Poultry
-
లోన్ ఆశ చూపి.. రూ.39 వేల నాటు కోళ్లు తిన్న బ్యాంక్ మేనేజర్!
చత్తీస్‌గఢ్‌లో ఓ వింత ఘటన వెలుగుచసింది. నాటు కోడి కూర అంటే తెగ ఇష్టపడే ఓ బ్యాంక్ మేనేజర్.. ఓ రైతును బకరాలాగా ఉపయోగించుకున్నాడు. అతడికి లోన్ ఇప్పిస్తానని ఆశ చూపి ఏకంగా వేల విలువైన నాటు కోళ్లను అమాంతం తినేశాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. మస్తూరి పట్టణానికి చెందిన రైతు మన్హర్‌కు కోళ్ల ఫారమ్ ఉంది. తన పొలంలో ఏర్పాటు చేసిన ఆ కోళ్ల ఫారాన్ని మరింత విస్తరించాలని రైతు భావించాడు. అందుకు లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుని స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్‌ను కలిశాడు. లోన్ ఇస్తానని చెప్పిన మేనేజర్ తనకు నాటు కోడి కూర అంటే ఇష్టమని, తనకు ప్రతి శనివారం నాటు కోడి తెచ్చివ్వాలని కోరాడు. లోన్ వస్తుందన్న ఆశతో రైతు మన్హర్ బ్యాంకు మేనేజర్ చెప్పినట్టే చేశాడు. అప్పటి నుంచి మొదలు లోన్ పేరు చెప్పి తరచూ అతడు మన్హర్ ద్వారా నాటు కోళ్లు తెప్పించుకుని తిన్నాడు.ఇలా రెండు నెలల వ్యవధిలో అతడు మొత్తం రూ.39 వేల విలువ చేసే నాటుకోళ్లు తిన్నాడు. పైగా రైతు నుంచి లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా డిమాండ్ చేశాడు. దాంతో అతను తన ఫారమ్‌లోని కోళ్లను అమ్మి రూ.10 లక్షల లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా ఇచ్చాడు. అయినా బ్యాంకు మేనేజర్ లోన్ మంజూరు చేయకుండా ఇంకా నాటు కోళ్ల కోసం డిమాండ్ చేశాడు. దాంతో బ్యాంకు మేనేజర్ తనకు లోన్ ఇవ్వదల్చుకోలేదని, తనను మోసం చేశాడని గ్రహించిన మన్హర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కొనుగోలు చేసి మేనేజర్‌కి ఇచ్చిన కోళ్ల బిల్లులు కూడా తన వద్ద ఉన్నాయని, మేనేజర్ తిన్న కోళ్లకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేనేజర్‌పై చర్య తీసుకోవాలని లేదంటే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనకు న్యాయం చేయకపోతే నిరహార దీక్షకు కూర్చుంటానని, మస్తూరి ఎస్బీఐ బ్రాంచ్ ముందే తాను చచ్చిపోతానని హెచ్చరించాడు. దాంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘ఎగ్’బాకుతున్న ధర
సాక్షి, భీమవరం/ నెల్లూరు(సెంట్రల్): రాష్ట్రంలో కొద్ది రోజులుగా నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, పప్పులు, నూనెలు ఏవీ కొనేటట్టు లేవు. కూరగాయలు కూడా కిలో 60కి తక్కువ ఏదీ లేదు. కాస్తో కూస్తో కోడి గుడ్డే చవగ్గా ఉందనుకుంటే ఇప్పుడు అదీ కొండెక్కి కూర్చుంటోంది. రిటైల్‌గా ఒక్కో గుడ్డు రూ.7కి తక్కువ లేదు. కొన్ని జిల్లాల్లో రూ.8.00కి ఎగబాకేసింది. ఈ సీజన్లోనూ గుడ్డు ధర ఫాం గేటు వద్దే పరుగులు పెడుతోంది. ప్రస్తుతం రూ.6.20తో పాత ధరను చేరుకొంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. హోల్‌సేల్‌లో ధరే వంద గుడ్లు ధర రూ.700కు చేరింది. రిటైల్ మార్కెట్లోకి వచ్చే సరికి మరో రూపాయి పెరిగి రూ.8కి చేరడంతో సామాన్యులు కొనలేకపోతున్నారు. ఫాం గేటు వద్ద ధర పెరిగితే రిటైల్ ధర కూడా ఇంకా పెరుగుతుందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. ఇంత ధర పెట్టి కొనలేమని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు 4.4 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి 60 శాతం గుడ్లు పశి్చమ బెంగాల్, బీహార్, అసోం, ఒడిశా, యూపీ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటే మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉత్పత్తయ్యే గుడ్లలో అధిక శాతం స్థానికంగానే వినియోగమవుతున్నాయి.శీతాకాలం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువై, ఎగుమతులు పెరిగి ఫాం గేటు ధర పెరుగుతోంది. గత డిసెంబరు 27న ఫాం గేట్ వద్ద రూ.6.20తో అత్యధిక ధర నమోదయింది. ఆ తర్వాత తగ్గినా.. మళ్లీ క్రమేపీ పెరిగి గురువారం రూ.6.20కి చేరింది. మరోపక్క రైతులకు కూడా మేత ధరలు, రవాణా ఖర్చులూ పెరిగిపోయాయి. ధరలు పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. రైతులకు ఎటువంటి సహాయం చేయడంలేదు. దీని ప్రభావం ధరలపై పడుతోంది. రైతుకేమీ లాభం లేదంటున్న పౌల్ట్రీ వర్గాలు ప్రస్తుతం గుడ్డు ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీ, పెరిగిన మేత ధరలతో రైతుకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని పౌల్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కొద్దికాలంగా పౌల్ట్రీలు విస్తరించి, రోజుకు 2.5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో కోస్తా గుడ్లకు డిమాండ్ తగ్గింది. పైగా, ఇక్కడి నుంచి వెళ్లే ఒక్కో గుడ్డుపై రూపాయి వరకు రవాణాకు ఖర్చవుతుండగా అక్కడి గుడ్లపై 25 పైసల లోపే ఉంటోంది. దీంతో అక్కడి మార్కెట్ ధరకు తగ్గించి అమ్మడం వల్ల నష్టపోతున్నామని కోళ్ల రైతులు అంటున్నారు. మరోపక్క కోళ్ల మేతలో ఎక్కువగా వాడే మొక్కజొన్న ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువ సాగవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి రవాణా చార్జీల భారం పెరిగిపోతోంది. దీనికితోడు ఇథనాల్, ఆల్కహాల్ పరిశ్రమలు మొక్కజొన్నతో పాటు కోళ్ల మేతలో వాడే పాడైన బియ్యం నూకలను కూడా భారీగా కొనేస్తుండటంతో ఇవి రైతాంగానికి దొరకడంలేదు. గతంలో పంట వచ్చిన సమయంలో కిలో రూ.18 ఉండే మొక్కజొన్న ఇప్పుడు రూ.27 ఉంది. దీంతో నిర్వహణ భారంగా మారిందని రైతులు చెబుతున్నారు. ఏడాది సగటు రైతు ధర రూ.5.75 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని, ఈ ఏడాది రూ.5 లోపే ఉండటంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది సీజన్..చలి ఎక్కువగా ఉండే నవంబరు నుంచి ఫిబ్రవరి నెల వరకు పౌల్ట్రీకి సీజన్‌గా భావిస్తారు. ఏటా ఈ కాలంలో రైతు ధర పెరుగుతూ ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో చలికాలంలో చేపల లభ్యత తగ్గుతుంది. దీంతో అక్కడ గుడ్ల వినియోగం పెరుగుతుంది. రాష్ట్రంలోనూ చలి కాలంలో గుడ్ల వినియోగం ఎక్కువగానే ఉంటుంది. కార్తీక మాసమూ ముగిసింది. పైపెచ్చు క్రిస్మస్, నూతన సంవత్సరం వస్తుండడంతో కేక్‌లకు డిమాండ్ ఉంటుంది. కేకులలో కోడిగుడ్లు తప్పనిసరిగా వాడతారు. సంక్రాంతికి కూడా గుడ్లకు డిమాండ్ ఎక్కువే. అందువల్ల ఇప్పటి నుంచే గుడ్లు ధర పెంచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.ప్రభుత్వం ఆదుకుంటేనే పౌల్ట్రీలకు మనుగడ మేత ధరలు, నిర్వహణ భారం విపరీతంగా పెరిగిపోయి గుడ్డు ధర గిట్టుబాటు అవ్వక కొన్నేళ్లుగా కోళ్ల పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉంది. మొక్కజొన్న, నూకలను ఇథనాయిల్, ఆల్కహాల్ కంపెనీలు ముందుగానే టోకుగా కొనేస్తుండటంతో కోళ్లకు మేత దొరకడం కష్టమవుతోంది. మొక్కజొన్న, ఎఫ్‌సీఐలో పాడైన బియ్యం, నూకలను సబ్సిడీపై అందించి ప్రభుత్వం ఆదుకోవాలి. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి,అర్తమూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లారేట్లు ఎక్కువగా ఉన్నాయి కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎప్పుడు ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. పెరగడమే తప్ప తగ్గడం అనేది లేదు. గుడ్డు తిందామన్నా రేట్లు చూసి మానుకోవాల్సి వస్తోంది. – వినయ్, స్టౌన్‌హౌస్‌పేట, నెల్లూరు జిల్లాఅన్ని రేట్లు పెరిగాయి ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగిపోయాయి. కనీసం గుడ్డు తిందామన్నా రేట్లు చూస్తే భయమేస్తోంది. కొందరు వ్యాపారులు కావాలనే రేట్లు పెంచుతున్నారనే ఆనుమానాలు కలుగుతున్నాయి.– బ్రహ్మరెడ్డి, డీసీ పల్లి, నెల్లూరు జిల్లా -
గాజాలో పంటలు నాశనం... పశువుల మృత్యువాత!
గాజా–ఇజ్రాయెల్ మధ్య ఎడతెగని యుధ్ధం గాజాలోని అనేక పదుల సంఖ్యలో మనుషులను బలిగొంది. అంతేకాదు, అక్కడి రైతులు, పశుపోషకుల జీవితాలను యుద్ధం ఛిద్రం చేసింది. కొనసాగుతున్న యుద్ధం స్థానిక ఆహారోత్పత్తి అడుగంటడంతో గాజాలో ఆహార భద్రత వేగంగా క్షీణించింది. గాజాలో దాదాపు 86 శాతం జనాభా (18.4 లక్షల) మంది ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. యావత్ గాజా స్ట్రిప్‌లో తిండి దొరకని తీవ్ర క్షామ పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది.ఎఫ్.ఎ.ఓ. ఉపగ్రహ కేంద్రం ఇటీవల సేకరించిన ఒక అధ్యయనంలో ఉపగ్రహ డేటా ప్రకారం.. గాజాలోని పంట భూమిలో మూడింట రెండొంతుల భూమి నాశనమైంది. గాజా వాసులకు చెందిన దాదాపు 15 వేల (95 శాతం) పశువులు చనిపోయాయి. దాదాపు దూడలన్నీ వధించబడ్డాయి. సుమారు 25 వేల గొర్రెలు (సుమారు 43 శాతం), కేవలం 3 వేల మేకలు (సుమారు 37 శాతం) మాత్రమే సజీవంగా మిగిలాయి. పౌల్ట్రీ రంగానికి కూడా అపార నష్టం జరిగింది. 99% కోళ్లు చనిపోయాయి. కేవలం 34 (1 శాతం) వేలు మాత్రమే మిగిలాయి.సగానికి సగం జీవాలు మృతిభయానక యుద్ధం వల్ల గాజాకు చెందిన పశుపోషకురాలు హక్మా ఎల్–హమీది తన కుటుంబ జీవనాధారమైన గొర్రెలు, మేకలు సహా దక్షిణ భాగాంలోకి వలస పోయింది. ఈ కుటుంబం కనీసం సగం జీవాలను కోల్పోయింది. పశువుల పనులు ఆమెకు చిన్నప్పటి నుండి అలవాటే. రోజుకు మూడు పూటలా వాటి బాగోగులు చూసుకుంటుంది. ‘యుద్ధ కాలంలో ఆహారం లేదు, బార్లీ లేదు, మేత లేదు, నీరు కూడా లేదు. మాకు నలభైకి పైగా పశువులు ఉండేవి. ఇప్పుడు ఇరవై కంటే తక్కువే మిగిలాయి’అని సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని అల్–జువైదా నివాసి హక్మా చెప్పారు.ఈ నష్టాలు ఆమె కుటుంబ జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగించాయి. ‘ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) మాకు పశువుల మేతను అందించి చాలా సహాయం చేసింది. దేవునికి ధన్యవాదాలు. ఈ జీవాలైనా చనిపోకుండా మిగిలాయి. ఆరోగ్యంగా ఉన్నాయి..’ అన్నారామె. ఎఫ్.ఎ.ఓ. అందించిన వెటర్నరీ కిట్ కూడా ‘నాకు చాలా సహాయపడింది. విటమిన్లతో కూడిన దాణాతో పాటు దోమలు/ ఈగల బాధ లేకుండా చేసే స్ప్రే ఆ కిట్‌లో ఉన్నాయి. జీవాలను ఈగలు కుట్టకుండా దీన్ని పిచికారీ చేస్తున్నాను. ఇది నిజంగా బాగుంది’ అన్నారామె.పశుగ్రాసం, వెటర్నరీ కిట్ల పంపిణీభద్రత, ప్రయాణ సంబంధ సవాళ్లను అధిగమించి గాజా ప్రజలకు అనేక సంస్థలు మానవతా సహాయాన్ని అందించాయి. గాజాలోని డెయిర్ అల్–బలా, ఖాన్ యూనిస్, రఫా గవర్నరేట్లలోని 4,400కు పైగా పశు పోషణే జీవనాధారంగా గల కుటుంబాలకు ఎఫ్.ఎ.ఓ. పశుగ్రాసాన్ని పంపిణీ చేసింది. జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, గాజా అంతటా జీవనోపాధులను కాపాడేందుకు దాదాపు 2,400 కుటుంబాలకు వెటర్నరీ కిట్లు అదనంగా అందించారు. మల్టీవిటమిన్లు, క్రిమిసంహారకాలు, సాల్ట్ బ్లాక్‌లు, అయోడిన్ గాయం స్ప్రేలు వంటి జంతువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాలా అవసరమైన వస్తువులను అందించటం విశేషం. వాస్తవానికి, హక్మా వంటి పశుపోషకులకు ఈ మహా సంక్షోభ కాలంలో ఈ సహాయం సరిపోదు. తన జంతువులను రక్షించుకోవడానికి ఇంకా ఎక్కువ మేత, మరిన్ని మందులు, మరిన్ని గుడారాలు అవసరమని ఆమె చెప్పారు.ఈ సాయం చాలదుబాధాకరమైన గత సంవత్సర కాలంలో అపారమైన నష్టాన్ని చవిచూసిన మరొక పశు పోషకుడు వార్డ్ సయీద్. వాస్తవానికి గాజాలోని పాత నగరంలో ఎల్–జెటూన్స్ కు చెందిన మహిళా పశుపోషకురాలు. యుద్ధం నుంచి ప్రాణాన్ని కాపాడుకోవడానికి డెయిర్ అల్–బలాహ్‌కు వలస వెళ్లి ఆశ్రయం పొందారు. ‘యుద్ధం కారణంగా మేం దక్షిణాదికి తరలివచ్చాం. మా పశువులను కూడా తోలుకొచ్చాం. సగానికి సగాన్ని కోల్పోయాం. వాటిలో చాలా వరకు దారిలోనే చనిపోయాయి. ఈ మిగిలిన జీవాలే మాకు ఏకైక జీవనాధారం’ అన్నారామె. క్షిపణులు తరచూ పడే యుద్ధ ప్రాంతంలో ఆమె తన కుటుంబానికి ఆహారం, పశువులకు మేత కోసం ప్రాణాలను పణంగా పెట్టి మరీ శ్రమిస్తున్నారు. ‘ఎఫ్.ఎ.ఓ. పశువుల మేత, వెటర్నరీ కిట్ ఇచ్చింది. ఈ సాయం సరిపోదు. పశువుల మేత, భద్రత కలిగిన గూడు, ఆహారం ఇంకా కావాలి’ అన్నారామె. యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం కాక ముందు దాదాపు 650 ట్రక్కుల మేత ప్రతి నెలా గాజా స్ట్రిప్‌లోకి తెప్పించుకునేవారు. ఎఫ్.ఎ.ఓ., బెల్జియం, ఇటలీ, మాల్టా, నార్వే ప్రభుత్వాల మద్దతుతో పాలస్తీనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రభుత్వేతర సంస్థలతో కలిసి గాజా పశువుల సంరక్షకులకు మేత, వెటర్నరీ కిట్లను పంపిణీ చేస్తుంది. అయినా, అది అరకొరగానే మిగిలింది. యుద్ధం వల్ల ఆహారం, దాణా తదితరాలను రవాణా చేయటంలో సహాయక సంస్థలు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితులు మెరుగుపడితే ఫీడ్ కాన్స్ సెంట్రేట్, గ్రీన్స్ హౌస్ ప్లాస్టిక్ షీట్లు, ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు, వ్యాక్సిన్స్ లు, ఎనర్జీ బ్లాక్‌లు, ప్లాస్టిక్ షెడ్లు, జంతు షెల్టర్లు, మరిన్ని వెటర్నరీ కిట్లను అందించడానికి సిద్ధమని ఎఫ్.ఎ.ఓ. చెబుతోంది. గాజా నుంచి ప్రాణాలు అరచేత పట్టుకొని వలస పోయిన హక్మా, వార్డ్ వంటి పశు పోషక కుటుంబాలకు మరింత మెరుగైన సహాయం అందే రోజు కోసం వారు ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు.గ్రీన్‌హౌస్‌లు ద్వంసంగాజా స్ట్రిప్ ప్రాంతంలో గల పంట పొలాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి 68 శాతం, అంటే 10,183 హెక్టార్లలో పంట పొలాలు యుద్ధం వల్ల నాశనమయ్యాయని ఎఫ్.ఎ.ఓ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 43% పొలాలు నాశనం కాగా, మే నాటికి అది 57%కి పెరిగింది. 71% తోటలు, చెట్లు, 67% స్వల్పకాలిక పంటలు, 59% వరకు కూరగాయ పంటలు నాశనమయ్యాయి. యుద్ధం వల్ల గాజాలోని వ్యవసాయ మౌలిక సదుపాయాలు సర్వనాశనం అయ్యాయి. 1,188 (52%) వ్యవసాయ బావులు దెబ్బతిన్నాయి. 578 హెక్టార్ల (44%)లోని గ్రీన్ హౌస్‌లు నేలమట్టం అయినట్లు అంచనా.∙గాజా స్ట్రిప్ నుంచి దక్షిణాదికి వలస వచ్చి జీవనోపాధి కోల్పోయిన హక్మా, వార్డ్ వంటి పశుపోషకులకు పశుగ్రాసం, వెటర్నరీ కిట్లు ఎఫ్.ఎ.ఓ. పంపిణీ చేసింది. మరిన్ని జంతువులు చనిపోకుండా కాపాడుకోవడానికి, వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి సహాయపడ్డాయి. -
గుడ్డు రైతుకు గడ్డు కాలం!
పౌల్ట్రీ రంగంలో నాలుగు దశాబ్దాల అపార అనుభవం ఉన్న రెడ్డిబత్తుల సత్యనారాయణరెడ్డి 2 వేల కోళ్లతో మొదలు పెట్టి 2.32 లక్షల కోళ్ల ఫారం నిర్వహించే స్థాయికి ఎదిగారు. పదేళ్ల పాటు కృష్ణా జిల్లా లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. అలాంటి రైతు కూడా చివరకు నష్టాలు భరించలేక నూజివీడు మండలం అన్నవరం వద్ద తనకున్న కోళ్ల ఫారాలను అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తమ ప్రాంతంలో ఇటీవల ఐదు కోళ్ల ఫారాలను విక్రయించారని, మిట్టగూడెం వద్ద ఓ కోళ్లఫారాన్ని కూలగొట్టి భూమి విక్రయానికి పెట్టారని, ప్రభుత్వం ఆదుకోకుంటే పౌల్ట్రీ రంగం కోలుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు తోడు ఫామ్ గేటు వద్ద గుడ్డుకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలతో అక్కడ పౌల్ట్రీ పరిశ్రమ బలంగా వేళ్లూనుకోవడం లాంటిæ కారణాల వల్ల రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. పలు జిల్లాల్లో ఫామ్స్‌ను విక్రయిస్తుండగా మరికొన్ని చోట్ల కార్పొరేట్ సంస్థలకు అప్పగించేస్తున్నారు. – సాక్షి, అమరావతిగతేడాది రికార్డు స్థాయిలో గుడ్డు ధర..రాష్ట్రంలో 1,200 కోళ్ల ఫారాలు ఉండగా రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఏపీలో 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు వినియోగమవుతుండగా 2 కోట్లకు పైగా గుడ్లు పశి్చమ బెంగాల్, ఒడిశా, బిహార్, అసోం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మొన్నటి వరకు శ్రీలంక, గల్ఫ్ దేశాలకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున గుడ్లు ఎగుమతి అయ్యేవి. పౌల్ట్రీ రంగ చరిత్రలో 2023లో ఫామ్ గేటు వద్ద గుడ్డుకు రికార్డు స్థాయిలో రూ.5.75కుపైగా ధర లభించడం, అదే సమయంలో పౌల్ట్రీరంగ అభ్యున్నతి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ పౌల్ట్రీ డెవలప్మెంట్ పాలసీ తెచ్చే దిశగా అడుగులు వేయడంతో తమ వెతలు తీరుతాయని రైతులు భావించారు. మేత ఖర్చులు తడిసి మోపెడు... ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో దాదాపు 2 లక్షల కోళ్లు మృత్యువాత పడగా ఆ ప్రభావంతో కోళ్లు పెద్దఎత్తున జబ్బుల పాలవుతున్నాయి. పౌల్ట్రీ రంగంలో విరివిగా వినియోగించే మొక్కజొన్న, బ్రోకెన్ రైస్ తదితరాలు ఇథనాల్ ఫ్యాక్టరీలకు మళ్లించడంతో బహిరంగ మార్కెట్లో వాటి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. సోయా మినహా మిగిలిన మేతæ ఖర్చులు రైతులకు భారంగా మారిపోయాయి. సాధారణంగా జూన్ తర్వాత ఫామ్ గేటు వద్ద గుడ్డు రేటు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఫామ్ గేటు వద్ద రూ.4.50 నుంచి రూ.4.75కి మించి రావడం లేదు. ప్రస్తుతం ఫామ్ గేటు వద్ద లేయర్ లైవ్ ధర కిలో రూ.78, బాయిలర్ రూ.102 చొప్పున ధర లభిస్తోంది. 40–50 శాతానికి పడిపోయిన ఉత్పత్తి సాధారణంగా ఫామ్‌లో 70–80 వారాల పాటు కోడి సగటున రూ.1,300 విలువైన మేత తింటుంది. సగటున 330 వరకు గుడ్లు పెడుతుంది. అత్యధికంగా 20–40 వారాల మధ్య గరిష్టంగా 96 గుడ్లు వరకు పెడుతుంటాయి. వర్షాలు, వరదల వల్ల దాదాపు 8–10 శాతం కోళ్లు వైరస్ల బారిన పడడంతో 40–50 శాతానికి ఉత్పత్తి తగ్గిపోయింది. పెట్టుబడి ఖర్చులు తట్టుకోలేక కొత్త బ్యాచ్‌లు పెట్టేందుకు రైతులు సాహసించడం లేదు. ప్రస్తుతం 75 శాతం కెపాసిటీతోనే ఫామ్స్ నడిచే పరిస్థితి నెలకొంది. గతేడాది ఇదే సమయంలో 4.75 కోట్ల నుంచి 5 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవగా ప్రస్తుతం 3.75 కోట్లకు మించి ఉత్పత్తి కావడం లేదు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఏపీ నుంచి వచ్చే గుడ్లకు ధర లేకుండా చేయడం, తమిళనాడు నుంచి కూడా ఏపీకి సరఫరా పెరగడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాల ఫలితంగా యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కోళ్ల ఫారాలు గణనీయంగా పెరుగుతుండడంకూడా ఏపీ పౌల్ట్రీ రంగానికి అశనిపాతంగా మారింది.సిండికేట్‌తో ధరలు పతనం గతేడాది రికార్డు స్థాయిలో ధర లభించడంతో పౌల్ట్రీ రంగం కాస్త కుదుటపడుతుందని రైతులు ఆశించారు. వైరస్ల ప్రభావంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు సిండికేట్‌గా మారి ఫామ్ గేటు వద్ద మన రైతుకు ధర లేకుండా చేస్తున్నారు. – తుమ్మల కుటుంబరావు, నెక్ మాజీ చైర్మన్ మేత ఖర్చులు భారం.. ఇథనాల్ ఫ్యాక్టరీలు పెరిగిపోయాయి. మొక్కజొన్న, బ్రోకెన్ రైస్ ఈ ఫ్యాక్టరీలకు మళ్లిస్తున్నారు. ఫలితంగా మార్కెట్లో వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కోళ్ల ఫారమ్‌ల నిర్వహణ చాలా భారంగా మారింది. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యదర్శి -
తక్కువ పెట్టుబడి అధిక లాభాలు
-
కోడిగుడ్డు.. ఏపీ రికార్డు.. మొదటి 5 స్థానాలు ఈ రాష్ట్రాలవే..
సాక్షి, అమరావతి: కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత దేశంలో మూడో స్థానంలో ఉంది. మన దేశంలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ సర్వే–2022 వెల్లడించింది. దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో తలసరి గుడ్ల లభ్యత అత్యధికంగా ఉందని.. ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఏడాదికి తలసరి 501 గుడ్ల లభ్యతతో నంబర్–1 స్థానంలో ఉందని సర్వే వెల్లడించింది. గుడ్ల లభ్యతలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సర్వే పేర్కొంది. తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత 442 కాగా.. దేశవ్యాప్తంగా ఏడాదికి సగటు తలసరి గుడ్ల లభ్యత కేవలం 95 మాత్రమే ఉందని సర్వే పేర్కొంది. 1950లో ఏడాదికి 5 గుడ్లే 1950–51 కాలంలో ఏడాదికి తలసరి కోడిగుడ్ల లభ్యత మన దేశంలో కేవలం ఐదు మాత్రమే ఉండగా.. 1960–61లో కేవలం 7 మాత్రమే ఉంది. తొలిసారిగా 1968–69లో జాతీయ స్థాయిలో సగటు తలసరి గుడ్ల లభ్యత 10కి చేరిందని సర్వే పేర్కొంది. 2020–21లో జాతీయ స్థాయిలో ఏడాదికి తలసరి గుడ్ల లభ్యత 90 ఉండగా 2021–22లో 95కు చేరినట్టు వెల్లడించింది. మొదటి 5 స్థానాలు ఈ రాష్ట్రాలవే కాగా.. కోడిగుడ్ల ఉత్పత్తి విషయంలోనూ దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కోడిగుడ్ల లభ్యతలో నాలుగో స్థానంలో ఉన్న తమిళనాడు గుడ్ల ఉత్పత్తిలో మాత్రం రెండో స్థానంలోను.. గుడ్ల లభ్యతలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఉత్పత్తిలో మాత్రం మూడో స్థానంలోనూ ఉన్నాయని సర్వే విశ్లేషించింది. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో టాప్ ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లోనే 64.56 శాతం గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని సర్వే వెల్లడించింది. దేశంలో 2021–22లో 129.60 బిలియన్ కోడిగుడ్లు ఉత్పత్తి కాగా.. వాణిజ్య పౌల్ట్రీల ద్వారా 109.93 బిలియన్ గుడ్లు ఉత్పత్తి అయినట్టు, పెరటి పౌల్ట్రీల ద్వారా 19.67 బిలియన్ గుడ్లు ఉత్పత్తి అయినట్టు సర్వే పేర్కొంది. రాష్ట్రంలో మూడేళ్లుగా (2019–20 నుంచి 2021–22) వరకు కోడిగుడ్ల ఉత్పత్తి పెరుగుతోందని సర్వే వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో పెరటి కోళ్ల సంఖ్య కూడా రెండేళ్లుగా పెరిగిందని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 2020–21లో పెరటి కోళ్ల సంఖ్య 1,23,70,740 ఉండగా.. 2021–22లో 1,31,69,200కు పెరిగినట్టు సర్వే స్పష్టం చేసింది. -
వామ్మో ఏమా చికెన్ ధరలు.. నెల క్రితం రూ.200, ఇప్పుడు ఏకంగా..!
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): చికెన్ ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. శుభకార్యాల వేళ ధర పెరగడంతో ప్రజలు తప్పనిసరిగా చికెన్ కొనుగోలు చేస్తున్నారు. ధరలతోపాటు వేసవి తీవ్రత పెరిగినా చికెన్ కొనుగోళ్లు ఏమాత్రం తగ్గటం లేదు. సరిగ్గా నెల రోజుల క్రితం చికెన్ కిలో ధర రూ.200 పలికింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో కిలోకు రూ.100 పెరిగిపోయింది. విజయవాడలోని పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఉన్న చేపల మార్కెట్ వంటి పెద్ద ప్రాంగణాల్లో స్కిన్ రూ.290 స్కిన్లెస్ రూ.300 చొప్పున విక్రయిస్తుండగా.. సాధారణ మార్కెట్లలో మాత్రం రూ.300లకు తగ్గకుండా విక్రయాలు చేస్తున్నారు. వేసవి.. ఆపై శుభకార్యాలు వేసవి సీజన్లో సాధారణంగా చికెన్ ధర పెరగటం సహజం. ఈ ఏడాది సాధారణ స్థాయి కంటే అధికంగా పెరుగుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల వందల కొద్దీ కోళ్లు చనిపోతుండటంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ నష్టాన్ని తట్టుకునేందుకు ధరలను పెంచాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. దానికి తోడు వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వివాహ ముహూర్తాలు ఉండటం వల్ల డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవటం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు వివరిస్తున్నారు. గుడ్డు ధరలూ పెరిగాయ్ కోడిగుడ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కోడిగుడ్లు అమ్మే దుకాణాల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. గత నెలలో పాతిక గుడ్లు సుమారు రూ.100 నుంచి రూ.110 వరకూ విక్రయించారు. ఇప్పుడు 25 కోడిగుడ్లు రూ.135కు హోల్‌సేల్ వ్యాపారులు విక్రయిస్తుండగా.. రిటైల్‌గా ఒక్కొక్కటి రూ.6, రూ.6.50 చొప్పున విక్రయిస్తున్నారు. రైతు బజార్లో ఆదివారం 25 గుడ్లు రూ.127 ధర పలికాయి. -
Egg Prices: కొండెక్కిన కోడిగుడ్డు.. సామాన్యుల బెంబేలు
సాక్షి, తూర్పుగోదావరి(మండపేట): కోడి గుడ్డు ధర కొండెక్కింది. రైతు ధర రూ.5.44 ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.ఏడుకు చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. శీతల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకున్నాయి. మరోపక్క కార్తిక మాసం ముగియడంతో స్థానిక వినియోగం పెరగడంతో గుడ్డు ధరకు రెక్కలొచ్చాయి. కాగా సీజన్లో రైతు ధర నిలకడగా ఉంటేనే నష్టాలు కొంత భర్తీ అవుతాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్లను సామాన్య మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 200 పౌల్ట్రీలు ఉండగా వాటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్లు వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 60 శాతం గుడ్లు పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో శీతాకాలంలో చేపల లభ్యత తక్కువగా ఉండటం వల్ల గుడ్ల వినియోగం పెరిగి ఎగుమతులకు డిమాండ్ ఉంటుంది. శీతల ప్రభావం అధికంగా ఉండే అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి వరకు పౌల్ట్రీకి సీజన్‌గా భావిస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో రైతు ధర పౌల్ట్రీకి ఆశాజనకంగా ఉంటుంది. పౌల్ట్రీ వర్గాల ఆందోళన మంగళవారం నాటికి రైతు ధర రూ. 5.44కు చేరింది. కాగా రిటైల్ మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7 పలుకుతుండటంతో సామాన్య వర్గాల వారు వాటిని కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా రైతు ధరకు 40 నుంచి 50 పైసల వరకు అదనంగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులు అమ్మకాలు చేయడం పరిపాటి. అందుకు భిన్నంగా రూపాయి నుంచి రెండు రూపాయల వరకు పెంచి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించి ఉన్న మండపేట, అనపర్తి, పెద్దాపురం, రాజానగరం పరిసర ప్రాంతాల్లో రూ 6.50కు అమ్మకాలు చేస్తుండగా రామచంద్రపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, జగ్గంపేట తదితర చోట్ల ఏడు రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.7.50కు అమ్మకాలు జరుగుతున్నట్టు వ్యాపారులు అంటున్నారు. చదవండి: (వైఎస్సార్సీపీ నేత హత్యపై సీఎం జగన్ ఆరా.. ధర్మానకు కీలక ఆదేశాలు) రెండు వారాల క్రితం రూ.5 ఉన్న గుడ్డు ధరను ఏడు రూపాయలు వరకు పెంచేశారని వినియోగదారులు అంటున్నారు. డ్యామేజీ అయిన గుడ్ల నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ధర పెంచకతప్పడం లేదని వ్యాపారులు అంటున్నారు. కాగా రిటైల్ మార్కెట్లో ధర బాగా పెరిగిపోవడం పౌల్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అధిక ధరతో వినియోగం తగ్గితే ఆ ప్రభావం పరిశ్రమపై పడుతుందంటున్నారు. పెరిగిన మేతలు, మందుల ధరలు, నిర్వహణ భారంతో గుడ్డు ఏడాది సగటు రైతు ధర ఐదు రూపాయలు ఉంటేనే గిట్టుబాటు కాదని కోళ్ల రైతులు అంటున్నారు. ఈ ఏడాది సగటు ధర నాలుగు రూపాయలు మాత్రమే ఉండటంతో ఆ మేరకు నష్టపోవాల్సి వస్తోందంటున్నారు. సీజన్లో రైతు ధర రూ. 5.50 దాటి నిలకడగా ఉంటేనే పాత నష్టాలను భర్తీ చేసుకునేందుకు వీలుంటుందన్నారు. రైతు ధర నిలకడగా ఉండాలి మేత ధరలు విపరీతంగా పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవ్వక కోళ్ల పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉంది. ఏడాది సగటు రైతు ధర రూ. ఐదు ఉంటేనే కాని గిట్టుబాటు కాదు. ప్రస్తుత రైతు ధర సీజన్లో నిలకడగా ఉంటే పాత నష్టాలు కొంతమేర భర్తీ అవుతాయి. ఎంతోమందికి జీవనాధారంగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమను నష్టాల్లోంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వపరంగా సాయం కోరుతున్నాం. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
స్కిన్లెస్ చికెన్ ధర కేజీ రూ.320.. మరోవైపు కళ్లు తేలేస్తున్న కోళ్లు
సాక్షి, కోనసీమ: మండుతున్న ఎండలకు కోళ్లు విలవిలలాడుతున్నాయి. వేడిగాలులకు తాళలేక మరణిస్తున్నాయి. పది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి. 42 నుంచి 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి వేడిగాలుల తీవ్ర త తోడవుతోంది. ఉష్ణతాపం నుంచి కోళ్లకు ఉపశమ నం కలిగించేందుకు కోళ్ల రైతులు అనేక చర్యలు చేప డుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా ప్రత్యేక మందులు ఇస్తున్నారు. షెడ్లలోకి వేడిగాలులు రాకుండా చుట్టూ గోనె సంచులు కట్టి, స్ప్రింక్లర్లతో తడుపుతున్నారు. లోపలి వేడిగాలి బయటకు పోయే విధంగా పైకప్పులో ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికి రికార్డు స్థాయిలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.3 కోట్ల వరకూ, మిగిలిన దశల్లోని కోళ్లు 80 లక్షల వరకూ ఉన్నాయి, సాధారణ పరిస్థితుల్లో రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, 25 వేల నుంచి 30 వేల వరకూ కోళ్లు చనిపోతుంటాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మునుపెన్నడూ లేని విధంగా కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 3 లక్షల వరకూ కోళ్లు మృత్యువాత పడుతున్నాయంటున్నారు. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వలన సుమారు రూ.200 మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. ఈ లెక్కన కోళ్ల మరణాల రూపంలో రోజుకు రూ.6 కోట్ల నష్టం వాటిల్లుతోంది. పైకప్పు చల్లబర్చేందుకు స్ప్రింక్లర్లతో నీటిని చల్లుతున్న దృశ్యం మరోపక్క గుడ్ల ఉత్పత్తి 20 శా తం మేర తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు 88 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. 22 లక్షల గుడ్లు ఉత్పత్తి తగ్గిపోవడంతో నెక్ ప్రకటిత రైతు ధర రూ.4.60 చొప్పున రోజుకు రూ.1.01 కోట్ల వరకూ రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇలా కోళ్ల మరణాలు, గుడ్లు డ్రాపింగ్ రూపాల్లో మూడు జిల్లాల్లోని పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు రూ.7.01 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీవర్గాలు చెబుతున్నాయి. దిగిరాని చికెన్ ధర తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు.. కోనసీమ జిల్లా అమలాపురం, రావులపాలెం.. కాకినాడ జిల్లా తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫారాల వరకూ ఉండగా 7 లక్షల కోళ్ల పెంపకం జరుగుతోంది. కోళ్ల మరణాలు ఎక్కువగా ఉండటంతో ఎండలకు జడిసి రైతులు కొత్త బ్యాచ్‌లు వేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధిక శాతం ఫారాలు కంపెనీల అధీనంలోనే ఉండటంతో బ్రాయిలర్ చికెన్ ధర కొన్నాళ్లుగా దిగి రావడం లేదు. రెండు నెలలుగా స్కిన్లెస్ చికెన్ కిలో రూ.320 నుంచి రూ.350 వరకూ పలుకుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధర ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. వాతావరణం చల్లబడాలి ఎండల తీవ్రత పెరిగిపోవడంతో కోళ్ల మరణాలు పెరిగిపోయాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఆయా కారణాలతో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. వర్షాలు కురిసి వాతావరణం చల్లబడితే మరణాలు తగ్గి, ఉత్పత్తి పెరుగుతుంది. – పడాల సుబ్బారెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
రెండు నెలలుగా దిగిరాని చికెన్ ధర
మండపేట: రెండు నెలలుగా చికెన్ ధర దిగిరానంటోంది. స్కిన్లెస్ కిలో రూ.300ల నుంచి రూ.320లతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. మేత ధరలు విపరీతంగా పెరగడం, ఎండలు ముదురుతుండటంతో నష్టాలు తాళలేక కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. అవసరమైన మేర కోళ్లు లేక ధర తగ్గడం లేదని వ్యాపారులు అంటున్నారు. రంజాన్ నెల మొదలుకావడంతో వినియోగం మరింత పెరగనుంది. మాంసాహార ప్రియులు అధికంగా ఇష్టపడేది చికెన్. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో రోజుకు సాధారణంగా మూడు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండుగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతుంటాయి. వేసవి ప్రభావం తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, కోనసీమలోని అమలాపురం, రావులపాలెం, కాకినాడలోని తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫామ్‌లు వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్లు పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీలు వరకు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. ఎండలు తీవ్రమయ్యే కొద్ది కోళ్ల మరణాలు పెరిగి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణంతో వేసవిలో కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు ఆసక్తి చూపించరు. దీనికితోడు గత మూడు నెలల్లో కోడిమేత ధరలు గణనీయంగా పెరగడం కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపింది. మొక్కజొన్న కిలో రూ. 14లు నుంచి రూ. 25లకు పెరుగ్గా, సోయా రూ. 40లు నుంచి రూ. 90లకు పెరిగిపోయింది. అన్ని మేతలు మిక్స్‌చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ. 30 నుంచి రూ. 50 వరకు పెరిగిపోయినట్టు కోళ్ల రైతులు అంటున్నారు. కోడిపిల్ల ధర రూ. 35లకు పెరిగిపోయింది. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుండగా, ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడి తయారవ్వడానికి రూ. 110లు వరకు వ్యయమవుతోందని వారంటున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధికశాతం మంది బ్రాయిలర్ కోళ్ల రైతులు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కమీషన్‌పై కేవలం కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి అప్పగించే విధంగా ఫామ్‌లు నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా అదే ధర స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధికశాతం పామ్‌లు కంపెనీల అధీనంలోనే ఉండటం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.200లు వరకు ఉండగా క్రమంగా పెరుగుతూ రూ.300లకు, లైవ్ కిలో రూ. 100ల నుంచి 150లకు చేరుకున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.320 నుంచి రూ.350లు వరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. రంజాన్ ఉపవాస దీక్షలు నేపథ్యంలో ముస్లింలు చికెన్ వినియోగానికి ప్రాధాన్యమిస్తుంటారు. సాధారణ రోజులతో పోలిస్తే రంజాన్ నెలలో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాల అంచనా. నిర్వహణ పెరిగిపోయింది ఎప్పుడు లేనంతగా కోడి మేత ధరలు, కోడిపిల్లల ధరలు పెరిగిపోయాయి. గతంలో పోలిస్తే నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతోంది. సొంతంగా పెంచలేక చాలామంది రైతులు కంపెనీ కోళ్లనే పెంచుతున్నారు. అవసరానికి తగ్గట్టుగా కోళ్లు లేకపోవడం వలన ధర పెరుగుతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం -
పశుగ్రాసం, ఎరువులుగా ఈకల వ్యర్థాలు
సాక్షి, న్యూఢిల్లీ: మానవ జుట్టు, ఉన్ని , పౌల్ట్రీ ఈకలవంటి కెరాటిన్ వ్యర్థాలను ఎరువులు, జంతువుల ఫీడ్లుగా తక్కువ ఖర్చులో మార్చేందుకు నూతన విధానాన్ని మన దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దేశంలో ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో మానవ జుట్టు, పౌల్ట్రీ ఈకల వ్యర్థాలు, ఉన్ని వ్యర్థాలు వెలువడతాయి. ఈ వ్యర్ధాలను డంప్ చేయడం, పాతిపెట్టడం, ల్యాండ్‌ఫిల్లింగ్ కోసం ఉపయోగించడం లేదా దహనం చేయడం ద్వారా పర్యావరణ ప్రమాదాలు, కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు, గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలు పెరుగుతున్నాయని గుర్తించారు. అంతేగాక ఈ వ్యర్థాల్లో ఉన్న అమైనో ఆమ్లాలు, ప్రోటీన్ వంటి వనరులను జంతువుల దాణాతో పాటు ఎరువుగా ఉపయోగించగలిగే సామర్థ్యం ఉందని నిపుణులు తెలిపారు. ముంబైకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎ. బి.పండిట్ తన విద్యార్థులతో కలిసి, కెరాటిన్ వ్యర్థాలను పెంపుడు జంతువుల ఆహారంగా, మొక్కలకు ఎరువులుగా వాడే సాంకేతికతను అభివృద్ధి చేశారు. వ్యర్థాలను విక్రయించదగిన ఎరువులు, పశుగ్రాసంగా మార్చేందుకు వారు అధునాతన ఆక్సీకరణ విధానాన్ని ఉపయోగించారు. -
బాబోయ్.. ఈ చికెన్ చిక్కనంటోంది
సాక్షి, పరిగి( హైదరాబాద్): కోడి మాసం ధరలు కొండెక్కాయి. శ్రావణమాసంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో మాంసాహార ప్రియులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ప్రస్తుత ధర రూ.270 పలుకుతోంది. దీంతో ముక్క గొంతు దాటని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వ్యవధిలో ధరలు రెండింతలు పెరిగాయి. దాణా రేట్లు సైతం ఇదే స్థాయిలో పెరిగాయని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. స్థానికంగా దాణా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోందని పేర్కొంటున్నారు. పండుగ రోజుల్లో కూడా.. జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు 1.7 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఆదివారం, ఏదైనా పండగ ఉంటే ఆయా రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ ఫారాలలో కోళ్ల పెంపకం ముమ్మరంగా సాగుతోంది. కోడి పిల్లలు వేసిన 40 రోజుల్లో కోళ్లు ఎదిగి అమ్మకానికి వస్తాయి. దీంతో కోళ్ల పెంపకందారులు రెండు నెలలకో బ్యాచ్ తీస్తున్నారు. ఏడాది పొడువునా చికెన్‌కు డిమాండ్ ఉంటున్నా.. గతంలో ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు విక్రయాలు బాగా తగ్గేవి. వరలక్ష్మీ వ్రతం, శ్రావణమాసం, వినాయక చవితి, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తీకమాసం పూజల నేపథ్యంలో శ్రావణ మాసం నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్ వినియోగం తగ్గుతుంది. దీంతో రేట్లు కూడా తగ్గుముఖం పడుతుంటాయి. ఈఏడాది శ్రావణమాసం ముగుస్తున్నా చికెన్ ధరలు మాత్రం పైపైకే వెళ్తున్నాయి. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారణాలు ఇవే.. కోవిడ్ కారణంగా ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో కోళ్ల దాణా ధరలు పెరిగాయి. ఆంక్షలు సడలించినా అదుపులోకి రావడం లేదు. దాణాలో ప్రధానమైన సోయాబీన్ అమాంతం ఎగబాకింది. గతంలో కిలో రూ.33 ఉండగా మూడు నెలలుగా రూ.100 పలుకుతోంది. మొక్కజొన్న రూ.14 నుంచి రూ.25 వరకు పెరిగిందని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. శ్రావణమాసం కావడంతో చాలా మంది రైతులు ఫారాల్లో కొత్త బ్యాచ్‌లు వేయలేదు. దీంతో ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగింది. అలాగే కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు చికెన్‌ను ఎక్కువగా తింటున్నారు. వీటి ప్రభావం ధరలపై పడుతోంది. చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
