చత్తీస్‌గఢ్‌లో ఓ వింత ఘటన వెలుగుచసింది. నాటు కోడి కూర అంటే తెగ ఇష్టపడే ఓ బ్యాంక్ మేనేజర్.. ఓ రైతును బకరాలాగా ఉపయోగించుకున్నాడు. అతడికి లోన్ ఇప్పిస్తానని ఆశ చూపి ఏకంగా వేల విలువైన నాటు కోళ్లను అమాంతం తినేశాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మస్తూరి పట్టణానికి చెందిన రైతు మన్హర్‌కు కోళ్ల ఫారమ్ ఉంది. తన పొలంలో ఏర్పాటు చేసిన ఆ కోళ్ల ఫారాన్ని మరింత విస్తరించాలని రైతు భావించాడు. అందుకు లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుని స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌ను కలిశాడు. లోన్ ఇస్తానని చెప్పిన మేనేజర్ తనకు నాటు కోడి కూర అంటే ఇష్టమని, తనకు ప్రతి శనివారం నాటు కోడి తెచ్చివ్వాలని కోరాడు. లోన్ వస్తుందన్న ఆశతో రైతు మన్హర్ బ్యాంకు మేనేజర్ చెప్పినట్టే చేశాడు. అప్పటి నుంచి మొదలు లోన్ పేరు చెప్పి తరచూ అతడు మన్హర్ ద్వారా నాటు కోళ్లు తెప్పించుకుని తిన్నాడు.
ఇలా రెండు నెలల వ్యవధిలో అతడు మొత్తం రూ.39 వేల విలువ చేసే నాటుకోళ్లు తిన్నాడు. పైగా రైతు నుంచి లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా డిమాండ్ చేశాడు. దాంతో అతను తన ఫారమ్‌లోని కోళ్లను అమ్మి రూ.10 లక్షల లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా ఇచ్చాడు. అయినా బ్యాంకు మేనేజర్ లోన్ మంజూరు చేయకుండా ఇంకా నాటు కోళ్ల కోసం డిమాండ్ చేశాడు. దాంతో బ్యాంకు మేనేజర్ తనకు లోన్ ఇవ్వదల్చుకోలేదని, తనను మోసం చేశాడని గ్రహించిన మన్హర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తాను కొనుగోలు చేసి మేనేజర్‌కి ఇచ్చిన కోళ్ల బిల్లులు కూడా తన వద్ద ఉన్నాయని, మేనేజర్ తిన్న కోళ్లకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేనేజర్‌పై చర్య తీసుకోవాలని లేదంటే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనకు న్యాయం చేయకపోతే నిరహార దీక్షకు కూర్చుంటానని, మస్తూరి ఎస్‌బీఐ బ్రాంచ్ ముందే తాను చచ్చిపోతానని హెచ్చరించాడు. దాంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment