![Poultry farmers facing losses from bird flu](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/chicks.jpg.webp?itok=FL0YjIr7)
బర్డ్ ఫ్లూతో లక్షలాది కోళ్లు మృత్యువాత
నష్టాల్లో కూరుకుపోతున్న పౌల్ట్రీ రైతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పౌల్ట్రీ రంగం గుడ్లు తేలేస్తోంది. జనవరి మొదటి వారంలోనే పెద్ద సంఖ్యలో నాటు కోళ్లు, పందెం కోళ్ల మరణాలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ఏపీ సరిహద్దులోని ఖమ్మం జిల్లాతో పాటు.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనవరి మూడో వారంలో ఒకేసారి లక్షల సంఖ్యలో కోళ్ల మరణాలు సంభవించాయి.
ఇందుకు కారణాలను అన్వేషించకుండా, ఈ మరణాలన్నీ చలికాలం వల్లే సంభవిస్తున్నాయని, ఉష్ణోగ్రతలు పెరిగితే ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభుత్వం కొట్టిపారేసింది. అదే సమయంలో కోళ్లు గుడ్లు తేలేస్తున్నాయంటూ ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగానే ఆగమేఘాల మీద ఆయా పౌల్ట్రీ ఫారాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షకు భోపాల్ పంపారు.
ఈ నెల 10న వచ్చిన రిపోర్టులో ఈ మరణాలకు కారణం బర్డ్ ఫ్లూ అని తేలడంతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేసి జీవభద్రతా చర్యలు చేపట్టింది. ముందుగానే స్పందించి ఉంటే తామిలా నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉండే వారం కాదని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సైబీరియన్ పక్షులపై నెపం!
దాదాపు 40 లక్షల కోళ్లు మృత్యువాత పడినట్టుగా పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. అయితే ఐదున్నర లక్షల కోళ్లు మాత్రమే చనిపోయాయని అధికార యంత్రాంగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ భయోందోళన వల్ల రోజువారీ చికెన్, గుడ్ల వినియోగం పడిపోయింది. ఎగుమతులు తగ్గిపోయాయి. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల పంపిణీని సైతం నిలిపివేశారు.
చాలా వరకు చికెన్ షాపులు మూతపడ్డాయి. హోటళ్లలో, ఇళ్లలో చికెన్ వంటకాలపై వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. వెరసి ఫౌల్ట్రీ రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సైబీరియన్ పక్షులపై నెపం మోపుతుండటం గమనార్హం. విదేశాల నుంచి ఈ పక్షులు వలస వచ్చినందునే బర్డ్ ఫ్లూ ప్రబలిందని ప్రభుత్వం కుంటి సాకులు చెబుతుండటాన్ని ఆ రంగం నిపుణులు తప్పు పడుతున్నారు. అలాగైతే ఈ పక్షులు ప్రతి సంవత్సరం వలస రావడం మామూలేనని, ఈ లెక్కన ప్రతి ఏటా బర్డ్ ఫ్లూ వచ్చిందా.. అని నిలదీస్తున్నారు.
శాస్త్రీయ అధ్యయనం లేకుండా సైబీరియన్ పక్షులను సాకుగా చూపి ప్రభుత్వం తప్పుకుంటుండటం సరికాదంటున్నారు. పౌల్ట్రీ మార్కెట్ పడిపోకుండా ఎలాంటి చర్యలకు ఉపక్రమించక పోవడం చర్చనీయాంశమైంది. చికెన్, గుడ్లు బాగా ఉడికించి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ఓ వైపు చెబుతూనే.. మరోవైపు విద్యా సంస్థలకు ప్రభుత్వమే గుడ్ల సరఫరా బంద్ చేయించడం గమనార్హం.
పర్యవేక్షణకు కాల్‌సెంటర్
బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి ప్రజలు, కోళ్ల పెంపకదారుల కోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్టు పశుసంవర్థకశాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదరనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 0866–2472543, 9491168699 ఫోన్ నంబర్లతో ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కాల్ సెంటర్ ద్వారా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు.
ఎగుమతులపై తీవ్ర ప్రభావం
‘బర్డ్ ఫ్లూ’ పూర్తిగా తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ మరో వైపు వేగంగా జిల్లాలు దాటి విస్తరిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల అమ్మకాలు, ఎగుమతులు అనూహ్యంగా పడిపోయాయి. దాదాపు 50–60 శాతం మేర అమ్మకాలు పడిపోవడంతో ధరలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి.
ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలతో పాటు విదేశాలకు కోడి గుడ్ల ఎగుమతులపై బర్డ్ ఫ్లూ తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో 1200కు పైగా కోళ్ల ఫారాలు ఉండగా, వాటిలో 5.60 కోట్లకు పైగా కోళ్లున్నాయి. వెయ్యికి పైగా ఫారాలు ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, ప్రస్తుతం రోజుకు 4.75 కోట్ల గుడ్లకు మించి ఉత్పత్తి జరగడం లేదు.
రాష్ట్ర పరిధిలో 2.50 కోట్ల నుంచి 3 కోట్ల గుడ్లు వినియోగమవుతున్నాయి. మిగిలిన గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, అసోం, మణిపూర్ తదితర రాష్ట్రాలతో పాటు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. గతేడాది కురిసిన వర్షాలు, వరదలతో దాదాపు 2 లక్షల కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఆ సమయంలోనే క్రానిక్ రెస్పటరీ డిసీజ్, ఇన్ఫెక్షన్ బ్రాంకటైస్, కొక్కెర తెగుళ్లు విజృంభించాయి. దీనికి తోడు ఈ ఏడాది సకాలంలో కోళ్లకు వ్యాక్సినేషన్ వెయ్యలేదనే విమర్శలు కూడా విన్పించాయి.
Comments
Please login to add a commentAdd a comment