డెయిరీ, పౌల్ట్రీల యజమానులకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డెయిరీ, పౌల్ట్రీల యజమానులకు శుభవార్త. పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నం దున రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీలు, మినహాయింపులను ఇచ్చింది. కరెంటు బిల్లుల్లో ఒక్కో యూనిట్‌కు రూ.2 రాయితీని, ఆస్తి పన్నుల చెల్లింపుల నుంచి మినహాయింపు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ, పంచాయతీరాజ్, ఇంధన శాఖలు బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే.. డెయిరీ, పౌల్ట్రీలకు 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి విద్యుత్ రాయితీలు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, యూనిట్ విద్యుత్‌కు రూ.2 చొప్పున రాయితీ ఇస్తుందని పేర్కొంటూ ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ రాయితీల అందజేతకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని పశుసంవర్థక, డెయిరీ, మత్స్యశాఖ కార్యదర్శిని కోరారు. వీటి ప్రకారం రాయితీలివ్వడానికి ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.100 చెల్లిస్తే చాలు పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఆస్తి పన్ను మినహాయింపు కోసం ‘తెలంగాణ మున్సిపాలిటీల ఆస్తి పన్నుల మదింపు నిబంధనలు–2020’కు సవరణ చేశారు. ‘పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లను ఆస్తి పన్నుల చెల్లింపు నుంచి మినహాయించారు. పురపాలికల్లోని ఆస్తి పన్నుల రికార్డుల నవీకరణ కోసం ఏటా నామమాత్రంగా రూ.100 చెల్లించి ఈ మినహాయింపును పొందవచ్చు’అన్న నిబంధనను కొత్తగా చేర్చారు. ఈమేరకు పురపాలక శాఖ కార్యదర్శి సి.సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు సైతం ఈ మినహాయింపును జీహెచ్‌సీఎం చట్టంలోని సెక్షన్ 679ఈ కింద అమల్లోకి తెస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
కోళ్ల 'మేత' కూత
సాక్షి, అమరావతి బ్యూరో: కోళ్ల దాణా ధర కొండెక్కింది. దీన్లో అధికంగా వినియోగించే సోయా రేటు పెరగడంతో ఆ ప్రభావం ఈ దాణాపై పడింది. అది చికెన్, కోడిగుడ్లపై ప్రభావం చూపుతోంది. సోయా ధర 4 నెలల్లో రెట్టింపయింది. ప్రస్తుతం చికెన్, గుడ్ల ధరలు కోళ్ల పెంపకందార్లకు ఊరటనిస్తున్నా పెరిగిన కోళ్ల మేత ధర భారంగా మారింది. కోళ్ల మేతను సోయా, మొక్కజొన్న, తవుడు, సజ్జలు, రాగులు, వరి నూక, వేరుశనగ చెక్కలతో తయారుచేస్తారు. వీటిలో సోయా, మొక్కజొన్నలను ఎక్కువగా వినియోగిస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో సోయా ధర టన్ను రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండేది. ప్రస్తుతం అది రూ.70 వేల నుంచి రూ.75 వేల మధ్య పలుకుతోంది. ఫలితంగా దాణా ధర నాలుగు నెలల్లో రూ.17 వేల నుంచి రూ.27 వేలకు చేరింది. డిసెంబర్, జనవరిల్లో సోయా ధర టన్ను రూ.30 వేల నుంచి రూ.35 వేల మధ్య ఉన్నప్పుడు మన దేశం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది రూ.2 వేల కోట్ల విలువైన సోయా ఎగుమతులు జరగ్గా, ఈ ఏడాది నాలుగు రెట్లు అధికంగా అంటే రూ.8 వేల కోట్ల ఎగుమతులు జరిగినట్టు పౌల్ట్రీ వర్తకులు చెబుతున్నారు. ఎగుమతులు ఎక్కువగా చేయడం వల్ల దేశీయంగా సోయా కొరత ఏర్పడింది. దీంతో దాణా ధర పెరిగింది. కోడి పూర్తిస్థాయిలో ఎదగడానికి 6 వారాలు పడుతుంది. ఈ 6 వారాల్లో ఒక బ్రాయిలర్ (చికెన్) కోడి 4 కిలోలకుపైగా, గుడ్ల (లేయర్) కోడి గుడ్లుపెట్టే దశకు వచ్చే సరికి 8 కిలోల వరకు మేత తింటాయి. 4 నెలల కిందటి ధరతో పోల్చుకుంటే కిలోకు రూ.10 చొప్పున మేత ధర పెరిగింది. అంటే బ్రాయిలర్ కోడిపై రూ.40, లేయర్ కోడిపై రూ.80 మేత ఖర్చు పెరిగింది. కోళ్ల మేత ధరల పెరుగుదల ఇంతలా ఊహించలేదని, ఇవే ధరలు కొనసాగితే పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతింటుందని కృష్ణా, గుంటూరు బ్రాయిలర్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుచ్చారావు ‘సాక్షి’తో చెప్పారు. కోళ్ల మేత వినియోగంలో 2వ స్థానం ఇండియా పౌల్ట్రీ ఫీడ్ మార్కెట్ అంచనా ప్రకారం.. కోళ్ల మేత వినియోగంలో దేశంలోకెల్లా తమిళనాడు మొదటి స్థానంలోను, ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోను ఉన్నాయి. రాష్ట్రంలో ఏటా బ్రాయిలర్ కోళ్లకు సుమారు 1.50 మిలియన్ టన్నులు, లేయర్ కోళ్లకు 3.40 మిలియన్ టన్నుల మేత అవసరమవుతోంది. ఏటా చికెన్, గుడ్ల వినియోగం పెరుగుతుండడంతో ఆ మేరకు మేత అవసరం కూడా పెరుగుతూ వస్తోంది. పౌల్ట్రీ రంగంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వృద్ధిలో ఉన్నాయి. దీంతో మన రాష్ట్రంపై కోళ్ల మేత ఉత్పత్తి సంస్థలు దృష్టి సారించాయి. పెరిగిన గుడ్లు,చికెన్ వినియోగం కోవిడ్ ఉధృతి సమయంలో కోడిగుడ్లు, చికెన్ వినియోగం పెరిగింది. కోడిగుడ్డు తింటే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందన్న డాక్టర్లు, న్యూట్రిషనిస్టుల సూచనలతో ఎక్కువమంది వీటిని తినడానికి మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో రోజుకు 4.50 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. సాధారణ రోజుల్లో రాష్ట్రంలో రోజుకు సగటున 3 కోట్ల గుడ్లు వినియోగం అవుతుంటాయి. ప్రస్తుతం కోవిడ్ ప్రభావంతో రోజుకు అదనంగా 50 లక్షల గుడ్ల వినియోగం పెరిగింది. అదే సమయంలో గుడ్ల ధరలు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఈనెల 5న విజయవాడలో 100 గుడ్ల ధర హోల్‌సేల్‌లో రూ.370 ఉండగా 27 నాటికి రూ.541కి, విశాఖపట్నంలో రూ.360 నుంచి రూ.557కి పెరిగింది. మరోవైపు చికెన్ వినియోగం కూడా ఆశాజనకంగానే ఉంది. రాష్ట్రంలో రోజుకు సగటున 8 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. రెండేళ్ల కిందటితో పోల్చుకుంటే చికెన్ కొనుగోళ్లు పెరిగాయని వర్తకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల కిలో చికెన్ ధర రూ.200కు అటుఇటుగా ఉంది. -
బ్లాక్‌ఫంగస్ దానివల్ల రాదు.. ఇది అసలు విషయం!
ఆదివారం వచ్చింది. ముక్క నోట్లోకి పోనిద్దాం అని ఆశతో చాలామంది పొద్దున్నే సంచులతో బయలుదేరుతారు. ఇంతలో ‘కోళ్లకు బ్లాక్ ఫంగస్.. తస్మాత్ జాగ్రత్త!’ అని ఎక్కడో వాట్సాప్‌లోనో, ఎవరో చెప్పడంతోనే ఆలోచనల్లో పడతారు. కానీ, చికెన్‌తో ఆ భయం అక్కర్లేదని డాక్టర్లు, సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు. ఇంతకీ వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ఆ వార్త వెనుక అసలు విషయం ఏంటో చూద్దాం. న్యూఢిల్లీ: కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ దేశాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో కోళ్ల కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తోందని, కాబట్టి, కొన్ని రోజుల పాటు చికెన్‌కి దూరంగా ఉండడమే మంచిదని వాట్సాప్‌ల్లో ఈమధ్య వైరల్ అవుతోంది. దీనికి తోడు ఓ ప్రముఖ న్యూస్ వెబ్సైట్ పేరు మీద అది పబ్లిష్ కావడం, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయని కథనాలు వైరల్ అవుతుండడంతో చాలామంది నమ్మేస్తున్నారు. అయితే వాతావరణంలో అంతటా ఉండే బ్లాక్ ఫంగస్.. కోళ్లకి కూడా వస్తుందని, కానీ, ఆ కోళ్ల ద్వారా, చికెన్ ద్వారా మనుషులకు బ్లాక్‌ఫంగస్ వ్యాపిస్తుందన్న వాదనలో అర్థం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ చెప్తున్నారు. అసలు బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని, అలాంటప్పుడు జంతువులు, మనుషుల్లో ఒకరి ద్వారా మరొకరికి సోకుతుందన్న వాదనలో నిజం లేదని ఆమె స్ఫస్టత ఇచ్చారు. కాబట్టి చికెన్‌కి భయపడాల్సిన అవసరం లేదని ఆమె అంటున్నారు. వీటికితోడు నల్లగా ఉండే ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్‌ఫంగస్ వస్తోందని ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త ప్రచారమవుతోంది. ఫ్రిజ్‌లో నల్లగా పేరుకుపోయిన ఫంగస్ వల్ల కూడా సోకే అవకాశముందని వాట్సాప్ లో మెస్సేజ్‌లు సర్కులేట్ అవుతున్నాయి. ఉల్లిగడ్డలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్ వల్ల వస్తుంది. కట్ చేసేటప్పుడు దానిని కడిగి తినడం మంచిది. ఇక ఈ కరోనా టైంలో వైరస్ నుంచి వ్యాక్సిస్ దాకా.. వేరియెంట్ల నుంచి ట్రీట్మెంట్ దాకా అన్నింటి గురించి వాట్సాప్‌లో పుకార్లు జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, లేకపోతే ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు చెప్తున్నారు. కోళ్లకు సోకినా.. అయితే ఒకవేళ ఏదైనా జంతువుకి ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకితే వాటి నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఆ కుళ్లిన వాసనతో కోళ్లకు ఫంగస్ సోకినట్లు గుర్తించవచ్చని ఐసీఎఆర్ సైంటిస్ట్ డాక్టర్ ఎంఆర్ రెడ్డి చెప్తున్నారు. ఆ వాసన వచ్చిన మాంసాన్ని తినలేరు కదా. అయితే ఇప్పటివరకు జంతువులకు బ్లాక్‌ఫంగస్ సోకిన కేసులు నిర్ధారణ కాలేదని, దానిపై ఎలాంటి అధ్యయనాలు జరగలేదని ఎంఆర్‌రెడ్డి చెప్తున్నారు. అయితే కోళ్లను, బాతులను ముద్దు చేయడం ద్వారా సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ సోకుతుందని, ఇది సాధారణమైన ఇన్ఫెక్షన్ కలుగజేస్తుందని అన్నారు. అంటువ్యాధి కాదు బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని ఎయిమ్స్ డైరెక్టర్, పల్మనాలజిస్ట్ అయిన రణ్‌దీప్ గులేరియా ఇది వరకే స్పష్టం చేశారు. మ్యూకర్ అనే ఫంగస్ కారణంగా ఈ మ్యుకర్మైకోసెస్ వస్తుందని చెబుతూనే.. అపోహలపై క్లారిటీ ఇచ్చారాయన. ఇక యునైటెడ్ స్టేట్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇది చాలా ప్రాణాంతకమైన ఫంగస్ ఇన్ఫెక్షన్ అని చెప్పింది. ఈ వైరస్ కారణంగా చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. ఇమ్యూనిటి పవర్ తక్కువగా ఉండటం, స్టెరాయిడ్స్ అధికంగా వాడటం, షుగర్ పేషెంట్లకు ఫంగస్ల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. A clear and important thread on Mucor: What they are, how they cause infections, how to treat the infection, how to lower chances of infection, prevent infection, by controlling diabetes, steroid use. Finally, reduce possibilities of getting COVID: Masks, distance, ventilation! https://t.co/wVgEYaaBl7 — Principal Scientific Adviser, Govt. of India (@PrinSciAdvGoI) May 26, 2021 -
వింత వ్యాధితో 4వేల కోళ్లు మృతి!
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వింతవ్యాధి సోకి 4వేల కోళ్లు మృతి చెందిన సంఘటన కాల్వశ్రీరాంపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. కాల్వశ్రీరాంపూర్‌లో పెద్దంపేట మాజీ సర్పంచ్ దాసరి స్వామి నాటుకోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. మార్కెట్లో అమ్మేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో వింత వ్యాధి సోకి చనిపోతున్నట్లు బాధితుడు తెలిపాడు. వీటి విలువ రూ.8 లక్షలు ఉంటుందని పేర్కొన్నాడు. ఈ విషయమై వైద్యాధికారి డాక్టర్ సురేశ్‌గౌడ్‌ను సంప్రదించాడు. కాగా కోళ్లకు రానిఖేట్ వ్యాధి సోకిందని, మృతి చెందిన కోళ్లను గుంత తీయించి పూడ్చి పెట్టాలని సూచించామని చెప్పారు. మృతి చెందిన కోళ్ల శ్యాంపిల్‌ను ల్యాబ్‌కు పంపించినట్లు వివరించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. చదవండి: తెలంగాణ సచివాలయంలో నాగుపాము కలకలం -
విషాదం: గ్రైండర్లో పడి నలిగిన మహిళ
మాస్కో : కోళ్ల ఫాంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ నిండు ప్రాణం బలైంది. ఫాంలోని గ్రైండర్లో పడి ఓ మహిళ మృత్యువాతపడింది. ఈ సంఘటన రష్యాలోని జుకోస్కిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బెలెవ్సోవోకు చెందిన ఓ మహిళ అక్కడి కోళ్ల ఫ్యాక్టరీలో ఉపాధి పొందుతోంది. కొద్దిరోజుల క్రితం ఫ్యాక్టరీలోని గ్రైండర్ దగ్గర పనిచేస్తోంది. కోళ్లను(మాంసం) ఒక కన్వేయర్నుంచి మరో కన్వేయర్‌కు మారుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె చెయ్యి గ్రైండర్లో ఇరుక్కుంది. ( మనుషులు లేని దీవిలో ఆ ముగ్గురు 33 రోజుల పాటు..) తీయటానికి ఎంత ప్రయత్నించినా రాలేదు. సెకన్లలో మహిళ మొత్తం గ్రైండర్‌లోకి వెళ్లిపోయింది. తోటి పనివాళ్లు ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోళ్ల ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవటానికి సిద్ధమయ్యారు. అధికారులు సంఘటనకు సంబంధించిన సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయిన వీడియోను తాజాగా విడుదల చేశారు. -
కుక్కుట చరితం
ప్రస్తుతం మనం పెంచుతున్న వివిధ రకాల కోళ్లన్నీ ఎర్ర అడవి కోడి జాతి నుంచి వచ్చినవేనని తాజా పరిశోధనలో వెల్లడైంది. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ, పర్యావరణ మార్పులతోపాటు సంక్రమణతో ఎర్ర అడవి కోడి పలు ప్రాంతాల్లో రకరకాలుగా మార్పు చెందినట్టు తేల్చారు. వేల సంవత్సరాల క్రితమే ఈ జాతులన్నీ వేరుపడినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సాక్షి, అమరావతి: మాంసాహారంలో ప్రధాన భాగంగా మారిన కోడికి 10 వేల సంవత్సరాల చరిత్ర ఉందనే విషయం తెలిసిందే. అయితే, ప్రపంచంలో కోళ్ల పెంపకం ఎక్కడ మొదలైందనే దానిపై కొన్ని వందల సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. తాజాగా వివిధ దేశాల శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన ఈ విషయమై ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. ప్రస్తుతం మనం పెంచుతున్న వివిధ రకాల కోళ్లన్నీ ఎర్ర అడవి కోడి జాతి నుంచి వచ్చినవేనని తాజా పరిశోధన స్పష్టం చేసింది. ఆగ్నేయ ఆసియా, దక్షిణాసియాలో ఉండే ఎర్ర అడవి కోళ్లు, వాటి ఉప జాతులు ఒక దానితో ఒకటి సంకరం చెంది ఇప్పుడున్న దశకు వచ్చాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న కోళ్లలో 80 శాతం వీటి నుంచే సంక్రమణ చెందినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్ ‘సెల్ రీసెర్చ్’ నేతృత్వంలో వివిధ దేశాల సైంటిస్టులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. మన దేశం నుంచి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ)కి చెందిన సైంటిస్టు ముఖేష్ ఠాకూర్ భాగం పంచుకున్నారు. 8 వేల నుంచి 10 వేల ఏళ్ల క్రితం చైనా,ఉత్తర థాయ్‌లాండ్, మయన్మార్‌లో కోళ్ల పెంపకం మొదలైనట్టు ఈ పరిశోధన వెల్లడించింది. ప్రాంతాన్ని బట్టి జాతులు మారాయి కోళ్ల పెంపకం మన ప్రాంతమైన సింధు లోయలో ప్రారంభమైనట్టు గతంలో జరిగిన అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. నిరంతరంగా జరిగే పరిశోధనల్లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు జరిగిన సెల్ రీసెర్చ్ సర్వే కూడా ఆసక్తికరమైంది. కానీ.. దీనిపై భిన్న వాదనలున్నాయి. కోళ్ల జాతులు ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితుల్ని బట్టి చాలా రకాలుగా మారిపోయాయి. కోళ్ల చరిత్ర చాలా సుదీర్ఘమైనది. – డాక్టర్ కె.నాగరాజకుమారి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ, ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల, గన్నవరం 864 రకాల జన్యువుల్ని విశ్లేషించి.. ► పరిశోధనలో భాగంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెంపకంలో ఉన్న కోడి జాతుల్లోని 864 రకాల జన్యువులను విశ్లేషించారు. ► సాంకేతిక పరిభాషలో ‘గినస్ గల్లస్’గా పిలిచే ఎర్ర అడవి కోడి, దానికి చెందిన ఐదు ఉప జాతులు, వివిధ దేశాల్లో పెంచుతున్న మరికొన్ని కోళ్ల జాతుల మైటోకాండ్రియల్ డీఎన్ఏలను విశ్లేషించారు. ► గతంలో ఇదే అంశంపై పరిశోధనకు వినియోగించిన 79 కోళ్ల జాతుల డీఎన్ఏలు కూడా ఇందులో ఉన్నాయి. గత పరిశోధనలకు భిన్నంగా.. ► తాజా పరిశోధన గత పరిశోధనలకు భిన్నంగా ఉండటంతో దానిపైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ► మొదట ఉత్తర చైనా, సింధు లోయ (ఇండస్ వ్యాలీ) ప్రాంతంలో కోళ్ల పెంపకం మొదలైనట్టు గత పరిశోధనలు తేల్చాయి. ► చార్లెస్ డార్విన్ సైతం కోళ్ల పెంపకం ఇండస్ వ్యాలీలో ఎర్ర అడవి కోళ్లతో మొదలైందని ప్రతిపాదించారు. ► కానీ సెల్ రీసెర్చ్ పరిశోధన దీనికి వ్యతిరేకంగా ఉండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► కోళ్ల పెంపకంపై శాస్త్రవేత్తల్లో చాలా శతాబ్దాల నుంచి ఆసక్తి ఉందని జెడ్ఎస్ఐ సైంటిస్ట్ ముఖేష్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. ► తాజా పరిశోధన కోళ్ల పెంపకం చరిత్రకు సంబంధించిన కీలక అంశాలను కనుగొందని, ఈ సమాచారం భవిష్యత్ పరిశోధనలకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎర్ర అడవి కోడి జాతి నుంచి.. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ, పర్యావరణ మార్పులతోపాటు సంక్రమణతో ఎర్ర అడవి కోడి వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా మార్పు చెందినట్టు తేల్చారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ జాతులన్నీ వేరుపడినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆగ్నేయ ఆసియా అడవుల్లో ఈ కోళ్లు పైకి ఎగిరి పోట్లాడుకోవడాన్ని చూసిన మానవులు వాటిని మచ్చిక చేసుకున్నారని భావిస్తున్నారు. ఆ తర్వాత వాటిని పెంచుకోవడం, వాటి మాంసం, గుడ్లను ఆహారంగా ఉపయోగించడం మొదలైంది. ఇప్పుడు అదే ప్రధాన ఆహారంలో ఒకటైంది. -
మిడతల దాణా మంచిదేనా?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యం, హార్న్ ఆఫ్రికా దేశాలతోపాటు భారత్ సహా పలు దక్షిణాసియా దేశాలు నేడు అనూహ్య సంఖ్యలో మిడతల దాడులను ఎదుర్కొంటున్నాయి. భారత్‌కన్నా ముందుగా మిడత దాడులను ఎదుర్కొన్న పాకిస్థాన్ వాటిని నిర్వీర్యం చేయడం కోసం మూడు లక్షల లీటర్ల క్రిమిసంహారక మందులను వాడడమే కాకుండా మరో కొత్త ప్రయోగానికి తెరతీసింది. క్రిమిసంహారక మందులు వాడని పొలాల్లో వాలిన మిడతలను కూలీల ద్వారా సేకరించి వాటిని కోడి దాణాగా మార్చి కోళ్ల ఫారమ్‌లకు పంపించింది. 45 శాతం ప్రొటీన్లు ఉండే సోయాబీన్ కిలో పాకిస్థాన్‌లో 90 రూపాయలు పలకుతుండగా, 70 శాతం ప్రొటీన్లు ఉండే మిడతలను కిలోకు 20 రూపాయలు చెల్లించి కూలీల ద్వారా సేకరించింది. మిడతలను కోడి దాణాకా మార్చేందుకు కిలోకు 30 రూపాయలు ఖర్చు అవుతుందని, సేకరణ ఖర్చుతో కలిపితో కోళ్ల ఫారాలకు కిలోకు 50 లేదా 55 రూపాయల చొప్పున సరఫరా చేయవచ్చని పాక్‌లోని ఓక్రా జిల్లోలో ఈ ప్రయోగం నిర్వహించిన ‘పాకిస్థాన్ అగ్రికల్చరల్ రిసర్చ్ కౌన్సిల్‌కు చెందిన బయోటెక్నాలజిస్ట్ జోహర్ అలీ తెలిపారు. మిడతలను చంపేందుకు క్రిమి సంహారక మందులను వాడినట్లయితే వాతావరణ కాలుష్యం పెరగుతుందని, వాటిని తిన్నట్లయితే మనుషులకూ ప్రమాదమని, వాటిని సేకరించి కోడి దాణాగా ఉపయోగించడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన మాటలతో ఏకీభవించిన పలువురు పర్యావరణ వేత్తలు భారత్ కూడా పాక్ అనుసరించిన కొత్త విధానాన్నే అనుసరించాలంటూ సూచనలు కూడా చేశారు. వాస్తవానికి ఇది కొత్తగా కనిపిస్తోన్న పాత విధానం. గతంలో రైతులు వ్యవసాయ బావుల వద్ద కోళ్లను, బాతులను పెంచేవారు. అవి మిడతలను ఎక్కువగా తిని బలంగా తయారయ్యేవి. ప్రకృతిసిద్ధంగా పిచ్చుకలు, కాకులు కూడా మిడతలను ఎక్కువగా తింటాయి. పిచ్చుకలు కనిపించడమే కష్టంకాగా కాకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. గతంలో పలు దేశాల ఆదిమ జాతులు కూడా మిడతలను తినేవి. ఇక్కడ క్రిమిసంహారక మందులు వాడని పొలాల్లో తాము ప్రయోగం చేసినట్లు జోహర్ అలీ తెలిపారు. క్రిమిసంహారక మందులు వాడుతున్న పొలాల సంగతి ఏమిటి? వాటిపై మిడతల దాడిని ఎలా ఆపాలి? భారత్‌లో 80 శాతాకిపైగా క్రిమిసంహారక మందులతో వ్యవసాయం జరుగుతోంది. పంటలపై చల్లే క్రిమి సంహారక మందుల ప్రభావం మిడతలపై ఎక్కువగా ఉంటుంది కనుక ఆ మందులు వాడని పొలాలపై మాత్రమే తాము ప్రయోగం చేసినట్లు అలీ చెప్పారు. (ఇవి అత్యంత వినాశకారి 'మిడతలు') మిడతల కోసం భారత వ్యవసాయదారులు క్రిమిసంహారక మందుల వాడకాన్ని వదిలేయాలా? సేంద్రీయ వ్యవసాయం వైపు మల్లండంటూ పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇస్తామంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినా పెద్దగా ఫలితాలు రాలేదు. మిడతలను నిర్మూలించేందుకు సాధారణంగా ‘ఆర్గనోఫాస్ఫేట్, కార్బమేట్, పైర్‌థ్రాయిడ్’ క్రిమిసంహారక మందులను వినియోగిస్తున్నారు. ఇవి అత్యంత విష పూరితమైనవి. వీటి ప్రభావం మిడతలపై చనిపోయిన తర్వాత కూడా ఉంటుందని రుజువైంది. కనుక ఈ మందుల వల్ల చనిపోయిన మిడతలను మనుషులుగానీ పక్షులుగానీ తినకూడదు. తిన్నట్లయితే మనుషుల్లో కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె చెడిపోయే అవకాశం, ఎముకలు పెలసవుతాయి. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అందుకని మనుషులెవరూ మిడతలను తినరాదంటూ అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మనుషులు లేదా జంతువులకు ఆహారంగా మిడతలు పనికి రావని దక్షిణ కొరియాలోని యాన్‌డాంగ్ నేషనల్ యూనివర్శిటీ, పోస్ట్ డాక్టోరల్ రిసర్చర్ జూస్ట్ వాన్ ఇట్టర్ బీక్ హెచ్చరిస్తున్నారు. (మిడతలపై దాడికి చైనా ‘డక్ ఆర్మీ’) -
కోడి కొండెక్కింది
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): చికెన్ ధరలు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. పెరుగుతున్న ధరలతో కిలో చికెన్ కొనాలంటే సామాన్యుడు కళ్లు తేలేసే పరిస్థితి నెలకొంది. రికార్డు స్థాయిలో ప్రస్తుతం చికెన్ ధరలు పెరుగుతుండటం నాన్‌వెజ్ ప్రియులను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రస్తుతం నగర మార్కెట్లో మటన్ కిలో రూ.600 పలుకుతున్నా ధర నిలకడగా ఉంటోంది. కానీ చికెన్ ధరలో మాత్రం భారీ పెరుగుదల కనిపిస్తోంది. బాయిలన్ చికెన్ కిలో రూ.250 నుంచి రూ.260 వరకు ఉండగా.. లైవ్ ధర రూ.150 నమోదు చేసింది. ఫారం కోడి ధర కిలో రూ.170, శొంఠ్యాం కోడి కిలో ధర రూ.250 పలుకుతోంది. దీంతో ఈ ధరలకు సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. 4 రెట్ల పెంపు ఏప్రిల్‌లో లాక్డౌన్ ప్రారంభంలో చికెన్ ధర బాగా దిగజారింది. బాయిలర్ ధర కేవలం కిలో రూ.60 ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వినియోగదారులు చికెన్ వైపు మొగ్గు చూపకపోవడంతో ధరలు భారీగా పతనమయ్యాయి. లాక్డౌన్ ప్రారంభమైన రెండు వారాల వరకు చికెన్ ధర సాధారణ స్థాయిలోనే కొనసాగింది. రూ.60 నుంచి రూ.80, రూ.120 , రూ.160 గా ధరల్లో క్రమంగా పెరుగుదల చోటు చేసుకుంది. ఆ సమయంలో మటన్ ధర అమాంతం కిలో రూ.800కు పెరిగినా చికెన్ మాత్రం నిలకడగానే పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో పౌల్ట్రీలు సైతం ఉత్పతిన్తి భారీగా తగ్గించాయి. దీంతో కిలో రూ.160, రూ.180 మధ్య కుదురుకుంటుందని వినియోగదారులు భావించారు. అయితే మే నెల 15 నుంచి పరిస్థితిలో భారీ మార్పులు వచ్చాయి. 15 తరువాత రోజుకో విధంగా ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా చికెన్ ధర రూ.200 మార్కును దాటింది. రోజు రోజుకూ ధరలో పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం కిలో రూ.250 చేరుకొని ఆల్‌టైం రికార్డును నెలకొలి్పంది. దీంతో ధరలపై సామాన్య వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి తగ్గడం వల్లే.. కరోనా కారణంగా మాంసాహారంపై వినియోగదారులు దృష్టి సారించకపోవడంతో చికెన్ ధర రూ.60కి పడిపోయింది. ఆ సమయంలో పౌల్ట్రీలు తీవ్రంగా నష్టపోయి, ఉత్పత్తిని పెద్ద ఎత్తున తగ్గించుకున్నాయి. అన్ని పౌల్ట్రీలు నష్టనివారణ చర్యలు చేపట్టాయి. వినియోగం తగ్గడం, ఎండలు ముదరడంతో కోళ్ల పెంపకాన్ని తగ్గించాయి. దీంతో ఉత్పత్తి భారీగా తగ్గి ధరలు రోజు రోజుకు పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగే పరిస్థితి ఉంది. పౌల్ట్రీల్లో ఉత్పత్తి సాధారణ స్థాయికి చేరుకునే వరకు ధరలు తగ్గకపోవచ్చు. – సుబ్బారావు, పౌల్ట్రీ, చికెన్ వ్యాపారి -
మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ!
సాక్షి, హైదరాబాద్: కరోనాకుతోడు ఇప్పుడు దేశాన్ని భయపెడుతున్న ప్రమాదం పంటలపై మిడతల దాడి. ఈ దండు దాడి చేసిందంటే సెకన్లు, నిమిషాలు, గంటల్లోనే పంటలన్నీ ఖాళీ అయిపోతాయి. దీంతో ఏ క్షణాన మిడతలు పంటలపై దాడి చేస్తాయోనన్న భయం రాష్ట్రాలను వెంటాడుతోంది. ఇదే పరిస్థితి మనకన్నా ముందు పాకిస్తాన్‌కూ ఎదురైంది. అక్కడి ప్రభుత్వం ఈ దండయాత్రను అడ్డుకొనేందుకు రసాయనాలపై ఆధారపడగా ఓ పరిశోధన బృందం మాత్రం సమస్య పరిష్కారానికి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. నిశీధిలో ఓ వెలుగు.. పాకిస్తాన్‌లోని సింధ్, బలూచిస్తాన్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలు ఈ మిడతలను చంపేందుకు వాడిన రసాయనాల కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ జాతీయ ఆహార భద్రత పరిశోధన మంత్రిత్వశాఖలో సివిల్ సర్వెంట్‌గా పనిచేసే మహ్మద్ ఖుర్షీద్, తన స్నేహితుడు, పాక్ వ్యవసాయ పరిశోధన మండలిలో బయోటెక్నాలజిస్టుగా పనిచేసే జోహార్ అలీతో కలసి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. మిడతలపై రసాయనాలు చల్లి చంపే బదులు వాటిని సజీవంగా పట్టుకొని బ్రాయిలర్ కోళ్లకు ఆహారంగా మారిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఓ ప్రయోగం చేయాలనుకున్నారు. ఇందుకోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకారా జిల్లాలోని అటవీప్రాంత సమీపంలో ఉన్న దీపల్‌పూర్‌లో (రసాయనాలు పిచికారీ చేయని ప్రాంతం కావడంతో దీన్ని ఎంచుకున్నారు) మూడు రోజులపాటు పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. సోయాబీన్ కంటే చౌక పాకిస్తాన్లో పౌల్ట్రీ పరిశ్రమ కోళ్లకు అహారంగా సోయాబీన్‌ను ఉపయోగిస్తోంది. దాదాపు 3 లక్షల టన్నుల సోయాబీన్‌ను దిగుమతి చేసుకుని నూనె తీసిన అనంతరం వచ్చే పీచును అక్కడి కోళ్ల పరిశ్రమలో వినియోగిస్తున్నారు. ‘సోయాబీన్లో 45 శాతం ప్రోటీన్లు ఉంటే క్రిమిసంహారక మందుల ప్రభావంలేని మిడతల్లో అది 70 శాతం ఉంటుంది. కోళ్లకు పెట్టే సోయాబీన్ ఆహారం కిలో 90 రూపాయలుంటే మిడతలు ఉచితంగా వస్తున్నాయి. వాటిని పట్టుకునేందుకు ఖర్చు పెడితే చాలు. సోయాబీన్ కంటే బలవర్ధకమైన ఆహారం మా కోళ్లకు పెట్టొచ్చు’అని పాకిస్తాన్లో అతిపెద్ద పౌల్ట్రీ కంపెనీ అయిన హైటెక్ గ్రూప్ జీఎం మహ్మద్ అథర్ వెల్లడించారు. కోళ్లకే కాదు చేపలు, డెయిరీ పరిశ్రమకు కూడా ఇది ఆహారంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మిడతల్ని బస్తాలలో మూటలు గట్టిన దృశ్యం కిలో మిడతలకు 20 పాక్ రూపాయలు.. ‘మిడతలను పట్టుకోండి.. డబ్బు సంపాదించండి.. పంటలు కాపాడుకోండి’అనే నినాదంతో ఖుర్షీద్ బృందం స్థానికులను ఆకర్షించింది. కిలో మిడతలను పట్టిస్తే 20 పాక్ రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది.. రాత్రివేళ చెట్లపై సేదతీరే మిడతలను వలలతో పట్టుకొనేందుకు జనం పోటీపడ్డారు. ఒక్క రాత్రిలో ప్రజలంతా కలిపి సగటున ఏడు టన్నుల మిడతలను పట్టేసుకొని భారీగా సొమ్ము చేసుకున్నారు. ఒక్కో వ్యక్తి 20 వేల పాకిస్తానీ రూపాయలు సంపాదించారు. అంటే ఒక్కో వ్యక్తి వెయ్యి కిలోల మిడతలు పట్టుకున్నాడన్న మాట. స్థానికులు పట్టి తెచ్చిన మిడతలను ఖుర్షీద్ బృందం స్థానికంగా ఉండే కోళ్ల ఫీడ్ తయారు చేసే ప్లాంట్లకు విక్రయించింది. -
పౌల్ట్రీకి మంచి రోజులు
సాక్షి, అమరావతి: లాక్డౌన్, కరోనా వైరస్‌పై వెల్లువెత్తిన వదంతుల వల్ల తీవ్రంగా నష్టపోయిన కోళ్ల పెంపకందారులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నెమ్మదిగా కోలుకుంటున్నారు. నెల రోజుల వ్యవధిలో దెబ్బమీద దెబ్బ తగలడంతో పౌల్ట్రీ రంగం తీవ్రంగా నష్టపోయింది. కోడి మాంసం, గుడ్లు తినడం వల్ల కరోనా వ్యాపిస్తుందనే పుకార్లు పౌల్ట్రీ రంగాన్ని కుంగదీస్తే లాక్డౌన్ వల్ల దాణా, ముడిపదార్ధాలు రైతులకు సకాలంలో అందలేదు. కోళ్లు, గుడ్లను కొనేవారు లేక పౌల్ట్రీ అనుబంధ సంస్ధలు, కార్మికుల ఆర్ధిక పరిస్ధితులు ఛిన్నాభిన్నం అయ్యాయి. ఈ తరుణంలో ఒకవైపు కోవిడ్–19 నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే పౌల్ట్రీ రంగానికి చేయూత నిచ్చేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తుండటంతో గుడ్లు, మాంసం విక్రయాలు క్రమంగా పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6.6 కోట్ల గుడ్లను పెట్టే కోళ్లు, 23 కోట్ల బ్రాయిలర్ కోళ్లున్నాయి. ఏటా 1,975 కోట్ల గుడ్లు, 444 వేల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. కోడి మాంసం, గుడ్లు తినడం వలన కరోనా వైరస్ వస్తుందనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో జనవరి, ఫిబ్రవరిలో వీటి వినియోగం పూర్తిగా పడిపోయింది. ► కోడి మాంసం, గుడ్లను తినడం వలన కరోనా సోకదని ప్రచార మాధ్యమాల ద్వారా వివిధ రూపాల్లో ప్రభుత్వం అవగాహన కల్పించింది. ► అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని పిల్లలు, గర్భిణీ, మహిళలకు ఇంటికి సరఫరా చేస్తున్న రేషన్‌లో కూరగాయలకు బదులు గుడ్లను అందిస్తూ వీటి వినియోగాన్ని పెంచింది. రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో 2.80 లక్షల మంది గర్భిణీ స్త్రీలు, 3.70 లక్షల మంది బాలింతలు, 8.70 లక్షల మంది పిల్లలున్నారు. వీరందరికీ రోజుకు 2 గుడ్ల చొప్పున 30.60 లక్షల గుడ్లను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ► కోళ్లు, గుడ్ల రవాణాలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిరంతరం పనిచేసే మానిటరింగ్ వ్యవస్ధను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ► లాక్డౌన్ నేపథ్యంలో పౌల్ట్రీ పరిశ్రమల్లో పనిచేసే 1,100 మంది కార్మికులు, 165 వాహనాలకు ఇబ్బంది లేకుండా గుడ్లు, దాణా రవాణా చేసేందుకు పాస్‌ల ద్వారా అనుమతి ఇచ్చింది. ► పశు సంవర్ధకశాఖ 8500001963 నంబరుతో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 13 జిల్లాల్లో పశు సంవర్ధశాఖ జాయింట్ డైరెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించింది. -
వెరీ'గుడ్డు'
సాక్షి, అమరావతి: కోడిగుడ్డుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. కరోనా నేపథ్యంలో అపోహలతో వినియోగం తగ్గి ధరలు పడిపోవడం, తర్వాత లాక్‌డౌన్‌తో రవాణా ఆగిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన పౌల్ట్రీ రైతులు ఇప్పుడిప్పుడే ఊరట చెందుతున్నారు. కోడిమాంసం, గుడ్లు వల్ల కరోనా వైరస్ సోకదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పడం, కరోనా వైరస్ బారిన పడిన వారికి సైతం చికెన్ సూప్, గుడ్డు ఇవ్వొచ్చని కేంద్రప్రభుత్వ పశు సంవర్థక శాఖ అడ్వయిజరీ ప్రకటించడంతో అపోహలు తొలగిపోయాయి. అలాగే లాక్డౌన్ నుంచి కోడిగుడ్లను మినహాయించి నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చడం వల్ల నాలుగైదు రోజులుగా రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతున్నాయి. దీంతో ధరలు మళ్లీ పుంజుకున్నాయి. మంగళవారం మార్కెట్ ధరలతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ఇబ్బందులు ఇలా... ► కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడో వంతు ఇతర రాష్ట్రానికి ఎగుమతి చేయాలి. ► కరోనా నేపథ్యంలో స్థానిక వినియోగం తగ్గడంతో గుడ్లు మిగిలిపోవడం మొదలైంది. ఆ వెనువెంటనే వెలువడిన లాక్‌డౌన్‌తో ఎగుమతులపైనా ప్రభావం పడింది. ► ఎండ పడకపోతే 15 రోజుల వరకు గుడ్లను నిల్వ చేయవచ్చు. ఎండ పడితే వారానికే మురిగిపోతాయి. ► ఒక దశలో ఒక్కో గుడ్డును రూపాయిన్నరకు కూడా కొనే పరిస్థితి లేకపోయింది. ఫలితంగా నష్టాలు తీవ్రమయ్యాయి. లాక్డౌన్ నుంచి మినహాయింపుతో.. ► జిల్లాల సరిహద్దుల వద్ద, చెక్‌పోస్టుల వద్ద కోడిగుడ్ల వాహనాలను ప్రస్తుతం ఆపడం లేదు. స్థానిక మార్కెట్లకు తరలించుకునే అవకాశం వచ్చింది. ► అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద సైతం తనిఖీ చేసి పంపిస్తున్నారు. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం తదితర రాష్ట్రాలకు మళ్లీ రవాణా ఊపందుకుంది. ► లాక్డౌన్ ప్రారంభంలో మాదిరిగా రెండు మూడు రోజులు చెక్‌పోస్టుల వద్ద ఆగిపోయే పరిస్థితి ఇప్పుడు లేదు. -
కోడిని తింటే ‘కోవిడ్’ రాదు..
సాక్షి, అమరావతి బ్యూరో: కోడి మాంసం తింటే కరోనా (కోవిడ్) వైరస్ రాదని పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. దీనిపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించింది. కరోనా వైరస్ ప్రచారంతో ఆందోళన చెందిన మాంసంప్రియులు చికెన్ తినడం భారీగా తగ్గించేశారు. దీంతో ధరలు పాతాళానికి పడిపోయి కోళ్ల పరిశ్రమ కకావికలమైపోతోంది. ఈ పరిశ్రమ యజమానులు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. దీంతో పశుసంవర్ధక శాఖ స్పందించింది.. - కోడి మాంసం, కోడిగుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ సోకదన్న విషయం శాస్త్రీయంగా నిరూపణ అయిందని.. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ శాఖ సిబ్బందికి ఆదేశాలిచ్చింది. - పౌల్ట్రీ ఫెడరేషన్ల సహకారంతో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు.. ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్లు, సంబంధిత అధికారులకు సూచించింది. - పుకార్ల కారణంగా కోళ్ల సంఖ్య తగ్గిపోయి భవిష్యత్తులో చికెన్, కోడిగుడ్ల ధరలు అమాంతంగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది. - కోళ్ల దాణాలో వాడే ముడి సరకులైన మొక్కజొన్న, సోయాల ధరలు దెబ్బతిని రైతులూ నష్టపోయే అవకాశం ఉంది. -
అలా పెరిగే కోళ్లతో డేంజర్
సాక్షి, న్యూఢిల్లీ : కోళ్ల పరిశ్రమలో లాభాపేక్ష కొక్కరొకో! అంటోంది. స్వల్ప కాల వ్యవధిలో అధిక లాభాలను ఆర్జించాలనే అత్యాశతో కొందరు కోళ్ల పెంపకం దారులు పెడదారులు తొక్కుతున్నారు. జన్యుపరమైన ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా 50, 60 రోజుల్లో పెరగాల్సిన కోడి పిల్లలను 35 రోజుల్లో పెరిగేలా చేస్తున్నారు. పర్యవసానంగా కోళ్ల కాళ్లు, గుండె, ఊపిరితిత్తులు తగిన రీతిలో ఎదగకుండా దెబ్బతింటున్నాయి. వీటివల్ల కోళ్లలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మరణం సంభవించకపోయిన కోళ్ల కాళ్లల్లో కురుపులు వస్తున్నాయి. వాటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలా అనవసరంగా కోళ్లను వేగంగా పెరగనిచ్చి వాటిని కొంత చౌక ధరలకు విక్రయిస్తుండడం వల్ల వాటినే కొనుగోలు చేసేందుకు రెస్టారెంట్లు, హోటళ్లు ప్రాధాన్యతనిస్తున్నాయని, ప్రస్తుతం లండన్ మార్కెట్లో ఇదే జరుగుతోందని ‘రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ (ఆర్ఎస్పీసీఏ)’ వెల్లడించింది. ‘వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్’, ‘ఫామ్ యానిమల్ వెల్ఫేర్ ఫోరమ్’లతో కలిసి అతి వేగంగా పెంచుతున్న మూడు రకాల కోళ్ల బ్రీడింగ్‌పై ఆర్ఎస్పీసీఏ అధ్యయనం జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1950లో కోడి పిల్లలు కోతకొచ్చే కోళ్లుగా ఎదిగేందుకు 70 రోజులు పట్టగా ప్రస్తుతం 35 రోజుల్లో ఆ స్థాయికి జన్యు ఇంజెక్షన్ల ద్వారా పెంచేసి విక్రయిస్తున్నారని ఆ చారిటీ సంస్థ తెలియజేసింది. ఇలాంటి కోళ్ల కొనుగోలుకు దూరంగా ఉండాలంటూ తామిచ్చిన పిలుపునకు కెఎఫ్సీ, మార్క్స్ అండ్ స్పెన్సర్, వెయిట్రోస్ సంస్థలు సానుకూలంగా స్పందించినట్లు ఆ చారిటీ సంస్థ తెలియజేసింది. ఇలా అతి వేగంగా పెంచుతున్న కోళ్లు అనారోగ్యం బారిన పడి చనిపోయే అవకాశం సాధారణంకన్నా రెట్టింపు ఉంటోందని అధ్యయనంలో తేలింది. వీటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎంత హానికరమన్న విషయంలో ఈ అధ్యయనం జరగలేదని, ఇలా వేగంగా పెంచడం వల్ల కోళ్లు ఎంత నరక యాతన అనుభవించాల్సి వస్తోందన్న విషయంలోనే ఈ అధ్యయనం కొనసాగిందని అధ్యయన సంస్థ పేర్కొంది. ఇలా జన్యుపరంగా వేగంగా పెంచిన కోళ్లు అనారోగ్యం, అనవసరమైన బాధతోని అర్ధాయుషు మాత్రమే బతుకుతున్నాయని వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ బ్రిటన్ చీఫ్ జేమ్స్ మాక్కోల్ ఆందోళన వ్యక్తం చేశారు.