సంక్షేమం, సాగునీరు, బ్రాండ్ హైదరాబాద్
ఇవే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రాధాన్యతలు!
- హైదరాబాద్-వరంగల్ మార్గంలో ప్రత్యేక కారిడార్
- ఫార్మా, పౌల్ట్రీ, టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ర్టంలో సంక్షేమం, సాగునీరు, బ్రాండ్ హైదరాబాద్ అంశాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాష్ట్ర జనాభాలో 85 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలే ఉన్నందున వారి కోసం సంక్షేమ శాఖలను తన వద్దే పెట్టుకున్నట్లు కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం అసెంబ్లీ లాబీలో కేసీఆర్ సన్నిహిత మంత్రి ఒకరు మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటిస్తూ ముఖ్యమంత్రి విజన్‌ను వివరించారు. ‘ఉద్యమాలు ముగిశాయి. ఇక కేసీఆర్ తన దృష్టిని పూర్తిగా తెలంగాణ అభివృద్ధిపైనే కేంద్రీకరించారు.
చంద్రబాబు మాదిరిగా ప్రచారం పొందాలని చూడటం లేదు. సాగునీరు, సంక్షేమం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు’ అని ఆయన చెప్పారు. ‘తమిళనాడు తరహాలో పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలను అందించాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తానంటున్నారు. 125 గజాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు’ అని పేర్కొన్నారు.
కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఏఐబీపీ నిధులను తెచ్చుకుని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తెలంగాణలో చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్-వరంగల్ హైవేలో ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసి ఫార్మా, టూరిజం, పౌల్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ రహదారి పొడవునా 36 ఫార్మా కళాశాలలు, వందలాది పౌల్ట్రీ ఫారాలతోపాటు ప్రస్తుతమున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సదరు మంత్రి వెల్లడించారు.