శుక్రవారం ప్రగతిభవన్‌లో నాబార్డ్ అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ రుణ వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డ్ సుముఖత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. నాబార్డ్ సీజీఎం వైకే రావుతో మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో నాబార్డ్ భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై మంత్రి చర్చించారు.
రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి అవుతుండటంతో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. ఐటీ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగు పరిచడం ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అది అందుబాటులోకి వస్తే వ్యవసాయ రంగంలో మార్పులు వస్తాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌కు రుణసాయం అందించాల్సిందిగా కోరారు.
పాడి పరిశ్రమను ప్రోత్సహించండి
పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు నాబార్డ్ ఇస్తున్న రుణాలను మరింత విస్తృతం చేయాలని కేటీఆర్ కోరారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాల్లో అర్హులైన వారికి పాడి పశువులు అం దించేందుకు నాబార్డు ముందుకు వస్తే తాము సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం తో నిర్మించే 500 గోదాములకు ఆర్థిక సాయం అందించాలని నాబార్డ్ సీజీఎంకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
రైతుబంధు కమిటీలను బలోపేతం చేస్తున్నందున వీటి ద్వారా వ్యవసాయ రంగానికి రుణాలను అందించే విషయాన్ని పరిశీలించాలన్నారు. నాబార్డు స్ఫూర్తికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ రంగ అభివృద్ధి కార్యక్ర మాలు ఉన్నాయని బ్యాంకు సీజీఎం వైకే రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సీజీఎం వివి ధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment