సాక్షి, కోనసీమ: మండుతున్న ఎండలకు కోళ్లు విలవిలలాడుతున్నాయి. వేడిగాలులకు తాళలేక మరణిస్తున్నాయి. పది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి. 42 నుంచి 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి వేడిగాలుల తీవ్ర త తోడవుతోంది. ఉష్ణతాపం నుంచి కోళ్లకు ఉపశమ నం కలిగించేందుకు కోళ్ల రైతులు అనేక చర్యలు చేప డుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా ప్రత్యేక మందులు ఇస్తున్నారు. షెడ్లలోకి వేడిగాలులు రాకుండా చుట్టూ గోనె సంచులు కట్టి, స్ప్రింక్లర్లతో తడుపుతున్నారు. లోపలి వేడిగాలి బయటకు పోయే విధంగా పైకప్పులో ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికి రికార్డు స్థాయిలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.3 కోట్ల వరకూ, మిగిలిన దశల్లోని కోళ్లు 80 లక్షల వరకూ ఉన్నాయి, సాధారణ పరిస్థితుల్లో రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, 25 వేల నుంచి 30 వేల వరకూ కోళ్లు చనిపోతుంటాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మునుపెన్నడూ లేని విధంగా కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 3 లక్షల వరకూ కోళ్లు మృత్యువాత పడుతున్నాయంటున్నారు. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వలన సుమారు రూ.200 మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. ఈ లెక్కన కోళ్ల మరణాల రూపంలో రోజుకు రూ.6 కోట్ల నష్టం వాటిల్లుతోంది.
పైకప్పు చల్లబర్చేందుకు స్ప్రింక్లర్లతో నీటిని చల్లుతున్న దృశ్యం
మరోపక్క గుడ్ల ఉత్పత్తి 20 శా తం మేర తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు 88 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. 22 లక్షల గుడ్లు ఉత్పత్తి తగ్గిపోవడంతో నెక్ ప్రకటిత రైతు ధర రూ.4.60 చొప్పున రోజుకు రూ.1.01 కోట్ల వరకూ రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇలా కోళ్ల మరణాలు, గుడ్లు డ్రాపింగ్ రూపాల్లో మూడు జిల్లాల్లోని పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు రూ.7.01 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీవర్గాలు చెబుతున్నాయి.
దిగిరాని చికెన్ ధర
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు.. కోనసీమ జిల్లా అమలాపురం, రావులపాలెం.. కాకినాడ జిల్లా తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫారాల వరకూ ఉండగా 7 లక్షల కోళ్ల పెంపకం జరుగుతోంది. కోళ్ల మరణాలు ఎక్కువగా ఉండటంతో ఎండలకు జడిసి రైతులు కొత్త బ్యాచ్‌లు వేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధిక శాతం ఫారాలు కంపెనీల అధీనంలోనే ఉండటంతో బ్రాయిలర్ చికెన్ ధర కొన్నాళ్లుగా దిగి రావడం లేదు. రెండు నెలలుగా స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.320 నుంచి రూ.350 వరకూ పలుకుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధర ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.
వాతావరణం చల్లబడాలి
ఎండల తీవ్రత పెరిగిపోవడంతో కోళ్ల మరణాలు పెరిగిపోయాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఆయా కారణాలతో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. వర్షాలు కురిసి వాతావరణం చల్లబడితే మరణాలు తగ్గి, ఉత్పత్తి పెరుగుతుంది.
– పడాల సుబ్బారెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు
Comments
Please login to add a commentAdd a comment