chickens
-
లోన్ ఆశ చూపి.. రూ.39 వేల నాటు కోళ్లు తిన్న బ్యాంక్ మేనేజర్!
చత్తీస్‌గఢ్‌లో ఓ వింత ఘటన వెలుగుచసింది. నాటు కోడి కూర అంటే తెగ ఇష్టపడే ఓ బ్యాంక్ మేనేజర్.. ఓ రైతును బకరాలాగా ఉపయోగించుకున్నాడు. అతడికి లోన్ ఇప్పిస్తానని ఆశ చూపి ఏకంగా వేల విలువైన నాటు కోళ్లను అమాంతం తినేశాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. మస్తూరి పట్టణానికి చెందిన రైతు మన్హర్‌కు కోళ్ల ఫారమ్ ఉంది. తన పొలంలో ఏర్పాటు చేసిన ఆ కోళ్ల ఫారాన్ని మరింత విస్తరించాలని రైతు భావించాడు. అందుకు లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుని స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్‌ను కలిశాడు. లోన్ ఇస్తానని చెప్పిన మేనేజర్ తనకు నాటు కోడి కూర అంటే ఇష్టమని, తనకు ప్రతి శనివారం నాటు కోడి తెచ్చివ్వాలని కోరాడు. లోన్ వస్తుందన్న ఆశతో రైతు మన్హర్ బ్యాంకు మేనేజర్ చెప్పినట్టే చేశాడు. అప్పటి నుంచి మొదలు లోన్ పేరు చెప్పి తరచూ అతడు మన్హర్ ద్వారా నాటు కోళ్లు తెప్పించుకుని తిన్నాడు.ఇలా రెండు నెలల వ్యవధిలో అతడు మొత్తం రూ.39 వేల విలువ చేసే నాటుకోళ్లు తిన్నాడు. పైగా రైతు నుంచి లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా డిమాండ్ చేశాడు. దాంతో అతను తన ఫారమ్‌లోని కోళ్లను అమ్మి రూ.10 లక్షల లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా ఇచ్చాడు. అయినా బ్యాంకు మేనేజర్ లోన్ మంజూరు చేయకుండా ఇంకా నాటు కోళ్ల కోసం డిమాండ్ చేశాడు. దాంతో బ్యాంకు మేనేజర్ తనకు లోన్ ఇవ్వదల్చుకోలేదని, తనను మోసం చేశాడని గ్రహించిన మన్హర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కొనుగోలు చేసి మేనేజర్‌కి ఇచ్చిన కోళ్ల బిల్లులు కూడా తన వద్ద ఉన్నాయని, మేనేజర్ తిన్న కోళ్లకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేనేజర్‌పై చర్య తీసుకోవాలని లేదంటే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనకు న్యాయం చేయకపోతే నిరహార దీక్షకు కూర్చుంటానని, మస్తూరి ఎస్బీఐ బ్రాంచ్ ముందే తాను చచ్చిపోతానని హెచ్చరించాడు. దాంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వేడికి ‘కోడి’ విలవిల!
సాక్షి, భీమవరం: మండుతున్న ఎండలు పౌల్ట్రీ పరిశ్రమకు గుబులు పుట్టిస్తున్నాయి. వేడిగాలులకు తాళలేక ఫారాల వద్ద వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం కోళ్ల రైతులను కలవరపరుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోట్లలో నష్టం వాటిల్లి పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కోస్తాలోని ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుడ్లు పెట్టే లేయర్ కోళ్లు నాలుగు కోట్ల వరకు ఉండగా, ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయలసీమలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కోటి వరకూ ఉన్నాయి. గుడ్లు పెట్టే దశకు చేరువలోని బ్రోయర్, చిక్స్ మూడు కోట్ల వరకు ఉంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో సాధారణంగా రోజుకు 60 నుంచి 80 కోళ్లు వరకు చనిపోతుంటాయి. ప్రస్తుతం ఈ మరణాల సంఖ్య 450 నుంచి 500 వరకు చేరింది. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకూ తట్టుకుంటాయి. గత మూడు రోజులుగా 40 డిగ్రీలకు పైబడి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడిగాలుల ప్రభావంతో ముందెన్నడూ లేనంతగా ఈ ఏడాది కోళ్ల మరణాలు పెరిగాయి. కోస్తా ప్రాంతంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. ఒక కోడి చనిపోవడం వల్ల రూ.250 వరకు నష్టం వాటిల్లుతుంది.. ఈ మేరకు గత మూడు రోజుల్లో రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల కోళ్లు చనిపోగా పరిశ్రమకు రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. పడిపోయిన గుడ్ల ఉత్పత్తి ఎండల తీవ్రత వల్ల గుడ్ల ఉత్పత్తి 15 శాతం మేర తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజుకు 4.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా వడగాలుల తీవ్రతకు ఆ ఉత్పత్తి 3.49 కోట్లకు తగ్గిపోయింది. డ్రాపింగ్ కారణంగా రోజుకు 61.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గుడ్డు రైతు ధర రూ.4.85 ఉండగా.. రోజుకు రూ.2.98 కోట్ల చొప్పున మూడు రోజుల్లో రూ.8.95 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లకు ఉపశమన చర్యలతో ఖర్చులు పెరిగిపోయాయి.వడదెబ్బకు గురికాకుండా కోళ్లకు ప్రత్యేక మందులివ్వడం, ఫారాల్లో వాతావరణాన్ని చల్లబర్చేందుకు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు.. పెరిగిన మేత ధరలు, కూలి రేట్లతో నిర్వహణ భారం మారిందని కోళ్ల రైతులంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు గుడ్డు సరఫరా లేక స్థానిక వినియోగం తగ్గి గుడ్డుకు రైతు ధర పతనమవుతోందని చెబుతున్నారు.ప్రభుత్వం ఆదుకోవాలి.. ఎప్పుడూ లేనంతగా ఈసారి ఎండల తీవ్రతకు కోళ్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రభుత్వం ఆదుకోకుంటే కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుంది. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయిస్ గోదాముల్లోని మనుషులు తినడానికి పనికిరాకుండా నిల్వ ఉన్న గోధుమలు, మొక్కజొన్న, నూకలను తక్కువ ధరపై కోళ్ల రైతులకు ప్రభుత్వం అందజేయాలి. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
తొలిరోజే పుంజుకున్నాయ్
సాక్షి, అమరావతి/భీమవరం/అమలాపురం: భోగి రోజైన ఆదివారం పందెం కోళ్లు జూలు విదిల్చాయి. బరిలోకి దూకి కత్తులు దూశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కోడి పందేలు మొదలయ్యాయి. గోదావరి జిల్లాల్లో భారీఎత్తున పందేలు జరిగాయి. పశి్చమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకొల్లు, నరసాపురం, ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, నిడమర్రు, దెందులూరు మండలాలు, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పందేలు సందడిగా సాగాయి. కోనసీమ జిల్లా రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలో పలుచోట్ల కోడిపందేలు జోరుగా సాగాయి. కొన్నిచోట్ల బరులకు ప్రత్యేకంగా ఫెన్సింగ్ కూడా వేశారు. పెద్దాపురం, కరప తదితర మండలాల్లో కోడిపందేలు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, కడియం, మండపేట తదితర ప్రాంతాలతోపాటు నల్లజర్ల, నిడదవోలు, పెరవలి, తాళ్లపూడి తదితర మండలాల్లో కోడిపందేలు జోరుగా నిర్వహించారు. వరి చేలు, కొబ్బరి తోటలు, మైదాన ప్రాంతాల్లో భారీ బరులు ఏర్పాటు చేశారు. బెట్టింగ్ స్థాయిని బట్టి బరులు ఏర్పాటు చేశారు. పందేలకు వచ్చే వారికి వీవీఐపీ, వీఐపీ, సామాన్యుల కోసం ప్రత్యేక గ్యాలరీలు నెలకొల్పారు. బరులను ఆనుకుని ప్రత్యేకంగా సిట్టింగ్ (బెంచీలు, కుర్చిలు) ఏర్పాటు చేశారు. బరుల చుట్టూ ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్‌లైట్లు పెట్టారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు మోస్తరుగా కొనసాగాయి. అన్నిచోట్లా పందేల బరులకు ఆనుకుని గుండాట, పేకాట, కోసు ఆటలు నిర్వహించారు. పందేలకు వచి్చన వారి కోసం బిర్యానీ, మాంసం పకోడి, కూల్‌డ్రింక్స్, సిగరెట్ స్టాల్స్ ఏర్పాటు చేయడంతో జాతరను తలపించింది. గోదావరి జిల్లాల్లో నిర్వహించే కోడి పందేలను తిలకించేందుకు, పందేలు వేసేందుకు బెట్టింగ్ రాయుళ్లు పయనమవడంతో హైదరాబాద్, విజయవాడ మార్గంలో వాహనాల రద్దీ కని్పంచింది. పందేలకు వచి్చన వారితో గోదావరి జిల్లాల్లోని లాడ్జిలు, అతిథి గృహాలు సైతం నిండిపోయాయి. ట్యాగ్లు ఉంటేనే అనుమతి పశి్చమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలోని పెదఅమిరం, సీసలి గ్రామాల్లో కోడి పందేలు వీక్షించడానికి ఎల్ఈడీ డిస్ప్లేను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పందేలను వీక్షించడానికి వచ్చే వారి చేతులకు ట్యాగ్లు వేశారు. బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేసి ట్యాగ్లు ఉన్నవారిని మాత్రమే బరుల్లోకి ప్రవేశించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం కలగంపూడి, కాపవరం, పూలపల్లి, పాలకొల్లు మండలం, నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు మండలం, ఆచంట నియోజకవర్గంలోని కవిటం, తణుకు నియోజకవర్గం అత్తిలి, వేల్పూరు, తేతలి గ్రామాల్లోనూ భారీ స్థాయిలో పందేలు నిర్వహించారు. ఏలూరు జిల్లాలోని కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోనూ భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహించారు. ఎన్నికల ఏడాది కావడంతో వివిధ పారీ్టల నేతలు బరులకు వెళ్లి నిర్వాహకులను, పందేల రాయుళ్లను పలకరించారు. అక్కడే కొంత సమయం గడిపి స్థానికులతో మమేకమై ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా.. ఈసారి హైదరాబాద్ నుంచి రాజకీయ నేతల రాక పెద్దగా కనిపించలేదు. బుసకొట్టిన ‘కట్టల’ పాములు కోడి పందేలతో పాటు పేకాట, గుండాట వంటి జూద క్రీడల శిబిరాలు కూడా భారీగానే వెలిశాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 200 బరుల్లో పందేలు నిర్వహించగా సుమారు రూ.150 కోట్ల వరకు చేతులు మారినట్టు అంచనా. కోనసీమ జిల్లాలోనూ నోట్ల కట్టలు బుసలు కొట్టినట్టుగా చేతులు మారాయి. కోడి పందేలు నిర్వహించే పెద్ద బరుల వద్ద సొమ్ములు లెక్కించడానికి కౌంటింగ్ మెషిన్లు ఏర్పాటు చేయడం విశేషం. కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కలిదిండి మండలం మిలట్రీపేట, మండవల్లి మండలం భైరవపట్నం శిబిరాల వద్ద ఎక్కువ పందేలు గెలిచిన వారికి బుల్లెట్లను బహుమతిగా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి జూదాలు విపరీతంగా పెరిగాయి. అక్కడ కూడా రూ.కోట్లు చేతులు మారాయి. -
స్కిన్లెస్ చికెన్ ధర కేజీ రూ.320.. మరోవైపు కళ్లు తేలేస్తున్న కోళ్లు
సాక్షి, కోనసీమ: మండుతున్న ఎండలకు కోళ్లు విలవిలలాడుతున్నాయి. వేడిగాలులకు తాళలేక మరణిస్తున్నాయి. పది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి. 42 నుంచి 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి వేడిగాలుల తీవ్ర త తోడవుతోంది. ఉష్ణతాపం నుంచి కోళ్లకు ఉపశమ నం కలిగించేందుకు కోళ్ల రైతులు అనేక చర్యలు చేప డుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా ప్రత్యేక మందులు ఇస్తున్నారు. షెడ్లలోకి వేడిగాలులు రాకుండా చుట్టూ గోనె సంచులు కట్టి, స్ప్రింక్లర్లతో తడుపుతున్నారు. లోపలి వేడిగాలి బయటకు పోయే విధంగా పైకప్పులో ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికి రికార్డు స్థాయిలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.3 కోట్ల వరకూ, మిగిలిన దశల్లోని కోళ్లు 80 లక్షల వరకూ ఉన్నాయి, సాధారణ పరిస్థితుల్లో రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, 25 వేల నుంచి 30 వేల వరకూ కోళ్లు చనిపోతుంటాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మునుపెన్నడూ లేని విధంగా కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 3 లక్షల వరకూ కోళ్లు మృత్యువాత పడుతున్నాయంటున్నారు. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వలన సుమారు రూ.200 మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. ఈ లెక్కన కోళ్ల మరణాల రూపంలో రోజుకు రూ.6 కోట్ల నష్టం వాటిల్లుతోంది. పైకప్పు చల్లబర్చేందుకు స్ప్రింక్లర్లతో నీటిని చల్లుతున్న దృశ్యం మరోపక్క గుడ్ల ఉత్పత్తి 20 శా తం మేర తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు 88 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. 22 లక్షల గుడ్లు ఉత్పత్తి తగ్గిపోవడంతో నెక్ ప్రకటిత రైతు ధర రూ.4.60 చొప్పున రోజుకు రూ.1.01 కోట్ల వరకూ రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇలా కోళ్ల మరణాలు, గుడ్లు డ్రాపింగ్ రూపాల్లో మూడు జిల్లాల్లోని పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు రూ.7.01 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీవర్గాలు చెబుతున్నాయి. దిగిరాని చికెన్ ధర తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు.. కోనసీమ జిల్లా అమలాపురం, రావులపాలెం.. కాకినాడ జిల్లా తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫారాల వరకూ ఉండగా 7 లక్షల కోళ్ల పెంపకం జరుగుతోంది. కోళ్ల మరణాలు ఎక్కువగా ఉండటంతో ఎండలకు జడిసి రైతులు కొత్త బ్యాచ్‌లు వేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధిక శాతం ఫారాలు కంపెనీల అధీనంలోనే ఉండటంతో బ్రాయిలర్ చికెన్ ధర కొన్నాళ్లుగా దిగి రావడం లేదు. రెండు నెలలుగా స్కిన్లెస్ చికెన్ కిలో రూ.320 నుంచి రూ.350 వరకూ పలుకుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధర ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. వాతావరణం చల్లబడాలి ఎండల తీవ్రత పెరిగిపోవడంతో కోళ్ల మరణాలు పెరిగిపోయాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఆయా కారణాలతో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. వర్షాలు కురిసి వాతావరణం చల్లబడితే మరణాలు తగ్గి, ఉత్పత్తి పెరుగుతుంది. – పడాల సుబ్బారెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
ఆదాయం.. ఆరోగ్యం
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: గ్రామీణ మహిళల్లో పౌష్టికాహార లోపం కారణంగా రక్తహీనత, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళలకు ఆరోగ్యం, వారి ఆర్థిక స్థితిని పెంచేందుకు ‘పెరటి కోళ్ల పెంపకం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తోంది. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు పెరటికోళ్ల పెంపకం యూనిట్లను అందజేశారు. నాటు కోళ్ల పెంపకంపై మహిళలకు శిక్షణ కూడా ఇస్తున్నారు. జిల్లాలో 2,566 యూనిట్లు జిల్లాలో పెరటి కోళ్ల పథకాన్ని సెర్ప్ ఈ ఏడాది జనవరిలో ప్రారంభించింది. ఇప్పటి వరకు 2,566 యూనిట్లను అందజేసింది. ఒక్కొక్కటి కిలో నుంచి 1,200 గ్రాములు ఉండే 8 పెట్టలు, 3 పుంజులు (జిల్లా వాతావరణానికి తట్టుకునే హసిల్ క్రాస్), 30 కిలోల దాణా, మెడికల్ కిట్ (డీవార్మింగ్, ఇమ్యునోబూస్టర్, మల్టీ విటమిన్స్, మినరల్స్, యాంటీబయాటిక్స్)ను ఒక యూనిట్‌గా నిర్ణయించింది. యూనిట్ ధర విషయానికి వస్తే కోళ్ల విలువ రూ.2,640, దాణా విలువ రూ.1,100, మెడికల్ కిట్ రూ.155, రవాణా ఖర్చు రూ.75గా మొత్తం కలిపి రూ.3,970. నాటు కోళ్లకు మంచి గిరాకీ నాటు కోళ్లకు మార్కెట్లో గిరాకీ ఉంది. వీటి మాంసం కిలో రూ.500 వరకు పలుకుతోంది. ఒక్కో కోడి పెట్ట ఏ డాదికి 180 గుడ్లు పెడుతుంది. సెర్ప్ ఇస్తున్న 8 పె ట్టల ద్వారా ఏడాదికి 1,440 గుడ్లు లభిస్తాయి. మార్కెట్లో నాటు కోడి గుడ్డు ధర రూ.8 పలుకుతోంది. ఈ గుడ్లు వెయ్యి విక్రయించినా ఏడాదికి రూ.8 వేల ఆదాయం వస్తుంది. గుడ్లను పొదిగించడం ద్వారా కోళ్ల ఉత్పత్తి పెంచుకోవచ్చు. సగటున ఏడాదికి 500 కోళ్లు అమ్మినా రూ.2.50 లక్షలు ఆదాయం పొందవచ్చు. ప్రయోజనం చేకూర్చే పథకం మహిళ ఆరోగ్యం, ఆర్థిక స్థితి పెంపునకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెరటి కోళ్ల పెంపకం చాలా మంచి పథకం. జిల్లాలో ఇప్పటి వరకు 2,566 యూనిట్లను ఏర్పాటు చేశాము. ఈ పథకం ద్వారా మహిళలు ఆదాయం పొందడమే కాకుండా పౌష్టిక విలువ అధికంగా ఉన్న నాటుకోడి గుడ్డును తినడం ద్వారా రక్తహీనత వంటి సమస్యలు తొలగి ఆరోగ్యంగానూ ఉంటారు. – ఐ.నరసింహారెడ్డి, పీడీ, సెర్ప్ -
పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!..ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!
భువనేశ్వర్: వివాహ వేడుక అనగానే బ్యాండ్ మేళాలతో డ్యాన్స్‌లు వేస్తూ, మరోవైపు బాణసంచాల కాల్పులతో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అయితే అవి మోస్తారు పరిధిలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఆహ్లాదభరిత వాతావరణంలో చేసుకువాల్సిన తంతు. కానీ ఇక్కడొక వివాహ వేడుకలోని మోగిన సంగీత భాజాలు కారణంగా కోళ్లు చనిపోయాయి. (చదవండి: పాపం ఎంత దాహం వేసిందో!.....ఆ కోబ్రా గ్లాస్‌తో తాగేస్తోంది.) అసలు విషయంలోకెళ్లితే... తూర్పు ఒడిషాలోని రంజిత్ కుమార్ పరిదా అనే వ్యక్తి పౌల్ట్రీ ఫారమ్‌కి కొద్ది దూరంలో పెళ్లి బాజాలతో బాణసంచా కాలుస్తూ, డ్యాన్స్ చేసుకుంటూ పెద్ద ఎత్తున వివాహ ఊరేగింపుగా వస్తున్నట్లు చెబుతున్నాడు. పైగా వాళ్లు పెద్ద ఎత్తున మ్యూజిక్ పెట్టారని, అంతేకాక చెవులు చిల్లులు పడేంత శబ్దంతో వాళ్లంతా చిందులేస్తూ ఉన్నారని అన్నారు. అయితే సదరు వ్యక్తి మ్యూజిక్ సౌండ్ తగ్గించమంటే వాళ్లు వినలేదని చెబుతున్నాడు. దీంతో తన కోళ్ల ఫారమ్‌లోని 65 కోళ్లు చనిపోయినట్లు చెప్పాడు. కోళ్లు గుండెపోటుతో చనిపోయాయని పశువైద్యుడు నిర్ధారించినట్టు రంజిత్ తెలిపాడు. ఈ క్రమంలో జంతువుల ప్రవర్తనపై పుస్తకాన్ని రచించిన జువాలజీ ప్రొఫెసర్ సూర్యకాంత మిశ్రా పెద్ద పెద్ద శబ్దాలు పక్షులలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పారు. అంతేకాదు వివాహ నిర్వాహకులు నష్ట పరిహారం చెల్లించడానికి నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని రంజిత్ చెప్పాడు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవల్సిందిగా సూచించడంతో చివరికి కథ సుఖాంతం అయ్యింది. పైగా రంజిత్ ఫిర్యాదు ఉపసంహరించుకోవడంతో తాము ఎటువంటి చర్య తీసుకోలేదని పోలీసు అధికారి ద్రౌపది దాస్ తెలిపారు. (చదవండి: ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో) -
నాలుగు రోజులుగా ఠాణాలో పందెం కోళ్లు!
సాక్షి, పాల్వంచ(ఖమ్మం): నాలుగు రోజులుగా పందెం కోళ్లకు ఠాణాలో పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. వాటికి రేషన్ బియ్యాన్ని అందిస్తూ పహరా కాస్తున్నారు. విషయమేంటంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం దంతలబోరు శివారు అటవీ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తుండగా పా ల్వంచ రూరల్ ఎస్సై సుమన్ ఆధ్వర్యంలో ఈనెల 25న దాడి చేశారు. ఈ సందర్భంగా మూడు పందెం కోళ్లతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. అనంతరం నిందితులకు నోటీసులు జారీ చేసి వదిలేసిన పోలీసులు కోడిపుంజులను గురువారం వరకు విడుదల చేయలేదు. కిన్నెరసాని రూరల్ పోలీసుస్టేషన్ ప్రాంగణంలోనే కోడిపుంజులను బంధించారు. పుంజు ల రంగుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని, తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. చదవండి: తల్లి బతికుండగానే పెద్దకర్మ! -
70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బర్డ్ ప్లూ వైరస్ బతకదు
సాక్షి, అమరావతి: బర్డ్ ఫ్లూ వ్యాధిని కలుగజేసే వైరస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 30 నిముషాలకు మించి బతకదని పరిశోధనల్లో నిర్ధారౖణెనట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. పూర్తిగా ఉడికించిన కోడిగుడ్లు, మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ రాదని, ప్రజలు లేనిపోని వదంతులు నమ్మకుండా వాటిని ఆహారంగా తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి బాగా విస్తరిస్తున్నందున రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనూహ్య రీతిలో కోళ్లు మరణిస్తే వెంటనే స్థానిక పశు వైద్యాధికారులకుగానీ, సమీప ఆర్బీకేలు, సచివాలయాలకుగానీ సమాచారం ఇవ్వాలని చెప్పారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వ్యాధి ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ఎలాంటి విపత్తు సంభవించినా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని శనివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. -
ఒకేరోజు 6,400 కోళ్లు మృతి
సాక్షి, నార్కట్‌పల్లి: కోళ్ల ఫామ్‌లో ఒకేరోజు 6,400 కోళ్లు మృతిచెందాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏనుగులదోరి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ప్రీమియం కంపెనీ సహకారంతో తాను నిర్వహిస్తున్న కోళ్లఫామ్‌లో ఉన్నట్టుండి 6,400 కోళ్లు ఒకేసారి చనిపోయాయని బాధితుడు పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. వెంటనే కంపెనీ యజమానులకు తెలపగా, సిబ్బంది వచ్చి పరిశీలించి.. ఫామ్‌కు సంబంధించిన నీటిట్యాంకులో విషపూరిత రసాయనాలు కలిపిన ఆనవాళ్లు దొరికాయని, ఆ నీటిని తాగి కోళ్లు చనిపోయాయని నిర్ధారించారని చెప్పారు. -
120 నాటుకోళ్లు మృతి..బర్డ్ ఫ్లూ అనుమానం
భీమదేవరపల్లి: వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌కు చెందిన గద్ద సారయ్యకు చెందిన 120 నాటు కోళ్లు మృత్యువాత పడ్డాయి. సారయ్య కొన్ని నెలలుగా నాటు కోళ్లు పెంచి విక్రయిస్తూ జీననోపాధి పొందుతున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే అవి మృతి చెందడంతో దాదాపు రూ.లక్ష మేరకు నష్టపోయినట్లు తెలిపారు. చనిపోయిన కోళ్లను మండల పశువైద్యాధికారి మాలతి పరిశీలించారు. నమూనాలను పరీక్ష నిమిత్తం వరంగల్ ప్రాంతీయ పశు వైద్యశాలకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. కాగా, పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ సోకుతుందనే ప్రచారం నేపథ్యంలో ఒకేసారి భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడం కలకలం రేపుతోంది. -
అలా పెరిగే కోళ్లతో డేంజర్
సాక్షి, న్యూఢిల్లీ : కోళ్ల పరిశ్రమలో లాభాపేక్ష కొక్కరొకో! అంటోంది. స్వల్ప కాల వ్యవధిలో అధిక లాభాలను ఆర్జించాలనే అత్యాశతో కొందరు కోళ్ల పెంపకం దారులు పెడదారులు తొక్కుతున్నారు. జన్యుపరమైన ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా 50, 60 రోజుల్లో పెరగాల్సిన కోడి పిల్లలను 35 రోజుల్లో పెరిగేలా చేస్తున్నారు. పర్యవసానంగా కోళ్ల కాళ్లు, గుండె, ఊపిరితిత్తులు తగిన రీతిలో ఎదగకుండా దెబ్బతింటున్నాయి. వీటివల్ల కోళ్లలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మరణం సంభవించకపోయిన కోళ్ల కాళ్లల్లో కురుపులు వస్తున్నాయి. వాటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలా అనవసరంగా కోళ్లను వేగంగా పెరగనిచ్చి వాటిని కొంత చౌక ధరలకు విక్రయిస్తుండడం వల్ల వాటినే కొనుగోలు చేసేందుకు రెస్టారెంట్లు, హోటళ్లు ప్రాధాన్యతనిస్తున్నాయని, ప్రస్తుతం లండన్ మార్కెట్లో ఇదే జరుగుతోందని ‘రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ (ఆర్ఎస్పీసీఏ)’ వెల్లడించింది. ‘వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్’, ‘ఫామ్ యానిమల్ వెల్ఫేర్ ఫోరమ్’లతో కలిసి అతి వేగంగా పెంచుతున్న మూడు రకాల కోళ్ల బ్రీడింగ్‌పై ఆర్ఎస్పీసీఏ అధ్యయనం జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1950లో కోడి పిల్లలు కోతకొచ్చే కోళ్లుగా ఎదిగేందుకు 70 రోజులు పట్టగా ప్రస్తుతం 35 రోజుల్లో ఆ స్థాయికి జన్యు ఇంజెక్షన్ల ద్వారా పెంచేసి విక్రయిస్తున్నారని ఆ చారిటీ సంస్థ తెలియజేసింది. ఇలాంటి కోళ్ల కొనుగోలుకు దూరంగా ఉండాలంటూ తామిచ్చిన పిలుపునకు కెఎఫ్సీ, మార్క్స్ అండ్ స్పెన్సర్, వెయిట్రోస్ సంస్థలు సానుకూలంగా స్పందించినట్లు ఆ చారిటీ సంస్థ తెలియజేసింది. ఇలా అతి వేగంగా పెంచుతున్న కోళ్లు అనారోగ్యం బారిన పడి చనిపోయే అవకాశం సాధారణంకన్నా రెట్టింపు ఉంటోందని అధ్యయనంలో తేలింది. వీటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎంత హానికరమన్న విషయంలో ఈ అధ్యయనం జరగలేదని, ఇలా వేగంగా పెంచడం వల్ల కోళ్లు ఎంత నరక యాతన అనుభవించాల్సి వస్తోందన్న విషయంలోనే ఈ అధ్యయనం కొనసాగిందని అధ్యయన సంస్థ పేర్కొంది. ఇలా జన్యుపరంగా వేగంగా పెంచిన కోళ్లు అనారోగ్యం, అనవసరమైన బాధతోని అర్ధాయుషు మాత్రమే బతుకుతున్నాయని వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ బ్రిటన్ చీఫ్ జేమ్స్ మాక్కోల్ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోళ్లపై కన్నేసి.. విషంతో కాటేసి..
భోపాల్ : తాను పెంచుకుంటున్న కోళ్లలో ఒక కోడిని ఇచ్చేందుకు మహిళ నిరాకరించడంతో ఇద్దరు వ్యక్తులు ఆమెకు చెందిన కోళ్లను విషమిచ్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసింది. ఝాన్సీరోడ్ పోలీస్ స్టేషన్లో మహిళ గుడ్డిభాయ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం...వైష్ణో ధామ్ ఆలయ సమీపంలో నివసించే గుడ్డి భాయ్ వ్యవసాయ పనులకు వెళుతూ మరికొంత ఆదాయం కోసం నాలుగు కోళ్లను కొనుగోలు చేసి కోడిగుడ్లను విక్రయిస్తూ జీవిస్తోంది. ఈమె పొరుగున ఉండే సురేందర్, సమర్లు ఆమె పనులకు వెళ్లిన సమయంలో మహిళ ఇంటికి వెళ్లి తమకు ఓ కోడిని ఇవ్వాలని కోరగా ఆమె కుమార్తె నిరాకరించడంతో నాలుగు కోళ్లకు విషం ఎక్కించారు. పని నుంచి ఇంటికి వచ్చిన మహిళకు కుమార్తె నిందితుల నిర్వాకం వివరించడంతో చనిపోయిన కోళ్లను తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కోళ్ల పరిశ్రమకు సన్‌స్ట్రోక్..!
గీసుకొండ(పరకాల): గుడ్డు పెట్టే లేయర్ కోళ్లకు గడ్డుకాలం వచ్చింది. ఎండ వేడిమి, వడగాడ్పుల కారణంగా లేయర్ కోళ్ల పరిశ్రమ కుదేలవుతోంది. కోళ్ల ప్రాణాల ఎండ వేడిమికి గాలిలో కలిసిపోతున్నాయి. ప్రస్తుత వేసవిలో సుమారు 4 లక్షల కోళ్లు మృతి చెందాయంటే కోళ్ల పెంపకం చేపట్టే ఫాం యజమానులు ఎంతగా నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో గుడ్డు ధర అమాంతం పడిపోవడంతో పెంపకందారులు దీనస్థితిలో ఉన్నారు. గతంలో గుడ్డు ధర రూ. 4.75 లు ఉండగా ప్రస్తుతం రూ. 2.75 పైసలకఅు పడిపోయింది. ఒక వైపు ఎండలతో మృతి చెందుతున్న కోళ్లు.. మరో వైపు గుడ్డు ధర పతనమవుతుండడంతో లేయర్ కోళ్లను పెంచే రైతులు, ఫాం యజమానులు ఆర్థికంగా నష్టపోతూ మనోవేదన చెందుతున్నారు. రూ.లక్షలు పెట్టుబడిగా పెట్టి, బ్యాంకుల నుంచి అప్పుతెచ్చి కోళ్ల పెంపకం చేపడితో పెట్టుబడి దక్కే పరిస్థితి లేక నష్టాల ఊబిలో చిక్కుకున్నామని వారు వాపోతున్నారు. హెచరీల యజమానులు, ఎగ్ ట్రేడర్ల మాయాజాలం కారణంగా గుడ్డు రేటు కృత్రిమంగా పతనమవుతోందని కోళ్ల రైతులు చెబుతున్నారు. ఫాం యజమానులకు తక్కువ చెల్లించి వ్యాపారులు గుడ్డుకు రూ. 4.50 నుంచి రూ. 5 వరకు ఓపెన్ మార్కెట్లో, చిల్లరగా అమ్ముకుంటున్నారని అంటున్నారు. వ్యాపారుల గుప్పిట్లో గుడ్ల వ్యాపారం, ధర నిర్ణయం కావడంతో తాము ఏమీ చేయలేక పోతున్నామని వారు వాపోతున్నారు. గుడ్డుకు మార్కెట్లో డిమాండ్ ఉన్నా తాము ఉత్పత్తి చేసే వాటికి ధర తగ్గించి హెచరీల యజమానులు, ఎగ్ వ్యాపారులు తమ జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని ఫాంల యజమానులు వాపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 85 లేయర్ కోళ్ల ఫాంలు ఉండగా వాటిలో సుమారు 35 లక్షల కోళ్లను పెంచుతున్నారు. వీటిలో ఇప్పటివరకు సుమారు 4 లక్షల కోళ్లు ఎండ వేడిమికి తట్టుకోలేక మృతి చెందినట్లు రైతులు చెబుతున్నారు. ఎగ్ బోర్డు ఏర్పాటు చేయాలి లేయర్ కోళ్లను పెంచే ఫాంల వారికి గుడ్డు విషయంలో గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎగ్ బోర్డును ఏర్పాటు చేయాలి. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవ తీసుకుని సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లాలని విజ్ఞప్తి. ఎగ్ వ్యాపారులు, హెచరీల పెత్తనం లేకుండా ఉండాలంటే ఎగ్బోర్డుతో గుడ్ల కోళ్లను పెంచే వారికి భరోసా ఏర్పడుతుంది. గిట్టుబాటు ధర కల్పిస్తే ఇబ్బందులు తప్పుతాయి. ధరల్లో హెచ్చు తగ్గులు ఉండకుండా చూడాలి. ఎండ దెబ్బతో చనిపోయిన కోళ్ల విషయంలో ప్రభుత్వం మమ్మలను ఆదుకోవాలి. –చిట్టిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, లేయర్ ఫాం యజమానుల ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి -
డిక్కీలు ఊపుకుంటూ వయ్యారంగా..!
ఈ మధ్య అమెరికాలోని కోళ్లు డిక్కీలు ఊపుకుంటూ వయ్యారంగా తిరుగుతున్నాయట.. విషయమేంటని ఆరాతీస్తే.. హవ్వ అంటూ నోరు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చూశారుగా.. డిక్కీలకు డైపర్లు!! ఇక్కడైతే.. పిల్లలకు వేస్తాం.. అమెరికాలో వీటికి వేశారు... కనిపించినచోటల్లా రెట్టలతో ముగ్గులు పెట్టేయకుండా.. ఇలా కట్టడి చేశారన్నమాట. అక్కడి గ్రామీణప్రాంతాల్లో కోళ్లను పెంపుడు జంతువులుగా పెంచడం స్టేటస్ సింబల్‌గా మారిందట. దీంతో న్యూహాంప్‌షైర్‌కు చెందిన జూలీ బేకర్ బుర్రలో ఐడియా వచ్చింది. వెంటనే కోళ్లకు ఫ్యాషనబుల్‌గా కనిపించే డైపర్లు తయారుచేయడం ద్వారా కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. కొన్నేళ్ల క్రితం యూ ట్యూబ్‌లో ఎవరో సరదాగా పెట్టిన కోడిపెట్టకు డైపర్ వేసిన వీడియోను ఆమె చూశారు. దీంతో నిజంగా మనమెందుకు ఇలా చేయకూడదు అనిపించిందట. పైగా.. తన కూతురు ఓ కోడిని పెంచుకుంటోంది. అది ఇంటిలో అక్కడక్కడా రెట్టలు వేయడం.. దాన్ని శుభ్రపరుచుకోవడానికి ఈవిడ తిప్పలు పడటం వంటివి గుర్తుకొచ్చాయి. దీంతో వాటికి డైపర్లు తయారు చేయడం మొదలుపెట్టింది. కొన్నేళ్ల క్రితం ‘పేంపర్డ్ పౌల్ట్రీ’పేరిట ఆన్లైన్లో విక్రయాలు మొదలుపెట్టింది. నెమ్మది నెమ్మదిగా విక్రయాలు పెరిగాయి. నగరాల్లో ఉన్నవారు కూడా కొనడం మొదలుపెట్టారు. అన్ని ఖర్చులు పోనూ.. జూలీకి ఏటా రూ.40 లక్షల దాకా మిగులుతున్నాయట. డైపర్లు సక్సెస్ కావడంతో ఆమె కోళ్లకు డ్రస్సులు వంటి వాటి విక్రయాలు కూడా మొదలుపెట్టింది. -
నాటు కోళ్ల ఫారంపై కుక్కల దాడి
చేర్యాల(సిద్దిపేట): నాటు కోళ్ల పారంపై కుక్కలు దాడి చేసి 600 నాటు కోళ్లను చంపిన ఘటన బుధవారం మండల పరిధిలో దానంపల్లి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రైతు మల్లారెడ్డికి గ్రామ శివారులో గ్రామప్రియ నాటు కోళ్ల ఫారం ఉంది. రోజువారీగా మంగళవారం రాత్రి కోళ్ల ఫారంలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిన మల్లారెడ్డి బుధవారం ఉదయం కోళ్ల ఫారానికి వచ్చి చూడగా కోళ్లన్నింటినీ కుక్కలు కొరికి చంపినట్టు గుర్తించాడు. దీంతో సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. ఇదిలా ఉండగా, ఘటన తెలుసుకున్న చేర్యాల ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డితో కలిసి బాధితుడిని పరామర్శించారు. ప్రభుత్వం తరపున సహాయం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
బస్సులో కోడికీ టికెట్!
గౌరిబిదనూరు: బస్సు లో ప్రయాణించాలనుకునే వారు టికెట్ కొనక తప్పదు. మరి కోళ్లు కూడా టికెట్ తీసుకోవాలా? అంటే అవుననే కర్ణాటక అధికారులు సమాధానం ఇస్తున్నారు. ఆదివారం బెంగళూరు సమీపంలో గౌరిబిదనూరు తాలూకా ముదలోడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన రెండు కోళ్లను తీసుకుని కర్ణాటక ఆర్టీసీ బస్సెక్కాడు. బస్‌కండక్టర్ అతనికి రూ.24 టికెట్, రెండు కోళ్లకు రెండు హాఫ్ టికెట్లు ఇచ్చాడు. ఆ టికెట్లపై పిల్లలకు అని రాసి ఇచ్చాడు. కానీ ప్రయాణికుడు.. పిల్లలకని ఎందుకు, కోళ్లకు అనే రాసివ్వు అని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. కోళ్లు, గువ్వలు, చిలుకలకు అర టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు కూడా స్పష్టం చేయడం గమనార్హం. -
‘పెరటికోళ్ల’ జాడేది?
మెదక్ జోన్: నిరుపేదల అభివృద్ధి కోసం పెద్ద పెట్టుబడిలేకుండా ప్రవేశపెట్టిన పెరటికోళ్ల పెంపకం ఒక ఏడాదికే పరిమితమైంది. దీనిపై ఎంతో ఆశపెట్టుకున్న పేదలకు ఈ పథకం అందుబాటులో లేకుండా పోయింది. 2016లో కేంద్ర ప్రభుత్వం పెరటికోళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి తెల్లరేషన్ కార్డుగల నిరుపేదలందరూ అర్హులుగా నిర్ణయించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్(ఎన్ఎల్ఎం) ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించింది. పథకం ప్రారంభంలో జిల్లాకు 380 యూనిట్లు మంజూరు చేశారు. దీంతో నిరుపేదలను గుర్తించిన వెటర్నరీ అధికారులు ముందుగా 300 యూనిట్లను పంపిణీ చేశారు. కారణాలతో 80 యూనిట్లు అప్పట్లో లబ్ధిదారులకు అందించలేక పోయారు. 2017లోనూ పెరటికోళ్ల పథకానికి నిధులు మంజూరి అయితే వాటితో పాటు మిగిలిపోయిన 80 యూనిట్లను సైతం లబ్ధిదారులకు పంపిణీ చేయలనుకున్న అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. ఒక ఏడాదికే ఈ పథకానికి ప్రభుత్వం మంగళం పాడటంతో మిగిలిపోయిన 80 యూనిట్లను ఎవరికి పంపిణీ చేసినా.. మిగతా లబ్ధిదారులతో ఇబ్బందులు వస్తాయని ఆ 80 యూనిట్లను ఎవరికీ ఇవ్వకుండా మిన్నకుండిపోయారు. నిరుపేదలకు ఎంతో మేలు.. ఈ పథకంలో ఒక్కో యూనిట్లో 45 కోళ్లు ఉంటా యి. వీటి ఖరీదు రూ.3,750. లబ్ధిదారుడి వాటా గా కేవలం రూ. 810 మాత్రమే చెల్లించాలి. అంటే కేవలం 20 శాతం మాత్రమే. ఇందుకు ప్రభుత్వం సబ్సిడీ కింద యూనిట్‌కు రూ. 2,940 చెల్లిస్తుంది. వెటర్నరీ అధికారులు మేలుజాతి కోళ్లను లబ్ధి దారుడికి అందజేస్తారు. 45 కోళ్లలో 5 పుంజులు ఉండగా 40 కోడిపెట్టలుంటాయి. అంతేకాకుండా వీటికి దానకోసం ఉపయోగించేందుకు మక్కల మిషన్ , నెట్(వల) తదితర వాటిని కోళ్లకు ఉపయోగించే పరికరాలను సైతం ప్రభుత్వం అప్పట్లో సరఫరా చేసింది. ఈ కోళ్లు కేవలం 2 నెలల్లోనే గుడ్లుపెట్టడం మొదలు పెడుతుంటాయి. ఒక్కో కోడిపెట్ట 140 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంది. ఒక్కో గుడ్డు 60 గ్రాముల తూకం ఉంటుంది. పూర్తిగా దేశీయవాలి గుడ్లు కావడంతో వీటికి మంచి డిమాండ్ ఉండేది. వీటిని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని అధికారులు సైతం బావించారు. రెండు సంవత్సరాల క్రితం ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు ఈ పథకం నిరుపేదలకు ఎంతో మేలుచేసేదిగా ఉందని పేర్కొంటున్నారు. రోగనిరోధకశక్తి అధికం.... పేరటికోళ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసే కోళ్లు మేలుజాతివి కావడంతో వీటికి రోగని రోధక శక్తి అధికంగా ఉంటుంది. వీటికి దాన కింద మక్కలతో పాటు, ప్రత్యేకంగా తయారు చేసిన దానను అధికారులు అప్పట్లో సబ్సిడీపై పంపిణీ చేశారు. కాగా పూర్తిగా నాటు(దేశీయవాలి)కోడితో సమానంగా పెరిగేవి. కొద్ది సమయంలోనే ఈ కోడి 6 కిలోల బరువు వరుకు పెరుగుతుందని అధి కారులు చెబుతున్నారు. కానీ కోడిని అమ్మటం కన్నా మూడు మాసాలకోసారి 140 నుంచి 160 వరకు పెట్టే గుడ్లను విక్రయిస్తేనే లబ్ధిదారుడికి అధిక మొత్తంలో లాభం ఉంటోంది. ఈ గుడ్లను తిన్నప్రజలకు సైతం రోగనిరోదక శక్తి పుష్కలంగా లబిస్తోంది. ముఖ్యంగా ఈ పథకం గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అడవిబిడ్డలు అధిక శాతం ఊరికి దూరంగా అడవుల్లో ఉం టారు. దీంతో పెరటికోళ్ల పథకం ద్వారా కోళ్లను పొందిన లబ్ధిదారులు వారు ఉండే ప్రాంతాల్లో వదిలిపెడితే రోజంతా ఆరుబయటనే గింజలు, పురుగులను తిని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాయి. నిరంతరంగా కొనసాగించాలి.. నిరుపేదల అభివృద్ధి కోసం దోహదపడే పెరటికోళ్ల పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాలి. ఇలాంటి పథకాన్ని ఒక్క యేడాది పాటు కొంత మందికి మాత్రమే ఇచ్చి నిలిపివేయడం సమంజసం కాదు. ఈ పథకం ఎంతోమంది నిరుపేదలకు ఉపయోగ పడాలంటే దీనికి ప్రతిఏటా నిధులు విడుదల చేయాలి. –బాగయ్య, రైతు బాగా డిమాండ్ ఉంది.. 2016లో జిల్లాకు 380 యూనిట్లు మంజూరయ్యాయి. ఇందులో 300 యూనిట్లు పంపిణీ చేశాం. పలు కారణాలతో 80 యూనిట్లు పంపిణీ చేయలేకపోయాం. వాటిని త్వరలో పంపిణీ చేప్తాం. పెరటికోళ్ల పథకం కోసం ప్రజల నుంచి బాగా డిమాండ్ ఉంది. లబ్ధిదారుల డిమాండ్‌ను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం మళ్లీ మంజూరు చేస్తే లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తాం. –అశోక్‌కుమార్, వెటర్నరీ శాఖ జిల్లా అధికారి -
దొంగను పట్టించిన బావి!
దంతాలపల్లి(డోర్నకల్) : బావి.. దొంగను పట్టించడం ఏమిటని ఆలోచిస్తున్నారా! ఈ సంఘటన గురువారం రాత్రి నిజంగానే జరిగింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన రైతు మెంచు మల్లయ్య తన వ్యవసాయబావి వద్ద నాటుకోళ్లు పెంచుతున్నాడు. కోళ్లను దొంగిలించేందుకు ఇదే మండలం దాట్ల గ్రామానికి చెందిన సయ్యద్ రఫీ, బోర శ్రీను గురువారం రాత్రి వచ్చారు. కాపలాగా ఉన్న రైతు మల్లయ్య అలికిడి విని వెంటనే లేవగా ఇద్దరు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో శ్రీను, తప్పించుకోగా రఫీ సమీపంలోని వ్యవసాయ బావిలో పడిపోయాడు. అందులో నుంచి పైకి ఎక్కేందుకు అవకాశం లేకపోయింది. గ్రామస్తులు రాత్రే చూసి అతడిని పైకి లాగకుండా రాత్రంతా అందులోనే ఉంచారు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చిన తర్వాత రఫీని పైకి లాగి అదుపులోకి తీసుకున్నారు. కాగా రైతు మల్లయ్య ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నందీప్ పేర్కొన్నారు. -
ఈల వేస్తే కోళ్లు గాల్లోకి.. వీడియో చూడండి..
బీజింగ్ : నెమళ్లంతపైకి కూడా పెంపుడు కోళ్లు గాల్లోకి ఎగరలేవు అంటారు. అదంతా అబద్ధమని అంతకన్నా పైకి ఎగురగలమని నిరూపిస్తున్నాయి చైనాకు చెందిన ఓ రైతు పెంపుడు కోళ్లు. ఓ కొండపై ఎక్కడెక్కడో తిండి కోసం వేట మొదలు పెట్టిన ఆ కోళ్లు రైతు ఈల ఊదగానే రెక్కలు అల్లార్చుతూ ఈల వినిపించిన వైపు గాల్లో ఎగురుకుంటూ వచ్చాయి. ఒకటి కాదు, పదులు కాదు, వందల్లో వచ్చి రోడ్డుపై అవి ఒక్క చోట చేరాయి. ఆ రైతు తిండి గింజలు వేయగానే అవి వాటిని తినడంలో నిమగ్నమయ్యాయి. చైనాలోని గిఝౌవ్ రాష్ట్రానికి చెందిన ఓ రైతు ఈ పెంపుడు కోళ్లకు ఎంతగా శిక్షణ ఇచ్చాడో తెలియదుగానీ ఆగస్టు 14వ తేదీన రికార్డు చేసిన ఈ కోళ్ల వీడియో మాత్రం ఇప్పుడు ఆన్లైన్ హల్చల్ చేస్తోంది. -
ఈల వేస్తే కోళ్లు గాల్లోకి వీడియో చూడిండి
-
ఎండ వేడిమికి 600 కోళ్లు మృతి
బ్రహ్మసముద్రం (కళ్యాణదుర్గం) : ప్రచండ భానుడి దెబ్బకు కోళ్లు విలవిలలాడుతున్నాయి. ఎండ తీవ్రత తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో రాజు అనే రైతుకు చెందిన కోళ్ల ఫారంలో సోమవారం 600 కోళ్లు నిమిషాల వ్యవధిలో చనిపోయాయి. వీటిని ఓ గోతిలో పూడ్చివేసినట్లు రైతు రాజు తెలిపాడు. -
ఎండ తీవ్రతకు కోళ్లు విలవిల
ఇప్పటివరకు 30 లక్షలకు పైగా మృతి.. రూ.40 కోట్ల నష్టం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రచండ భానుడి ప్రతాపానికి కోళ్లు విలవిలలాడుతున్నాయి. మార్చి చివరి వారం నుంచే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఫారాల్లో కోళ్లు లక్షల సంఖ్యలో మృతి చెందుతున్నాయి. ఇప్పటిరకు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షలకు పైగా కోళ్లు చనిపోయి ఉంటాయని అంచనా వేసినట్లు జాతీయ గుడ్డు సమన్వయ సంఘం కార్యవర్గ సభ్యులు ఎ.సుధాకర్ ‘సాక్షి’కి చెప్పారు. సాధారణంగా 37-38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వరకు మాత్రమే కోళ్లు తట్టుకుంటాయి. అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదైతే చనిపోతాయి. నీరు లేక సమస్య: రాష్ట్రంలో 20 వేల కోళ్లఫారాలున్నాయి. వాటిలో 6.25 కోట్ల కోళ్లున్నాయి. అందులో 4.50 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లు, 1.75 కోట్ల బాయిలర్ కోళ్లున్నాయి. ఇవిగాక మరో 60 లక్షల హేచరీ కోళ్లున్నాయి. సాధారణంగా 35 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయితే కోళ్లకు వడదెబ్బ తగలకుండా ఫారాల యజమానులు నీళ్లు చల్లడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. కోళ్ల ఫారాల్లో కర్టెన్లను తడపడం ద్వారా ఉష్ణోగ్రతలు పెరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అటువంటి జాగ్రత్తలతో 42 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కోళ్లు తట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఈసారి అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇంత భారీ వే డి కారణంగా లక్షలాది కోళ్లు చనిపోతున్నాయి. పైగా భూగర్భ జలాలు పడిపోవడం, బోర్లలో నీళ్లు లేకపోవడంతో నీటి సమస్య తలెత్తింది. ఫలితంగా కోళ్లపై నీళ్లు చల్లడానికి అవకాశం ఉండటం లేదు. పైగా కొత్తగా బోర్లు వేయడానికి ప్రభుత్వపరంగా ఆంక్షలు ఉండటంతో పరిస్థితి మరింత విషమంగా ఉంది. కోళ్లు మృతి చెందటంతో వ్యాపారులకు రూ. 40 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. వాటికి బీమా సౌకర్యం లేకపోవడంతో నష్టాన్ని వ్యాపారులే భరించాల్సి ఉంటుంది. -
కోడే గెలిచింది!
జిల్లా అంతటా కోడిపందేల బరులు, పేకాట శిబిరాల ఏర్పాటు పలుచోట్ల పందేలు {పారంభించిన ప్రజాప్రతినిధులు చేతులు మారిన కోట్లాది రూపాయలు సంక్రాంతి సంప్రదాయం ముసుగులో పందెం కోళ్లు కత్తులు దూశాయి. కోడిపందేల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి పందెంరాయుళ్లు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ ఏర్పాటుచేసిన బరుల్లో కోలాహలం నెలకొంది. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. దాదాపు ప్రతిచోటా అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ముందుండి కోడిపందేలను ప్రారంభించారు. మచిలీపట్నం : జిల్లావ్యాప్తంగా కోడిపందేల బరులు, పేకాట శిబిరాలు కిటకిటలాడాయి. కైకలూరు నియోజకవర్గం కొల్లేటికోటలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, పెడన మండలం కొంకేపూడిలో ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, పామర్రు మండలం కొమరవోలులో గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య కోడిపందేలను ప్రారంభించారు. జిల్లా నలుమూలలా పెద్ద ఎత్తున బరులను ఏర్పాటు చేశారు. బరుల వద్దే బెల్టు షాపులను పెట్టారు. పందెంరాయుళ్ల కోసం రెస్టారెంట్లను ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పించారు. ఈ బరుల్లో పేకాట, చిన్నబజార్, పెద్దబజార్ పెద్దఎత్తున నిర్వహించారు. భోగి రోజున ప్రారంభమైన ఈ బరులు మూడు రోజులపాటు కొనసాగిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మంగళవారం రాత్రే పోటీలను ప్రారంభించారు. వణుకూరులో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కోడిపందేలను ప్రారంభించారు. గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో పెద్దఎత్తున బరి ఏర్పాటుచేశారు. గురువారం ఉదయం ఏడు గంటలకు కోడిపందేలు, పేకాటను ప్రారంభించారు. బెల్టుషాపుతో పాటు రెస్టారెంట్లను ఇక్కడే నిర్వహించారు. పేకాట, కోడిపందేల కోసం మూడేసి శిబిరాలను నిర్వహించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, వత్సవాయిలో కోడిపందేలు జోరుగా కొనసాగాయి. పామర్రు నియోజకవర్గంలోని యలకుర్రు, కొమరవోలు, కనుమూరు ప్రాంతాల్లో కోడిపందేలు, పేకాటలు జరగగా లక్షలాది రూపాయలు చేతులు మారాయి. మైలవరం మండలంలో నాగులేరు, జి.కొం డూరు మండలంలోని వెలగలేరు, ఇబ్రహీంపట్నంలో భారీస్థాయిలో బరులను ఏర్పాటు చేశారు. నూజివీడు నియోజకవర్గంలో జనార్దనవరం, పోతిరెడ్డిపాలెం, జంగంగూడెం, ఈదర, శోభనాపురం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించారు. కైకలూరు నియోజకవర్గంలో కొల్లేటికోట, భుజబలపట్నం, భైరవపట్నం, కలిదిండి మండలం నాగన్నచెరువు తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో కోడిపందేలు నిర్వహించారు. పెడన, తిరువూరు నియోజకవర్గాల్లోనూ బరులు, పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు. -
దొరికినోడికి... దొరికినన్ని
అది తూర్పు చైనాలోని ఓ ఎక్స్‌ప్రెస్ హైవే. గత మంగళవారం భారీ కార్గోలారీ దూసుకెళ్తోంది. ఏమైందో ఏమో... అకస్మాత్తుగా పల్టీలు కొట్టింది. నిమిషాల్లోనే పక్కనున్న పల్లెలో అలజడి. అందరూ బుట్టలు, పెద్ద వంటపాత్రలు పట్టుకొని హైవే పైకి పరుగో పరుగు. ఎందుకంటారా? పడిపోయిన లారీలో 10 వేల కోడిపిల్లలు ఉన్నాయి మరి. కొన్ని చనిపోయాయి తప్పితే మిగతావన్నీ నిక్షేపంగా ఉన్నాయి. జనం వీటిని ఏరుకోవడానికి పోటీలుపడ్డారు. వీరిని నియంత్రించడం పోలీసుల వల్ల కూడా కాలేదట. చివరికి హైవేపై ట్రాఫిక్‌నే నిలువరించారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. చివరికి దొరికినోళ్లు దొరికినన్ని కోడిపిల్లలను పట్టుకుపోయారు. ఐదు లక్షల రూపాయల విలువైన కోడిపిల్లలు మాయమైపోయాయి. ఆపై పోలీసులు తీరిగ్గా ట్రాఫిక్ క్లియర్ చేశారట. -
ఈ కోళ్లు ఖతర్నాక్
- విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడకం - 40 శాతం కోళ్లలో మందుల అవశేషాలు - శరీరానికి ముప్పు తప్పదంటున్న ఐఎంఏ సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), ఢిల్లీలోని పౌల్ట్రీఫారాల నిర్వాహకులు కోళ్లకు భారీ ఎత్తున యాంటీబయాటిక్స్‌ను భారీ మోతాదులో వాడుతున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) అధ్యయనంలో తేలడం చర్చకు దారితీసింది. యాంటీబయాటిక్స్ వాడిన చికెన్ తినడం వలన మానవ శరీరంలో క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గి, విషక్రిముల ప్రభా వం పెరుగుతుందని హెచ్చరించింది. కోళ్లు రోగాల బారిన పడకుండా ఉండేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇలాంటి కోళ్ల మాంసాన్ని తినడం వల్ల మానవశరీరానికి బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి తగ్గుతుంది. ఫలితంగా రోగాల బారిన పడడం ఖాయమని, అప్పుడు యాంటీబయాటిక్స్‌తోనూ ప్రయోజనం ఉండకపోవచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధాన కార్యదర్శి సెక్రటరీ జనరల్ డాక్టర్ నరేంద్ర సైనీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్‌ను జాగ్రత్తగా వాడడంపై అవగాహన పెంచాలని ఐఎంఏ నిర్ణయించింది. ఢిల్లీ, ఎన్సీఆర్లో పెంచుతున్న కోళ్లలో ఆరు యాంటీబయాటిక్స్ మందుల అవశేషాలు అధికంగా ఉన్నాయని సీఎస్ఈ వెల్లడించింది. ఢిల్లీ, ఎన్సీఆర్లో దొరికే 70 చికెన్ నమూనాలను పరీక్షించగా, 40 శాతం కోళ్లలో యాంటీ బయాటిక్స్ అవశేషాలు ఉన్నట్టు నిర్ధారించారు. 17 శాతం నమూనాల్లో ఒకటి కన్నా ఎక్కువ యాంటీబయాటిక్స్ అవశేషాలున్నాయని సీఎస్ఈ ఇటీవల జరిపిన అధ్యయనం వెల్లడించింది. కోళ్లు వేగంగా పెరిగి, వాటిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి పెంపకందారులు యాంటీబయాటిక్స్‌ను వాడుతున్నారు. ఇలాంటి కోళ్ల మలమూత్రాలు భూమి, నీటిలో కలవడంవల్ల వాటి దేహాల్లోని యాంటీబయాటిక్స్ అవశేషాలు క్రమేణా మానవశరీరంలో చేరవచ్చు. కోడి మాంసాన్ని బాగా ఉడికించినప్పటికీ ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి చికెన్ తినడం వల్ల క్రమేణా మనిషి శరీరానికి బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి తగ్గుతుంది. మానవులలో అనేక రకాల ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాకు శక్తి పెరిగిన తరువాత యాంటీబయాటిక్స్ ఎన్ని వాడినా ఫలితం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో సిప్రోఫ్లోక్సీసిన్, టెట్రాసైక్లీన్, డాక్సీసైక్లిన్ వంటి యాంటిబయాటిక్స్‌కు బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి తగ్గుతోందని డాక్టర్లు అంటున్నారు. ఏ కోడికి యాంటిబయాటిక్స్ వాడారో తెలుసుకోవడం కష్టం కాబట్టి పౌల్ట్రీల్లో యాంటీబయాటిక్స్ వాడకాన్ని నిషేధిస్తూ చట్టాలు చేయడం మేలన్నది డాక్టర్ల అభిప్రాయం.