ఆందోళన అక్కర్లేదు | Bird flu is extremely rare in humans | Sakshi
Sakshi News home page

ఆందోళన అక్కర్లేదు

Feb 14 2025 5:31 AM | Updated on Feb 14 2025 5:31 AM

Bird flu is extremely rare in humans

మనుషులకు అత్యంత అరుదుగా బర్డ్‌ ఫ్లూ.. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరికీ సోకలేదు

జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోళ్లకు ఏవియన్‌ ఇన్‌­ఫ్లూయెంజా (హెచ్‌5ఎన్‌1–బర్డ్‌ ఫ్లూ) వేగంగా సోకు­తోంది. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్‌ ఫ్లూ సోకిందనే వార్త గురువారం కలకలం రేపింది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు మనుషులకు బర్డ్‌ ఫ్లూ నమోదైన ఘటనలు చోటు చేసుకోలేదని వైద్య శాఖ స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. 

పక్షుల నుంచి మను­షులకు బర్డ్‌ ఫ్లూ సోకే అవకాశం అత్యంత అరుదుగా ఉంటుందని స్పష్టం చేశారు. వ్యాధి బారినపడిన పక్షులకు దగ్గరగా ఉండే వ్యక్తులకు అరుదుగా ఈ వైరస్‌ సోకే అవకాశం ఉంటుందని, మనుషుల నుంచి మనుషులకు సోకిన సందర్భాలు లేవన్నారు. ఇక మనుషుల్లో బర్డ్‌ ఫ్లూ ఔట్‌ బ్రేక్స్‌ ఇప్పటి వరకూ సంభవించలేదని తెలిపారు. మనుషులకు వ్యాధి సోకినట్లైతే జ్వరం, దగ్గు, గొంతు మంట, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయన్నారు. 

ఈ వ్యాధి నుంచి రక్షణ కోసం పౌల్ట్రీ ఉత్పత్తులను బాగా ఉడికించిన తర్వాతే ఆహారంగా తీసుకోవాలని, వ్యాధి బారిన­పడిన కోళ్లు, జంతువులకు దూరంగా ఉండాలని వైద్య శాఖ సూచిస్తోంది. ఈ తరహా కేసులు వ్యక్తుల్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో వెలుగు చూడలేదు. గత పదేళ్లలో దేశ వ్యాప్తంగా రెండు హెచ్‌5ఎన్‌1, రెండు హెచ్‌9ఎన్‌2 కేసులు వెలుగు చూశాయి. 2019లో మహారాష్ట్రలో ఒకటి, 2021 జూలైలో హర్యానాలో ఒకటి, గతేడాది ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున రెండు కేసులు నమోదయ్యాయి. 

2003 నుంచి 2023 వరకు పశ్చిమ పసిఫిక్‌లో 248 కేసులు నమో­దయ్యాయి. ప్రపంచ వ్యా­ప్తంగా గత ఏడాదిలో 60 కేసులు నమోదైనట్లు వెల్లడైంది. కర్నూలు జిల్లాలో 15 బాతులు మృతి చెందగా..వాటికి   బర్డ్‌ ఫ్లూ లేదని అధికారులు నిర్థారించారు. తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదా­వరి, ఎన్టీ­ఆర్‌ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ కారణంగా కో­ళ్లు మృత్యువాత పడ్డాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా జిల్లాల్లోని కోళ్ల ఫారాల్లో పని చేసే సిబ్బందిని వైద్య శాఖ స్క్రీనింగ్‌ చేస్తోంది. 

బుధవారం నా­టికి 584 మందిని స్క్రీనింగ్‌ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 18 మంది నుంచి న­మూ­నాలు సేకరించి కాకినాడ రంగరాయ కళా­శాలలో పరీక్షించగా నెగిటి­వ్‌గా నిర్ధా­రణ అ­యింది. మరోవైపు విజయవాడ, కర్నూ­లు, విశా­ఖ బోధనాస్పత్రుల్లో 10 పడకల ఐసో­లేషన్‌ వార్డులను అందుబాటులో ఉంచారు. 

మార్గదర్శకాలు పాటించాలి
రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్లకు వ్యాపించిన బర్డ్‌ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ స్పష్టం చేశారు. గురువారం ఆయన రాష్ట్ర సచివాలయం నుంచి పశు సంవర్థక, వైద్య ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

వ్యాధి నివార­ణకు తీసుకోవాల్సిన చర్యలు, చనిపో­యిన కోళ్లను సక్రమంగా పూడ్చి పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కలెక్టర్లు, పశు సంవర్థక శాఖల అధికారులకు స్పష్టమైన ఆదే­శాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్టాండర్డ్‌ ప్రొటోకాల్‌ మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటిని పాటించాలన్నారు. వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిని రెడ్‌ జోన్‌గా ప్రకటించి, అక్కడికి రాకపోకలను, దాణా రవాణాను నియంత్రించాలని స్పష్టం చే­శా­రు. 

ఒకటి నుంచి తొమ్మిది కిలోమీటర్ల పరిధి­లో ముందు జాగ్రత్తలు చేపట్టా­లని, పశు సంవర్థక శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిం­చాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రసార మాధ్య­మా­ల్లో ఏవైనా తప్పుడు వార్తలు వస్తే ఆందోళన చెందొద్దని, అలాంటి వార్తలు ప్రసా­రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. 

బర్డ్‌ ప్లూ సోకిన ఏలూరు జిల్లా బాదంపూడి, పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరు, కానూరు, ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం ప్రాంతాల్లోని 5 ఫౌల్ట్రీల్లో చేపట్టిన చర్యలపై ఆయన ఆరా తీశారు. ఢిల్లీ నుండి కేంద్ర పశు సంవర్ధక శాఖ కమిషనర్‌ డా.అమిత్‌ మిత్రా మాట్లాడు­తూ సరే కోళ్ల ఫారాలను తప్పనిసరిగా రిజిష్టర్‌ చేయించాలని చెప్పారు. కాగా, ఏలూరు జిల్లా బాదంపూడిలో బర్డ్‌ఫ్లూ వల్ల ఎవరూ మరణించలేదని కలెక్టర్‌ ప్రకటించారు. 

రాష్ట్రానికి కేంద్ర బృందాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ తీవ్రతపై అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు వచ్చాయని మంత్రి కె.అచ్చెన్నా­­యుడు తెలిపారు. కేంద్ర పశు సంవర్థక శాఖ జాయింట్‌ సెక్రటరీ కూడా శుక్రవా­రం రాష్ట్రానికి వస్తారని చెప్పారు. గురు­వా­రం ఆయన సచివా­లయంలో మీడియాతో మాట్లాడుతూ బర్డ్‌ ఫ్లూ నియంత్రణకు పటిష్ట­మైన చర్యలు చేపట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement