సిటీ.. నిప్పుల కుంపటి | Temperature Rise in Hyderabad | Sakshi
Sakshi News home page

సిటీ.. నిప్పుల కుంపటి

Published Thu, May 30 2019 8:17 AM | Last Updated on Mon, Jun 3 2019 11:00 AM

Temperature Rise in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు ఎండ ప్రచండం.. మరోవైపు వాహన కాలుష్యం నగర వాసులను ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యం 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు వాహనాలు వెదజల్లుతున్న పొగతో బ్లాక్‌ కార్బన్‌ కాలుష్యం పంజా విసురుతుండటంతో సిటీజనులు విలవిలలాడుతున్నారు. గ్రేటర్‌తోపాటు శివారు ప్రాంతాల్లో ప్రతిరోజూ సుమారు 50 లక్షల వాహనాలు రహదారులపై తిరుగుతున్నాయి. ఎండ వేడిమితో పాటు వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో తల్లడిల్లుతున్నారు.  

వాహన విస్ఫోటనం..
దశాబ్దం క్రితం ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపలున్న 190 గ్రామ పంచాయతీలు, నగరపాలక సంస్థల పరిధిలో వాహనాల సంఖ్య ఐదు లక్షలు మాత్రమే. రియల్‌ ఎస్టేట్, ఐటీ, బీపీఓ, కేపీఓ, ఫార్మా రంగాలకు ఆయా పంచాయతీలు చిరునామాగా మారాయి. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. వాహనాల సంఖ్య దశాబ్ద కాలంలోనే ఐదురెట్లు పెరిగింది. వాహనాల సంఖ్య పెరగడం వరకు బాగానే ఉన్నా.. ప్రధానంగా కాలం చెల్లిన వాహనాలు, డీజిల్‌ ఇంధనంగా నడిచే బీఎస్‌3 వాహనాలు వెదజల్లుతున్న కాలుష్య ఉద్గారాల్లో శివారు ప్రాంతాల్లో ఇటీవల బ్లాక్‌కార్బన్‌ కాలుష్యం పంజా విసురుతున్నట్లు కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) తాజా అధ్యయనంలో తేలింది. నగర వాతావరణంలో బ్లాక్‌ కార్బన్‌ మోతాదుపై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో 24 చోట్ల వాయు నమూనాలను పరిశీలించిన పీసీబీ ఈ విషయాన్ని వెల్లడించింది.   

వామ్మో బ్లాక్‌ కార్బన్‌..
సూక్ష్మ ధూళికణాల మోతాదు వార్షిక సరాసరి ఘనపు మీటరు గాలిలో 75 మైక్రో గ్రాములు కాగా.. బ్లాక్‌కార్బన్‌ మోతాదు 34 మైక్రో గ్రాములుగా నమోదవడం గమనార్హం. ప్రధానంగా నగరంలో సూక్ష్మ ధూళి కణాలు అత్యధికంగా 58 శాతం ఉండగా.. బ్లాక్‌ కార్బన్‌ మోతాదు 42 శాతంగా నమోదవడం గమనార్హం.  

వాయు కాలుష్యానికి కారణాలివే
గ్రేటర్‌ పరిధిలో వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్‌ రద్దీలో రహదారులపై దుమ్మూ ధూళి పేరుకుపోవడం   
బహిరంగ ప్రదేశాల్లో చెత్త తగులబెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి
శివారు ప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడం    
బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్‌ ప్రాంతాల్లో వాయు కాలుష్యం శృతిమించుతోంది   
శివారు ప్రాంతాలైన బొంగళూరు, పెద్దఅంబర్‌పేట్, పటాన్‌చెరు, ఆదిభట్ల, ఘట్‌కేసర్, మేడ్చల్, శంషాబాద్, కీసర తదితర ప్రాంతాల్లో వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి.
గ్రేటర్‌ పరిధిలో రాకపోకలు సాగించే 50 లక్షల వాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత పెరుగుతోంది  
సుమారు 10 లక్షల కాలం చెల్లిన వాహనాలు రోడ్లపైకి ముంచెత్తుతుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది
వాహనాల సంఖ్య లక్షలు దాటినా..గ్రేటర్‌లో  10 వేల కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ  పెరిగి సగటు వాహన వేగం గంటకు 15 కి.మీకి పడిపోతోంది.  
వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్బన్‌ మోనాక్సైడ్, నైట్రోజన్‌ డయాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్, అమ్మోనియా, బెం జీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం (ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది.

ధూళి కాలుష్యంతో అనర్థాలివే..
పీఎం10,పీఎం 2.5,ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ,స్థూల ధూళి రేణువులు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, పొడి దగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతాయి
దుమ్మూ ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బ తింటుంది చికాకు, అసహనం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందితలనొప్పి,పార్శ్వపు నొప్పి కలుగుతుందిఊపిరితిత్తుల కేన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది.
ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, క్రానిక్‌ బ్రాంకైటిస్, సైనస్‌ సమస్యలు పెరగడానికి వాతావరణ మార్పులు, వాయు కాలుష్యమే ప్రధాన కారణం
ముఖానికి, ముక్కుకు మాస్క్‌లు, కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా ఆర్‌ఎస్‌పీఎం వల్ల కలిగే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement