![Bird flu is completely on decline in state](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/flu.jpg.webp?itok=9-oQipjl)
వ్యాధి తగ్గుముఖం పట్టింది..
70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకే వైరస్ బతుకుతుంది
కోడి మాంసం, గుడ్లు ఉడికించి తినొచ్చు
వైరస్ గుర్తించిన గ్రామాలకు 10 కిలోమీటర్లు సరై్వలెన్స్ జోన్..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ పూర్తిగా తగ్గుముఖం పట్టిందని, ఈ వ్యాధి పట్ల ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికార వర్గాలు భరోసా ఇస్తున్నాయి. ఆ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం...
» రాష్ట్రంలో 2.32 కోట్ల నాటు కోళ్లు, 8.47 కోట్ల లేయర్, బ్రాయిలర్ కోళ్లున్నాయి.
» ఇటీవల ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.20 లక్షల కోళ్లు, పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరులో 2.50 లక్షల కోళ్లు, తూర్పుగోదావరి జిల్లా కానూరులో 65వేల కోళ్లు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో 7వేల కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది.
» వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమై శాంపిల్స్‌ను భోపాల్‌కు పంపించి పరీక్షించగా, బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ అయ్యింది.
» వెనువెంటనే జీవభద్రతా చర్యలు తీసుకుని, ఆయా పౌల్ట్రీల్లో చనిపోతున్న కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది.
» వ్యాధి ప్రభావం ఉన్న జిల్లాల్లో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు.
» రాష్ట్ర సరిహద్దుల్లో కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాట్లు జరిగాయి.
» వైరస్ గుర్తించిన గ్రామాల చుట్టుపక్కల 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్విలెన్స్ జోన్‌గా ప్రకటించి కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రాకపోకలను అధికార యంత్రాంగం కట్టడి చేసింది.
» కోళ్ల ఫారాలు అధికంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో చెరువులు, సరస్సులు, వలస పక్షులు వచ్చే ప్రాంతాల్లో వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు.
భయం అక్కర్లేదు: మంత్రి
కాగా, రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ఈ వైరస్ 70 డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత వద్ద వరకు మాత్రమే బతుకుతుందన్నారు. కానీ మనం వంద డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద చికెన్ ఉడికిస్తామన్నారు. అందువలన ఈ వైరస్ బ్రతికే అవకాశమే ఉండదన్నారు.
కోడి మాంసాన్ని కానీ, కోడిగుడ్లను కానీ బాగా ఉడికించి తినొచ్చని, ఈ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ టీ.దామోదర్‌నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పౌల్ట్రీ ఫారాలున్న జిల్లాల పరిధిలో మండలానికి రెండు చొప్పున 721 రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment