
రోడ్డున పడుతున్న వేలాది మంది పౌల్ట్రీ కార్మికులు.. రెడ్, అలెర్ట్ జోన్ పరిధిలో మూతపడిన ఫారాలు
దిక్కుతోచక స్వస్థలాలకు వెళ్లిపోతున్న కార్మికులు
15–20 వేల కుటుంబాలపై తీవ్ర ప్రభావం
వివిధ రాష్ట్రాల్లో ప్రోత్సాహకాలు ఇస్తున్న ఆయా ప్రభుత్వాలు
ఏపీలో మాత్రం పౌల్ట్రీ పరిశ్రమను పట్టించుకోని టీడీపీ కూటమి సర్కారు
సాక్షి, అమరావతి: ‘బర్డ్‌ఫ్లూ’ వ్యాధి పౌల్ట్రీ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోంది. వేలాది కార్మికుల కుటుంబాలు జీవనోపాధిలేక రోడ్డున పడ్డాయి. ఈ వ్యాధి ప్రభావంతో లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడడంతో పెద్ద సంఖ్యలో పౌల్ట్రీ ఫారాలు మూతపడే పరిస్థితి ఏర్పడింది.
ఐదు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం..
రాష్ట్రంలో 1,200కు పైగా పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి. ఇందులో వెయ్యికి పైగా ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనే ఉన్నాయి. వీటిల్లో 5.60 కోట్ల కోళ్లున్నాయి. ప్రతిరోజూ 4.75 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. ప్రతి ఫామ్‌లోనూ 10–25 మంది ఉపాధి పొందుతుంటారు. వీరంతా ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారే. వీరు ఫామ్స్ వద్దే ఉంటూ వాటి నిర్వహణను చూసుకుంటుంటారు.
పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, ఏలూరు జిల్లా బాదంపూడి, ఎన్జీఆర్ జిల్లా గంపలగూడెంతో పాటు కర్నూలు జిల్లా ఎన్‌ఆర్ పేటలలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకి లక్షలాది కోళ్లు, బాతులు మృత్యువాతపడ్డాయి. ఈ ఐదు గ్రామాల్లోని కోళ్ల ఫారాల పరిధిలో కిలోమీటరు ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా.. 10 కి.మీ. వరకు అలెర్ట్ జోన్‌గా ప్రకటించారు.
రెడ్‌జోన్ పరిధిలో సుమారు 30కి పైగా ఫామ్స్ మూసివేసి వాటిలో ఉండే సుమారు ఆరున్నర లక్షలకు పైగా కోళ్లను చంపి పాతిపెట్టేశారు. లక్షల సంఖ్యలో కోడిగుడ్లను కూడా ధ్వంసం చేశారు. పది కిలోమీటర్ల పరిధిలో కూడా పదుల సంఖ్యలో కోళ్ల ఫారాలను మూసివేశారు. అలాగే, సరై్వలెన్స్ జోన్ పెట్టి 24 గంటలూ వాటిల్లోని కోళ్ల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షిస్తున్నారు.
వివక్షకు గురవుతున్న కార్మికులు..
ఇక బర్డ్ ఫ్లూ ప్రభావం రెడ్, అలెర్ట్ జోన్ పరిధిలోని సుమారు 10–15 వేల మంది కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెడ్ జోన్‌లో ఉన్న పౌల్ట్రీ ఫామ్స్‌లో పనిచేసే కార్మికుల రక్తనమూనాలు సేకరిస్తుండడంతో చుట్టుపక్కల ప్రజలు వారిని దూరంపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. వీరిలో ఏ ఒక్కరికీ వైరస్ లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించినప్పటికీ వివక్షకు గురవుతున్నారు.
అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారిని ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోవాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో.. చేసేదిలేక కొందరు బంధువుల ఇళ్లకు వెళ్లిపోతుండగా, పొరుగు జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు తిరుగుముఖం పడుతున్నారు.
ప్రోత్సాహమివ్వని ఏపీ సర్కారు..
ఇదిలా ఉంటే.. బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగుచూసిన జిల్లాల్లో రెడ్, అలెర్ట్ జోన్ పరిధిలోని పౌల్ట్రీ ఫారాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కార్మికుల్లేక వెలవెలబోతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో.. మేత ధరలు అమాంతం పెరిగిపోవడంతో అవి 75 శాతం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయి. మరోపక్క.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఏపీ నుంచి వచ్చే గుడ్డుకు ధరలేకుండా చేస్తున్నారు.
యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కోళ్ల ఫారాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుండగా ఏపీలో మాత్రం ప్రభుత్వం తీరు పౌల్ట్రీ పరిశ్రమకు శాపంగా తయారైంది. దీంతో రాష్ట్రంలో ఈ రంగం మరింత కుదేలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment