కోళ్ల పరిశ్రమకు సన్‌స్ట్రోక్‌..!  | Chickens Died With Temperature Warangal | Sakshi
Sakshi News home page

కోళ్ల పరిశ్రమకు సన్‌స్ట్రోక్‌..! 

Published Thu, May 9 2019 10:48 AM | Last Updated on Thu, May 9 2019 10:48 AM

Chickens Died With Temperature Warangal - Sakshi

గీసుకొండ(పరకాల): గుడ్డు పెట్టే లేయర్‌ కోళ్లకు గడ్డుకాలం వచ్చింది. ఎండ వేడిమి, వడగాడ్పుల కారణంగా లేయర్‌ కోళ్ల పరిశ్రమ కుదేలవుతోంది. కోళ్ల ప్రాణాల ఎండ వేడిమికి గాలిలో కలిసిపోతున్నాయి. ప్రస్తుత వేసవిలో సుమారు 4 లక్షల కోళ్లు మృతి చెందాయంటే కోళ్ల పెంపకం చేపట్టే ఫాం యజమానులు ఎంతగా నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో గుడ్డు ధర అమాంతం పడిపోవడంతో పెంపకందారులు దీనస్థితిలో ఉన్నారు. గతంలో గుడ్డు ధర రూ. 4.75 లు ఉండగా ప్రస్తుతం రూ. 2.75 పైసలకఅు పడిపోయింది. ఒక వైపు ఎండలతో మృతి చెందుతున్న కోళ్లు.. మరో వైపు గుడ్డు ధర పతనమవుతుండడంతో లేయర్‌ కోళ్లను పెంచే రైతులు, ఫాం యజమానులు ఆర్థికంగా నష్టపోతూ మనోవేదన చెందుతున్నారు.

రూ.లక్షలు పెట్టుబడిగా పెట్టి, బ్యాంకుల నుంచి అప్పుతెచ్చి కోళ్ల పెంపకం చేపడితో పెట్టుబడి దక్కే పరిస్థితి లేక నష్టాల ఊబిలో చిక్కుకున్నామని వారు వాపోతున్నారు. హెచరీల యజమానులు, ఎగ్‌ ట్రేడర్ల మాయాజాలం కారణంగా గుడ్డు రేటు కృత్రిమంగా పతనమవుతోందని కోళ్ల రైతులు చెబుతున్నారు. ఫాం యజమానులకు తక్కువ చెల్లించి వ్యాపారులు గుడ్డుకు రూ. 4.50 నుంచి రూ. 5 వరకు ఓపెన్‌ మార్కెట్‌లో, చిల్లరగా అమ్ముకుంటున్నారని అంటున్నారు.

వ్యాపారుల గుప్పిట్లో గుడ్ల వ్యాపారం, ధర నిర్ణయం కావడంతో తాము ఏమీ చేయలేక పోతున్నామని వారు వాపోతున్నారు. గుడ్డుకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నా తాము ఉత్పత్తి చేసే వాటికి ధర తగ్గించి హెచరీల యజమానులు, ఎగ్‌ వ్యాపారులు తమ జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని ఫాంల యజమానులు వాపోతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 85 లేయర్‌ కోళ్ల ఫాంలు ఉండగా వాటిలో సుమారు 35 లక్షల కోళ్లను పెంచుతున్నారు. వీటిలో ఇప్పటివరకు సుమారు 4 లక్షల కోళ్లు ఎండ వేడిమికి తట్టుకోలేక మృతి చెందినట్లు రైతులు చెబుతున్నారు.

ఎగ్‌ బోర్డు ఏర్పాటు చేయాలి
లేయర్‌ కోళ్లను పెంచే ఫాంల వారికి గుడ్డు విషయంలో గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎగ్‌ బోర్డును ఏర్పాటు చేయాలి. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవ తీసుకుని సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకుని వెళ్లాలని విజ్ఞప్తి. ఎగ్‌ వ్యాపారులు, హెచరీల పెత్తనం లేకుండా ఉండాలంటే ఎగ్‌బోర్డుతో గుడ్ల కోళ్లను పెంచే వారికి భరోసా ఏర్పడుతుంది. గిట్టుబాటు ధర కల్పిస్తే ఇబ్బందులు తప్పుతాయి. ధరల్లో హెచ్చు తగ్గులు ఉండకుండా చూడాలి. ఎండ దెబ్బతో చనిపోయిన కోళ్ల విషయంలో ప్రభుత్వం మమ్మలను ఆదుకోవాలి. –చిట్టిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, లేయర్‌ ఫాం యజమానుల ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement