Poultry Industry
-
వేడికి ‘కోడి’ విలవిల!
సాక్షి, భీమవరం: మండుతున్న ఎండలు పౌల్ట్రీ పరిశ్రమకు గుబులు పుట్టిస్తున్నాయి. వేడిగాలులకు తాళలేక ఫారాల వద్ద వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం కోళ్ల రైతులను కలవరపరుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోట్లలో నష్టం వాటిల్లి పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కోస్తాలోని ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుడ్లు పెట్టే లేయర్ కోళ్లు నాలుగు కోట్ల వరకు ఉండగా, ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయలసీమలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కోటి వరకూ ఉన్నాయి. గుడ్లు పెట్టే దశకు చేరువలోని బ్రోయర్, చిక్స్ మూడు కోట్ల వరకు ఉంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో సాధారణంగా రోజుకు 60 నుంచి 80 కోళ్లు వరకు చనిపోతుంటాయి. ప్రస్తుతం ఈ మరణాల సంఖ్య 450 నుంచి 500 వరకు చేరింది. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకూ తట్టుకుంటాయి. గత మూడు రోజులుగా 40 డిగ్రీలకు పైబడి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడిగాలుల ప్రభావంతో ముందెన్నడూ లేనంతగా ఈ ఏడాది కోళ్ల మరణాలు పెరిగాయి. కోస్తా ప్రాంతంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. ఒక కోడి చనిపోవడం వల్ల రూ.250 వరకు నష్టం వాటిల్లుతుంది.. ఈ మేరకు గత మూడు రోజుల్లో రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల కోళ్లు చనిపోగా పరిశ్రమకు రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. పడిపోయిన గుడ్ల ఉత్పత్తి ఎండల తీవ్రత వల్ల గుడ్ల ఉత్పత్తి 15 శాతం మేర తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజుకు 4.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా వడగాలుల తీవ్రతకు ఆ ఉత్పత్తి 3.49 కోట్లకు తగ్గిపోయింది. డ్రాపింగ్ కారణంగా రోజుకు 61.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గుడ్డు రైతు ధర రూ.4.85 ఉండగా.. రోజుకు రూ.2.98 కోట్ల చొప్పున మూడు రోజుల్లో రూ.8.95 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లకు ఉపశమన చర్యలతో ఖర్చులు పెరిగిపోయాయి.వడదెబ్బకు గురికాకుండా కోళ్లకు ప్రత్యేక మందులివ్వడం, ఫారాల్లో వాతావరణాన్ని చల్లబర్చేందుకు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు.. పెరిగిన మేత ధరలు, కూలి రేట్లతో నిర్వహణ భారం మారిందని కోళ్ల రైతులంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు గుడ్డు సరఫరా లేక స్థానిక వినియోగం తగ్గి గుడ్డుకు రైతు ధర పతనమవుతోందని చెబుతున్నారు.ప్రభుత్వం ఆదుకోవాలి.. ఎప్పుడూ లేనంతగా ఈసారి ఎండల తీవ్రతకు కోళ్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రభుత్వం ఆదుకోకుంటే కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుంది. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయిస్ గోదాముల్లోని మనుషులు తినడానికి పనికిరాకుండా నిల్వ ఉన్న గోధుమలు, మొక్కజొన్న, నూకలను తక్కువ ధరపై కోళ్ల రైతులకు ప్రభుత్వం అందజేయాలి. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
Chicken: చికెన్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు
ఖమ్మం: చికెన్‌కు డిమాండ్ పెరిగింది. నిన్న, మొన్నటి వరకు కిలో రూ.220 నుంచి రూ.250 వరకు ఉన్న చికెన్ ధర ఆదివారానికి ఒక్కసారిగా పెరిగింది. ప్రాంతం, డిమాండ్ ఆధారంగా కిలో చికెన్ రూ.300 పైగానే విక్రయిస్తున్నారు. ఓ వైపు పండుగలు, మరో వైపు శుభకార్యాల సీజన్ కావటంతో చికెన్ వినియోగం గణనీయంగా పెరిగింది. వినియోగానికి తగిన విధంగా కోళ్ల ఉత్పత్తి లేకపోవటంతో ధరకు రెక్కలొచ్చాయి. సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. దాణా ధరలు, కోడిపిల్లల ధరలు పెరగటం, వేసవిలో నిర్వహణ ఖర్చులు పెరగటం కూడా చికెన్ ధరలు పెరగటానికి కారణాలుగా కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్పత్తి పడిపోయింది.. ప్రస్తుతం చికెన్‌కు ఉన్న డిమాండ్‌కు తగిన విధంగా కోళ్ల ఉత్పత్తి జరగటం లేదు. మార్కెట్లో వ్యాపారుల నుంచి ఆర్డర్లు పెరగటంతో అందుకు అనుగుణంగా ఉత్పత్తులు లేకపోవటంతో కంపెనీలు రేట్లు పెంచుతున్నాయి. పరిశ్రమల వద్ద లైవ్ బర్డ్ ధర పెరగటంతో దాని ప్రభావం చికెన్ ధరపై పడుతోంది. నెల రోజుల కిందట తెలంగాణ కుంభమేళాగా జరిగిన మేడారం జాతరతో కోళ్లు, చికెన్ ధరలు పెరిగాయి. జాతర తరువాత తగ్గిన చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. నెల రోజులకు పైగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు జరుగుతుండటంతో మాంసాహారాల వినియోగం బాగా పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవలి కాలంలో నిత్యం 80 నుంచి 90 టన్నుల వరకు చికెన్ వినియోగం జరుగుతున్నట్లు అంచనా. ఒక్క ఖమ్మం నగరంలోనే దాదాపు 25 నుంచి 30 టన్నుల వరకు వినియోగం ఉన్నట్లు వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో 60 లక్షలకు పైగా కోళ్లను పెంచేందుకు అవకాశం ఉన్నప్పటికీ గత అనుభాలు, ఇతర కారణాలతో ప్రస్తుతం 40 నుంచి 45 లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్లు కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. వినియోగానికి తగిన విధంగా ఉత్పత్తి లేకపోవటంతో ధర ౖపైపెకి పోతోందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లతో.. ప్రస్తుతం హిందూ, ముస్లింల పండుగలైన ఉగాది, రంజాన్లు ఓ వైపు, మరో వైపు పెళ్లిళ్ల సీజన్ కావటంతో చికెన్‌కు బాగా డిమాండ్ పెరిగింది. మంగళవారం ఉగాది పండుగ, గురు, శుక్రవారాల్లో రంజా న్ పండుగ ఉండటంతో చికెన్‌కు వ్యాపారుల నుంచి ఆర్డర్లు బాగా పెరిగాయి. ఇదే తరుణంలో పెళ్లిళ్లు ఉండటంతో ఆ డిమాండ్ కూడా కొనసాగుతోంది. శుభ ముహూర్తాల కాలం కావటంతో ప్రతి ఇంటా ఉప్పలమ్మ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో చికెన్‌కు ధరలు పెరుగుతున్నాయి. మొక్కజొన్న వంటి పంటల ఉత్పత్తి తగ్గిపోవటంతో దాణా ధర పెరిగింది. ఇక హేచరీస్‌లో కోడి పిల్లల ధర పెరిగింది. రూ.25 నుంచి రూ.30 ఉన్న కోడి పిల్ల ధర ప్రస్తుతం రూ.53గా పలుకుతోంది. ఇక నిర్వహణ ఖర్చులు పెరిగాయి. వేసవిలో కోళ్ల పరిశ్రమల నిర్వహణకు అదనంగా ఖర్చవుతుంది. ఏసీల వినియో గం పెరగటంతో నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. ఇక ప్రస్తుతం 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కోళ్లు తట్టుకోలేవు. ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కాలం కావటంతో కోళ్ల పరిశ్రమకు నష్టం జరుగుతుందని భావించి నిర్వాహకులు, రైతులు కోళ్ల పెంపకానికి వెనుకంజ వేస్తున్నా రు. ఉష్ణోగ్రతలతో కోళ్లు చనిపోతే కోలుకోలేని దెబ్బ పడుతుంది. కోళ్లు సాధారణంగా 40 రోజుల్లో 2.3 కిలోల బరువు పెరుగుతుంది. కానీ, వేసవిలో 48 రోజులు పడుతుంది. ప్రస్తుతం ఒక కోడి పెంపకానికి రూ.125 నుంచి రూ.135 వరకు ఖర్చవుతోంది. కంపెనీలు ప్రస్తుతం రూ.140 వరకు విక్రయిస్తున్నాయి. దీంతో రిటైల్‌గా స్కిన్లెస్ రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిండగా, విత్స్కిన్ రూ.280 గా, లైవ్‌కోడి రూ.170 వరకు విక్రయిస్తున్నారు. ఉత్పత్తి లేకనే.. కోళ్ల ఉత్పత్తి లేకనే చికెన్ ధరలు పెరిగాయి. వివిధ కారణాలతో కోళ్ల పెంపకం తగ్గింది. వేసవిలో కోళ్ల పెంపకం భారంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. కోడిపిల్ల ధర బాగా పెరిగింది. వేసవిలో పెంపకం ఇబ్బందిగా ఉంటుంది. నిర్వహణ ఖర్చులు పెరిగాయి. డిమాండ్ తగిన ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెంచడం అనివార్యమైంది. – రావి బాబూరావు, పౌల్ట్రీ పరిశ్రమ యజమాని, ఖమ్మం చికెన్ ధర ప్రియం చికెన్ ధర ప్రియంగా మారింది. గతంతో పోలిస్తే దాదాపుగా రెట్టింపు ధరకు చేరింది. కిలో చికెన్ ధర రూ.300 కావటంతో వినియోగాన్ని తగ్గించాల్సి వచ్చింది. ప్రతి ఆదివారం చికెన్‌కు రూ.200 నుంచి రూ.220 వరకు వెచ్చిస్తాం. అలాంటిది రూ.300 పెట్టినా కేజీ రావటం లేదు. మటన్ ధరతోపాటు చికెన్ ధర కూడా అందుబాటులో లేకుండా పోతోంది. – శీలం కార్తీక్, నాయుడుపేట, ఖమ్మం -
Egg Prices: అ‘ధర’హో.. రూ.6 పలికిన గుడ్డు .. ప్రస్తుతం 3.65
గుడ్డు.. అ‘ధర’గొడుతోంది.. ధర నిలకడగా సాగుతూ పరిశ్రమకు ఊతమిస్తోంది.. కోవిడ్ కాలంలో వచ్చిన వదంతులతో సంక్షోభంలో చిక్కుకున్నా.. ఆ తర్వాత కోలుకుని ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 250 వరకు పౌల్ట్రీలు ఉండగా వాటిలో సుమారు 1.20 కోట్ల మేర కోళ్లు పెరుగుతున్నాయి. వీటి ద్వారా రోజుకు కోటి గుడ్లు వరకు ఉత్పత్తి అవుతున్నాయి. సాధారణ రోజుల్లో 80 శాతం మేర కోడిగుడ్లు పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోం, బిహార్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. మిగిలిన 20 శాతం స్థానికంగా వినియోగిస్తుంటారు. తణుకు (పశ్చిమ గోదావరి): కరోనా విపత్తు నుంచి జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ బయటపడుతోంది. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైంది. చికెన్, గుడ్డు వినియోగం తగ్గింది. దీంతో ఒక్కసారిగా పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పట్లో చికెన్ ధర పతనం కాగా గుడ్డు ధర సైతం గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.2.25కు పతనమైంది. అయితే కరోనా కట్టడిలో పౌష్టికాహారం అయిన కోడిగుడ్లు, చికెన్ ప్రాధాన్యం పెరగడంతోపాటు ప్రభుత్వం, వైద్యులు సైతం అవగాహన పెంచడంతో పౌల్ట్రీకు కలిసి వచ్చింది. అనంతర కాలంలో గుడ్డు, చికెన్ వినియోగం పెరగడంతో వాటి ధరలు సైతం గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఏడాదిగా కోడిగుడ్డు నెక్ ధర రూ.5 పైగా పలుకుతూ వస్తోంది. ఇటీవల బహిరంగ మార్కెట్లో రూ.6 ధర ఉండగా ప్రస్తుతం నెక్ ధర రూ.3.65 వద్ద కొనసాగుతోంది. తగ్గిన ఉత్పత్తి జిల్లాలో 250 వరకు పౌల్ట్రీలు ఉండగా వీటిల్లో సుమారు 1.20 కోట్లు కోళ్లు పెరుగుతున్నాయి. వీటి ద్వారా రోజూ కోటి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. సాధారణ రోజుల్లో 80 శాతం మేర కోడిగుడ్లు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. 20 శాతం స్థానికంగా వినియోగిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్లుగా రైతులు పెద్ద సంఖ్యలో కోళ్లు వదిలించుకుని చేతులు దులుపుకున్నారు. తర్వాత బ్యాచ్‌లు వేయకపోవడంతో దాదాపు సగం మేర కోళ్ల ఫారాలు ఖాళీ అయ్యాయి. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి సైతం సగానికి పైగా పడిపోయింది. మరోవైపు కరోనా వదంతులతో ఎగుమతులు నిలిచిపోవడంతో స్థానికంగా వినియోగం కూడా భారీగా తగ్గింది. ఈ పరిస్థితుల్లో 2020 మార్చిలో గుడ్డు ధర రూ.2.25 కనిష్ట స్థాయికి దిగజారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కోగుడ్డు ఉత్పత్తి ధర రూ.3.75 అవుతుంది. ఇప్పుడిప్పుడే పరిశ్రమ కోలుకోవడంతో గుడ్ల ఉత్పత్తి పెరిగింది. మరోవైపు నెక్ ప్రకటించిన ధరకు వ్యాపారులు తమ వద్ద నుంచి కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేసిన కృషితో పౌల్ట్రీ పరిశ్రమ మరోసారి నిలదొక్కుకుంది. కోవిడ్ కారణంగా సంక్షోభంలోకి వెళ్లిన పౌల్ట్రీ పరిశ్రమను గట్టెక్కించేందుకు పౌల్ట్రీ అసోసియేషన్‌తో కలిసి గతంలో చికెన్, ఎగ్ మేళాలను ప్రభుత్వం నిర్వహించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో గుడ్డు వినియోగం తగ్గింది. మరోవైపు స్థానికంగా గత నెలలో ఎండలు పెరుగడటంతో కోళ్లు మేతతో పోల్చితే నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కోడిగుడ్డు పెంకు పటిష్టత తగ్గుతోంది. దీంతో గుడ్డు నాణ్యత తగ్గి ఎగుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇదే వంకతో పొరుగు రాష్ట్రాల్లో వ్యాపారులు గుడ్డు ధరను తగ్గిస్తున్నారని వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గుడ్డు ధర రూ.4 ఉంటేనే గత నష్టాలను భర్తీ చేసుకునే వీలుంటుందని పౌల్ట్రీ రైతులు అంటున్నారు. మరోవైపు పౌల్ట్రీ రైతులకు వడ్డీ రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం రెండేళ్ల క్రితం కోవిడ్ కారణంగా కోళ్ల పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిపోయింది. అయితే ఇటీవల కాలంలో గుడ్డు వినియోగం పెరగడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. గుడ్డు ధర నిలకడగా ఉంటే నష్టాల నుంచి గట్టెక్కుతాం. పౌల్ట్రీ రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. – పెన్మత్స సుబ్బరాజు, పౌల్ట్రీ రైతు, కావలిపురం, ఇరగవరం మండలం -
పౌల్ట్రీలకు వడదెబ్బ.. గుడ్లు తేలేస్తున్న కోళ్లు
మండపేట(కోనసీమ జిల్లా): మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన తయారైంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కోళ్ల రైతుల పరిస్థితి. ఎగుమతులకు ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీ, పెరిగిన మేత ధరలతో కుదేలైన కోళ్ల పరిశ్రమను మండుతున్న ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. వేడిగాలులకు తాళలేక రోజుకు దాదాపు లక్ష కోళ్లు మృత్యువాత పడుతుండగా, 15 శాతం మేర గుడ్ల ఉత్పత్తి పడిపోయింది. ఆయా కారణాలతో పరిశ్రమకు రోజుకు రూ.2.02 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. చదవండి: ప్రమాదాలకు చెక్.. వాటేన్ ఐడియా.. డ్రైవర్ రాజా..! నష్టాల మోత తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్ల వరకూ ఉండగా, మిగిలిన దశల్లోని కోళ్లు 1.2 కోట్ల వరకూ ఉన్నాయి, సాధారణ పరిస్థితుల్లో రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 23 వేల నుంచి 25 వేల వరకూ కోళ్లు చనిపోతుంటాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత తట్టుకుంటాయి. అధిక ఉష్ణోగ్రతలకు వేడిగాలులు తోడవడంతో కోళ్ల మరణాలు పెరగడంతో పాటు గుడ్లు ఉత్పత్తి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఎండలతో కోళ్ల మరణాలు మూడు రెట్లు పెరిగినట్టు పౌల్ట్రీ వర్గాలు అంటున్నాయి. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 93.5 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని రైతులు అంటున్నారు. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వలన సగటున సుమారు రూ.150 మేర నష్టపోవాల్సి వస్తోంది. ఈ మేరకు కోళ్ల మరణాల రూపంలో రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం నెక్ ప్రకటిత రైతు ధర రూ.3.15 ప్రకారం చూస్తే.. 16.5 లక్షల గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం వలన రైతులు రూ.51.98 లక్షల మేర నష్టపోవాల్సి వస్తోంది. కోళ్ల మరణాలు, గుడ్లు డ్రాపింగ్ రూపాల్లో మూడు జిల్లాల్లోని పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు రూ. 2.02 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. నిర్వహణ తడిసి మోపెడు.. అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసి మోపెడవుతోందని రైతులంటున్నారు. వడదెబ్బకు గురి కాకుండా వాటికి ప్రత్యేక మందులు ఇవ్వడం, కోళ్లకు వేడిగాలులు తగలకుండా షెడ్లు చుట్టూ గోనె సంచులు కట్టి, వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర జాగ్రత్తలతో నిర్వహణ భారం పెరిగిపోతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీతో జిల్లా ఎగుమతులకు డిమాండ్ పడిపోయింది. మరోపక్క మేత ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గుడ్డు ధర గిట్టుబాటు కాక ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో అధిక ఎండలతో గుడ్ల డ్రాపింగ్, కోళ్ల మరణాలు పరిశ్రమను మరింత నష్టాల పాలు చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షోభంలో కూరుకుపోతోంది.. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో కోళ్ల మరణాలు నాలుగు రెట్లు పెరిగిపోయాయి. 15 శాతం మేర గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఆయా కారణాలతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. వడ్డీ రాయితీ, ఎఫ్‌సీఐ నుంచి సబ్సిడీపై మేతలు అందించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – కర్రి వెంకట ముకుందరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ పౌల్ట్రీ అసోసియేషన్, కొమరిపాలెం ప్రభుత్వం గట్టెక్కించాలి ఇటీవల ఒడిశాలో ఏపీ గుడ్ల ఎగుమతులను అక్కడి ట్రేడర్స్ అడ్డుకున్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అదే విధంగా ప్రస్తుత సంక్షోభం నుంచి పరిశ్రమ గట్టెక్కేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. -పడాల సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌల్ట్రీ ఫెడరేషన్, అర్తమూరు -
పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోండి: నెక్
హైదరాబాద్: రోజురోజుకూ పెరుగుతున్న ఫీడ్ ధరలతో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాలని నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ (నెక్) ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు మానవ వినియోగానికి పనికిరాని 2 మిలియన్ టన్నుల మొక్క జొన్న, గోధుమ, సొయా వంటి కోళ్ల దాణాను పరిశ్రమకు కేటాయించాలని అభ్యర్ధించింది. -
గుడ్డుకు గడ్డు కాలం.. రోజుకు రూ.1.05 కోట్లు నష్టం
మండపేట(తూర్పుగోదావరి): పౌష్టికాహారాన్ని అందించే గుడ్డు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీతో జిల్లా ఎగుమతులకు డిమాండ్ లేక రైతు ధర పతనమవుతోంది. కోడి మేత ధరలు పెరిగిపోగా, గుడ్డు ధర గిట్టుబాటు కాక పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోంది. గుడ్డు ధర రూపంలో జిల్లాలోని పరిశ్రమకు రోజుకు దాదాపు రూ.1.05 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. మరోపక్క ముదురుతున్న ఎండలు కోళ్ల రైతులకు గుబులు పుట్టిస్తున్నాయి. జిల్లాలో సుమారు 200 పౌల్ట్రీ ఫాంలు ఉండగా వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు దాదాపు 1.4 కోట్లు వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. చదవండి: AP: మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రానికి ఐఎస్ఓ గుర్తింపు ఎగుమతులే పౌల్ట్రీకి ప్రధాన వనరుగా ఉన్నాయి. 60 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, అస్సాం తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మిగిలినవి స్థానికంగా వినియోగమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా పశి్చమ బెంగాల్, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించడం జిల్లా ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. అక్కడి పౌల్ట్రీల నుంచి ఎదురవుతున్న పోటీతో అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితిలో కోళ్ల రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని అక్కడి ట్రేడర్లు గుడ్డు ధరను మరింత తగ్గించేస్తున్నారు. నెక్ ప్రకటిత ధర కంటే తక్కువకు కొనుగోళ్లు చేస్తున్నారు. పౌల్ట్రీకి సీజన్‌గా భావించే శీతాకాలంలోనూ రైతు ధర ఈ ఏడాది రూ.5 దాటకపోవడం పౌల్ట్రీ దుస్థితికి అద్దం పడుతోంది. చుక్కల్లో మేత ధరలు కోడి మేతకు వినియోగించే మేతల ధరలు చుక్కల్లో చేరాయి. రెండు నెలల క్రితం రూ.38గా ఉన్న సోయా రూ.110కి చేరుకోగా, జీఎన్ కేకు రూ.35 నుంచి రూ. 110కి, మొక్కజొన్న రూ.14 నుంచి రూ. 25కు, డీఓబీ రూ.9 నుంచి రూ.18కి, ఎండు చేప రూ.30 నుంచి రూ.60కి, నూకలు రూ.13 నుంచి రూ.20కి పెరిగిపోయాయి. గుడ్డు రైతు ధర పతనమవుతుండగా పౌల్ట్రీల నిర్వహణ వ్యయం పెరిగిపోవడం పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేస్తుందని కోళ్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గుడ్డు ఉత్పత్తికి దాదాపు రూ.4.75 వ్యయమవుతుండగా నెక్ ప్రకటిత రైతు ధర రూ.3.79 మాత్రమే. ఈ మేరకు రోజుకు రూ.1.05 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. వేసవి మొదలు కావడంతో ఇప్పటికే సాధారణ స్థాయికి మించి కోళ్ల మరణాలు సంభవిస్తుండగా, గుడ్ల ఉత్పత్తి తగ్గనుంది. ఎండలు ముదిరేకొద్ది గుడ్డు రైతు ధర, కోళ్ల మరణాల రూపంలో నష్టాలు పెరిగి కోళ్ల పరిశ్రమ మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ దృష్టికి పౌల్ట్రీ సమస్యలు పౌల్ట్రీ సమస్యలపై ఇటీవల అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు కేవీ ముకుందరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, ఆదుకొనేందుకు రుణాలపై 4 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని, సబ్సిడీపై మేతలు అందజేయాలని, విద్యుత్‌లో రాయితీ ఇవ్వాలని, ఇతర సదుపాయలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సానుకూల స్పందన పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డితో కలిసి సీఎం జగన్‌ను కోరగా ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారు. సమస్యపై నివేదికను అందజేయాలని సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డిని ఆదేశించారు. సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. – కేవీ ముకుందరెడ్డి, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు, కొమరిపాలెం. సంక్షోభంలో కూరుకుపోతోంది మేత ధరలు పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవక కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న సీఎం జగన్, ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. – పడాల సుబ్బారెడ్డి, నెక్ జాతీయ కమిటీ సభ్యులు, పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
పాడి, పౌల్ట్రీ రంగాలకు విద్యుత్ సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: పాడి, పౌల్ట్రీ రంగాలను అభివృద్ధి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ప్రకటించింది. విజయ డెయిరీ విద్యుత్ చార్జీలపై యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇవ్వనుంది. ఈ మేరకు పాడి, పశు సంవర్ధక, మత్స్యశాఖ మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని డెయిరీ ఫారమ్‌లు, డెయిరీ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లు, లేయర్ ఫారమ్‌లు, బ్రాయిలర్ ఫారమ్‌లు, హ్యాచరీస్, ఫీడ్ మిల్స్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఒక్కో యూనిట్ విద్యుత్‌పై రూ.2 చొప్పున సబ్సిడీ పొందడానికి అర్హులను తెలిపింది. అర్హులైన డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లు https://elaabh telangana gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించింది. -
చికెన్ కేజీ ధర సగం తగ్గింది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 దెబ్బతో పౌల్ట్రీ పరిశ్రమ కష్టాల కడలి ఈదుతోంది. కరోనా వైరస్ వ్యాప్తికి చికెన్ కారణమంటూ గత ఏడాది ప్రారంభంలో పుకార్లు వచ్చిన కారణంగా అమ్మకాలు 75 శాతం పడిపోయి ధర కిలోకు రూ.30కి చేరిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల తర్వాత పరిశ్రమ క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో సెకండ్‌వేవ్ రూపంలో దెబ్బతీసింది. ఇప్పటికే చికెన్ వినియోగం 30 శాతం తగ్గింది. తాజాగా కర్ఫ్యూ, లాక్డౌన్లతో పరిశ్రమకు కొత్త సవాల్ విసిరింది. కిలోకు రూ.40 దాకా నష్టం.. గతేడాది ఫామ్ గేట్ వద్ద బ్రాయిలర్ కోడి కిలోకు ధర సగటున రూ.85 నమోదైంది. ప్రస్తుతం ఇది రూ.60–65 మధ్య ఉంది. ఉత్పత్తి వ్యయం ఏడాదిలో కిలోకు రూ.20–25 అధికమై ఇప్పుడు రూ.95–100కు చేరిందని స్నేహా ఫామ్స్ సీఎండీ డి.రామ్‌రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ లెక్కన కిలో కోడికి రైతుకు రూ.40 దాకా నష్టం వాటిల్లుతోందని చెప్పారు. గతేడాది నుంచి పరిశ్రమ నష్టాలను మూటగట్టుకుంటోందని వెల్లడించారు. ‘మొక్కజొన్న టన్నుకు ఏడాదిలో రూ.15,000 నుంచి రూ.17,000కు, సోయా రూ.40,000 నుంచి రూ.80,000కు చేరింది. దీంతో దాణా వ్యయం అదే స్థాయిలో అధికమైంది. కోళ్లకు వాడే మందులు రష్యా, చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. వీటి ధరలు 30 శాతం పెరిగాయి’ అని వివరించారు. క్రమంగా తగ్గుతున్న వినియోగం.. సాధారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 15–16 లక్షల కోళ్లు అమ్ముడవుతాయి. ఇందులో ఒక్క హైదరాబాద్ వాటా 6 లక్షలు. ఇప్పుడీ వినియోగం 12 లక్షల కోళ్లకు వచ్చి చేరింది. కోవిడ్ ముందు వరకు మొత్తం చికెన్ అమ్మకాల్లో హోటళ్లు, ఫంక్షన్ల వాటా 25 శాతం ఉండేది. ప్రస్తుతం ఇది 5 శాతానికి వచ్చింది. వైరస్ ఉధృతితో శుభకార్యాలు దాదాపుగా వాయిదా పడ్డాయి. కొద్ది రోజుల క్రితం వరకు జరిగినా పరిమిత సంఖ్యలో అతిథులతో వేడుకలు కొనసాగాయి. ఇప్పుడు లాక్డౌన్ తోడు కావడంతో పౌల్ట్రీ పరిశ్రమ ఆందోళన చెందుతోంది. కేజీ ధర సగం తగ్గింది.. రిటైల్‌లో స్కిన్లెస్ చికెన్ ధర ఈ ఏడాది కిలోకు కనిష్టంగా రూ.140 పలికితే.. గరిష్టంగా రూ.300 వరకు వెళ్లింది. ప్రస్తుతం రూ.150–180 మధ్య ఉంది. అంటే ఈ ఏడాది అమ్ముడైన గరిష్ట ధరతో పోలిస్తే కిలోకు దాదాపు సగం తగ్గిందన్న మాట. 2019లో ధర రూ.340 దాకా పలికిందని హైదరాబాద్‌లోని విజయనగర్ చికెన్ సెంటర్ యజమాని బండి సాయి కిరణ్ తెలిపారు. కోవిడ్‌కు చికెన్ కారణమంటూ పుకార్లు రావడంతో గతేడాది ఫిబ్రవరి–మార్చిలో కిలో ధర రూ.30కి పడిపోయిందని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా రూ.260 వరకు వెళ్లిందన్నారు. వైరస్ భయంతో ప్రస్తుతం జనాలు బయటకు రావడం లేదని, హోటళ్ల వ్యాపారం తగ్గడంతో చికెన్ అమ్మకాలు క్షీణించాయని చెప్పారు. విలువ రూ.90,000 కోట్లు భారత పౌల్ట్రీ పరిశ్రమ విలువ రూ.90,000 కోట్లు. ఈ పరిశ్రమకూ కోవిడ్–19 ముప్పుగా పరిణమించింది. పరిశ్రమలో దక్షిణాది వాటా ఏకంగా 70%. సగటు చికెన్ వినియోగం దేశంలో 4.5 కిలోలుంటే దక్షిణాదిన ఇది 8 కిలోలు ఉంది. ఇక పౌల్ట్రీలు ఏర్పాటు చేసి సొంతంగా మార్కెట్ చేసుకునేవారు తెలుగు రాష్ట్రాల్లో 25 శాతముంటారు. మిగిలిన వారంతా కాంట్రాక్ట్ వ్యాపారంలో ఉన్నవారే. అంటే రైతుల నుంచి కోళ్లను కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్ట్ వ్యాపారంలో 100 వరకు కంపెనీలు ఉన్నట్టు సమాచారం. -
చికెన్ ధర ఆల్‌టైమ్ రికార్డు.. పౌల్ట్రీ చరిత్రలో అత్యధికం
సాక్షి, అమరావతి: చికెన్ ధర సరికొత్త రికార్డు సృష్టించింది. కిలో రూ.306కు చేరి ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. ఇంతటి ధర దేశంలోనే ఎప్పుడూ నమోదు కాలేదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు, వడగాలులకు తోడు కోళ్ల కొరత వల్ల చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. గతేడాది కోవిడ్‌కు ముందు వరకు చికెన్ రేటు అధికంగానే (కిలో రూ.270 వరకు) ఉండేది. కోవిడ్ ఉధృత రూపం దాల్చిన తర్వాత వచ్చిన రూమర్స్‌తో నాలుగైదు నెలల పాటు చికెన్ ధర గణనీయంగా పడిపోయింది. ఒకానొక దశలో మూడు కిలోల చికెన్‌ను రూ.100కే విక్రయించారు. ఆ పరిస్థితి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ నెమ్మదిగా బయటపడింది. క్రమేపీ చికెన్ ధర పెరగడం మొదలైంది. విజయవాడ జోన్లో గత డిసెంబర్ వరకు కిలో రూ.250 వరకు అమ్ముడయ్యేది. బర్డ్‌ఫ్లూ విజృంభిస్తుందన్న ప్రచారంతో చికెన్ రేటు మళ్లీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.150కి దిగివచ్చింది. దాన్ని కూడా అధిగమించి.. చికెన్ ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరి 23న కిలో రూ.200 ఉన్న ధర.. మార్చి 31వ తేదీకి రూ.260కి చేరింది. ఏప్రిల్ 2న రూ.270, ఏప్రిల్ 3న రూ.296కు పెరిగింది. తాజాగా ఆదివారం రికార్డు స్థాయిలో కిలో రూ.306కి చేరింది. కోళ్ల కొరత వల్లే.. కొన్నాళ్ల నుంచి బ్రాయిలర్ కోళ్లకు కొరత ఏర్పడింది. దీనికితోడు ఎండలు, వడగాలుల వల్ల కోళ్లు చనిపోతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా చికెన్ ధర పెరగడానికి ఇదే కారణం. ఈ స్థాయిలో ధర పెరగడం పౌల్ట్రీ చరిత్రలో ఇదే ప్రథమం. – కాజా వెంకటేశ్వరరావు (నాని), ప్రెసిడెంట్, అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఎండ దెబ్బ.. వేసవికాలంలో కోళ్ల ఎదుగుదల తగ్గుతుంది. మేత అధికంగా తింటే ఎండల ధాటికి తట్టుకోలేక చనిపోతాయని పౌల్ట్రీ నిర్వాహకులు కోళ్లకు ఉదయం పూట మేత పెట్టరు. పైగా నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కోళ్లు సరిగ్గా తిండి కూడా తినలేవు. ఫలితంగా కోళ్లు ఎదుగుదల తగ్గి బరువు పెరగవు. అదే సమయంలో వడగాలులకు ఫారాల్లో పెరుగుతున్న కోళ్లు 10 నుంచి 15 శాతం వరకు మృత్యువాత పడుతుంటాయి. అలాగే ఏటా కోళ్ల విక్రయాల పెంపును దృష్టిలో ఉంచుకుని హ్యాచరీలు వారంపాటు క్రాప్ హాలిడే ప్రకటిస్తాయి. ఆ సమయంలో పౌల్ట్రీలకు హ్యాచరీల వాళ్లు కోడి పిల్లలను విక్రయించరు. ఇలా నెల కిందట తెలుగు రాష్ట్రాల్లో క్రాప్ హాలిడే అమలు చేశారు. ఇవన్నీ వెరసి ఇప్పుడు డిమాండ్‌కు సరిపడినన్ని కోళ్లు లభ్యం కావడం లేదు. ఫలితంగా చికెన్ ధర గణనీయంగా పెరిగిపోయింది. మరో రెండు వారాలకు కోళ్ల లభ్యత పెరుగుతుందని, ఆ తర్వాత చికెన్ ధర దిగివస్తుందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. -
పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం వద్దు
న్యూఢిల్లీ: బర్డ్‌ఫ్లూ(ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా) కారణంగా మహారాష్ట్ర, హరియాణాలో పౌల్ట్రీ కోళ్ల వధ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబైలో, మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో కొత్తగా బర్డ్‌ఫ్లూ కేసులు బయటపడ్డాయని తెలిపింది. ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, గుజరాత్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యింది. పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించడం సరికాదని, దీనిపై పునరాలోచించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వ్యాధి ప్రభావం లేని రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర పశు సంవర్థక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో కోళ్లలోనే కాకుండా కాకులు, గుడ్లగూబలు, పావురాలలో ఈ వ్యాధి ఆనవాళ్లు బయటపడ్డాయని పేర్కొంది. బర్డ్‌ఫ్లూపై అనుమానం ఉంటే సమాచారం అందించడానికి మహారాష్ట్ర పశు సంవర్థక శాఖ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. తాజా పరిస్థితిపై అధ్యయనం చేస్తోంది. ఈ వ్యాధిపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, గందరగోళానికి గురికావొద్దని కేంద్ర పశు సంవర్థక శాఖ కోరింది. తప్పుడు ప్రచారం వల్ల పౌల్ట్రీ పరిశ్రమతోపాటు రైతులు సైతం నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. -
బర్డ్ ఫ్లూ: చికెన్ అమ్మకాలపై నిషేధం
న్యూఢిల్లీ: దక్షిణ, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) పరిధిలోని రెస్టారెంట్లు, హోటళ్లలో చికెన్ అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. అదే విధంగా పౌల్ట్రీకి సంబంధించిన అన్ని రకాల ఆహార ఉత్పత్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. దేశ రాజధానిలో బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పౌల్ట్రీ షాపులు, మాంసం దుకాణాలు, ప్రాసెసింగ్ యూనిట్లు అమ్మకాలు జరుపకూడదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఎన్డీఎంసీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఇక ఎస్డీఎంసీ సైతం.. ‘‘బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ హోల్‌సేల్ మార్కెట్లు మూసివేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాం. చికెన్, కోడిగుడ్లతో కూడిన వంటకాలు వడ్డించకూడదని రెస్టారెంట్ల యజమానులకు స్పష్టం చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమించిన వారి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం’’ అని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కాగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయిలో ఉడికిన మాంసం, గుడ్లు తినవచ్చని ఆరోగ్య శాఖ నేడు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. (చదవండి: బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా?) ఈ క్రమంలో తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇక ఢిల్లీలో ఎనిమిది బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూసినట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. మయూర్ విహార్ ఫేజ్ 3, సంజయ్ లేక్, ద్వారక నుంచి సేకరించిన నమూనాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు ప్రకటించింది.(చదవండి: 9 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ పంజా) -
కొండెక్కిన కోడిగుడ్డు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కోడిగుడ్డు ధర కొండెక్కింది. మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర ఏకంగా రూ. 6కు ఎగబాకి ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తోంది. కరోనా లాక్డౌన్ ముందు వరకు రూ. 4 నుంచి రూ. 4:50 వరకు పలికిన ధర గత కొన్ని రోజు లుగా రూ. 5 పలుకుతోంది. తాజాగా రూ. 6కు పెరిగింది. 2017 సెప్టెం బర్లో అత్యధికంగా రూ. 5.35 ధర పల కగా ఇప్పుడు దాన్ని మించి ధర నమోదు కావడం గమనార్హం. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధిక విక్రయాల్లో ముందు వరుసలో ఉన్నది కోడిగుడ్డే. రోగ నిరోధకశక్తిని పెంచు కొనే క్రమంలో రోజుకొక కోడిగుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుండటంతో గుడ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో నిర్వహణ, రవాణా ఖర్చులు పెరగడంతో ఉత్పత్తి తగ్గింది. దీంతో కోడిగుడ్డు ధర పెరిగిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. డిమాండ్ పెరిగి... ఉత్పత్తి తగ్గి... దక్షిణాధి రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ కేంద్రంగా ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లు, లైవ్ బర్డ్స్‌లో సగం ఇతర రాష్ట్రాలకే ఎగుమతి అవుతుంటాయి. అయితే కరోనా లాక్డౌన్, ఆ తర్వాతి పరిస్థితుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన పౌల్ట్రీ రైతులు కొంతకాలం వరకు కొత్తగా బర్డ్స్ వేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గింది. రాష్ట్రంలో రోజుకు సగటున 3.65 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 2.80 కోట్లకు తగ్గింది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న గుడ్లలోనూ సగం పొరుగు రాష్ట్రలకు ఎగుమతి అవుతుండటంతో రాష్ట్రంలో నిత్యం 1.4 కోట్ల కోడిగుడ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు కోడిగుడ్లను తినాలన్న వైద్యుల సూచనతో గుడ్ల వినియోగం రోజుకు 1.3 కోట్ల నుంచి 2 కోట్లకు పెరిగింది. ఈ క్రమంలో డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేక ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కోళ్ల ఆహారానికి సంబంధించిన ముడిసరుకు, రవాణా చార్జీలు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమైనట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. చిన్నారులకు బంద్... కోడిగుడ్డు ధర ఒక్కసారిగా పెరగడంతో ఆ ప్రభావం అంగన్వాడీ కేంద్రాలపై పడింది. అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజూ ఒక గుడ్డును ఇస్తుంటారు. ఇందుకోసం ఏటా టెండర్ల పద్ధతిలో డీలర్లను ఎంపిక చేసి రోజుకు సగటున 8 లక్షల కోడిగుడ్లు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో తమకు గిట్టుబాటు కావట్లేదనే సాకుతో డీలర్లు 10 రోజులుగా పంపిణీని నిలిపివేశారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు గుడ్లను అందించలేకపోతున్నారు. -
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నాబార్డ్ చేయూత
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ రుణ వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డ్ సుముఖత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. నాబార్డ్ సీజీఎం వైకే రావుతో మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో నాబార్డ్ భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై మంత్రి చర్చించారు. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి అవుతుండటంతో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. ఐటీ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగు పరిచడం ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అది అందుబాటులోకి వస్తే వ్యవసాయ రంగంలో మార్పులు వస్తాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌కు రుణసాయం అందించాల్సిందిగా కోరారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించండి పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు నాబార్డ్ ఇస్తున్న రుణాలను మరింత విస్తృతం చేయాలని కేటీఆర్ కోరారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాల్లో అర్హులైన వారికి పాడి పశువులు అం దించేందుకు నాబార్డు ముందుకు వస్తే తాము సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం తో నిర్మించే 500 గోదాములకు ఆర్థిక సాయం అందించాలని నాబార్డ్ సీజీఎంకు మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతుబంధు కమిటీలను బలోపేతం చేస్తున్నందున వీటి ద్వారా వ్యవసాయ రంగానికి రుణాలను అందించే విషయాన్ని పరిశీలించాలన్నారు. నాబార్డు స్ఫూర్తికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ రంగ అభివృద్ధి కార్యక్ర మాలు ఉన్నాయని బ్యాంకు సీజీఎం వైకే రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సీజీఎం వివి ధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పాల్గొన్నారు. -
పౌల్ట్రీ విలవిల!
సాక్షి, హైదరాబాద్: పౌల్ట్రీ పరిశ్రమ సంకటంలో పడింది. క్షేత్రస్థాయిలో ధరలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఫారం వద్ద కొనుగోళ్లు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడం.. మరోవైపు శుభకార్యాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడటంతో వాణిజ్య పరంగా డిమాండ్ తగ్గిపోవడంతో పౌల్ట్రీ రైతు కుదేలవుతున్నాడు. రాష్ట్ర పౌల్ట్రీ పరిశ్రమలో 85.10 కోట్ల కోళ్లున్నాయి. ఇందులో లేయర్స్ (గుడ్లు పెట్టేవి) 53.4 కోట్లు, బాయిలర్స్ (మాసం కోసం పెంచేవి) 31.70 కోట్లున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ కేంద్రంగా ఉంది. తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు బాయిలర్ కోళ్లు, గుడ్లు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ అతలాకుతలమవుతోంది. ఇక్కడ తక్కువ.. అక్కడ ఎక్కువ! దూర ప్రాంతాలకు కోళ్లు, గుడ్లు సరఫరా బంద్ కావడంతో వ్యాపారం అంతా స్థానిక మార్కెట్‌పై ఆధారపడింది. కరోనా నేపథ్యంలో డిమాండ్ కాస్త తగ్గినప్పటికీ.. క్షేత్రస్థాయిలో రిటైల్ వ్యాపారులు ధరలు మాత్రం తగ్గించలేదు. రిటైల్ వ్యాపారులు పౌల్ట్రీ ఫాం వద్ద కిలోకు రూ.35 నుంచి రూ.45 చొప్పున బాయిలర్ కోళ్లు (లైవ్ బర్డ్) కొనుగోలు చేస్తున్నారు. అలాగే కోడి గుడ్డు ఒక్కింటికి రూ.1 నుంచి రూ.1.50 చొప్పున కొనుగోలు చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో రిటైల్ వ్యాపారులు కిలో చికెన్ (స్కిన్ లెస్) ధర రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. రెండో రకం కింద కిలో చికెన్ (విత్ స్కిన్) రూ.170 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక గుడ్డు ఒక్కింటికి రూ.5 చొప్పున అమ్ముతున్నారు. క్షేత్రస్థాయిలో ధరలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. పౌల్ట్రీ రైతుల వద్ద మాత్రం సగానికి సగం తగ్గించి కొనుగోలు చేస్తుండటం గమనార్హం. మరోవైపు కోళ్లను ఎక్కువ రోజులు ఫారంలోనే ఉంచుకుంటే దానా వేయడం భారమవుతుందనే భావనతో ధర తక్కువైనా స్టాక్‌ను వదిలించుకోవల్సిన పరిస్థితి తలెత్తింది. పెరిగిన అంతరం.. బాయిలర్ కోళ్ల పరిశ్రమలో కోడి పిల్లలను తెచ్చిన రోజు మొదలు 42 రోజుల్లో పెరిగి పెద్దవవుతాయి. దీంతో వాటిని లిఫ్ట్ చేసి చికెన్ మార్కెట్‌కు తరలిస్తారు. అలా లిఫ్ట్ చేసిన తర్వాత ఫారంను పక్షం రోజుల పాటు ఖాళీగా ఉంచి తిరిగి పిల్లలను తెచ్చి పెంచడం ప్రారంభిస్తారు. ఫారంలో ఇన్ఫెక్షన్లు ఇతర ఇబ్బందులు తొలగిపోయేందుకు ఈ అంతరం అవసరమనే నిబంధన ప్రకారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంతరం 20 నుంచి 25 రోజులకు పెరిగింది. లాక్డౌన్, కరోనా వైరస్ ప్రభావంతో మార్కెట్ కాస్త మందగమనంలో ఉండటంతో రైతులు ఈ దిశగా గ్యాప్ పాటిస్తున్నారు. అయితే కొందరు పౌల్ట్రీ నిర్వాహకులు మాత్రం కొత్త పిల్లలు పెంచేందుకు నిరాకరిస్తున్నారు. రెండు, మూడు నెలల పాటు వేచిచూసేందుకే మొగ్గుచూపుతున్నారు. 2 నెలల్లో అరకోటి నష్టం.. 90 వేల లేయర్ బర్డ్స్‌తో పౌల్ట్రీ పరిశ్రమ నడుపుతున్నా. పెట్టుబడి భారీగా అయ్యింది. లాక్డౌన్ కారణంగా పౌల్ట్రీ రంగంలో తీవ్ర నష్టాలే ఎదురవుతున్నాయి. గత ఐదు నెలలుగా గుడ్లు, చికెన్ సేల్స్ మందగించాయి. తర్వాత కాస్త కోలుకుంటున్న సమయంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పరిశ్రమ కుదేలైంది. అంతర్రాష్ట్ర రవాణా నిలిచిపోవడంతో సరఫరా ఆగిపోయింది. దీంతో గుడ్ల డిమాండ్ తగ్గడంతో ధర భారీగా పడిపోయింది. క్షేత్రస్థాయిలో రిటైలర్స్ సంతృప్తికరమైన ధరకే విక్రయిస్తున్నా.. మావద్ద మాత్రం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు లేయర్ కోళ్లకు ఇచ్చే దానా ధరలు కూడా భారీగా పెరిగాయి. గతంలో కిలో దానా రూ.12 నుంచి రూ.16 మధ్యలోఉండేది. ప్రస్తుతం ఈ ధర రూ.20కి పెరిగింది. మొత్తంగా గణిస్తే ఒక గుడ్డుపై సగటున రూ.1.50 నష్టం వస్తోంది. గడిచిన రెండు, మూడు నెలల్లో రూ.50 లక్షల వరకు నష్టం వచ్చింది. – ఎడమ నరేందర్‌రెడ్డి, మంచాల, రంగారెడ్డి జిల్లా ఆలస్యంతో లాభాలు ఆవిరి... 12 వేల బర్డ్స్‌తో బాయిలర్ పౌల్ట్రీ నిర్వహిస్తున్నా. సాధారణంగా ఒక కోడి పిల్ల పెరిగేందుకు 40 నుంచి 42 రోజులు పడుతుంది. ఎక్కువ శాతం 42వ రోజు బర్డ్స్ లిఫ్ట్ చేస్తాం. ఈ లెక్క ప్రకారం బర్డ్స్ లిఫ్ట్ చేస్తేనే ఆదాయం వస్తుంది. 42 రోజుల పాటు ఎదిగిన కోడి తినే ఆహారం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఒక్క రోజు ఆలస్యమైనా అంతే సంగతి. ఆ తర్వాత బర్డ్స్‌కు ఫీడ్ ఇచ్చినప్పటికీ కనీసం 10 గ్రాముల బరువు కూడా పెరగదు. కచ్చితంగా నిర్దేశించిన రోజుల్లో తీసేయాలి. లాక్డౌన్ కారణంగా రవాణా గందరగోళంగా మారింది. దీంతో బర్డ్స్ లిఫ్ట్ చేయడానికి ఎక్కువ రోజుల సమయం పడుతోంది. దీంతో బర్డ్స్‌కు ఫీడ్ ఇవ్వాల్సిన పరిస్థితి రావడంతో వచ్చే లాభం కాస్త ఆవిరవుతోంది. – జూలూరు పాండు, కుమ్మెర, చేవెళ్ల -
కరోనా ఎఫెక్ట్ : వేల కోళ్లు సజీవ సమాధి
బెంగళూరు : కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావంతో పలు పరిశ్రమలు నష్టాలు చవిచూస్తున్నాయి. ముఖ్యంగా చికెన్ తింటే కరోనా విస్తరిస్తుందనే వదంతులు ప్రచారం జరగడంతో.. ఆ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ పౌల్ట్రీ నిర్వాహకుడు ప్రాణాలతో ఉన్న వేలాది కోళ్లను సజీవంగా పూడ్చిపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. బెలగావిలోని గోకాక్‌కు చెందిన నజీర్ అహ్మద్ అనే పౌల్ట్రీ నిర్వాహకుడు చికెన్ ధరలు భారీగా పడిపోవడంతో ఆవేదన చెందాడు. కోళ్ల పెంపకపు ఖర్చులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పౌల్ట్రీలోని 6 వేల కోళ్లను ఓ ట్రక్‌లో తరలించి పెద్ద గుంత తీసి అందులో పూడ్చిపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి నజీర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కోళ్లతో కరోనా వస్తుందనే వదంతుల కారణంగా చికెన్ ధరలు భారీగా పడిపోయాయని తెలిపారు. కోళ్ల పెంపకానికి రూ. 6 లక్షల ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పెట్టుబడి రాకపోగా.. నష్టాలు వచ్చే అవకాశం ఉన్నారు. అందుకే కోళ్లను పూడ్చిపెట్టినట్టు వెల్లడించారు. (చదవండి : కోడికి కరోనా బూచి) A dejected farmer Nazeer Makandar from Lolasoora village in #Gokak, #Belagavi decided to bury #chicken from his #poultry farm, following steep fall in price due to #CoronavirusOutbreak. @DeccanHerald @CMofKarnataka @mani1972ias #Coronavid19 Nazeer Makandar pic.twitter.com/OExEPM39ay — Niranjan Kaggere (@nkaggere) March 10, 2020 -
పౌల్ట్రీకి 1,750 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: చికెన్ వల్ల కరోనా వైరస్ (కోవిడ్–19) ప్రబలుతోందన్న వదంతుల మూలంగా పౌల్ట్రీ పరిశ్రమ గణనీయంగా దెబ్బతింది. నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 1,750 కోట్ల మేర నష్టాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో తక్షణం సహాయక ప్యాకేజీ ఇవ్వాలంటూ కేంద్ర పశు సంవర్ధక శాఖకు పౌల్ట్రీ రంగం విజ్ఞప్తి చేసింది. చికెన్‌కు డిమాండ్ తగ్గిపోవడంతో కోళ్ల ధరలు కేజీకి రూ. 10–30 స్థాయికి (ఫాం గేట్) పడిపోయినట్లు అఖిల భారత పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ (ఏఐపీబీఏ) వెల్లడించింది. మరోవైపు సగటు ఉత్పత్తి ధర కేజీకి రూ. 80గా ఉంటోందని వివరించింది. ‘సోషల్ మీడియాలో పదే పదే వదంతులు వ్యాప్తి కావడంతో.. చికెన్‌పై వినియోగదారుల నమ్మకం సడలింది. చికెన్ ఉత్పత్తుల డిమాండ్ పడిపోయింది’ అని ఏఐపీబీఏ చైర్మన్ బహదూర్ అలీ తెలిపారు. దీంతో జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి మూడో వారం మధ్య కాలంలో బ్రాయిలర్ రైతులు, బ్రీడింగ్ సంస్థల నష్టాలు దాదాపు రూ. 1,750 కోట్లకు చేరాయని ఆయన వివరించారు. ఈ భారీ సంక్షోభంతో పౌల్ట్రీ రంగం దివాలా తీసే పరిస్థితి వచ్చిందని అలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగిన పక్షంలో ప్రతి నెలా రూ. 1,750 కోట్ల నష్టాల భారం పడుతుందన్నారు. దేశీ పౌల్ట్రీ లో 10 లక్షల మంది పైగా రైతులు ఉపాధి పొందుతున్నారు. దేశీయంగా జొన్న, సోయాబీన్ల వినియోగం ఎక్కువగా పౌల్ట్రీ రంగంలోనే ఉంటోందని.. ఇది గానీ దెబ్బతిందంటే ఆయా రైతులకూ కష్టం తప్పదని అలీ తెలిపారు. -
ముఖ్యమంత్రితో సహా అంతా రోజూ చికెన్ తింటాం
ఖైరతాబాద్: రాష్ట్రంలో నాలుగు కోట్ల మందిలో ఏ ఒక్కరికీ చికెన్, గుడ్డుతో ఆరోగ్యపరమైన సమస్యలు రాలేదని.. దుష్ప్రచారాలు, అపోహలు, అనుమానాలతో జరుగుతున్న వైరల్ క్యాంపెయిన్ తప్పని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. చికెన్, ఎగ్‌తో కరోనా వైరస్ రాదని, ఆరోగ్యానికి మంచి పౌష్టిక విలువలు లభిస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చికెన్ అండ్ ఎగ్ మేళాను ఆయన ప్రారంభించారు. మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలసి ఆయన చికెన్ తిని చూపించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుడ్డు, చికెన్‌లో ఉన్న పోషక విలువలు ఏ ఆహార పదార్థంలో లేవన్నారు. మనదేశంలో అధిక మంటపై ఉడికించి తినే వంటలకు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు లేవన్నారు. చికెన్, గుడ్డు తినడంతో కోవిడ్ వ్యాపిస్తుందన్న వదంతులు నమ్మవద్దని, ఆరోగ్య శాఖ మంత్రే వచ్చి చికెన్, గుడ్డు తినడంతో ఎలాంటి హాని జరగదని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఇంకా అపోహలు పెట్టుకోవదన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లాల్లో కూడా చేయాలని.. దీనికోసం నటులు, డాక్టర్లు ముందుకు రావాలన్నారు. తమ కుటుంబంలో ముఖ్యమంత్రితో సహా అంతా రోజూ చికెన్ తింటామని కేటీఆర్ తెలిపారు. త్వరలో తెలంగాణ పౌల్ట్రీ పాలసీ కూడా రాబోతుందని వివరించారు. అనారోగ్య సమస్యలు రావు... మన ఆహారపు అలవాట్లకు కోవిడ్ వైరస్ వచ్చే అవకాశం లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేరళలో 3 కేసులు నమోదయ్యాయి తప్ప, మన రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదన్నారు. మన వద్ద సగం ఉడికించి తినే ఆహారపు అలవాటు లేదన్నారు. వైరల్ వార్తల కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైందన్నారు. 2 నెలల కాలంలో రూ.500 కోట్ల పైచిలుకు నష్టపోయిందన్నారు. వదంతులు నమ్మవద్దని, కరోనా వైరస్‌కు చికెన్‌కు ఎలాంటి సంబంధం లేదని తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. చికెన్ అండ్ ఎగ్ మేళాలో 6,200 కిలోల వివిధ రకాల చికెన్ వంటకాలు, 22వేల గుడ్లు నగరవాసులకు ఉచితంగా అందజేశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌కుమార్‌రావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, సురేందర్, ఫౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు, రైతులు, నగరవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుదీప్, లిప్సిక, లిటిల్ సింగర్ సాయివేద పాటలతో అలరించగా, బిత్తిరి సత్తి మాటలతో ఆకట్టుకున్నారు. -
‘సీఎం కేసీఆర్ కూడా చికెన్ తింటారు’
-
‘సీఎం కేసీఆర్ కూడా చికెన్ తింటారు’
సాక్షి, హైదరాబాద్: సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చికెన్ తింటే కరోనా వైరస్ సోకుతుందనే అసత్య వార్తల్ని నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా తన కుటుంబమంతా చికెన్ తింటున్నామని, ఎప్పుడూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని చెప్పారు. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనే ఆసత్య ప్రచారాలను తిప్పికొంట్టేందుకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చికెన్ ఎగ్స్ మేళాను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పలువురు అధికారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, సినీ నటి రష్మిక మంధాన పాల్గొన్నారు. చికెన్ ఒక ప్రొటీన్ ఆహారమని.. దానికీ కరోనా వైరస్‌కు సంబంధం లేదని రష్మిక పేర్కొన్నారు. చికెన్ ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. -
‘ముక్క’ ముట్టడం లేదు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా చికెన్ అమ్మకాలు నెల రోజుల్లో 50 శాతానికి పడిపోయాయి. ఫాం గేట్ ధర 70 శాతం తగ్గింది. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని గోద్రెజ్ అగ్రోవెట్ ఎండీ బి.ఎస్.యాదవ్ తెలిపారు. వారానికి 6 లక్షల కోళ్లు విక్రయించేవారమని, నెల రోజుల్లో 40 శాతం అమ్మకాలు తగ్గాయని చెప్పారు. వదంతులు ఆగిపోయి తిరిగి అమ్మకాలు రెండు మూడు నెలల్లో పుంజుకున్నాక చికెన్ కొరత ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే జరిగితే ధరలు పెరుగుతాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రతి వారం 7.5 కోట్ల కోళ్లు అమ్ముడవుతున్నాయని, ఇది 3.5 కోట్ల కోళ్లకు వచ్చిందని గుర్తుచేశారు. కాగా, హైదరాబాద్ మార్కెట్లో కొద్ది రోజుల క్రితం స్కిన్లెస్ చికెన్ మాంసం రూ.250 దాకా దూసుకెళ్లింది. గత వారం రూ.110కి దిగొచ్చి ప్రస్తుతం రూ.130 పలుకుతోంది. ఇక్కడ సాధారణ స్థితికి.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. రెండు వారాల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అమ్మకాలు సాధారణ స్థితికి వచ్చాయని స్నేహ ఫామ్స్ సీఎండీ డి.రామ్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘తెలుగు రాష్ట్రాల్లో 30 శాతం అమ్మకాలు పడిపోయాయి. చికెన్ ఫాం గేట్ ధర రూ.80 నుంచి రూ.35 వరకు వెళ్లింది. ఇప్పుడు రూ.42కు వచ్చింది. వారానికి సరిపడ నిల్వలు పౌల్ట్రీల వద్ద మిగిలిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాంసాహారం ఎక్కువ తింటారు కాబట్టి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వదంతుల ప్రభావం తక్కువగా ఉంది. సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వినియోగం సాధారణ స్థితికి వచ్చింది. ధరలు రోజురోజు కూ పెరుగుతున్నాయి. చికెన్‌కు కరోనాకు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి’ అని వివరించారు. నష్టం రూ.7,000 కోట్ల పైనే..! కరోనా వదంతుల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీ పరిశ్రమ రూ.700 కోట్ల వరకు నష్టపోయిందని రామ్ రెడ్డి వెల్లడించారు. కోడి ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.80 అవుతోందని, విక్రయ ధర సగానికి పడిపోవడంతో పౌల్ట్రీ సంస్థలు నష్టాలను మూటగట్టుకున్నాయని చెప్పారు. ఈ నష్టం దేశవ్యాప్తంగా ఎంత కాదన్నా రూ. 7,000 కోట్ల పైచిలుకు ఉంటుందని ఆ యన అంచనా వేశారు. తమకు సం బంధం లేకపోయినా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బ్యాచ్ వేయడానికి రైతుల వద్ద మూలధనం లేదన్నారు. వాస్తవానికి సాధారణ రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 15–20 లక్షల కోళ్లు అమ్ముడయ్యేవి. -
పెరట్లో వన రాజా కోళ్ల పెంపకం
గత రెండు దశాబ్దాలుగా కోళ్ల పరిశ్రమ మన దేశంలో బాగా విస్తరిస్తోంది. ముఖ్యంగా మాంసం, గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండటానికి ఇదే కారణం. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలతోపాటు ఇతర కుటుంబాలు కూడా పెరటి కోళ్లను పెంచుకుంటారు. పెరటి కోళ్ల పెంపకం అభివృద్ధికి తక్కువ పెట్టుబడి, పెట్టుబడి పెట్టిన కొద్ది కాలంలోనే లాభాలు రావటం, కోళ్ల పెంట ఎరువుగా ఉపయోగపడటం వంటి అనేక కారణాలున్నాయి. నాటు కోళ్లకు గిరాకీ పెరుగుతుండడంతో పెరటి కోళ్ల పెంపకానికి ఈ మధ్య రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. పెరట్లో పెంపకానికి వనరాజా కోళ్లు అనువైనవన్న సంగతి తెలిసిందే. వనరాజా కోళ్ల విశిష్టతలు ► వివిధ రంగుల ఈకలు ఉండటం వలన నాటు కోళ్లను పోలి ఉంటాయి. ► వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. ► పొడవైన కాళ్లు ఉండటం వలన త్వరగా కదలగలవు. కుక్కల బారి నుంచి తప్పించుకోగలవు. ► గుడ్ల ఉత్పత్తికి, మాంసం ఉత్పత్తికి పనికివస్తాయి. వనరాజా కోళ్ల సామర్థ్యం ► మొదటి గుడ్డు పెట్టే రోజు నుంచి 175–180 రోజుల వరకు గుడ్లు పెడతాయి. 160 గుడ్లు పెడతాయి. ► 6వ వారంలో శరీర బరువు 2,000–2,200 గ్రాములు. ► గుడ్ల బరువు 28వ వారంలో 48–50 గ్రాములు. 40వ వారంలో 52–58 గ్రాములు. ► మొదటి 6 వారాల వరకు మరణాల శాతం 2 శాతం కంటే తక్కువ. ► ఎక్కువ సంఖ్యలో వనరాజా కోడి పిల్లలను పెంచేటప్పుడు శాస్త్రీయ పద్ధతిలో బ్రూడర్స్‌ను ఏర్పాటు చేయాలి. పిల్లలు షెడ్లకు రాక ముందు 2–3 అంగుళాల వరకు వరి పొట్టు / రంపపు పొట్టు లిట్టరు లాగా పోయాలి. అది మేయకుండా కాగితాలు పరవాలి. బ్రూడర్స్ చుట్టూ నీటి, మేత తొట్టెలను అమర్చాలి. కరెంటు బల్బులలతో ప్రతి కోడికి 2 వ్యాట్ల చొప్పున వేడినివ్వాలి. ► మేతలో 2,400 కేలరీల శక్తి , 16 శాతం ప్రొటీన్లు, 0.77% లైసిన్, 0.36% మిధియోనిన్, 0.36% భాస్వరం, 0.7% కాల్షియం ఉండాలి. ► ఆరువారాల వయస్సు దాటిన తర్వాత వాటిని పెరట్లో విడిచి పెట్టాలి. పెరట్లో లభించే చిన్న చిన్న మొక్కలు, నిరుపయోగ ధాన్యాలు, క్రిమి కీటకాలు, గింజలు మొదలైన వాటిని తింటూ పగలంతా తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తాయి. ► వివిధ జబ్బుల నుంచి రక్షించుకోవడానికి పిల్ల పుట్టిన ఒకటో రోజున, 7వ రోజున, 14వ రోజున, 28వ రోజున, 36–42 రోజుల మధ్య, 8వ వారంలో టీకాలను విధిగా వేయించాలి. ► ఆర్థిక లాభాల కోసం కోడి పెట్టలను ఒకటిన్నర సంవత్సరం, కోడి పుంజులను 14 లేదా 16 వారాల వయస్సు వచ్చే వరకు పెంచాలి. ఒక్కో పెట్ట 160 గుడ్లు పెడుతుందనుకుంటే రూ. 5 చొప్పున రూ. 800ల ఆదాయం పొందవచ్చు. ► దాణాను అధిక ధరకు కొనుగోలు చేయడం కన్నా రైతు తన దగ్గర ఉన్న దాణా దినుసులతో చౌకగా తయారు చేసుకుంటే, గుడ్ల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ , (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవస్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
రూ.100 కోట్లతో స్నేహా ఫామ్స్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌల్ట్రీ రంగ సంస్థ స్నేహా ఫామ్స్ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ప్రాసెసింగ్ కెపాసిటీ గంటకు 6,000 బర్డ్స్ నుంచి 12,000లకు చేర్చనుంది. అలాగే కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం ప్రస్తుతం 2,000 టన్నులుంది. దీనికి 3,000 టన్నులకు పెంచనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ వద్ద కంపెనీకి ప్రాసెసింగ్ ప్లాంటుతోపాటు శీతల గిడ్డంగి ఉంది. సంస్థ ఇప్పటికే ప్రాసెస్డ్ చికెన్, ఫ్రెష్ చికెన్ విక్రయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్థానంలో నిలిచింది. అలాగే ప్రాసెసింగ్ కెపాసిటీ పరంగా దేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఎనిమిది నెలల్లో ఈ విస్తరణ పూర్తి అవుతుందని స్నేహా ఫామ్స్ ఎండీ డి.రామ్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. నూతన విభాగాల్లోకి ప్రవేశించేందుకు తాజా విస్తరణ దోహదం చేస్తుందన్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మెగా ప్రాజెక్టు కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి పొందామని చెప్పారు. కొత్త విభాగాల్లోకి స్నేహా... స్నేహా ఫామ్స్ త్వరలో నగ్గెట్స్, లాలీపాప్స్ వంటి రెడీ టు కుక్, చికెన్ కర్రీ వంటి ఉత్పత్తులతో రెడీ టు ఈట్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే అయిదారు ఉత్పత్తులతో ట్రయల్స్ నిర్వహించామని రామ్‌రెడ్డి తెలిపారు. ‘ఫ్రోజెన్ చికెన్ విభాగంలోకి కూడా వస్తున్నాం. రెడీ టు ఈట్ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తాం. ఇప్పటికే దాణాను ఎగుమతి చేస్తున్నాం. సఫల బ్రాండ్ కింద సోయా, రైస్ బ్రాన్ ఆయిల్స్ దేశీయంగా విక్రయిస్తున్నాం. 80,000 కిలోల ప్రాసెస్డ్ చికెన్, 2.5 లక్షల బ్రాయిలర్ కోళ్లు ప్రతిరోజు అమ్ముతున్నాం. గ్రూప్ టర్నోవర్ రూ.3,000 కోట్లుంది. ఇందులో స్నేహా ఫామ్స్ వాటా రూ.2,500 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌లో 15–20 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. 3,000 మంది ఉద్యోగులు ఉన్నారు. విస్తరణతో కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుంది’ అని వివరించారు. -
కోడిగుడ్లతో ఏటా 7,500 కోట్ల నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గిట్టుబాటు ధర లేకపోవటం, మొక్కజొన్న, సోయాబిన్ లభ్యత తక్కువగా ఉండటం, దాణ ధరలు, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల దేశంలో కోడి గుడ్ల ఉత్పత్తిదారులు ఏటా రూ.7,500 కోట్లు నష్టపోతున్నట్లు పౌల్ట్రీ పరిశ్రమ చెబుతోంది. ఏటా దేశంలో 8,800 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ప్రెసిడెంట్ చక్రధర రావు పొట్లూరి చెప్పారు. గుడ్ల ఉత్పత్తితో ప్రపంచంలో చైనా తర్వాతి స్థానం మనదే అయినా... సరైన ప్రోత్సాహం లేక కోళ్ల ఫామ్స్‌ని మూసేస్తున్నారని ఆయన వాపోయారు. ఈ నెల 27–29 తేదీల్లో హెచ్ఐసీసీలో 13వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో జరగనున్న నేపథ్యంలో సోమవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం.. దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ వార్షిక పరిమాణం ప్రస్తుతం రూ.1.1 లక్షల కోట్లు. వృద్ధి రేటు 7 శాతం. పరిశ్రమలో తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం వరకూ ఉన్నట్లు వెంకటేశ్వర హ్యాచరీస్ జీఎం కేజీ ఆనంద్ చెప్పారు. దేశంలో రోజుకు 25 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తయితే... దాన్లో 4 కోట్లు తెలంగాణలో, 4.5 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలో 2 వేల మంది గుడ్ల ఉత్పత్తిదారులు, లక్ష మంది బ్రాయిలర్ రైతులు ఉన్నారని, రోజుకు 2 కోట్ల బ్రాయిలర్స్ ఉత్పత్తి అవుతున్నాయని తెలియజేశారు. అమెరికన్ కాళ్లను దించొద్దు.. అమెరికాలో అమ్ముడుపోని, కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న చికెన్ లెగ్స్‌ను భారత్‌కు పంపేందుకు యూఎస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని చక్రధర రావు చెప్పారు. దీన్ని అనుమతించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘గతంలో అమెరికా.. పక్కనే ఉన్న హైతీ దేశంలోకి చికెన్ లెగ్స్‌ను ఎగుమతి చేసింది. దీంతో హైతీ పౌల్ట్రీ పరిశ్రమ 70 శాతం వరకు కనుమరుగైపోయింది. భారీగా చికెన్ లెగ్స్‌ను తక్కువ ధరకు పంపితే స్థానిక కంపెనీలు పోటీని తట్టుకోలేవు. ఈ పరిస్థితి మనకూ వస్తుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. -
వ్యవసాయానికి వెన్నెముకగా కోళ్ల పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: దేశంలో వ్యవసాయ అనుబంధంగా కోళ్ల పరిశ్రమపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తూ పేదలకు మాంసం, గుడ్ల రూపంలో పౌష్టికాహారం అందిస్తున్నాయని కేంద్ర పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఓపీ చౌదరి పేర్కొన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కోళ్ల రంగం ఏటికేటికీ వృద్ధి సాధిస్తున్న దృష్ట్యా.. మరింత అభివృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతున్న కీలక వ్యవసాయానికి వెన్నెముకగా నిలిచిందని చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్–ఐపీఈఎంఏ ఆధ్వర్యంలో మూడ్రోజుల పాటు జరగనున్న పౌల్ట్రీ ఇండియా–2018ను ఆయన ప్రారంభించారు. హైటెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 5 డూమ్ల్లో 326 వరకు స్టాళ్లు కొలువు తీరాయి. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పౌల్ట్రీ పరిశ్రమలు, ఫీడ్, క్లీనింగ్, ఔషధ పరిశ్రమలు తమ ఉత్పత్తులు పదర్శిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీ రంగంలో వస్తున్న అనూహ్యమైన మార్పులకు అనుగుణంగా విజ్ఞానం, అంతర్జాతీయస్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ యంత్రాలు, పనిముట్లు ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు పెద్దసంఖ్యలో సందర్శకులు, పౌల్ట్రీ రైతులు, యువత, ఔత్సాహికుల తాకిడి కనిపించింది. ఉత్పత్తి, ఉత్పాదకత వ్యయం తగ్గించుకుంటూ ముందుకు వెళితే నికర లాభాలు ఆర్జించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. తెలంగాణలో పౌల్ట్రీ అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్న భారత్.. రాబోయే రోజుల్లో రెండో స్థానానికి వెళ్లేందుకు కృషి చేస్తున్నామని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్– ఐపీఈఎంఏ అధ్యక్షుడు హరీశ్ గర్వార్ స్పష్టం చేశారు. దక్షిణాసియా స్థాయి ప్రదర్శనలో నాఫెడ్ సంస్థ డైరెక్టర్ అశోక్‌కుమార్ ఠాకూర్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇంటర్నేషనల్ ఎగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురేశ్ చిట్టూరి రాయుడు, ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్– ఐపీఈఎంఏ కార్యదర్శి చక్రధర్, రాష్ట్ర బ్రీడర్స్ అసోసియేషన్ చైర్మన్ జి.రంజిత్‌రెడ్డి, నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ అధ్యక్షుడు సుబ్బరాజు, తెలుగు రాష్ట్రాల పౌల్ట్రీ సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కోళ్ల పరిశ్రమకు డిజిటల్ టచ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోళ్ల పరిశ్రమ అనగానే సీజనల్ బిజినెస్ అంటారు. గుడ్ల నుంచి మొదలుపెడితే కోడి పిల్లల పెంపకం, ఫీడింగ్, కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్.. ఇలా ప్రతి దశలోనూ ఉష్ణోగ్రత, స్థానిక వాతావరణ ప్రభావితం చేస్తుంటాయి. ఏ మాత్రం తేడా వచ్చినా నష్టాలే. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ కోళ్ల పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఎందుకా అనిపించింది హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్–అర్చన దంపతులకు. అప్పటికే చేస్తున్న ఐటీ ఉద్యోగాలకు గుడ్‌బై కొట్టేసి ఎంఎల్‌ఐటీని ప్రారంభించారు. ఇదేంటంటే.. పొదుగు, కోడి పిల్లల ఉత్పత్తి, ఆహారం, శీతలీకరణ కేంద్రం, ఫుడ్ ప్రాసెసింగ్.. ఇలా కోళ్ల పరిశ్రమలో ప్రతి దశలోనూ టెక్నాలజీ అందిస్తుంది. మరిన్ని వివరాలు ఎంఎల్ఐటీ కో–ఫౌండర్ అర్చన ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది హైదరాబాద్. కస్తూర్బాలో ఎంఎస్సీ పూర్తయింది. పెళ్లయ్యాక ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాం. ఏడేళ్ల తర్వాత తిరిగి ఇండియాకి వచ్చి కుటుంబ వ్యాపారమైన ఇండస్ట్రియల్ పరికరాల తయారీలో భాగస్వామినయ్యా. నట్లు, బోల్ట్‌ల వంటి ప్రతి ఉత్పత్తి తయారీని ప్రత్యక్షంగా పరిశీలించాల్సిన అవసరం లేకుండా ఉత్పత్తుల తయారీ, నియంత్రణ, నిర్వహణ సులువుగా ఉండేలా ఐఓటీ ఆధారిత పరికరాన్ని అభివృద్ధి చేశా. ఈ ఐవోటీ పరికరం... ఉత్పత్తుల తయారీ సమయంలో ఉష్ణోగ్రత, ఒత్తిడి, వాతావరణ పరిస్థితులను నియంత్రిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. క్వాలిటీ మేనేజర్ పనంతా ఈ ఐఓటీ పరికరమే చేసేస్తుందన్నమాట! ఓ రోజు మా కస్టమర్‌తో మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు సంబంధించిన ఓ హేచరీస్ ఇంక్యుబేటర్‌లో ఉష్ణోగ్రత పెరిగి గుడ్లు పాడైపోయాయని ఫోన్ వచ్చింది. దీన్ని మాతో చెబుతు నట్లు, బోట్ల తయారీలో ఉష్ణోగ్రతలను నియంత్రించినట్లే పౌల్ట్రీ పరిశ్రమలోనూ ఉంటే బాగుండనని అన్నారాయన. అలా ఎంఎల్ఐటీ కంపెనీకి పునాది పడింది. 2016లో రూ.60 లక్షల పెట్టుబడితో టీ–హబ్ కేంద్రంగా ప్రారంభించాం. కన్‌సైట్, పౌల్ట్రీమాన్ రెండు పరికరాలు.. ప్రస్తుతం ఎంఎల్ఐటీ నుంచి రెండు ఉత్పత్తులున్నాయి. మొదటిది కన్‌సైట్. దీన్ని బిగ్ డేటా, క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేశాం. కోళ్ల పరిశ్రమలో ఉష్ణోగ్రతల నియంత్రణతో పాటు ఫామ్ నిర్వహణ, విశ్లేషణ సేవలందించడం దీని ప్రత్యేకత. ఒకేసారి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న అన్ని ఫామ్‌లను రియల్ టైమ్‌లో నిర్వహించుకునే వీలుంటుంది. ధర రూ.60 వేలు. రెండోది పౌల్ట్రీమాన్. సెన్సార్లు, క్లౌడ్ టెక్నాలజీ అనుసంధానిత పరికరమిది. దీన్ని హేచరీలో అనుసంధానం చేస్తాం. మొబైల్ అప్లికేషన్స్‌తో ఎప్పటికప్పుడు ఇంక్యుబేటర్‌లోని ఉష్ణోగ్రత నివేదికలను చూడొచ్చు. ఏమాత్రం తేడా వచ్చిన అలెర్ట్ చేస్తుంది. ఏ దశలో సమస్య ఉందో కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. దీంతో నేరుగా సమస్యను పరిష్కరించవచ్చు. ధర రూ.15 వేలు. వార్షిక నిర్వహణ రుసుము 12 శాతం. పౌల్ట్రీమాన్‌కు పేటెంట్ ఉంది. సెప్టెంబర్ నుంచి సుగుణలో సేవలు.. ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సేవలందిస్తున్నాం. దాదాపు 10 సంస్థలు మా సేవలు వినియోగించుకుంటున్నాయి. వీటిల్లో వంద వరకు ఇంక్యుబేషన్స్ ఉంటాయి. పెద్ద కంపెనీలతో మాట్లాడుతున్నాం. సుగుణ కంపెనీలో అన్ని విభాగాల్లోనూ పౌల్ట్రీమాన్, కన్‌సైట్ నిర్వహణ సేవలు సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది కాలంలో బెంగళూరు, కోయంబత్తూరు, కోల్‌కతాలకు విస్తరించనున్నాం. గతేడాది రూ.12 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.5 కోట్ల ఆదాయాన్ని, పౌల్ట్రీ పరిశ్రమలో 30 శాతం మార్కెట్ వాటాను లకి‡్ష్యంచాం. మా సంస్థలో ప్రస్తుతం 8 మంది ఉద్యోగులున్నారు. టెక్నాలజీ, సేల్స్ విభాగంలో మరో నలుగురిని తీసుకుంటున్నాం. దేశంలోని ప్రముఖ అగ్రిటెక్ వెంచర్ క్యాప్టలిస్ట్ నుంచి రూ.7 కోట్ల నిధులను సమీకరించనున్నాం. డీల్ 2 నెలల్లో పూర్తవుతుంది’’ అని అర్చన వివరించారు.