
నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (ఎన్‌ఎల్‌ఎమ్)
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ .. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (ఎన్‌ఎల్‌ఎమ్).
కేంద్ర ప్రభుత్వ పథకమైన నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా గొర్రెలు, మేకలు, పందులు, నాటుకోళ్ల పెంపకానికి 50 శాతం సబ్సిడీతో రుణ సదుపాయాన్ని అందిస్తోంది. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో అన్ని సామాజిక వర్గాలూ దీన్ని పొందవచ్చు. అయితే ఈ లోన్ కోసం బ్యాంకులను సంప్రదించినప్పుడు ఎన్.ఎల్.ఎమ్. ద్వారా అందుతున్న ముందస్తు సబ్సిడీ అవకాశం గురించి సిబ్బందికి చెప్పాలి.
సిబిల్ స్కోర్ కూడా బాగుండాలి. సొంత లేదా కనీసం అయిదేళ్ల లీజు కింద ఎకరం నుంచి అయిదు ఎకరాల వరకు భూమిని కలిగి ఉండాలి. నాటుకోళ్లు, పందుల పెంపకానికైతే ఎకరం భూమి సరిపోతుంది. గొర్రెలు, మేకలకు సంబంధించి అయితే.. 500 గొర్రెలకు గడ్డిసాగు, షెడ్డులాంటి వాటికోసం అయిదు ఎకరాల భూమి కావాలి. తగిన అర్హతలుంటే ఒకే కుటుంబంలో ఎంతమందైనా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
దరఖాస్తుకు..
ఉద్యమ్ మిత్ర పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు, వ్యక్తిగత గుర్తింపు, చిరునామా వగైరాలన్నిటికీ రుజువుగా పాస్‌పోర్ట్ లేదా ఆధార్‌కార్డ్, పాన్‌కార్డ్ వంటివి సమర్పించాలి. ఆదాయ రుజువు పత్రం, గడచిన రెండేళ్ల ఐటీఆర్, బ్యాంక్‌స్టేట్‌మెంట్,ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొటేషన్స్‌తోపాటు ఎక్కడైతే యూనిట్ పెట్టాలనుకుంటున్నారో ఆప్రాంతప్రాముఖ్యం, అక్కడ వ్యాపార అనుకూలతలు మొదలైన అంశాలతో పూర్తిప్రాజెక్ట్ రిపోర్ట్‌నూ సమర్పించాలి. పై వివరాలన్నిటిలో ఏ మాత్రం తప్పుల్లేకుండా చూసుకోవాలి.
దరఖాస్తును,ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను పశుసంవర్ధక శాఖా సిబ్బంది పరిశీలించి, అప్రూవ్ చేసిన పత్రాన్ని సంబంధిత బ్యాంకుకు పంపిస్తారు. అప్పుడు బ్యాంకు ద్వారా రుణం పొంది, సొంతపెట్టుబడినీ కూడబెట్టుకోవాలి. సబ్సిడీకి కూడా అప్లయ్ చేసుకోవాలి. సబ్సిడీ పొందడానికి కొంత సమయం పడుతుంది. సబ్సిడీ పొందిన వెంటనే యూనిట్‌నుప్రారంభించవచ్చు. ఈలోపు ఎక్కడైతే యూనిట్‌ను పెట్టాలనుకుంటారో అక్కడ గ్రాసాన్ని పెంచాలి. ప్రభుత్వం సూచించిన నమూనాలోనే షెడ్డును నిర్మించాలి. అందులోని పశువులకు పోషకాహారం, పశువైద్య సౌకర్యం వంటివీ చూసుకోవాలి. ఇటు గ్రామీణ... అటు పట్టణ్రపాంతాల్లో విజయవంతంగా ముందుకు సాగుతోందీ పథకం.
– బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్
మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ : ownership.sakshi@gmail.com
నిర్వహణ : సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment