైగా మృతి చెందగా.. ఒక్కరిని కూడా గుర్తించలేదు. వడదెబ్బకు గురైతే.. ఎండలో పనిచేసేవారు, తిరిగేవారు దీనికి త్వరగా వడదెబ్బకు గురవుతారు. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీ ఫారెన్‌హీట్ దాటితే వడదెబ్బ సోకుతుంది. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండెదడ, చెమట ఎక్కువగా రావడం, కిడ్నీలు చెడిపోవడం, ఫిట్స్ రావడం తదితర లక్షణాలు బయటపడతాయి. ఒక్కోసారి కోమాలోకి సైతం వెళ్లొచ్చు. శరీరంలో ప్రొటీన్ స్థాయి తగ్గి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. శరీర ఉష్ణోగ్రత మామూలు స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు వేడిగాలి తగిలినా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. గర్భస్రావం కావొచ్చు.. ఎండల తీవ్రతకు గురి కాకుండా గర్భిణులు మరింత జాగ్రత్త తీసుకోవాలి. శరీరం నిర్జలీకరణం కాకుండా ఎప్పటి కప్పుడు ధ్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. ఇంట్లోనూ మంచి నీటిలో ఉప్పు, చక్కెర వేసుకొని తాగాలి. ఎండ తీవ్రతకు గర్భస్రావమయ్యే ప్రమాదం అధికంగా ఉం టుంది. వేసవిలో గర్భిణులు బయటకు వెళ్లకపోవడమే మంచిది. బాలింత లు గదిలో ఫ్యాన్ తక్కువ వేగంతో తిరిగే లా చూడాలి. కీరదోస, పుచ్చకాయ లాం టి తాజా పండ్లు తీసుకోవడం మంచిది. – డాక్టర్ లక్ష్మీపద్మప్రియ, గైనకాలజిస్టు విచారణ చేస్తాం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ఆశ కార్యకర్తలతో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ప్రస్తు తం జిల్లాలో మూడు లక్షల వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఆయా సెంటర్లకు పంపించాం. ఇప్పటి వరకు జిల్లాలో కొంతమంది వడదెబ్బకు గురై మృతి చెందినట్లు తెలుస్తుంది. కానీ దానిపై సరైన రిపోర్టు రాలేదు. మృతి చెందిన వారిపై నిర్ధారణ కమిటీ ద్వారా విచారణ చేయిస్తాం. జిల్లా లో వడదెబ్బపై ప్రచారం చేస్తున్నాం. ఎక్క డ ఎలాంటి ఇబ్బంది ఉన్నా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఫిర్యాదు చేయాలి. – డాక్టర్ రజని, డీఎంహెచ్ఓ -
‘ఉక్క’రిబిక్కిరి
ఖమ్మంవ్యవసాయం: ఈ వేసవి కాలంలో గత కొద్దిరోజులుగా ఎండలు తీవ్రస్థాయికి చేరి..చెమటలు పట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతుండడంతో కనీసం ఇళ్లలోనూ ఉండలేనంతగా వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో సగటున గరిష్టంగా 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇక మిట్ట మధ్యాహ్నం వేళయితే సూర్య భగవానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మే నెల అంటేనే ఎండలనేవి సహజం. ఇక ప్రస్తుతం రోహిణి కార్తె కూడా ప్రారంభమవడంతో రోళ్లు పగిలే స్థాయిలో ఎండలు పెరుగుతున్నాయి. ప్రజలు ఉదయాన్నే బయటకు వచ్చి తమ పనులను పూర్తి చేసుకొని 11 గంటల వరకు ఇళ్లకు చేరుకునేలా చూసుకుంటున్నారు. అయితే..రోజువారీ జీవనోపాధికి కూలి, ప్రైవేట్ పనులు చేసుకునేవారు అవస్థలు పడుతున్నారు. ఎండదెబ్బ బారిన పడి అస్వస్థతకు గురవుతున్నారు. చాలావరకు పగటిపూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇక ఇళ్లలో వృద్ధులు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాన్లు తిరుగుతున్నా, కూలర్లు నడుస్తున్నా చల్లదనం ఆశించిన స్థాయిలో లేక, కాసేపు కరెంట్‌పోతే విపరీతమైన ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాతనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. సూర్య ప్రతాపానికి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. మే నెల ఆరంభం నుంచి ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 18వ తేదీన జిల్లాలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు అధికమే. గత మే నెలలో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా..ఈ ఏడాది అంతకు మించి నమోదవుతున్నాయి. ఇక ఎండ తీవ్రత నుంచి ఉపశమనానికి ప్రజలు శీతల పానీయాలను తాగుతున్నారు. కొబ్బరి బొండాలు, చెరకు రసం తదితరాలను తీసుకుంటూ, పిల్లలు ఐస్‌క్రీమ్‌లను తింటూ కొంత ఉపశమనం పొందుతున్నారు. పలుచోట్ల ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాలను, మజ్జిగ పంపిణీ కేంద్రాలను స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి . జనజీవనం అతలాకుతలం ఎండ తీవ్రతకు రెక్కాడితే డొక్కాడని పేదల పరిస్థితి దయనీయంగా ఉంది. పనికి వెళ్లంది ఇంట్లో గడవని పరిస్థితిలో పనికి పోయి..వడదెబ్బకు గురవుతున్నారు. ఈ పరిస్థితి ఖమ్మం నగరంతో పాటు, పట్టణాల్లో, గ్రామాల్లో కూడా నెలకొంది. ఒక్కరోజు పనికి పోతే ఎండ తీవ్రతతో నీరసపడి రెండు రోజులు ఇంటివద్ద ఉండాల్సివస్తోంది. ప్రధానంగా నిర్మాణ రంగంలో కూలీలు డీలా పడుతున్నారు. గృహ నిర్మాణ పనులు ఆగిపోతున్నాయి. నీడలో చేసే పనులే సాగుతున్నాయి. కొందరు కాంట్రాక్ట్ పద్ధతికి తీసుకొని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చేసి వెళ్లిపోతున్నారు. వడదెబ్బకు విలవిల అధిక ఉష్ణోగ్రతలు చోటు చేసుకోవడంతో అక్కడక్కడా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. వడగాలులు వీస్తుండడంతో వయో వృధులు తీవ్ర అస్వస్థత చెందుతున్నారు. పగటి వేళల్లో ద్విచక్రవాహనాలపై ప్రయాణించే వారు, పనులపై కాలినడకన వెళ్లేవారు వడదెబ్బకు గురవుతున్నారు. గ్రామాల్లో పశువుల కాపరులు, జీవాల పెంపకందార్లు ఎండదెబ్బ బారిన పడుతున్నారు. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించడం కూడా ఎండ తీవ్రతకు ఇబ్బందికరంగా ఉంది. అడుగంటుతున్న భూగర్భ జలాలు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో బోర్లలో, బావుల్లో నీరు ఇంకుతోంది. వేసవిలో నీటి వినియోగం అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలు పడిపోయి..గ్రామాల్లో సుదూర ప్రాంతాల నుంచి నీటిని మోసుకురావాల్సి వస్తోంది. -
కోళ్ల పరిశ్రమకు సన్‌స్ట్రోక్..!
గీసుకొండ(పరకాల): గుడ్డు పెట్టే లేయర్ కోళ్లకు గడ్డుకాలం వచ్చింది. ఎండ వేడిమి, వడగాడ్పుల కారణంగా లేయర్ కోళ్ల పరిశ్రమ కుదేలవుతోంది. కోళ్ల ప్రాణాల ఎండ వేడిమికి గాలిలో కలిసిపోతున్నాయి. ప్రస్తుత వేసవిలో సుమారు 4 లక్షల కోళ్లు మృతి చెందాయంటే కోళ్ల పెంపకం చేపట్టే ఫాం యజమానులు ఎంతగా నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో గుడ్డు ధర అమాంతం పడిపోవడంతో పెంపకందారులు దీనస్థితిలో ఉన్నారు. గతంలో గుడ్డు ధర రూ. 4.75 లు ఉండగా ప్రస్తుతం రూ. 2.75 పైసలకఅు పడిపోయింది. ఒక వైపు ఎండలతో మృతి చెందుతున్న కోళ్లు.. మరో వైపు గుడ్డు ధర పతనమవుతుండడంతో లేయర్ కోళ్లను పెంచే రైతులు, ఫాం యజమానులు ఆర్థికంగా నష్టపోతూ మనోవేదన చెందుతున్నారు. రూ.లక్షలు పెట్టుబడిగా పెట్టి, బ్యాంకుల నుంచి అప్పుతెచ్చి కోళ్ల పెంపకం చేపడితో పెట్టుబడి దక్కే పరిస్థితి లేక నష్టాల ఊబిలో చిక్కుకున్నామని వారు వాపోతున్నారు. హెచరీల యజమానులు, ఎగ్ ట్రేడర్ల మాయాజాలం కారణంగా గుడ్డు రేటు కృత్రిమంగా పతనమవుతోందని కోళ్ల రైతులు చెబుతున్నారు. ఫాం యజమానులకు తక్కువ చెల్లించి వ్యాపారులు గుడ్డుకు రూ. 4.50 నుంచి రూ. 5 వరకు ఓపెన్ మార్కెట్లో, చిల్లరగా అమ్ముకుంటున్నారని అంటున్నారు. వ్యాపారుల గుప్పిట్లో గుడ్ల వ్యాపారం, ధర నిర్ణయం కావడంతో తాము ఏమీ చేయలేక పోతున్నామని వారు వాపోతున్నారు. గుడ్డుకు మార్కెట్లో డిమాండ్ ఉన్నా తాము ఉత్పత్తి చేసే వాటికి ధర తగ్గించి హెచరీల యజమానులు, ఎగ్ వ్యాపారులు తమ జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని ఫాంల యజమానులు వాపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 85 లేయర్ కోళ్ల ఫాంలు ఉండగా వాటిలో సుమారు 35 లక్షల కోళ్లను పెంచుతున్నారు. వీటిలో ఇప్పటివరకు సుమారు 4 లక్షల కోళ్లు ఎండ వేడిమికి తట్టుకోలేక మృతి చెందినట్లు రైతులు చెబుతున్నారు. ఎగ్ బోర్డు ఏర్పాటు చేయాలి లేయర్ కోళ్లను పెంచే ఫాంల వారికి గుడ్డు విషయంలో గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎగ్ బోర్డును ఏర్పాటు చేయాలి. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవ తీసుకుని సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లాలని విజ్ఞప్తి. ఎగ్ వ్యాపారులు, హెచరీల పెత్తనం లేకుండా ఉండాలంటే ఎగ్బోర్డుతో గుడ్ల కోళ్లను పెంచే వారికి భరోసా ఏర్పడుతుంది. గిట్టుబాటు ధర కల్పిస్తే ఇబ్బందులు తప్పుతాయి. ధరల్లో హెచ్చు తగ్గులు ఉండకుండా చూడాలి. ఎండ దెబ్బతో చనిపోయిన కోళ్ల విషయంలో ప్రభుత్వం మమ్మలను ఆదుకోవాలి. –చిట్టిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, లేయర్ ఫాం యజమానుల ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి -
సుర్‌రీడు
ప్రచండ భానుడి సెగలతో సింహపురి అల్లాడుతోంది. వారం రోజులుగా అధిక ఉష్ణ్రోగ్రతలతో జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఒక వైపు సూర్యతాపం.. వడగాలులు.. మరో వైపు పడమటి గాలులు ఠారెత్తిస్తున్నాయి. కావలిలో అత్యధికంగా 44.6 డిగ్రీలు నమోదైంది. ఎండలు మండిపోతుండడంతో జనాలు బయటకు రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటని ప్రజలు భయపడుతున్నారు. నెలాఖరుకు 46.5 డ్రిగీలు దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రెండు, మూడు రోజులు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఎండలకు చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో వారం రోజుల నుంచి ఎండల తీవ్రత తార స్థాయికి చేరుకుంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు వడగాలుల అధికంగా ఉంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ఊరించిన ఫొని తుపాను ఉసూరుమనిపించింది. వర్షాలు కురుస్తాయని ఆశ పడిన జనానికి ఎండతీవ్రత ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరో వైపు పరిశ్రమల కాలుష్య తీవ్ర కూడా అధికంగా ఉన్న క్రమంలో రుతుపవనాల జాడ ఇక్కడ కనిపించని పరిస్థితి. ఫలితంగా మే మూడో వారం నమోదయ్యే ఉష్ణోగ్రతలు నెల ప్రారంభం నుంచే నమోదు అవుతున్నాయి. వాస్తవానికి మే 3 వారం చివర్లో వచ్చే రోహిణి కార్తెతో 43 డిగ్రీల నుంచి అత్యధికంగా 46 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ ఏడాది రోహిణి కార్తెకు ముందే ఎండలు మండుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి 38 డిగ్రీలు నమోదయ్యాయి. భానుడు సెగలతో భయ పెడుతున్నాడు. ఉదయం 8 గంటల దాటిన తర్వాత బయటకు రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. సాయంత్రం 6.30 గంటల తరువాత కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదు. రాత్రులు సైతం వేడిగాలు ఉంటున్నాయి. రాబోవు వారం రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీసే అవకాశం ఉంది. మెట్ట ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. వేసవి ముందు నుంచే పూర్తిగా అప్రమత్తం కావాల్సిన వైద్యఆరోగ్య శాఖ ఇంకా ఆ దిశగా దృష్టి సారించని పరిస్థితి. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ఎండ తీవ్రత నేపథ్యంలో వడ దెబ్బ తగలకుండా ముందస్తుగా ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ మొదలు అవగాహన కార్యక్రమాల వరకు అన్నీ నిర్వహించాల్సి ఉన్నా దానిని పట్టించుకోలేదు. వడదెబ్బ బాధితులు ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వడగాలుల తీవ్రత అధికంగా ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారగణం ప్రకటించింది. ఈ నెల 6న జరిగే రీపోలింగ్ వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. రీపోల్ జరిగే రెండు కేంద్రాల్లో టెంట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంతో పాటు మంచి నీటి వసతి కూడా ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా సాధారణ వర్షపాతమే జిల్లాలో సగటు వర్షపాతం అతి తక్కువగా నమోద అవుతుంది. ఏటా సగటున 1,080 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా సగటున 60 శాతం వరకు లోటు వర్షపాతం నమోదు అవుతోంది. నాలుగేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి. ఈ ఏడాది 57.5 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. 2015లో వచ్చిన తుపాన్ మినహా ఇప్పటి వరకు ఆ స్థాయిలో వర్షాలు లేకపోవడంతో జిల్లాలో 20కి పైగానే మండలాలు కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. వడగాల్పులుకూడా వీస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వడదెబ్బకు గురయ్యే పరిస్థితి ఉంది. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ వాడుకోవాలి. తెలుపు లేదా లేత రంగు దుస్తులు ధరిస్తే మంచిది. కూలి పనులు చేసేవారు ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకుని ఎండ తీవ్రత తగ్గిన తర్వాత పనిచేయాలి. దాహం వేయకపోయినా గంటకో సారి చొప్పున రోజులో 5 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. ఉప్పుతో కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ నీరు తరచుగా తాగుతూ ఉంటే ఇంకా మంచిది. వడదెబ్బకు గురైతే వెంటనే చల్లగాలి వీచే ప్రాంతానికి చేరుకోవాలి. చల్లని నీటితో ముంచిన వస్త్రంతో శరీరాన్ని తుడవాలి. ఆరోగ్య పరిస్థితి ఆశించిన మార్పు లేకపోతే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తగిన చికిత్స పొందాలి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఎండలో తిరగకుంటేనే మంచిది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వెళ్లడం మంచిది. – డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యుడు -
నిప్పుల వాన..!
కడప రూరల్: ఈ ఎండాకాలం చాలా ‘హాట్’గా మారింది. వేసవి సెగలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అప్పుడే ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటేలా కనిపిస్తోంది. ‘నిప్పుల వాన’ పడుతోందా...? అనేఅ భావన జనంలో కలుగుతోంది. వేడికి మించి ఉక్కపోత ఉండటంతో ఇంట్లో నుంచి బయటపకు అడుగుపెట్టాలంటే జంకుతున్నారు. ఉదయం 8.30 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మ«ధ్యాహ్నం సమయంలో విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. రోజూ సగటున 43 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రంలో కడప ఉష్ణోగ్రతలో టాప్‌గా నిలుస్తూ కలవరపరుస్తోంది. రాత్రి వేళ గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడంతో ఉక్కపోత ప్రభావం కనిపిస్తోంది. బద్వేల్, జమ్మలమడుగు, కమలాపురం తదితర నియోజక వర్గ ప్రాంతాల్లో ఈ ప్రభావం మొదటిపేజీ తరువాయిఎక్కువగా కనిపిస్తోంది. నదీ తీరం, కొండలున్న ఏరియాల్లో ‘సెగ’ మరింతగా జనాలకు మంట పెట్టిస్తోంది. వర్షాలు సరిగా పడకపోవడం..çకనుచూపు మేర కరువు ఛాయలు ఏర్పడడం. పచ్చదనం లేకపోవడం తదితర కారణాలతో వేసవి అందరినీ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పుడే గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకుంది. ఈ వేసవిలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే సంప్రదించాలని సూచిస్తున్నారు. -
ఈ ఏడాది 47 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు!
హైదరాబాద్ : గత పదేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా మార్చి నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉంటాయని వాతావరణశాఖ గురువారం వెల్లడించింది. ఏపీ, తెలంగాణలోల పొడి వాతావరణం నెలకొందని పేర్కొంది. వాయవ్య పశ్చిమం నుంచి వీచే పొడిగాలుల ప్రభావంతో వాతావరణంలో తేమ లేదని... అందువల్ల మేఘాలు కూడా లేవని స్పష్టం చేసింది. ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో సూర్యశక్తి నేరుగా భూమిని తాకడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వివరించింది. గత ఏడాది మే నెలలో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయినాయని వాతావరణశాఖ ఈ సందర్భంగా గుర్తు చేసింది. అయితే ఈ ఏడాది 47 డిగ్రీల ఉష్ణోగ్రతలకు మించి నమోదయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కోస్తా, రాయలసీమ, తెలంగాణలో పొడిగాలులు వీస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం భారీగా ఉన్న ఉష్ణోగ్రతలు... రెండుమూడు రోజుల తర్వాత... కొద్దిగా తగ్గినా 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.