కోలుకోని కోడి | Chicken sales fail to recover despite Redzones withdrawal | Sakshi
Sakshi News home page

కోలుకోని కోడి

Published Sun, Mar 9 2025 5:42 AM | Last Updated on Sun, Mar 9 2025 9:19 AM

Chicken sales fail to recover despite Redzones withdrawal

రెడ్‌జోన్స్‌ ఉపసంహరించినా పుంజుకోని అమ్మకాలు

కుదేలుఅవుతున్న పౌల్ట్రీ పరిశ్రమ

కొత్త బ్యాచ్‌లు పెట్టేందుకు రైతులు వెనుకడుగు

75 రోజులు దాటినా ఫామ్స్‌లోనే కోళ్లు

ఫామ్‌ గేటు వద్ద కిలో రూ.60కి కూడా కొనుగోలు చేయని పరిస్థితి

బర్డ్‌ ఫ్లూతో చనిపోయినకోళ్ల పరిహారం ఊసెత్తని ప్రభుత్వం

బర్డ్‌ ఫ్లూ దెబ్బకు కోళ్ల పరిశ్రమ కుదేలవుతోంది. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వైరస్‌ల ఉధృతి దాదాపు తగ్గుముఖం పట్టింది. బర్డ్‌ ఫ్లూ వైరస్‌ గుర్తించిన ప్రాంతాల్లో రెడ్‌ జోన్‌ సహా ప్రభుత్వ హెచ్చరికలన్నీ ఉపసంహరించారు. పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా అమ్మకాలు ఏమాత్రం ఊపందుకోకపోవడంతో పౌల్ట్రీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. – సాక్షి, అమరావతి

పరిశ్రమకు దెబ్బ మీద దెబ్బ
రాష్ట్రంలో 1200కు పైగా కోళ్లఫామ్‌లు ఉండగా.. వాటిలో 5.60 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయి. వెయ్యికి పైగా ఫామ్‌లు ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుతం రోజుకు 4.50 కోట్ల గుడ్లకు మించి ఉత్పత్తి జరగడం లేదు. రాష్ట్ర పరిధిలో సుమారు 3 కోట్ల గుడ్లు వినియోగమవుతుండగా, మిగిలినవి పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, అస్సాం, మణిపూర్‌ తదితర రాష్ట్రా­లతో పాటు గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. 

గతేడాది కురిసిన వర్షాలు, వరదలతో దాదాపు 2 లక్షల కోళ్లు మృత్యువాతపడగా, కేవలం 3,489 కోళ్లకు మాత్రమే రూ.100 చొప్పున పరిహారం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మరోవైపు భారీగా పెరిగిన మేత ఖర్చులతో పెద్దఎత్తున కోళ్లపామ్‌లు మూతప­డ్డాయి. దీంతో గుడ్ల ఉత్పత్తి 40–50 శాతం మేర తగ్గిపోయింది.

బర్డ్‌ ప్లూతో అదనపు భారం
ఈ తరుణంలో బర్డ్‌ ఫ్లూ మహమ్మారి పౌల్ట్రీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసింది. ఒక్కసారిగా లక్షలాది కోళ్లు కళ్లెదుటే మృత్యు వాతపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 30 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్టు పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతుండగా, అధికార యంత్రాంగం మాత్రం 5.50 లక్షల కోళ్లు మాత్రమే మృత్యువాత పడ్డాయని తేల్చింది. 

మరోపక్క రెడ్‌ జోన్‌ పరిధిలో 30కుపైగా ఫామ్స్‌ మూసివేసి వాటిలో ఉండే సుమారు 6.60 లక్షలకు పైగా కోళ్లను చంపి పాతిపెట్టారు. లక్షల సంఖ్యలో కోడిగుడ్లను ధ్వంసం చేశారు. రెడ్‌ జోన్ల పరి«ధిలో వైరస్‌ ప్రభావం లేనప్పటికీ వ్యాక్సినేషన్, శానిటేషన్‌ కోసం ప్రతీ రైతుకు రూ.5–10 లక్షల వరకు భారం పడింది. వైరస్‌ ప్రభావంతో చనిపోయిన, చంపిన కోళ్లకు పరిహారం చెల్లించి ఆదుకోవాలన్న రైతుల అభ్యర్థనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

కొత్త బ్యాచ్‌లు పెట్టేందుకు సాహసించని రైతులు
ప్రస్తుత పరిస్థితుల కారణంగా పౌల్ట్రీ ఫామ్స్‌లో కొత్త బ్యాచ్‌లు పెట్టేందుకు రైతులు ఏమాత్రం సాహసించడం లేదు. సాధారణంగా 40–45 రోజుల వయసులో బ్రాయిలర్‌ కోళ్లను కంపెనీలతోపాటు రిటైలర్స్‌ కొంటారు. ప్రస్తుతం ఫామ్‌లలో ఏకంగా 60–75 రోజుల వయసున్న కోళ్లు పేరుకుపోయాయి. 

సాధారణంగా ఫామ్‌ వద్ద కేజీన్నర నుంచి రెండు కేజీల మధ్య ఉండే కోళ్లు ప్రస్తుతం 3–4 కేజీల వరకు పెరిగిపోతున్నాయి. దాదాపు ప్రతి జిల్లాల్లోనూ 30 లక్షలకు పైగా కోళ్లు ఉన్నట్టు చెబుతున్నారు. ఫామ్‌ వద్ద లైవ్‌ బర్డ్‌ రూ.75–రూ.80 ధర ప్రకటిస్తున్నప్పటికీ కొనే వారులేక ప్రకటిత ధరపై కనీసం రూ.20–రూ.25 తగ్గించి ఇచ్చేస్తున్నారు.

ఆంక్షలు సడలించినా ఊపందుకోని అమ్మకాలు
ఫిబ్రవరి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వైరస్‌ల ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వ హెచ్చరికలన్నీ తొలగించారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల పంపిణీపై విధించిన ఆంక్షలను ఎత్తివేశారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులపై ఆంక్షలు పూర్తిగా సడలించారు. 

వైరస్‌ ప్రభావం ఏమాత్రం లేదని అధికారులు ప్రకటించినప్పటికీ ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగడం లేదు. నెక్, పౌల్ట్రీ యజమానుల సంఘం సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా చికెన్‌ మేళాలు పెడుతున్నప్పటికీ అమ్మకాలు మాత్రం ఊపందుకోవడం లేదు. 

ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అమ్మకాలు ఘోరంగా పడిపోయాయని చెబుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్‌ వంటకాల పట్ల ఆసక్తి చూపడం లేదు. ఫంక్షన్లలో సైతం చికెన్‌ వంటకాలు వడ్డించడం లేదు. మంగళ, ఆదివారాలలో సైతం 30–40 శాతానికి మించి కోళ్లు అమ్ముడుపోవడం లేదు. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో కిలో బ్రాయిలర్‌ మాంసం రూ.170–రూ.200 మ«ధ్య ధర పలుకుతోంది. 20 శాతం నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్‌ బోర్డులు పెట్టినా కొనడం లేదని చికెన్‌ షాపు నిర్వాహకులు చెబుతున్నారు.

ఇది కోలుకోలేని దెబ్బ
బర్డ్‌ ఫ్లూ దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు. వైరస్‌ ప్రభావం పూర్తిగా తగ్గిననప్పటికీ ప్రజల్లో భయాందోళనలు మాత్రం పోవడం లేదు. చికెన్‌ మేళాలు నిర్వహిస్తున్నా అమ్మకాలు పుంజుకోవడం లేదు. గత సీజన్‌లో ఇదే నెలలో అమ్ముడైన కోళ్లలో సగం అమ్మకాలు కూడా ఈ ఏడాది జరగలేదు. ఫామ్స్‌లో లక్షలాది కోళ్లు అమ్ముడుపోక పేరుకుపోతున్నాయి. ఎండల తీవ్రత పెరిగితే కోళ్ల ఉత్పత్తి తగ్గి పోతుంది. ఆగస్టు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం.     – గడ్డం బుచ్చారావు, అధ్యక్షుడు, కృష్ణా జిల్లా బ్రాయిలర్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌

పుంజుకోవడానికి టైం పడుతుంది
బర్డ్‌ ఫ్లూ ప్రభావం పరిశ్రమపై తీవ్రంగా పడింది. ఎగుమతులకు ఇబ్బంది లేకపోయినా స్థానిక వినియోగం తగ్గింది. ఫామ్‌ గేటు వద్ద గతేడాది ఇదే సమయానికి కోడిగుడ్ల ధర రూ.5కుపైగా ఉంది. ఈ ఏడాది ఫామ్‌ గేటువద్దే రూ.3.80–రూ.3.90కు మించి కొనడం లేదు. ఆర్థిక భారమైనా చికెన్‌ మేళాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల్లో భయాందోళనలు పోవడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా చేయూతనివ్వాలి. – తుమ్మల కుటుంబరావు,  నెక్‌ మాజీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement