animal husbandary
-
తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేదు.. చికెన్ తినొచ్చు: పశు సంవర్ధక శాఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బర్డ్ ఫ్లూ(Bird Flu) కేసులు నమోదు కాలేదని తెలిపారు తెలంగాణ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి. ఇతర కారణాలతో కోళ్లు మృతిచెందినట్టు ఆయన వెల్లడించారు. చికెన్ తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు.తెలంగాణ పశు సంవర్థకశాఖ డైరెక్టర్ గోపి తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదు. వరంగల్, ఖమ్మం జిల్లాలో కోళ్ల మృతిపై రక్త నమూనాలను ల్యాబ్స్‌కు పంపించాం. ఇతర కారణాలతో కోళ్లు మృతి చెందినట్లు తేలింది. బర్డ్ ఫ్లూపై పౌల్ట్రీ రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. కోళ్ల ఫారాల చుట్టూ బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలి. కోళ్ల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువ.ఈ నేపథ్యంలో చికెన్ తినడం వలన ఎలాంటి ఇబ్బంది లేదు. చికెన్, కోళ్లను ఉడికించి తినటం వలన వైరస్ బతికే ఛాన్స్ లేదు. కోళ్ల ఫారాలలో వైరస్ సోకిన కోళ్లకు దగ్గరగా పనిచేసే వారికి స్వల్పంగా దగ్గు, జలుబు వచ్చే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం’ అని చెప్పుకొచ్చారు. -
‘గొర్రెల’కు మంగళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అటకెక్కినట్టే కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై ఒక విడత పూర్తయిన ఈ పథకం కింద రెండో విడత గొర్రెలను పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మౌఖికంగా వచి్చన ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు చడీచప్పుడు లేకుండా గొల్ల కుర్మలు కట్టిన డీడీలను పశుసంవర్ధక శాఖ అధికారులు వెనక్కు ఇచ్చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక దరఖాస్తును కూడా రూపొందించిన ప్రభుత్వం.. ఆ దరఖాస్తు పెట్టుకున్న గొల్లకుర్మల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. గత నెలరోజులుగా..: ఈ డీడీల వాపస్ ప్రక్రియ నెల రోజుల క్రితమే ప్రారంభమైందని, జిల్లాల వారీగా వరుసగా డీడీలు వెనక్కు ఇస్తున్నారని, కొన్ని జిల్లాల్లో రెండు, మూడు రోజుల కిందటే ప్రారంభించామని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం కింద ఇప్పటివరకు 4 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశారు. మరో 3,37,816 మంది గొల్లకుర్మలకు రెండో విడతలో గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా, గత ఎన్నికల కంటే ముందు సుమారు 80 వేల మంది రూ.43,750 చొప్పున డీడీలు తీసి గొర్రెలెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం అకస్మాత్తుగా డీడీలు వాపస్ చేస్తుండటం గమనార్హం. ప్రత్యేక దరఖాస్తు రూపొందించి మరీ... వాస్తవానికి, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టిన మేనిఫెస్టోలో కూడా గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రస్తావించింది. తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని కొనసాగిస్తామని, 90 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచి్చంది. కానీ, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రత్యేక దరఖాస్తు రూపొందించి మరీ గొల్లకుర్మలు కట్టిన డీడీలను వారికి వెనక్కు ఇచ్చేస్తుండటం గమనార్హం. అయితే, మంత్రివర్గంలో ఎవరికీ కేటాయించకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి పరిధిలోకే పశుసంవర్ధక శాఖ వస్తుంది. నేరుగా సీఎం పర్యవేక్షణలోకి రావడంతో శాఖ కార్యకలాపాల గురించి ఆయనకు చెప్పేందుకు అధికారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి. అసలు గొర్రెల పథకం గురించి చర్చ జరిగింది ఒక్కసారేనని, ఈ చర్చ తర్వాతే ఉన్నతాధికారులు కొందరిపై రేవంత్ చర్యలు తీసుకున్నారని అధికారులంటున్నారు. అయితే, డీడీలు వెనక్కు ఇవ్వాలని నిజంగానే రేవంత్ ఆదేశాలిచ్చారా లేక అధికారులే చొరవ తీసుకుని ఈ పథకానికి మంగళం పాడేందుకు సిద్ధమవుతున్నారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో పథకం అమలులో అవినీతి జరిగితే ఈ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసి గొల్లకుర్మలకు మేలు చేయాలే కానీ ఏకంగా పథకాన్ని తీసేవిధంగా వ్యవహరించడమేంటనే చర్చ జరుగుతోంది. డీడీలు వెనక్కు ఇస్తున్న ప్రక్రియపై గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మాట్లాడుతూ.. గతంలో మాదిరి కాకుండా అవినీతికి తావు లేకుండా నగదు బదిలీ ద్వారా పథకాన్ని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. డీడీలను వాపస్ చేయడాన్ని వెంటనే నిలిపివేసి అసలు ఈ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. -
పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా మంజువాణి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా డాక్టర్ జి.మంజువాణి నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ ఎస్.రాంచందర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం, ఆయన స్థానంలో మంజువాణిని నియమించింది. ఈ మేరకు పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మంజువాణి తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. డాక్టర్ ఎస్.రాంచందర్‌ను తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ (టీఎల్‌ఎస్‌డీఏ) సీఈవోగా నియమించారు. కాగ్ నివేదిక నేపథ్యంలో! పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీలో జరిగిన కుంభకోణం కారణంగానే ఈ బదిలీలు జరిగాయనే చర్చ సాగుతోంది. గొర్రెల పంపిణీలో చాలా అవకతవకలు జరిగాయని, బైక్‌లపై కూడా గొర్రెలను తీసుకొచ్చారని ఇటీవల కాగ్ తన నివేదికలో వెల్లడించిన నేపథ్యంలో ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గిరిజన బిడ్డ కావడమే నేరమా?: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పశుసంవర్థక శాఖలో జరిగిన బదిలీలపై రాష్ట్ర బహుజన సమాజ్‌పార్టీ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ స్పందించారు. నిజాయితీకి మారుపేరైన రాంచందర్‌ను ఆగమేఘాల మీద బదిలీ చేసి బలిపశువును చేశారని, ఆయన తెలంగాణ తండాలలో జని్మంచిన గిరిజన బిడ్డ కావడమే నేరమా అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘గొర్రెల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రులను, వారి ఓఎస్డీలను, అప్పటి డైరెక్టర్లను ముట్టుకునే దమ్ముందా మీకు? ’అని ప్రభుత్వాన్ని నిలదీశారు. -
పశుపోషకులకు కొండంత భరోసా
సాక్షి, అమరావతి: నాణ్యమైన దాణాను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పశుపోషకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పశు పోషణ ఖర్చును భారీగా తగ్గించి.. పాడిరంగాన్ని లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా ఏపీ పశు దాణా చట్టం –2020 తీసుకొచ్చింది. దీని పరిధిలోకి దాణా తయారీ, సరఫరా, అమ్మకం కార్యకలాపాలన్నింటినీ తెచ్చింది. అంతేకాకుండా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లపెంపకందార్లకు నాణ్యతా ప్రమాణాలు కలిగిన.. కల్తీలేని దాణా, ఖనిజ లవణ మిశ్రమాన్ని నిర్దేశించిన ధరలకు అందించేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1,680 మంది తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్ట్‌లకు ఈ చట్టం కింద లైసెన్స్‌లు జారీ చేసింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ నాసిరకం దాణా తయారీ, విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతోంది. లైసెన్సుల జారీ, శాంపిల్స్ తనిఖీల ద్వారా ఇప్పటివరకు రూ.5.25 కోట్లు వసూలు చేసింది. పశువుల ఆహార అవసరాలకే 70 శాతం ఖర్చు రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 1.76 లక్షల గొర్రెలు, 55 లక్షల మేకలు, 10.78 లక్షల పౌల్ట్రీ సంపద ఉంది. మూగజీవాలకు ఏటా 65 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అవసరం కాగా ఏటా సగటున 70.92 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోందని అంచనా. పశుపోషణ కోసం చేసే ఖర్చులో 70 శాతం వాటి ఆహార అవసరాల కోసమే ఉంటోంది. గతంలో నాణ్యత విషయంలో దాణా తయారీదారులు గోప్యత పాటించడం పశుపోషకులకు ఆశనిపాతంగా ఉండేది. దాణాలో.. తేమ, ముడి మాంసకృత్తులు, ముడి కొవ్వు పదార్థాలు, ముడి పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి. ఇలా తయారైన దాణాను అధిక మోతాదులో వినియోగిస్తే తప్ప ఆశించిన స్థాయిలో ఉత్పాదన వచ్చేది కాదు. ముడి మాంసకృత్తులను పెంచడానికి కొంతమంది తయారీదారులు చట్టవిరుద్ధమైన పనులు చేసేవారు. దీంతో పెట్టుబడి భారం పెరగడంతోపాటు నాణ్యమైన పాల ఉత్పత్తి రాక పశుపోషకులు ఆర్థికంగా నష్టపోయేవారు. మరోవైపు ఆరోగ్యవంతమైన పశువులు సైతం దీర్ఘకాలిక రోగాల బారిన పడేవి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఏపీ పశు దాణా చట్టం తెచ్చింది. ఈ చట్టం 2021 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. చట్టం అమలుకు ప్రత్యేక కమిటీలు పశు దాణా చట్టం అమలు కోసం ప్రత్యేకంగా పశుదాణా నాణ్యత, నియంత్రణ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘కంట్రోలింగ్ అథారిటీ, కలెక్టర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారుల నేతృత్వంలో జిల్లా స్థాయి లైసెన్సింగ్ అథారిటీలను నియమించింది. పశుదాణా నాణ్యతను తనిఖీ చేసేందుకు స్థానిక పశువైద్యులకు యానిమల్ ఫీడ్ ఇన్స్పెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది. వీరు క్షేత్ర స్థాయి తనిఖీల్లో సేకరించిన శాంపిల్స్‌కు ప్రభుత్వం గుర్తించిన ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు చేస్తున్నారు. తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ షాపులను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ యానిమల్ ఫీడ్ యాక్ట్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ పేరిట ప్రత్యేకంగా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఇప్పటివరకు 1,680 మంది దాణా తయారీదారులు, అమ్మకందార్లకు లైసెన్సులు ఇచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక గతంతో పోలిస్తే నాసిరకం దాణా తయారీ, సరఫరా, అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని పశుపోషకులు చెబుతున్నారు. నాణ్యత లేని దాణా తయారుచేస్తే క్రిమినల్ కేసులు.. పశు దాణా చట్టం అమల్లోకి వచ్చాక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నాం. నాణ్యత లేని దాణా తయారీదారులు, నిరీ్ణత ప్రమాణాలు పాటించనివారు, తప్పుడు ప్రకటనలు ఇచ్చే కంపెనీలపై ఈ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించినట్టు తేలితే కనీసం ఏడేళ్లు జైలుశిక్ష, తగిన జరిమానా పడుతుంది. – డాక్టర్ అమరేంద్రకుమార్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ -
కాసేపట్లో పశుసంవర్ధక సహాయకుల పోస్టు ఫలితాలు విడుదల
సాక్షి, తాడేపల్లి: పశు సంవర్ధక సహాయకుల పోస్టుల రాత పరీక్ష ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను https://apaha-recruitment.aptonline.in/ వెబ్ సైట్లో చూసుకోవచ్చు. కాగా సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసి.. గత డిసెంబర్ 31వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించింది. ఎంపికైన వారికి రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 చొప్పున ఇస్తారు. ఉమ్మడి జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు జిల్లా పోస్టుల సంఖ్య అనంతపురం 473 చిత్తూరు 100 కర్నూలు 252 వైఎస్సార్ 210 నెల్లూరు 143 ప్రకాశం 177 గుంటూరు 229 కృష్ణా 120 పశ్చిమ గోదావరి 102 తూర్పు గోదావరి 15 విశాఖపట్నం 28 విజయనగరం 13 శ్రీకాకుళం 34 -
పశు సంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి పశుసంవర్ధక శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులకు డిసెంబర్ 27న హాల్‌టికెట్లు జారీ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు. వేతనం రూ.22,460 ఎంపికైన వారికి రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 చొప్పున ఇస్తారు. అభ్యర్థులు 18–42 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి, విద్యార్హతలు, ఇతర వివరాలు ahd.aptonline.in, https://apaha- recruitment.aptonline.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తులు కూడా ఇదే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నిర్ధేశిత రుసుములను డిసెంబర్ 10వ తేదీలోగా చెల్లించాలి. దరఖాస్తులను డిసెంబర్ 11వ తేదీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు విడతల్లో 4,643 పోస్టుల భర్తీ సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే పశు సంపద ఆధారంగా 9,844 వీఏహెచ్‌ఏలు అవసరమని గుర్తించి ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు విడతల్లో 4,643 ఆర్బీకేల్లో వీఏహెచ్‌ఏలను నియమించారు. రేషనలైజేషన్ ద్వారా గ్రామ పరిధిలో 2–3 ఆర్బీకేలు ఉన్న చోట గ్రామాన్ని యూనిట్‌గా వీఏహెచ్‌ఏలను నియమించి, అదనంగా ఉన్న వీఏహెచ్‌ఏలను లేనిచోట్ల సర్దుబాటు చేశారు. మిగిలిన 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్‌ఏల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పోస్టుల భర్తీకి పశు సంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు జిల్లా పోస్టుల సంఖ్య అనంతపురం 473 చిత్తూరు 100 కర్నూలు 252 వైఎస్సార్ 210 నెల్లూరు 143 ప్రకాశం 177 గుంటూరు 229 కృష్ణా 120 పశ్చిమ గోదావరి 102 తూర్పు గోదావరి 15 విశాఖపట్నం 28 విజయనగరం 13 శ్రీకాకుళం 34 -
వర్షం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయం, పశువుల గ్రాసం తదితర అంశాలపై ఆయన శనివారం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల్లో ఆగస్టులో కూడా వర్షాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయంపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణంకంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వర్షపాతం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. అధిక వర్షాలతో వరి నారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటీయూ 1010, 1121,1153, బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 34449 వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బి.ఆర్.అంబేద్కర్, పశు సంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, మత్స్య శాఖ అదనపు సంచాలకులు డా. అంజలి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులుపాల్గొన్నారు. -
గొల్ల, కుర్మ సొసైటీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ఎప్పుడో..?
కైలాస్‌నగర్: పశుసంవర్ధకశాఖ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొల్ల, కుర్మలకు అందించే పథకాలు, రాయితీ యూనిట్లు, గొర్రెలు, బర్రెలు, పశువులు వంటి ప్రయోజనాలు పొందాలంటే ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘ సభ్యులై ఉండాలి. ఈ సంఘాల్లో సభ్యులైన వారికే ప్రభుత్వపరంగా అందించే ప్రయోజనాల్లో ప్రాధాన్యత దక్కుతుంది. ఇంతటి కీలకమైన ఈ సంఘాల జిల్లా అధ్యక్ష ఎన్నికలు ఐదేళ్లుగా పత్తాలేకుండా పోయాయి. మండల సంఘాల ఎన్నికలు సకాలంలో జరగకపోవడం, వాటిి నిర్వహణపై జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా క్షేత్రస్థాయిలో సరైన ప్రచారం జరగక గొల్ల, కుర్మలకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఐదేళ్లుగా పత్తాలేని అధ్యక్ష ఎన్నికలు జిల్లా ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘ అధ్యక్ష ఎన్నికలు ఐదేళ్లుగా పత్తా లేకుండాపోయాయి. జిల్లా పునర్విభజనకు ముందు ఉమ్మడి జిల్లా సహకార సంఘం అధ్యక్షుడిగా మంచిర్యాల జిల్లాకు చెందిన రెంకల హన్మండ్లు యాదవ్ పనిచేశారు. ఆ తర్వాత 2018 నుంచి ఈ పదవికి ఎన్నికలు నిర్వహించ లేదు. నిబంధనల ప్రకారం 70సొసైటీల మండల అధ్యక్షులు ఎన్నికై తే జిల్లా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించవచ్చనేది అధికారులే చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా కసరత్తు చేయడం లేదు. జిల్లాలో 97 సొసైటీలకు అధ్యక్షులు ఎన్నికయ్యారు. వీరి పదవీకాలం ఇప్పటికే సగం గడిచిపోయింది. అయితే జిల్లా అధ్యక్షుడి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేకపోవడం గమనార్హం. అధ్యక్షుడు ఉన్నట్లేతే గొల్ల, కుర్మల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి మార్గం చూపే అవకాశముంటుందని కులస్తులు చెబుతున్నారు. ఎన్నికలు వెంటనే నిర్వహించాలి మండల సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికై రెండేళ్లు గడుస్తు న్నా ఇంకా జిల్లా ఎన్నికలు నిర్వహించడం లేదు. ఓ వైపు పదవీ కాలం ముగిసేదశకు వస్తున్నా ఎ ప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. గొ ల్ల, కుర్మలు ఏవైనా సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరిని కలువాలో తెలియడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే జిల్లా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. – మేకల రవికాంత్, తలమడుగు సొసైటీ అధ్యక్షుడు మండలస్థాయి ఎన్నికలు పూర్తికాలేదు అన్ని మండలాల్లో ఈ సొసైటీ అధ్యక్ష ఎన్నికలు ఇంకా పూర్తికాలేదు. జిల్లాలో 97 మాత్రమే పూర్తయ్యాయి. ఓటరు జాబితా తయారీ కోసం మిగతా సంఘాల సభ్యుల ఆధార్ వివరాలు కో రుతున్నాం. కానీ వారు స్పందించట్లేదు. పూర్తి వివరాలు అందిన వెంటనే ఓటరు జాబితా సిద్ధం చేసి రాష్ట్ర సహకార శాఖకు పంపిస్తాం. – కిషన్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి -
రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట
చెన్నూర్: కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని కేంద్ర పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి పరుషోత్తం రూపాలా అన్నారు. తొమ్మిదేళ్ల మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం చెన్నూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2014లో దేశంలో అవినీతి రాజ్యమేలిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేకుండా చేశారని అన్నారు. రైతులకు ఏటా రూ.18 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేస్తున్నారని తెలిపారు. మత్స్యశాఖ వారి కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తామని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం అనేక నిధులు మంజూరు చేసిందని, ఇక్కడ మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నేటికీ ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరం ఆలయానికి ప్రత్యేకత ఉందని, కాళేశ్వరం పేరుతో ప్రజలకు అన్యాయం చేయడాన్ని దేవుడు క్షమించడని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మాజీ ఎంపీ వివేక్‌వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పా లన సాగుతోందని విమర్శించారు. గోదావరి పరిరక్షణ కోసం చెన్నూర్ గోదావరి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం మండలంలోని గంగారం, అస్నాద్ గ్రామాలకు చెందిన ఇద్దరు వార్డు సభ్యులతోపాటు పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎరబెల్లి రఘునాథ్‌రావు, బెల్లంపల్లి ఇన్చార్జి ఏమాజీ, ప్రభాకర్, జిల్లా నాయకులు వెంకటేశ్వర్‌గౌడ్, సుశీల్‌కుమార్, చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. గడప గడపకు బీజేపీ ప్రచారం ప్రారంభం తాండూర్: మండల కేంద్రంలో గురువారం గడపగడపకు బీజేపీ ప్రచారాన్ని కేంద్రమంత్రి పరుషోత్తం రూపాల ప్రారంభించారు. విద్యాభారతి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎఫ్‌సీఐ సభ్యుడు పుల్గం తిరుపతి, నాయకులు కృష్ణదేవరాయలు, శ్రీవాణి, చిరంజీవి, సంతోష్, విష్ణు, ప్రవీణ్ పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధిని పట్టించుకోని ప్రభుత్వం బెల్లంపల్లిరూరల్: మండలంంలోని కన్నాల శివారులో ఉన్న బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల వి మర్శించారు. గురువారం సాయంత్రం ఆయ న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ మూడు గుట్ట ల నడుమ అటవీ ప్రాంతంలో ఆలయం ఎంతో విశాలంగా ఉందని తెలిపారు. అనంతరం ఆయనను బెల్లంపల్లి బీజేపీ నాయకులు శా లువాతో ఘనంగా సన్మానించారు. బీజేపీ జి ల్లా ఉపాధ్యక్షుడు పులగం తిరుపతి, జిల్లా అధి కార ప్రతినిధి శ్రీకృష్ణదేవరాయలు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటకృష్ణ, బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, నాయకులు పాల్గొన్నారు. -
పాల ఉత్పత్తిలో టాప్ 5లో ఏపీ
సాక్షి, అమరావతి: జాతీయ సగటును మించి ఆంధ్రప్రదేశ్‌లో రోజు వారీ తలసరి పాల లభ్యత ఎక్కువగా ఉందని కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ–2022 సర్వే వెల్లడించింది. జాతీయ స్థాయిలో రోజు వారీ తలసరి పాల లభ్యత 444 గ్రాములుండగా ఆంధ్రప్రదేశ్‌లో 799 గ్రాములుందని సర్వే పేర్కొంది. దేశంలోని పది రాష్ట్రాలు జాతీయ సగటు కంటే ఎక్కువ లభ్యత కలిగి ఉన్నాయని సర్వే తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగోస్థానంలో ఉండగా.. మొదటి మూడు స్థానాల్లో వరుసగా పంజాబ్, రాజస్థాన్, హరియాణ ఉన్నాయి. గతేడాదికి సంబంధించి దేశంలో పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది. ఏపీ కంటే ముందువరసలో మొదటి నుంచి నాలుగు వరకు వరసగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ నిలిచాయి. దేశంలో మొత్తం పాల ఉత్పత్తిలో 53.11 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే జరుగుతోందని సర్వే వెల్లడించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా రాష్ట్రంలో పాలిచ్చే ఆవులు, గేదెల సంఖ్య పెరగడమే కాకుండా వాటి పాల ఉత్పత్తి కూడా పెరిగిందని సర్వే వివరించింది. రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా పాల ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. 2020–21లో రాష్ట్రంలో 1,47,13,840 టన్నుల పాలు ఉత్పత్తి జరగ్గా 2021–22లో 1,54,03,080 టన్నుల ఉత్పత్తి జరిగినట్లు సర్వే పేర్కొంది. -
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కాదు.. 'కౌ హగ్ డే'..!
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు అని అందరికీ తెలుసు. యువతీ, యువకులు తాము ప్రేమించిన వారికి ఈరోజే ప్రపోజ్ చేస్తుంటారు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వాములకు ప్రత్యేక కానుకలు ఇచ్చి సర్ఫ్రైజ్ చేస్తుంటారు. భారతీయ యువతలో ఈ ఆలోచనను మార్చాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ భావిస్తోంది. పాశ్చాత్య దేశాల పట్ల ప్రభావితమై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతున్న యువతలో మార్పు తీసుకురావాలనుకుంటోంది. అందుకే ఫిబ్రవరి 14ను 'కౌ హగ్ డే'గా జరుపుకొని గోవులను ఆలింగనం చేసుకోవాలని పిలుపునిచ్చింది. 'భారతీయ సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవులు వెన్నెముక. పశుసంపదకు, జీవ వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మానవాళికి సకల సంపదలను అందించే తల్లి వంటి పోషకాహార స్వభావం ఉన్నందున ఆవును కామధేను, గోమాత అని పిలుస్తారు. గోవును ఆలింగనం చేసుకుంటే మానసిక ఆనందం కలుగుతుంది. అందుకే ఫిబ్రవరి 14 కౌ హగ్ డే జరుపుకోండి' అని పేర్కొంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ సూచన మేరకు ఆ శాఖ కార్యదర్శి ఈ ప్రకటన విడుదల చేశారు. చదవండి: పార్లమెంట్లో విపక్షాలను ఏకిపారేసిన మోదీ.. -
ఇతర రాష్ట్రాల్లోనూ పశు వైద్య రథాలు
సాక్షి, అమరావతి: మూగ జీవాల ఆరోగ్య సంరక్షణకు సైతం అత్యంత ప్రాధాన్యమిస్తూ 108 అంబులెన్స్‌ల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మొబైల్ అంబులేటరీ క్లినిక్స్’ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. జార్ఖండ్‌లో ఇప్పటికే వీటిని అందుబాటులోకి తీసుకురాఆ, ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెలాఖరు నాటికి సేవలందించనున్నాయి. పంజాబ్‌లో టెండర్లు పిలవగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. వాహనాల్లో అత్యాధునిక సౌకర్యాలు దేశంలోనే తొలిసారిగా రైతుల ముంగిటకు వెళ్లి మూగ జీవాలకు వైద్య సేవలందించే సంకల్పంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున తొలి విడతలో 175 వైఎస్సార్ సంచార పశు వైద్యసేవా రథాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అంబులెన్స్‌ల తయారీతో పాటు రెండేళ్ల పాటు నిర్వహణ కోసం రూ.133.13 కోట్లు ఖర్చు చేస్తోంది. గతేడాది మే 19న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటి సేవలను ప్రారంభించి టోల్ ఫ్రీ నంబర్ 1962తో అనుసంధానించారు. ప్రత్యేకంగా రూ.7 కోట్లతో కాల్ సెంటర్ నెలకొల్పారు. మూగ జీవాలకు ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పెరటి కోళ్లు, పక్షులకు చిన్నపాటి సర్జరీలు అక్కడే నిర్వహించేలా తీర్చిదిద్దారు. అంబులెన్స్‌లో మినీ ల్యాబ్ ఏర్పాటు చేశారు. వెయ్యి కిలోల బరువున్న జీవాలను సునాయాసంగా తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ జాక్ లిఫ్ట్ సౌకర్యం కల్పించారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి వాహనానికి డ్రైవర్ కమ్ అటెండర్‌తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ కమ్ కాంపౌండర్, ఒక వైద్యుడిని నియమించారు. 1.72 లక్షల మూగ జీవాలకు సేవలు ఫోన్ కాల్ వచ్చిన అరగంటలోపే మూగ జీవాలకు వైద్యసేవలు అందిస్తూ అవసరమైన మందులను ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 3.52లక్షల ఫోన్‌కాల్స్ రాగా, వాహనాలు 1.20లక్షల ట్రిప్పులు తిరిగాయి. 2,127 ఆర్బీకేల పరిధిలో 1.72లక్షల మూగ, సన్నజీవాలకు గత 8 నెలలుగా సేవలందిస్తున్నాయి. రెండో విడతలో రూ.119.18 కోట్లతో మరో 165 అంబులెన్స్‌లను ఈ నెలాఖరుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సర్వత్రా ప్రశంసలు అంబులెన్స్‌లలో సమకూర్చిన సౌకర్యాలు, అందిస్తున్న సేవలను జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అధికారుల బృందాల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఇదే తరహాలో సంచార పశు వైద్య సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. లక్ష పశు సంపద ఉన్న ప్రాంతానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తే ఆర్థిక చేయూతనిస్తామని ప్రకటించడంతో పలు రాష్ట్రాలు ఏపీ బాట పట్టాయి. కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్ర బృందాలు ఏపీలో పర్యటించి వీటి సేవలపై అధ్యయనం చేశాయి. మన రాష్ట్రంలో సమర్ధంగా నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈఎంఆర్ఐ) గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థకే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లో వాహనాల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. సీఎం ఆలోచనలు స్ఫూర్తిదాయకం సీఎం వైఎస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టినవే మొబైల్ అంబులేటరీ క్లినిక్స్. మూగజీవాలకు సైతం నాణ్యమైన సేవలందించే లక్ష్యంతో తెచ్చిన వీటి సేవలను అందిపుచ్చుకునేందుకు పలు రాష్ట్రాలు పోటీపడుతుండడం గర్వ కారణం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక శాఖమంత్రి పలు రాష్ట్రాలు సంప్రదిస్తున్నాయి.. ఏపీ తరహాలో అంబులెన్స్‌లు ప్రవేశపెట్టి నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు పలు రాష్ట్రాలు సంప్రదిస్తున్నాయి. ఇప్పటికే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మాతో కలసి పని చేసేందుకు సిద్ధమయ్యాయి. మిగిలిన రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయి. – ఎస్.రామకృష్ణవర్మ, ఈఎంఆర్ఐ ఆపరేషన్స్ ఏపీ స్టేట్ హెడ్ -
పంజాబ్‌కు ఆదర్శంగా ఏపీ
సాక్షి, అమరావతి: పాడి అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిన పంజాబ్ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుంటోంది. మూగజీవాల కోసం ఏపీ ప్రభుత్వం విజయవంతంగా అమలుచేస్తున్న మొబైల్ అంబులేటరీ వెహికల్స్ సేవలను పంజాబ్‌లోనూ ఆచరణలోకి తీసుకొస్తున్నామని.. ఇందుకోసం కార్యాచరణ సిద్ధంచేస్తున్నామని పంజాబ్ రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ ప్రతాప్ తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడలోని పశుసంవర్థక శాఖ సంచాలకుల కార్యాలయంలో వైఎస్సార్ పశుసంచార వైద్య సేవా రథాలను పంజాబ్ స్టేట్ పశుసంవర్ధక శాఖ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎంపీ సింగ్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. అంబులెన్స్‌లో ఏర్పాటుచేసిన సౌకర్యాలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అందులో ఉన్న సౌకర్యాలను పశుసంవర్థక శాఖ డైరెక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ వివరించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో వికాస్ ప్రతాప్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఏపీ ఆర్బీకేలపై దేశవ్యాప్తంగా చర్చ 22 జిల్లాలతో కూడిన మా రాష్ట్రంలో 25 లక్షల ఆవులు, 40 లక్షల గేదెలున్నాయి. ముర్రా జాతి పశువులే ప్రధాన పాడి సంపద. ఏపీలో మాదిరిగానే పంజాబ్‌లోనూ సహకార రంగం చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడి ఆర్బీకేల తరహాలో సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఏపీలో ఏర్పాటుచేసిన ఆర్బీకేలపై దేశం మొత్తం చర్చించుకుంటోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా దూరదృష్టితో వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. వన్‌స్టాప్ సొల్యూషన్ సెంటర్స్‌గా తీర్చిదిద్దిన ఆర్బీకేల ఆలోచన చాలా వినూత్నం. అలాగే, దేశీవాళీ గో జాతులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఇక్కడ గో పెంపకం కేంద్రాల ఏర్పాటు కూడా మంచి ఆలోచన. వాటి ఉత్పత్తులకు కూడా మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం నిజంగా గొప్ప విషయం. ఏపీ ప్రభుత్వం నుంచి నేర్చుకోవాల్సిన, ఆచరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పంజాబ్‌లో 70 వాహనాలు ఏర్పాటుచేస్తున్నాం వైఎస్సార్ పశు సంచార వైద్య సేవా రథాలలో కల్పించిన సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఇదే మోడల్లో మా రాష్ట్రంలోనూ జిల్లాకు మూడుచొప్పున 70 వాహనాలు ఏర్పాటుచేయాలని సంకల్పించాం. అందుకోసమే వాటిని çపరిశీలించేందుకు ఇక్కడకు వచ్చాం. తాము ఊహించిన దానికంటే మెరుగైన సౌకర్యాలను ఈ అంబులెన్స్‌లలో కల్పించారు. ప్రతీ వాహనానికి ఓ పశువైద్యుడు, వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను నియమించడం, వెయ్యికిలోల బరువున్న జీవాలను తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్ట్, 20 రకాల పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు అనువుగా మైక్రోస్కోప్‌తో కూడిన మినీ లేబొరేటరీ, ప్రాథమిక వైద్యసేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించడం చాలా బాగుంది. టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్చేయగానే రైతు ముంగిటకు వచ్చి వైద్యసేవలు అందిస్తున్న తీరు కూడా అద్భుతం. వాహనాలను డిజైన్ చేసిన టాటా, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జీవీకే యాజమాన్యాలకు నా ప్రత్యేక అభినందనలు. -
ఆర్బీకేల ద్వారా పశుగ్రాసం విత్తనాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన పశుగ్రాస విత్తనాల సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థానికంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న సీఎస్హెచ్–24 జొన్న రకం పశుగ్రాసం విత్తనాలను సరఫరా చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 75 శాతం సబ్సిడీపై 1,503.87 టన్నులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాల వారీగా స్థానికంగా ఉన్న పశు సంపద, డిమాండ్ ఆధారంగా ఆర్బీకేలకు కేటాయిస్తున్నారు. 20 సెంట్ల నుంచి ఎకరం వ్యవసాయ పొలం కలిగిన సన్న, చిన్నకారు రైతులకు 5 నుంచి 20 కిలోల వరకు సరఫరా చేయనున్నారు. మార్కెట్లో ఐదు కిలోల ప్యాకెట్ విలువ రూ.436.75 ఉండగా, ప్రభుత్వం రూ.327.55 సబ్సిడీగా భరిస్తుంది. రైతు కేవలం రూ.109.20 చెల్లిస్తే చాలు. వర్షాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఈ విత్తనం చల్లుకుంటే మూడు నెలల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు 15–20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఆరేడు పశువులకు కనీసం ఆరు నెలలపాటు పశుగ్రాసానికి లోటు లేకుండా అందించవచ్చు. వీటిలో అత్యధికంగా 8–10 శాతం వరకు మాంసకృత్తులతో పాటు కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆసక్తి గల రైతులు సమీప ఆర్బీకేలోని కియోస్క్ ద్వారా బుక్ చేసుకుని సబ్సిడీ పోనూ మిగిలిన మొత్తం చెల్లిస్తే 24 గంటల్లోనే సరఫరా చేస్తారు. ఆర్బీకేల్లో సంప్రదించండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన పశుగ్రాసం విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నాం. అర్హత, ఆసక్తి కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమీప ఆర్బీకేల్లోని పశుసంవర్థక సహాయకులను సంప్రదించండి. నాణ్యమైన సీఎస్హెచ్–24 విత్తనాన్ని తీసుకొని అదును దాటిపోకుండా నాటుకోవాలి. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్థక శాఖ -
విశ్రాంతి గదిలో విగతజీవిగా.. ఏడీ అనుమానాస్పద మృతి
సాక్షి, అనంతపురం: పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) ఎం.రాము (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని మొదటి అంతస్తులో గల విశ్రాంతి గదిలో ఉరికి వేలాడుతుండగా సిబ్బంది మంగళవారం గమనించారు. తలుపులు తెరిచి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. తన చావుకు పలువురు కారణమంటూ పేర్లు రాసి ఉన్న లేఖ లభించింది. హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు, కార్యాలయ సిబ్బంది తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లాకు చెందిన ఎం.రాముకు భార్య రాణి (ప్రభుత్వ కళాశాల లెక్చరర్), కుమార్తె రిత్విక ఉన్నారు. భార్య, కుమార్తె కర్నూలులో స్థిరపడగా.. రాము మాత్రం పదేళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన ధర్మవరం, పుట్టపర్తి ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. ప్రస్తుతం డీఆర్డీఏ లైవ్‌స్టాక్ విభాగం డీపీఎంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం సాయంత్రం క్యాంపు ముగించుకుని విశ్రాంతి గదికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం పశుసంవర్ధక శాఖ కార్యాలయ డ్రైవర్ రామసుబ్బారెడ్డి విద్యుత్ మోటార్ ఆన్ చేసేందుకని మొదటి అంతస్తులోకి వచ్చాడు. చదవండి: (ప్రేయసి ఇంటి వరండాలో శవంగా మారిన యువకుడు) అప్పటికే అక్కడ విశ్రాంతి గది తలుపులు కొంత తెరుచుకుని ఉండటంతో లోపలికి తొంగి చూశాడు. ఫ్యాన్‌కు ఉరికి వేలాడుతున్న ఏడీని చూసి వెంటనే ఉన్నతాధికారులతో పాటు పోలీసులకు సమాచారమందించాడు. వన్‌టౌన్ పోలీసులు హుటాహుటిన వచ్చి గదిని పరిశీలించగా.. సూసైడ్ నోట్ లభించింది. మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చనిపోవడానికి ముందు పలువురితో సంభాషించినట్లు, గట్టిగా అరుస్తున్నట్లు శబ్దాలు వినిపించాయని సిబ్బంది పోలీసులకు తెలిపారు. స్వతహాగా ఏడీ స్థానికంగా ఎవరితోనూ కలివిడిగా ఉండేవారు కాకపోవడంతో సూసైడ్ నోట్లో పేర్కొన్న వ్యక్తులు, వారి వ్యవహారాల గురించి తెలియదని పేర్కొన్నారు. డ్రైవర్ రామసుబ్బారెడ్డిని ప్రాథమికంగా విచారణ చేశారు. ఏడీ గదికి ఎవరెవరు వచ్చారో.. ఆయన ఏ సమయంలో చనిపోయారో తెలియదని సిబ్బంది తెలిపారు. అయితే తలుపులు తెరిచి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. హత్యా.. ఆత్మహత్యా.. మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలుస్తామన్నారు. చదవండి: (ఏడాది క్రితం పెళ్లి.. జోగ్ ఫాల్స్ చూడాలని వెళ్లి..) ఏడీ సూసైడ్ నోట్లో ఏముందంటే... ‘నా చావుకు కారణం అటెండర్ జాకీర్, కోట్ల విజయ, కోట్ల అనిల్, కోట్ల విజయ లవర్ మహేష్. వీరు రూ.50 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినారు. చిక్కబళ్లాపురకు చెందిన నెట్ సెర్ఫ్ వ్యాపార భాగస్వామి మునిరాం, పుట్టపర్తికి చెందిన జియోన్ మెడికల్ షాపు ఓనర్ అశోక్‌కుమార్, ధర్మవరానికి చెందిన మెడికల్ స్టోర్ అశ్వర్థనారాయణ, హరికృష్ణ కల్లూరు స్టాక్ తీసుకుపోయి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. సెమన్ బ్యాంకులో పని చేసే డీసీ హుసేన్, అశోక్‌కుమార్‌లకు నా పేరు మీద ప్రాంసరీ నోటు రాయించి రూ.4లక్షలు ఇప్పించాను. నన్ను మోసం చేసినారు. ధర్మవరంలో 27.50 ఎకరాల భూమి పత్రాలు 925–2022 చెన్నేకొత్తపల్లి’ అంటూ అస్పష్టంగా వివరాలు రాశారు. -
Telangana: ఎలుకలను పట్టే గ్లూట్రాప్‌లపై నిషేధం!
సాక్షి, హైదరాబాద్: ఎలుకలను పట్టేందుకు వినియోగించే గ్లూట్రాప్ (జిగురుతో కూడిన ఉచ్చు)ల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేదించింది. గ్లూట్రాప్స్‌తో ఎలుకలను పట్టడం అత్యంత క్రూరమైన విధానమని, ఎలుకలు వాటికి అతుక్కుపోయి తీవ్రనొప్పి, బాధను ఎదుర్కొంటాయని.. గ్లూట్రాప్‌ల వినియోగం జంతువులపై క్రూరత్వం నిషేధ చట్టం– 1960లోని సెక్షన్ 11 స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్థకశాఖ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. నిషేధాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఉచ్చుబిగించడం తోపాటు ఇతర సంప్రదాయ పద్ధతుల్లో ఎలు కల నియంత్రణకు చర్యలు తీసుకోవచ్చని ప్రజలకు సూచించింది. కాగా.. గ్లూట్రాప్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం చర్య తీసుకోవడంపై ‘పెటా’ హర్షం వ్యక్తం చేసింది. -
చేపల వినియోగం పెంచడానికి హబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి,అమరావతి: ఆక్వా రైతులకు మంచి ధరలు అందాలని, ఈ లక్ష్యాలను చేరుకోవడానికి రాష్ట్రంలో వినియోగం పెంచే దిశగా ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. చేపల వినియోగం పెరగాలని, సరసమైన ధరలకు ప్రజలకు చేరాలని ఆయన అధికారులకు సూచించారు. పశుసంవర్ధకశాఖ, డెయిరీ, ఫిషరీస్ విభాగాలపై వైఎస్ జగన్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చేపల రవాణా, నిల్వ తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా లాబ్స్‌ను వినియోగించుకోవడంపై ప్రచారం, అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆక్వా రంగానికి సంబంధించి క్వాలిటీ చెకింగ్స్ ఎలా చేయించుకోవాలన్నదానిపై అవగాహన పెంచాలన్నారు. ఈ ల్యాబ్‌లను ఆర్బీకేలకు అనుసంధానం చేయాలని, ఆక్వా సీడ్, ఫీడ్ల విషయంలో ఎలాంటి కల్తీలు ఉండకూడదని తెలిపారు. కేజ్ ఫిష్ కల్చర్‌పై కార్యాచరణ ప్రణాళిక 5 ఫిషింగ్ హార్బర్లు, 1 ఫిస్ ల్యాండ్ సెంటర్లో పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేజ్ ఫిష్ కల్చర్, మరీకల్చర్‌లపై దృష్టి పెట్టాలని, ఆదాయాలు బాగా పెరుగుతాయని తెలిపారు. కేజ్ ఫిష్ కల్చర్‌పై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, రైతులు, ఔత్సాహికులతో కలిసి ముందుకు సాగేలా ఒక ప్రణాళిక తీసుకురావాలని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్ ఫిష్ కల్చర్, మూడు చోట్ల మరీకల్చర్‌లను మొదలుపెట్టాలని తెలిపారు. వెటర్నరీ డిస్పెన్సరీల్లో హేతుబద్ధత ఉండాలని, ప్రతి గ్రామం, మండలంలో ఏం ఉండాలనేదాన్ని నిర్ధారించాలని అధికారులకు సీఎం సూచించారు. డిస్పెన్సరీలు ఆర్బీకేలతో అనుసంధానం హేతుబద్ధత ప్రకారం డిస్పెన్సరీలను పెట్టాలని, తర్వాత వాటిని మెరుగ్గా నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. డిస్పెన్సరీలు ఆర్బీకేలతో అనుసంధానం చేయాలన్నారు. అయితే కొన్ని డిస్పెన్సరీలు లేని మండలాలు కూడా ఉన్నాయని అధికారులు ముందు మ్యాపింగ్ చేసి తర్వాత వాటిని ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల ఆస్పత్రుల్లో నాడు-నేడుపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడులో భాగంగా నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను ముందు నిర్దారించుకోలన్నారు. తర్వాత పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఆ పోస్టులు వెంటనే భర్తీ చేయండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అదే విధంగా, వెటర్నరీ వైద్యులు తప్పనిసరిగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆర్బీకేల్లో కూడా సేవలందించాలని, ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశు సంవవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఆర్బీకేల్లో కియోస్క్ ద్వారా పశు దాణా, మందులు కూడా ఇవ్వండి. సీడ్, ఫీడ్, మెడికేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. నాసిరకం వాడకూడదు, కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలి’’అని మార్గనిర్దేశనం చేశారు. ఇందుకు స్పందనగా.. ఫీడ్, సీడ్ కియోస్క్ ద్వారా ఇప్పటికే మందులు సరఫరా చేస్తున్నామని అధికారులు సమాధానమిచ్చారు.ఈ క్రమంలో.. ‘‘రైతులకు ఏది అవసరమో తెలియజెప్పండి, అవే తిరిగి వాళ్లకు అందించే ప్రయత్నం జరగాలి. నకిలీలకు అడ్డుకట్ట వేయాలి. వైఎస్సార్ చేయూత కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పశువులకు ఇనాఫ్ ట్యాగ్ చేయించాలి. వైఎస్సార్ పశునష్ట పరిహార పథకం ఆర్బీకేల్లో డిస్ప్లే చేయాలి’’ అని సీఎం జగన్ సూచించారు. అదే విధంగా, ప్రతి మూడు నెలలకొకసారి బీమా పరిహారం క్లెయిమ్స్ క్లియర్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించి, రూ.98 కోట్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో, సీఎంఓ అధికారులు కూడా దీనిపై కలెక్టర్లతో సమన్వయం చేసుకుని, వారికి స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. ఇక సమీక్ష సందర్భంగా, ఆర్బీకేల్లోని ఇంటిగ్రేడెట్ కాల్ సెంటర్ నంబర్ 155251 పనిచేస్తుందా లేదా ? అని సీఎం జగన్ అధికారులను ప్రశ్నించారు. ఈ నంబరు పనితీరుపై క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. ‘‘గ్యారంటీ, టెస్టెడ్, క్వాలిటీ అని ప్రభుత్వ ముద్ర వేసి విత్తనాలు ఇస్తున్నాం. వీటి నాణ్యతలో ఎలాంటి తేడా రావడానికి వీల్లేదు. ఆర్బీకేల ద్వారా ఇచ్చే ఇన్‌పుట్స్‌లో నాణ్యత లేకపోతే కచ్చితంగా అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. ఏహెచ్ఏ ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ 6099 ఏనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్స్ (ఏహెచ్ఏ) ఖాళీల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సమీక్ష సందర్భంగా, పశుసంరక్షక్ యాప్ పనితీరుని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యానిమల్ ఫీడ్ యాక్ట్ రావడంతో క్వాలిటీ సీడ్ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో.. ‘‘బయో ఫెస్టిసైడ్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. నాణ్యత విషయంలో రాజీపడొద్దు’’ అని సీఎం స్పష్టం చేశారు. ఇక వైఎస్సార్ చేయూత కింద జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల ద్వారా పశువులు, గొర్రెలు, మేకల పంపిణీపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ పథకాన్ని మరింత విస్తతంగా చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా బ్యాంకులతో మరింత సమన్వయం చేసుకోవాలన్నారు. ఇంటిగ్రేటెడ్ లాబ్స్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ లాబ్స్ ఏర్పాటు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఇందుకు సంబంధించి కూడా జూన్ 1, 2021 నాటికి భవనాలన్నీ సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా, కొత్తగా 21 లాబ్ టెక్నిషియన్స్, 21 లాబ్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ వీటన్నింటికీ ఒకే కాల్ సెంటర్, ఒకే నంబర్ ఉండాలని పేర్కొన్నారు. వెటర్నరీ ఆసుపత్రుల్లో నాడు–నేడు నాడు నేడు కింద వెటర్నరీ ఆసుపత్రుల నిర్మాణ పనులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. ఈ క్రమంలో మూడు సంవత్సరాల్లో అన్ని పశువైద్యశాలలు ఆధునీకరణ నాడు–నేడు ( పశు వైద్యశాలలు) కార్యక్రమాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మొబైల్ యాంబులేటరీ(వెటర్నరీ) సర్వీసెస్ 108 తరహాలో పశువులకు కూడా అంబులెన్స్ ద్వారా వైద్య సేవలు మొబైల్ యాంబులేటరీ (వెటర్నరీ) సర్వీసెస్ ఏర్పాటుపై సమీక్షలో చర్చ జరిగింది. నియోజకవర్గానికి ఒక వాహనం మంజూరుకు సీఎం ఆమోదం తెలిపారు. తమిళనాడు తరహాలో మొబైల్ యాంబులేటరీ సర్వీసెస్ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలుచేశారు. దీని ద్వారా మారుమూల గ్రామాల్లో సైతం జబ్బుపడిన పశువులను ఆసుపత్రికి తరలించే ఏర్పాటు ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా వైఎస్సార్ కడప జిల్లా ఉటుకూరులో కడక్‌నాథ్ పౌల్ట్రీ ఫాంను పునురుద్ధరించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. కడక్‌నాథ్ చికెన్‌కు ఉన్న మార్కెట్ డిమాండ్‌ను వివరించారు. ఈ క్రమంలో ఉటుకూరు పౌల్ట్రీ ఫాం పునరుద్ధరణకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. -
చికెన్.. ఏడాదికి 3.6 లక్షల టన్నులు
సాక్షి, హైదరాబాద్: చికెన్.. రాష్ట్ర ప్రజలు ఇష్టంగా ఆరగించే ఈ మాంసాహారంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. తక్కువ ధరకే దొరికే బలవర్ధకమైన మాంసాహారం కోడికూర అని, ఈ విషయంలో ఆందోళన చెందొద్దని సూచిస్తున్నారు. ఇటీవల పశుసంవర్థక శాఖ తయారుచేసిన నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో ఏటా 3.6 లక్షల టన్నులకు పైగా చికెన్ వినియోగమవుతోంది. మొత్తం మాంసం మార్కెట్లో ఇది 44 శాతం కాగా, ఒక కిలో చికెన్‌లో 250 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సింహభాగం చికెన్‌దే రాష్ట్రంలో మాంసాహార ప్రియులు ఎక్కువగా ఆరగించేది చికెనే అని లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల పశుసంవర్ధక శాఖ రూపొందించిన ఓ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని మొత్తం మాంసాహార మార్కెట్లో 44 శాతం చికెన్‌దేనని తేలింది. ఏటా రాష్ట్ర ప్రజలు 3,63,850 టన్నుల కోడికూర లాగించేస్తున్నారని చెబుతోంది. ఇక నాటుకోళ్ల రూపంలో రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెంచుకుని ఆరగించే మాంసం ఈ లెక్కలోకి రాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇతర మాంసాహారాల్లో గొర్రె మాంసం 32 శాతం, మేక మాంసం 8 శాతం, నల్లజాతి పశువుల మాంసం 14 శాతం తింటున్నారని తేలింది. ముఖ్యంగా చికెన్‌లో 25 శాతం ప్రోటీన్లు ఉంటాయని, తక్కువ ధరకు దొరికే బలవర్ధకమైన మాంసాహారం ఇదేనని పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మటన్‌లో 20 శాతం మాత్రమే ప్రోటీన్లు ఉంటాయని చెబుతున్నారు. ఈసారి బర్డ్‌ఫ్లూ లేనట్టే ఇటీవల దేశంలోని దాదాపు 10 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకింది. మన రాష్ట్రంలోనూ గత రెండేళ్ల కింద ఈ వ్యాధి సోకడంతో లక్షల సంఖ్యలో కోళ్లను పూడ్చిపెట్టాల్సి వచ్చింది. (చదవండి: సిటీ టేస్ట్.. చికెన్ ఫస్ట్..) ఈ ఏడాది కూడా దేశంలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కన్పించడంతో మన రాష్ట్ర చికెన్ మార్కెట్‌పై కూడా ఈ ప్రభావం పడింది. అయితే పశుసంవర్ధక శాఖ మాత్రం బర్డ్‌ఫ్లూ మన రాష్ట్రంలో లేదని స్పష్టం చేస్తోంది. ఇటీవల కొన్ని జిల్లాల్లో చాలా కోళ్లు, నెమళ్లు మరణించడానికి బర్డ్‌ఫ్లూ కారణం కాదని, ఇతర కారణాలతో చనిపోయాయని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 3 వేల కోళ్ల ఫారంలు ఉండగా, వాటిలోని 75 శాతం ఫారంల నుంచి పశుసంవర్ధక శాఖ అధికారులు నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కన్పించకపోవడంతో చికెన్ వినియోగంపై రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను ఆ శాఖ అధికారులు నివృత్తి చేసే పనిలో పడ్డారు. అనవసరపు భయాలొద్దు.. చికెన్ తినే విషయంలో ప్రజలు లేనిపోని అపోహలకు గురికావద్దు. రోజుకు ఒక గుడ్డు తింటే డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. కోడిమాంసం కూడా చాలా బలవర్ధకమైనది. తక్కువ ధరకు దొరికే బలవర్ధక మాంసాహారం ఇదే. బర్డ్‌ఫ్లూ మన రాష్ట్రంలో రాలేదు. పశుసంవర్ధక శాఖ అప్రమత్తంగా ఉంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. – రాంచందర్, పశుసంవర్థక శాఖ అదనపు డైరెక్టర్ -
అది బర్డ్‌ఫ్లూ కాదు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల కోళ్లు చనిపోయిన ఘటనలపై పశు సంవర్థక శాఖ స్పందించింది. కోళ్లు చనిపోయింది బర్డ్‌ఫ్లూ వల్ల కాదని స్పష్టం చేసింది. వారం రోజుల కిందట పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలంలో 35 కోళ్లు చనిపోయాయని, అయితే పోస్టుమార్టంలో అవి రానికేట్ వ్యాధి వల్ల చనిపోయినట్టు తేలిందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ అదనపు డైరెక్టర్ రాంచందర్ శుక్రవారం ‘సాక్షి’కి వెల్లడించారు. అవి కూడా ఒకే రోజు చనిపోలేదని, వారం రోజుల పాటు రోజుకు 5–10 చొప్పున చనిపోయినట్లు తేలిందని చెప్పారు. దీంతోపాటు వరంగల్ అర్బన్ జిల్లాలోని ఓ కోళ్లఫారంలో వ్యక్తిగత కారణాలతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని కోళ్లను చంపేశారని, పోస్టుమార్టంలో కూడా వాటిని చంపినట్లు తేలిందని ఆయన చెప్పారు. అసలు రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు. (చదవండి: వేటగాళ్ల పాపమా?.. బర్డ్‌ఫ్లూ శాపమా?) అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య బృందాలు విస్తృతంగా పర్యటిస్తున్నాయని, శాంపిళ్లు సేకరించి పరీక్షలు జరుపుతున్నాయని స్పష్టం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా బుదేరా గ్రామంలో కొన్ని కోళ్లు చనిపోయిన సంఘటనపై విచారణ చేయగా విష ప్రయోగం వల్ల అవి చనిపోయాయని, ఈ మేరకు పోలీసు కేసు కూడా నమోదయినట్లు తమకు నివేదిక అందిందని ఆయన వివరించారు. ఇక మెదక్‌జిల్లా మునుపల్లి గ్రామంలో ఏడు నెమళ్లు చనిపోగా, అధికారులు పోస్టుమార్టం చేయించారని.. వాటి కడుపులో ఎక్కువ మొత్తంలో వడ్లు కనిపించాయని, పురుగు మందు మోతాదు ఎక్కువగా ఉన్న వడ్ల కారణంగానే నెమళ్లు చనిపోయినట్లు తేలిందని రాంచందర్ వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ప్రవేశించలేదని, ఆందోళన చెందవద్దని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. అనవసరపు ప్రచారాల గురించి భయపడొద్దని, పశుసంవర్థక శాఖ అప్రమత్తంగా ఉందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
4 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 12 ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ(అవియన్ ఇన్‌ఫ్లూయెంజా) వ్యాప్తిని గుర్తించినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ వెల్లడించింది. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాజస్తాన్‌లోని బరాన్, కోట, ఝలావర్, మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్, ఇండోర్, మాల్వా, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా(వలస పక్షుల కేంద్రం), కేరళలోని కొట్టాయం, అలప్పుజాలో నాలుగు చోట్ల బర్డ్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తిని కనుగొన్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ వ్యాప్తిపై తాజా పరిస్థితి అంచనా వేయడానికి ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. రాష్ట్రాల్లో అధికారులు చేపట్టిన బర్డ్‌ఫ్లూ నియంత్రణ చర్యలపై రోజువారీ గణాంకాలు సేకరించేందుకు ఈ కంట్రోల్ రూమ్ నెలకొల్పినట్లు పేర్కొంది. దేశంలో మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు ఇప్పటిదాకా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని తెలియజేసింది. కర్ణాటకలో హై అలర్ట్ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హైఅలర్ట్ ప్రకటించినట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి ప్రభు చెప్పారు. కేరళ నుంచి పౌల్ట్రీ కోళ్లు, కోడి మాంసం రవాణా చేయకుండా సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక పశు సంవర్థక శాఖ వెల్లడించింది. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో కేరళతోపాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి కోడిమాంసం దిగుమతిపై 10 రోజులపాటు నిషేధం విధిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధవారం చెప్పారు. ప్రభావిత జిల్లాలకు కేంద్ర బృందాలు బర్డ్‌ఫ్లూ ప్రభావం అధికంగా ఉన్న కేరళలోని అలప్పుజా, కొట్టాయం, హరియాణాలోని పంచకుల జిల్లాలకు బృందాలను పంపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ బృందాల్లో ఎన్సీడీసీ, ఎన్ఐజీ, ఆర్ఎంఎల్ హాస్పిటల్, లేడీ హర్డింగ్ మెడికల్ కాలేజీకి చెందిన నిపుణులు ఉంటారు. అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో బాతుల్లో, పంచకుల జిల్లాలో పౌల్ట్రీ కోళ్లలో బర్డ్‌ఫ్లూను గుర్తించినట్లు వెల్లడించింది. బృందాలు ఆయా జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖలకు సహరిస్తాయని తెలిపింది. -
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ లేదు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా.అమరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. కేరళ, రాజస్ధాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ ఉందని, ఇప్పటివరకు ఏపీలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు నిరభ్యంతరంగా చికెన్ తినొచ్చని చెప్పారు. అన్ని జిల్లాల్లో పశు సంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించామని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమ పరిశ్రమ కూడా అప్రమత్తంగానే ఉందన్నారు. (చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్త కరోనా) బుధవారం నాడు ఆయన 'సాక్షి'తో మాట్లాడుతూ "ఏపీలో ఏటా సుమారు లక్షకు పైగా పక్షులు వలస వస్తుంటాయి. కొల్లేరు, పులికాట్, నేలపట్టు, కోరంగి ప్రాంతాలకి పక్షులు ఎక్కువ వలస వస్తుంటాయి. వలస పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ, వైద్య ఆరోగ్య శాఖలతో కలిసి పర్యవేక్షణ చేస్తున్నాం. బర్డ్ ఫ్లూ లక్షణాలతో పక్షులు, కోళ్లు చనిపోతే మా దృష్టికి తీసుకురావాలని అటవీ శాఖని కోరాం. ఏవైనా కేసులు వస్తే భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. పరిస్ధితులను బట్టి జిల్లా స్ధాయిలో కలెక్టర్ల అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తాం" అని అమరేంద్ర కుమార్ తెలిపారు. (చదవండి: బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా?) బర్డ్ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ హైదరాబాద్: ఇప్పటికే కరోనాతో హడలెత్తిపోనున్న జనాలకు బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పశుగణాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వెటర్నరీ, పశు సంవర్ధక శాఖలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ రాకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. వలస పక్షుల రాకపై ఆరా తీసి అప్రమత్తం కావాలని సూచించారు. ప్రతిరోజు ఫౌడ్రీ ఫారాల్లో చనిపోయే కోళ్ల శాంపిల్స్‌ను వీబీటీఐకి పంపి పరీక్షించాలని ఆదేశించారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ..బర్ద్ ఫ్లూ విషయంలో ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. 1300 మందితో ఉన్న టీమ్స్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫామ్‌లలో తిరుగుతూ సూచనలు తీసుకుంటున్నారని చెప్పారు. వలస పక్షుల ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉండొచ్చే తప్ప ఫ్లూ ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అధికారులంతా అలర్ట్‌గా ఉన్నారని తెలిపారు. -
అరకొర ఆలోచనలు వద్దు : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : అరకొర ఆలోచనలు చేయవద్దని, దార్శనికతతోనే సమూల పరిష్కారాలు దొరుకుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి రంగంలో విజన్ ఉండాలని, పెద్ద ఆలోచనలతోనే మార్పులు సాధ్యపడతాయన్నారు. ఆర్బీకేల ఏర్పాటు, స్కూళ్లలో నాడు-నేడు, ప్రజారోగ్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు అలానే వచ్చాయని చెప్పారు. గురువారం పశు సంవర్థక శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ చేపలు, రొయ్యలు పండిస్తున్న రైతులకు కనీస గిట్టుబాటు ధరలు రావాలి. మంచి ధరలు వచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం వ్యూహాత్మక విధానాన్ని అనుసరించాలి. ప్రీ ప్రైమరీ ప్రాసెసింగ్ నుంచి సెకండరీ ప్రాసెసింగ్ వరకూ.. ప్రభుత్వం నుంచి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆక్వా ఉత్పత్తుల కోసం ప్రీ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీల సదుపాయాలు కల్పించాలి. వాటిని జనతా బజార్లకు అనుసంధానం చేయాలి. దీని వల్ల ప్రైవేట్ వ్యక్తులు సిండికేట్ కాకుండా రైతులకు భరోసా ఇవ్వగలుగుతాం. ( మీ సహకారంతో సాకారం ) సుమారు 3200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, దళారుల నుంచి పొగాకు రైతులను కాపాడగలిగాం. ఆక్వా ఉత్పత్తుల విషయంలోనూ ధరల స్థిరీకరణ అమలు చేసేలా ఆలోచనలు చేయాలి. వైఎస్సార్ చేయూత కింద పాడి పశువుల కొనుగోలులో అమూల్ సలహాలు తీసుకోవాలి. దాణా, సంరక్షణ, సాంకేతిక అంశాల్లో కూడా అమూల్ భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. గొర్రెలు, మేకల పెంపకంలో కూడా వాళ్లతో ఒప్పందం చేసుకోవాలి. పాదయాత్రలో నా కళ్లతో చూసిన పరిస్థితులను మార్చాలని ప్రయత్నిస్తున్నా. దేవుడు, ప్రజలు ఆశీర్వదించి ఈ సీటులో కూర్చోబెట్టారు. అందరికీ మంచి చేయాలని తపిస్తున్నాం. అంకిత భావంతో ముందడుగులు వేస్తున్నామ’’న్నారు. -
‘కోళ్లు’ కోలేని దెబ్బే.. !
సాక్షి, ఆలమూరు (తూర్పుగోదావరి) : వెరీ విరులెంట్ న్యూ కేస్టల్ డిసీజ్ (వీవీఎన్డీ) వైరస్ సోకి సుమారు 2200 కోళ్లు మృతి చెందిన ఆలమూరు మండలంలోని బడుగువానిలంక కోళ్ల ఫారాన్ని జిల్లా పశుసంవర్ధకశాఖ డీడీ, రోగ నిర్ధారణ వైద్యాధికారి కె.రామకృష్ణ బుధవారం పరిశీలించారు. ఆలమూరు పశుసంవర్ధకశాఖ ఏడీ ఓ రామకృష్ణతో కలిసి కోళ్ల ఫారం పరిసర ప్రాంతాలను అధ్యయనం చేశారు. ఈ వ్యాధి నివారణ సాధ్యం కాదని, ముందస్తు జాగ్రత్తలే తీసుకోవాలి తప్ప వైరస్ నియంత్రణకు చికిత్స లేదని తెలిపారు. గత వారంలో ఆత్రేయపురం మండలంలోని వద్దిపర్రులో వీవీఎన్డీ వైరస్ సోకి వేలాది బాయిలర్ కోళ్లు మృతి చెందడం వల్లే ప్రస్తుత పరిస్థితి కారణమని అభిప్రాయపడ్డారు. వేగంగా సోకే స్వభావం కలిగిన ఈ వైరస్ గోదావరి అవతలి నుంచి ఇవతల ఉన్న బడుగువానిలంకలోని కోళ్ల ఫారంలోకి చేరిందన్నారు. కోళ్ల రైతులు వీవీఎన్డీ వైరస్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. లేయర్ ఫారంలో పెంపకం సాగించే కోళ్లకు ఐదో రోజు నుంచి ఏడాది పాటు ప్రతినెలా తప్పనిసరిగా లాసోటా టీకాలను వేయించాలని సూచించారు. అనంతరం ఆలమూరు ఏడీఏ కార్యాలయంలో వీవీఎన్డీ వైరస్ నివారణకు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఆలమూరు మండల పశు వైద్యా«ధికారి జి.భానుప్రసాద్, సీహెచ్.మౌనిక తదితరులు పాల్గొన్నారు. వీవీఎన్డీ వైరస్ సోకి మృతి చెందిన కోళ్ల ఫారాన్ని పునరుద్ధరించే విధానం ► ఒకసారి వైరస్ సోకి కోళ్లు మృతి చెందిన ఫారంలో మూడు నెలల పాటు విరామం ప్రకటించాలి. ► కోళ్ల ఫారంలో ఉన్న పాత మట్టిని, ఇసుకను తీసివేసి బయట పారబోయాలి. అనంతరం ఆ ఫారాన్ని పరిశుభ్రం చేసి కొత్త ఇసుకను, మట్టిని సమకూర్చుకోవాలి. ► డిసినిఫికెంటెండ్, గ్లీజర్ల్డ్హైడ్ మందులో క్లోరుసులాన్ను మిశ్రమం చేసి కోళ్లఫారంలో పిచికారీ చేయాలి. ► ఒకేసారి ఎక్కువ కోళ్లు పెంపకం చేపట్టకుండా కేవలం 15 నుంచి 20 వరకు మాత్రమే పెంచుకుని పరీక్షించుకోవాలి. ► వ్యాధి నిరోధక లక్షణాలు కనిపించకపోతే మరో ఏడు వారాల నుంచి ఎనిమిది వారాలలోపు కోళ్ల ఫారంలో పెంపకాన్ని చేపట్టవచ్చు. ► ప్రతి 2–3 ఏళ్లకు తప్పనిసరిగా టీకాలు వేయిస్తూ ఫారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాధి నిరోధక టీకాలు వేయించుకునే విధానం ► బ్రాయిలర్ ఫారం : కోడి పెంపకం ప్రారంభించిన ఐదో రోజున లాసోటా లేదా ఆర్2బీను వాడాలి. బూస్టర్ ఒక నెల తరువాత, మళ్లీ రెండో నెల తరువాత తప్పనిసరిగా వేయాలి. ► పెరటి కోళ్లకు టీకాలు ► ఇంటాఓ క్యూలర్ (కళ్లల్లో చుక్కల మందు) ఐదు, ఆరో రోజున వేయాలి. ► టీకాలు వేసే రెండు రోజుల ముందు తప్పనిసరిగా ఆల్బెండజోల్ పాముల మందును కోళ్లకు నోటి ద్వారా అందించాలి. ► నిమిరోల్ 1 చుక్క మందును వేస్తే విటమిన్ ఏ సమృద్ధిగా లభించి రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ► నిట్రోప్యూరంటన్ మందును ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ను తగ్గించుకోవచ్చు. -
కరువు సీమలో.. పాలవెల్లువ
అనంతపురం రూరల్: ‘అనంత’ కరువుకు చిరునామా. తీవ్ర వర్షాభావంతో దుర్భిక్ష పరిస్థితుల్ని ఎదుర్కొన్న ప్రాంతం. ఏటా నష్టాలతో రైతులంతా కుదేలయ్యారు. చాలామంది పొట్టచేతబట్టుకుని వలస వెళ్లగా...అనంతపురం మండలం కట్టకిందపల్లి గ్రామ రైతులు మాత్రం ప్రత్యామ్నాయం ఆలోచించారు. పంటల సాగును పక్కనపెట్టి పాడిని నమ్ముకున్నారు. ఒకరిని చూసి మరొకరుగా ఊరంతా పశు పోషణపైనే ఆధారపడ్డారు. ఈ గ్రామంలో ప్రస్తుతం రోజుకు దాదాపు 5 వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అనంతపురం నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. గ్రామంలో దాదాపు 400 కుటుంబాలుండగా.. 1,300 మంది జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఏ ఇంట్లో చూసినా ఐదారు గేదెలు కనిపిస్తాయి. 353 కుటుంబాలు (90 శాతం మంది) ప్రత్యక్షంగా పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారి నుంచి పాలను సేకరించి నగరంలో విక్రయిస్తూ పరోక్షంగా పదుల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. అనంతపురం జిల్లా కట్టకిందపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు దంపతులు జనార్దనరెడ్డి, రాధ. గతంలో వ్యవసాయం చేసేవారు. తీవ్ర వర్షాభావం వల్ల పంట కోసం పెట్టిన పెట్టుబడులు సైతం రాక తీవ్ర అవస్థలు పడేవారు. ఈ పరిస్థితుల్లో పశువుల పెంపకంపై దృష్టి సారించారు. ఐదెకరాల పొలం ఉండటంతో ఎకరం విస్తీర్ణంలో గడ్డి పెంపకం చేపట్టి పశుపోషణ చేశారు. మొదట్లో ఒక గేదెతో ప్రారంభమైన వారి పాల వ్యాపారం.. ఇప్పుడు 8 గేదెలకు పెరిగింది. లీటరు పాలు రూ.50 చొప్పున రోజూ 70 లీటర్లు విక్రయిస్తున్నారు. ‘నెలకు దాదాపు రూ.లక్ష వరకు ఆదాయం వస్తోంది. ఖర్చులు పోను రూ.30 వేల వరకు మిగులుతోంది. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాం’ అని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -జనార్దనరెడ్డి, రాధ మధుసూదన్‌రెడ్డి, రేణుక దంపతులు గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్ల ద్వారా నీరు రాక ఇదే గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డి, రేణుక దంపతులకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. అప్పటికే గ్రామంలోని కొందరు పశు పోషణ చేపట్టి రాణిస్తుండటాన్ని చూసి వారూ అదే బాట పట్టారు. తొలుత 8 లీటర్ల పాలతో ప్రారంభమైన వారి వ్యాపారం నేడు 80 లీటర్లు విక్రయించే స్థాయికి చేరింది. ‘వ్యవసాయం చేస్తూనే పశు పోషణ చేపట్టి పాలను విక్రయిస్తున్నాం. పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటున్నాం’ అని మధుసూదన్‌రెడ్డి, రేణుక చెప్పారు. సహకార డెయిరీ ఏర్పాటుకు కృషి కట్టకిందిపల్లి రైతులను మరింత ప్రోత్సహించేందుకు స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. వరంగల్ జిల్లా ములకనూరు డెయిరీ తరహాలో రాప్తాడు నియోజకవర్గంలోను సహకార డెయిరీ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. త్వరలోనే సహకార డెయిరీ ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాల సభ్యులతో పాలను కొనుగోలు చేయించి పాలకు గిట్టుబాటు ధర కల్పించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పాడిపైనే ఆధారపడి జీవిస్తున్నాం పాడిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రస్తుతం 5 గేదెలను పెంచుతున్నాం. పాలను విక్రయించి నెలకు రూ.30 వేల వరకు సంపాదిస్తున్నా. – గోపాల్‌రెడ్డి కట్టకిందపల్లి మా గ్రామంలోనే డెయిరీ ఏర్పాటు చేయాలి మా గ్రామంలోనే సహకార డెయిరీ ఏర్పాటు చేస్తే పాడి రైతులకు మేలు జరుగుతుంది. పశు వైద్యశాల నెలకొల్పడంతో దాణా పంపిణీ చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. – నాగలక్ష్మమ్మ, కట్టకిందపల్లి సహకారం అందిస్తాం పాడి రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలతో పాటు దాణా పంపిణీ చేయడానికి చర్యలు ప్రారంభించాం. గ్రామంలో పశు వైద్యశాల ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం తీసుకెళతాం. – డాక్టర్ సన్యాసిరావు, జేడీ, పశు సంవర్ధక శాఖ -
పల్లెల్లో ‘క్రిషి’
సాక్షి, నాగర్‌కర్నూల్: పాడిపశువులతో పాటు పాల ఉత్పత్తులు పెంచడానికి పశుసంవర్ధక శాఖ తగు చర్యలు చేపట్టింది. వాటిని నమ్ముకున్న రైతులకు ఆదాయం పెంచడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ గోకుల్ మిషన్‌లో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 500 గ్రామాల్లో క్రిషి కల్యాణ్ అభియాన్ అమలు చేయాలని నిర్ణయించారు. పశువుల్లో కృత్రిమ గర్భధారణ చేపట్టి పశు సంతానోత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం పశు సంతానోత్పత్తి ఆశించినంతగా లేదు. మగ పశువులు అందుబాటులో లేకపోవడం, ఉన్న వాటిలో మంచి బీడ్ర్ కాకపోవడం, పశువులు ఎదకు వచ్చినప్పుడు రైతులు గుర్తు పట్టకపోవడం తదితర కారణాల వల్ల సహజ సిద్ధ విధానంలో పశు సంతానోత్పత్తి ఆశించినస్థాయిలో జరగడం లేదని పశుసంవర్ధకశాఖ అధికారులు గుర్తించారు. ఫలితంగా పాల దిగుబడీ పెరగడం లేదు. దీనిని అధిగమిచేందుకు గాను గేదెలు, ఆవుల్లో కృత్రిక గర్భధారణను చేపట్టేందుకు కేంద్రం, పశు సంవర్ధకశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అమలు చేయనున్న గ్రామాలను గుర్తించారు. దీనిపై ఈపాటికే వెటర్నరీ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రతి గ్రామంలో 200 పాడి పశువులకు.. ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన 200 పాడి పశువులను గుర్తిస్తారు. వీటికి ఆవులు, ముర్రా గేదెలకు ఐఎన్ఏపీహెచ్ టాగింగ్ వేసి ఉచితంగా కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు వేయనున్నారు. దీనిని అమలు చేసేందుకు ప్రతి జిల్లాలో వంద గ్రామాలను జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు గుర్తించారు. ఇలా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కలిపి మొత్తం 500 గ్రామాల్లో జిల్లాకు 20వేల పశువుల చొప్పున పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించనున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలి విడతగా ఈ నెలాఖరు నుంచి 2020 మార్చి వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పశువులు, గేదెలకు కృత్రిమ గర్భధారణ నిమిత్తం టెక్నీషియన్‌కు రూ.50, దూడపుట్టిన తర్వాత మరో రూ.వంద చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుంది. వారు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. పశుసంవర్ధక శాఖ వైద్యులు, సిబ్బంది ఆయా గ్రామాల్లో పర్యటించి ఉచితంగా పశువులకు ఎద సూది ఇవ్వనున్నారు. అలాగే వాటిలో రోగ నిరోధకశక్తి పెంపొందించడానికి మందులు వేస్తారు. వచ్చే ఆరు నెలల్లోనే కృత్రిమ గర్భధారణను 40శాతానికి పెంచాలని పశు సంవర్ధకశాఖ భావిస్తోంది. రైతుల వద్ద ఉన్న ఆవులు, గేదెలకు మేలు జాతికి చెందిన పశువుల వీర్యాన్ని మాత్రమే ఎక్కిస్తారు. గేదెలకు ముర్రజాతి, ఆవులకు జెర్సీ, హెచ్ఎఫ్, ఒంగోలు, సాయివాల్, గిర్ తదితర జాతులకు చెందిన పశువుల వీర్యాన్ని వినియోగిస్తారు. తమ వద్ద ఉన్న పశువులకు ఏ జాతి వీర్యం కావాలన్నది రైతులు నిర్ణయించుకోవచ్చు. ఈ సమయంలో పశు సంవర్ధకశాఖ అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. వృద్ధి చెందనున్న పాడిరంగం ఉమ్మడి జిల్లాలో గోజాతి, గేదె జాతి పశువులు కలిపి మొత్తం 6,76,072 ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పాలిచ్చే వాటినే అంచనా వేస్తే వీటి ద్వారా నిత్యం సుమారు ఐదు లక్షల లీటర్ల పాల దిగుబడి ఉంది. ఈ ఏడాది ఆఖరులోగా 20వేల పశువులకు కృత్రిమ గర్భధారణ విధానాన్ని అమలు చేస్తే ఇప్పుడున్న పాల దిగుబడి మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పశుసంతానోత్పత్తితో పాటు పాల ఉత్పత్తి పెరగడం వల్ల రైతులు ఆర్థికంగా మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. పాడి రైతులకు ఎంతోమేలు క్రిషి కల్యాణ్ అభియాన్‌తో పాడి రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. జిల్లాలో ఇప్పటికే వంద గ్రామాలను గుర్తించాం. ఒక్కో గ్రామంలో 200పశువులకు గర్భధారణ సూదులు ఇప్పిస్తాం. దీనిని గోపాలమిత్రలు, వెటర్నరీ సిబ్బంది ద్వారా అమలు చేస్తాం. ఇప్పటికే వారి శిక్షణ ఇచ్చాం. – అంజిలప్ప, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ -
ఖాళీల భర్తీకి జనవరి నెలను వాడుకోండి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మూడు మేజర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మచిలీపట్నాన్ని మేజర్ పోర్టుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పశుసంవర్థక, మత్స్య శాఖలపై సీఎం జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేట సహా రాష్ట్రంలో గుర్తించిన ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణాలపై సీఎం అధికారులతో చర్చించారు. వీటి నిర్మాణాలను ప్రణాళికా బద్ధంగా పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో దాదాపు 12 జెట్టీల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. గుజరాత్లో 25వేల తెలుగు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, వారంతా ఉపాధి లేక వలస వెళ్లారన్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వేటకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా వారిని తిరిగి రాష్ట్రానికి రప్పించే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొనడంతో.. ఆ దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అవినీతికి ఆస్కారం లేకుండా.. పనుల్లో పారదర్శకత ఉండేలా చూసుకోవాలని సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి పశుసంవర్ధక, మత్సశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష సమావేశంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ....‘ చేపలు, రొయ్యలు పెంచుతున్న ప్రాంతాల్లో ల్యాబ్, రైతులకు అవగాహన కల్పించడానికి వర్క్‌షాపుల ఏర్పాటు జనవరి నాటికి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. సీడ్, ఫీడ్‌ల్లో కచ్చితంగా నాణ్యత ఉండాలి. ఎక్కడా కూడా కల్తీ ఉండకూడదు. కల్తీ చేసే వారిపై ఉక్కుపాదం మోపండి. ఆక్వా ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో సంబంధిత రంగానికి చెందిన వారిని ఉద్యోగులుగా తీసుకున్నారు. వారికి సరైన శిక్షణ ఇచ్చి, రైతులకు మంచి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని పేర్కొన్నారు. ఖాళీల భర్తీకి జనవరి నెలను వాడుకోండి.. ‘తూర్పు గోదావరి జిల్లాలో హేచరీజోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీలకు గతంలో అనుమతి ఇచ్చారు. దీనివల్ల కాలుష్యం అంతా సముద్రంలోకి వెళ్తుంది. ఇదే ప్రాంతంగుండా నేను పాదయాత్ర చేశాను. ఒక ప్రాంతాన్ని పలానా జోన్‌గా ప్రకటించిన తర్వాత అక్కడ వేరే పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం, కలుషితం చేయడం కరెక్టు కాదు. ఈ అంశంపై పూర్తిగా అధ్యయనం చేసి... ఒక విధానాన్ని రూపొందించండి అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆక్వా పంట చేతికి వచ్చే సరికి రేటు పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి..ఇది మనకు పెద్ద సవాలు.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. ఈ విషయంపై కూడా అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి’ అని సూచించారు. ‘రైతుల ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత మనదే. ఎంత కష్టపడినా గిట్టుబాటు కావడంలేదని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు, సహకారం తీసుకోండి. వారి బ్రాండును వినియోగించుకునేలా ప్రణాళికలు తీసుకురండి. మేనేజ్మెంట్లో ప్రతిభావంతుల సహకారం తీసుకోండి. దీనివల్ల మార్కెటింగ్ సదుపాయాలు పెరుగుతాయి. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. జనవరిని రిక్రూట్మెంట్ నెలగా చేసుకోండి. ఖాళీల భర్తీకి జనవరి నెలను వాడుకోండి. వెటర్నరీ ఆస్పత్రులు, క్లినికులల్లో సదుపాయాలను కల్పించాలి. ఇందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను బాగా వినియోగించుకోండి’ అని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశువులకూ హెల్త్ కార్డులు.. సీఎం జగన్ మాట్లాడుతూ... పశువులకు కూడా హెల్త్ కార్డులు జారీ చేయాల్సిన ఆవశ్యకవత ఉందన్నారు. దీనివల్ల క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ‘పశువుల పెంపకంలో సంప్రదాయ పద్ధతులకు పెద్దపీట వేయాలి. ఏ కార్యక్రమం చేపట్టినా వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలి. పశువుల మందుల కొనుగోలులో ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించాలి. ఏపీకార్ల్‌కు నేరుగా నీటిని తెప్పించుకునేలా నీటిపారుదల శాఖతో మాట్లాడాలి. దీనివల్ల పరిశోధనలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని పేర్కొన్నారు. ఏపీ కార్ల్‌ను లక్ష్యాలకు అనుగుణంగా నడపాలని ఆదేశించారు. అదే విధంగా....పులివెందులలో ముర్రా గేదెలు, పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధికోసం బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కరువు పీడిత ప్రాంతాల్లో పశువులకు ఆహార సమస్య లేకుండా చేయడానికి స్థిరమైన, శాశ్వతమైన విధానాలు తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దాణా కొరత రాకుండా ఉత్తమ విధానాలు అనుసరించాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి పశువుల వైద్యంకోసం 102 వాహనాలు తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు. -
గొర్రెలనూ, బర్రెలనూ వదలని చింతమనేని
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆఖరికి గొర్రెలకు ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా వదలలేదని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి విమర్శించారు. శనివారం జరిగిన జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైథాన్ తుపాను సందర్భంగా తమ నియోజకవర్గంలో గొర్రెలు చనిపోయాయని, వాటి కోసం పశుసంవర్ధక శాఖ తయారు చేసిన లబ్ధిదారుల జాబితాలో మొదటిపేరు చింతమనేని భార్యది ఉండగా, రెండోపేరు ఆయన తండ్రి పేరు ఉందని మొత్తం జాబితా అంతా తప్పుల తడకగా ఉందని, దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళుతున్నట్టు ఆయన చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన జిల్లా ఇన్చార్జి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పశుసంవర్ధక శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకి గేదెలు అందలేదని, బినామీ పేర్లతో చింతమనేని తీసుకున్నారని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో చెట్టున్నపాడు గ్రామంలో కూడా గొర్రెలు పెద్ద సంఖ్యలో చనిపోయినా ఇంతవరకూ నష్టపరిహారం రాలేదని ఉంగుటూరు శాసనసభ్యుడు పుప్పాల వాసుబాబు చెప్పారు. హర్యానా నుంచి గేదెలను తేవడం వల్ల అవి ఈ వాతావరణానికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాయని, వేరే ప్రత్యామ్నాయం చూడాలని చింతలపూడి శాసనసభ్యులు వీఆర్ ఎలిజా కోరారు. -
పశువులకూ ‘ఆధార్’!
మొయినాబాద్(చేవెళ్ల): ఇకనుంచి పశువుల ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తామని.. ప్రతి పశువుకు 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య(ఆధార్ వంటిది), హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ జి.మంజులవాణి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో పశుగణన తీరు, వేసవిలో పశువుల పరిస్థితి , గొర్రెల పంపిణీ పథకం అమలు ఎలా ఉందనే విషయాలను మండల పశువైద్యాధికారి శ్రీలతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతుల వద్ద ఉన్న పశువుల సమగ్ర వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తున్నామని అన్నారు. ప్రతి పశువుకు ఆధార్ నంబర్ మాదిరిగా 12 అంకెల గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నామని.. గుర్తింపు సంఖ్య ఉన్న పోగును పశువుల చెవులకు వేస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక గుర్తింపు సంఖ్యతోపాటు రైతు వివరాలు కూడా ఫీడ్ చేస్తామన్నారు. పశువు వివరాలతోపాటు దాని ఆరోగ్య పరిస్థితిని నమోదు చేస్తున్నామని తెలిపారు. వాటికి హెల్త్‌కార్డులు సైతం ఇవ్వనున్నట్లు చెప్పారు. పశు సంపదను పెంచే చర్యలు ముమ్మరం చేసినట్లు తద్వారా పాలఉత్పత్తి పెంచి రైతుల ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. గొర్రెల పంపిణీ పథకం కింద అందజేసిన జీవాల ద్వారా రాష్ట్రంలో 50 లక్షల గొర్రెపిల్లలు ఉత్పత్తి అయ్యాయన్నారు. రెండో విడత పంపిణీ త్వరలోనే మొదలవుతుందని చెప్పారు. అనంతరం శ్రీరాంనగర్ గ్రామాన్ని సందర్శించి దూడలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్డీఓ ఈఓ కె.సింహరావు, పశువైద్యులు దేవేందర్‌రెడ్డి, శ్రీలత, గోపాలమిత్రలు శ్రీనివాస్, బాలకిష్టయ్య తదితరులు ఉన్నారు. -
కరువు తీవ్రం బతుకు భారం
ఏళ్ల తరబడి కన్నబిడ్డల్లా పెంచుకున్న పండ్ల తోటలు కళ్లముందే ఎండిపోతున్నాయి.. కోతకొచ్చిన కాయలతో పచ్చగా కళకళలాడాల్సిన మామిడి, బత్తాయి, సన్న నిమ్మ తోటలు కాయలతో సహా మలమలా మాడిపోతున్నాయి.. పొట్టేళ్లను వేలాడదీసినట్లు గెలలున్న అరటి చెట్లు వాడిపోతున్నాయి.. బొప్పాయిదీ అదే పరిస్థితి.. చెరకు ఎండిపోయిన గడ్డిలా మారింది.. కోతకు రావాల్సిన నువ్వు భూమికి అతుక్కుని వత్తుల్లా మారింది.. టమోటా, ఇతర కూరగాయల తోటలూ ఇందుకు భిన్నమేమీ కాదు. తినడానికి గడ్డి, తాగడానికి నీరులేక పశువులు బక్కచిక్కిపోతున్నాయి. ఇది తట్టుకోలేక అన్నదాతలు మనసు చంపుకుని వీటిని కటికోళ్లకు ఇస్తున్నారు. మరోవైపు.. వేలాది పల్లెలు తాగునీటికి కటకటలాడుతున్నాయి. పనుల్లేక ఉపాధి కోసం కూలీలతోపాటు సన్నకారు రైతులు వలసబాట పట్టారు. గ్రామాల్లో వృద్ధులు, పిల్లలు మాత్రమే ఉన్నారు. చాలా ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. సిరిధాన్యాలతో కళకళలాడాల్సిన పల్లె సీమలు కళావిహీనంగా, దయనీయంగా మారాయి. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు కరాళ నృత్యం సృష్టించిన బతుకు చిత్రం ఇది. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని పుదూరు పొలాల్లో ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకుంటున్న మహిళ సాక్షి, అమరావతి : ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు ఉష్ణతాపం, వేడిగాలులతో నీటి తడిపెట్టిన రెండో రోజే పంటపొలాలు తడారి ఎండిపోతున్నాయి. మరోవైపు ఐదేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలమట్టం పాతాళానికి చేరింది. బోర్లకు నీరు అందడంలేదు. ఎలాగైనా పైర్లు, పండ్ల తోటలను కాపాడుకోవాలనే ఆశతో అప్పుచేసి బోర్లు వేసినా నీరు పడటంలేదు. చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వెయ్యి అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా నీటి జాడేలేదు. దీంతో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. పంటల సాగుకు చేసిన అప్పులకు బోర్ల కోసం చేసిన అప్పులు తోడుకావడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటి నుంచి బయటపడే మార్గం కానరాక సతమతమవుతున్నారు. వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో గెలలతో ఉన్న అరటి తోటలు, బత్తాయి, మామిడి, దానిమ్మ తోటలు ఎండిపోతున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఏతావాతా పెరిగిన అప్పులు తీర్చే మార్గం కానరాక రైతులు పడుతున్న మానసిక వేదన మాటలకందనిది. తాగునీరు.. కన్నీరు.. గ్రామాల్లో తాగునీటి ఇక్కట్లకు అద్దం పడుతున్నాయి ఈ దృశ్యాలు. ఊరుదాటి కిలోమీటర్ల కొద్దీ వెళ్లినా చుక్క నీరు దొరకని దుస్థితిలో గ్రామీణులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కడో దూరాన చెలమల్లో అరకొర నీరు ఊరుతోందని తెలుసుకొని బిందెలు పట్టుకొని గంటల తరబడి తోడుకుంటూ గుక్కెడు నీళ్లు చేతికందగానే ఇంటి ముఖం పడుతున్నారు. మండు వేసవిలో మహిళలు చిన్న పిల్లలను కూడా వెంట నడిపించుకొస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీరు అందించాల్సిన ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇకనైనా తమకు కనీసం గుక్కెడు మంచినీళ్లు అందించాలని సర్కారును వేడుకుంటున్నారు. కందిపోతున్న కాయలు రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రతతో నీటి తడులు అందక పండ్ల తోటల్లోని కాయలు నల్లగా కందిపోతున్నాయి. అరటి గెలలు వాడిపోతున్నాయి. బత్తాయి, బొప్పాయితోపాటు మామిడి కాయలు రంగు మారిపోతున్నాయి. టమోటాలు ఎండకు తెల్లగా రంగుమారి పిప్పితేలుతున్నాయి. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో టమోటా తోటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల టమోటా దిగుబడి భారీగా పడిపోయింది. అనంతపురం జిల్లాలో ఎండల నుంచి దానిమ్మ చెట్లను కాపాడుకోడానికి పాత చీరలను కప్పుతున్నారు. టమోటా రైతులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ‘తోటకు పందిరి ఎటూ వేయలేం. భారీగా ఖర్చుపెట్టి గ్రీన్ హౌస్ లాంటివి పెట్టుకునే స్తోమతలేదు. అందువల్ల పాత చీరలు కొని పండ్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. వీటిని చెట్లకు రక్షణగా కట్టడంవల్ల పండ్లకు, మొగ్గలకు కొంతవరకు రక్షణగా ఉంటున్నాయి’ అని అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన వెంకటప్ప గౌడ్ అన్నారు. పడిపోయిన భూగర్భ నీటిమట్టం గత ఏడాది మే 16వ తేదీతో పోల్చితే ప్రస్తుతం శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో తప్ప మిగిలిన 11 జిల్లాల్లో భూగర్భ జలమట్టం పడిపోయింది. చిత్తూరు జిల్లాలో గత ఏడాదికీ, ఈ ఏడాదికీ భారీ వ్యత్యాసం నెలకొంది. ఏకంగా 36.90 అడుగుల కిందకు జలమట్టం పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదే కాలంలో వైఎస్సార్ జిల్లాల్లో 19.65 అడుగుల కిందకు పడిపోయింది. రాయలసీమలో సగటున భూగర్భ జలమట్టం 20.86 అడుగులకు కిందకు పడిపోవడం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనడానికి నిదర్శనమని భూగర్భ జల శాఖ నిపుణులు చెబుతున్నారు. వరుసగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణమని వారు చెబుతున్నారు. ఈ కారణంతోనే బోర్లు సైతం ఎండిపోతున్నాయి. ‘భూగర్భ జలమట్టం బాగా పెరగాలంటే మంచి వర్షాలు కురిసి వాగులు వంకలు పొంగి ప్రవహించాలి. ఇలా అయితేనే నీటి మట్టం పైకి వస్తుంది’ అని భూగర్భ జల రంగానికి చెందిన నిపుణుడు ‘సాక్షి’తో చెప్పారు. ‘ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వస్తాయని, వర్షపాతం కూడా సాధారణం (93 శాతం మాత్రమే )గానే ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇలాగైతే కష్టమే’ అని ఒక ఉన్నతాధికారి నిరాశను వ్యక్తం చేశారు. తాగునీటికీ కటకట రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ చాలాచోట్ల తాగునీటికి కటకట ఏర్పడింది. గ్రామాల్లో తాగునీరు అందించే బోర్లు ఇంకిపోయి నీరు రావడంలేదు. దీంతో చాలా గ్రామాల వారు సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావుల నుంచి బిందెల్లో నీరు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా డ్రమ్ములతో నీరు తెచ్చుకుంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో దారుణమైన కరువు పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎనిమిది వేలకుపైగా గ్రామాల్లో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నట్లు అంచనా. జాడలేని పశు సంరక్షణ కేంద్రాలు మూగ జీవాలు మేత, నీరులేక అల్లాడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పశు సంరక్షణ కేంద్రాలను ప్రభుత్వంఏర్పాటుచేసి మేత, నీరు అందించే చర్యలు తీసుకోవాలి. అయితే, ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రైతులు వరిగడ్డి కొనుక్కోవాలంటే ట్రాక్టరు రూ.15 వేలకు పైగా అవుతోంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయినందున దానిని కొనే స్థితిలో చాలామంది రైతులు లేరు. ప్రభుత్వం చొరవ తీసుకుని గడ్డి, దాణా కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేయాల్సి ఉన్నా దానిపై దృష్టి పెట్టడంలేదు. దీంతో రైతులు దిక్కుతోచక పశువులను కబేళాలకు ఇచ్చేస్తున్నారు. నిత్యం సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి బెంగళూరు, చెన్నై నగరాల కబేళాలకు వేలాది పశువులు తరలిపోతున్నాయి. ప్రకాశంలో 56 శాతం లోటు వర్షపాతం గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో సగటున 34.1 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో సాధారణంతో పోల్చితే 56.7 శాతం, నెల్లూరులో 54.6 శాతం, వైఎస్సార్ జిల్లాలో 55.9 శాతం, చిత్తూరులో 46.2, కర్నూలులో 48.1, అనంతపురంలో 43.1 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. వరుసగా ఐదేళ్లపాటు ఇలా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవడంవల్ల భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. చాలా నదులు ఎండిపోయాయి. డ్యామ్‌లలో నీరు డెడ్ స్టోరేజికి చేరింది. -
మూగజీవాలకు పశుగ్రాసం కొరత
సాక్షి, హైదరాబాద్: ఈ వేసవిలో మూగజీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడనుంది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ అంచనా వేసింది. 16 జిల్లాల్లోని, 70 మండలాల్లో ఈ ప్రభావం ఉండనుంది. వాస్తవానికి అన్ని జిల్లాల్లోని మూగజీవాలకు మేత కష్టాలు తప్పేలా లేవు. వేసవి వచ్చినపుడే పశుగ్రాసం గుర్తు రావడం, ముందస్తు ప్రణాళికలు వేసుకోకపోవడంతోనే పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. వేసవిలో పశుగ్రాసం కొరత సాధారణమేనని కొందరు అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. పశుసంవర్ధకశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4.27 కోట్ల పశువులు ఉన్నాయి. వీటికి జనవరి నుంచి జూన్ వరకు 111.27 లక్షల మెట్రిక్ టన్నుల మేత అవసరం కాగా, 109.77 లక్షల మెట్రిక్ టన్నుల గ్రాసం మాత్రమే అందుబాటులో ఉంది. ఎండు మేతను తీసుకుంటే 101.11 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా, 82.57 టన్నులు అందుబాటులో ఉందని పశుసంవర్థక శాఖ తన నివేదికలో పేర్కొంది. 16 జిల్లాల్లో అధికం జనగాం, ఆదిలాబాద్, కొత్తగూడెం, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్, నల్లగొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొరత తీవ్రంగా ఉంది. కొత్తగూడెం జిల్లాలో మూడు మండలాలు, భూపాలపల్లిలో రెండు, మహబూబాబాద్‌లో రెండు, మంచిర్యాల్లో ఐదు, నల్లగొండలో 18, నిర్మల్‌లో మూడు, సిరిసిల్లలో రెండు, రంగారెడ్డిలో 16, వికారాబాద్‌లో 6, యాదాద్రి భువనగిరిలోని 13 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు పేర్కొంటున్నారు. కొన్ని జిల్లాల్లో సరిపోను గ్రాసం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే గొర్రెలకు పచ్చదనం లేక మేత దొరకని పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ సబ్సిడీ గొర్రెల పంపిణీ జరుగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. వాటి మేతకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇస్తే వేసవిలో అవి చనిపోతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి సాధారణంగా వేసవిలో పశుగ్రాసం కొరత ఉంటుంది. అయినప్పటికీ కొరత తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాం. పశువుల తాగునీటికోసం కొత్తగా 8 వేల నీటి తొట్లను నిర్మిస్తున్నాం. ఇప్పటికే 12 వేల నీటి తొట్లు అందుబాటులో ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ సహకారంతో అదనపు తొట్లు నిర్మిస్తున్నాం. – డాక్టర్ ఎస్.రామచందర్, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు -
సబ్సిడీ బర్రెల పథకానికి బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ పాడి పశువుల పథకానికి తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటివరకు తమ వాటా సొమ్ము చెల్లించిన రైతులు తప్ప కొత్త వారి నుంచి ఎలాంటి డీడీలు తీసుకోకూడదని అధికారులకు అంతర్గత ఆదేశాలు వెళ్లాయి. అనేకచోట్ల బర్రెలు, ఆవులు కొనకుండానే కొన్నట్లు చూపుతుండటం, అధికారుల అవినీతి నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పైగా ఎన్నికల సమయంలో పర్యవేక్షణ లేకపోవడం కూడా అక్రమాలకు కారణంగా భావిస్తున్నారు. రైతులకు ఇదే విషయాన్ని పశుసంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో అటు కొత్తగా డీడీలు చెల్లించాలనుకున్న రైతులు, ఇటు ఇప్పటికే డీడీలు చెల్లించి పాడి పశువులు పొందని వారిలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు 52,491 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించగా అందులో 32,175 మందికి పాడి పశువులను సరఫరా చేశారు. మిగిలిన రైతులు కూడా చాలామంది డీడీలు చెల్లించేందుకు సిద్ధమవుతుండగా, ఇప్పుడు వద్దనీ ఎన్నికల తర్వాత ఇవ్వండని పశు సంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు. -
పకడ్బందీగా గొర్రెలు, పాడి గేదెల పంపిణీ: తలసాని
సాక్షి, హైదరాబాద్: విభిన్న కార్యక్రమాల అమలుతో దేశంలోనే రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో రెండో విడత గొర్రెలు, పాడి గేదెల పంపిణీ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలపై జరిగిన రాష్ట్రస్థాయి సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆలోచనతో రూ.5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని, సమిష్టి కృషితో 63 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలోని యాదవ, కురుమలందరికీ గొర్రెలు పంపిణీ చేసేందుకు మరో రూ.5 వేల కోట్లు ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. -
సబ్సిడీపై 2.13 లక్షల పాడి పశువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2.13 లక్షల మంది పాడిరైతులకు సబ్సిడీపై గేదెలు, ఆవుల పంపిణీని ఆగస్టు మొదటివారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఇక్కడ ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయ, కరీంనగర్, ముల్కనూర్, మదర్ డెయిరీలకు పాలు పోస్తున్న 2.13 లక్షల మంది రైతులకు సబ్సిడీపై పాడిగేదెలు, పాడి ఆవులను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. ఒక్కో పాడిగేదెకు రూ. 80 వేలు కాగా ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీని వర్తింప చేస్తామని పేర్కొన్నారు. మొదటగా 15 వేల మంది లబ్ధిదారులకు గేదెలను పంపిణీ చేస్తామని, ప్రతినెలా 15 వేల నుండి 16 వేల పశువులను కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ గేదెలను హర్యానా, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆయా రాష్ట్రాలలో గేదెల లభ్యత, నాణ్యతను పరిశీలించేందుకు డెయిరీల ప్రతినిధులు, అధికారులు, రైతులతో కూడిన బృందాలు పర్యటించినట్లు వివరించారు. రైతుల ఇష్టాఇష్టాలపై ఆధారపడే విధంగా పాడిగేదెల కొనుగోలు పథకం నిబంధనలు రూపొందిస్తామన్నారు. పశువుల కొనుగోలు విధివిధానాలను 2.13 లక్షల మంది సభ్యులకు తెలుగులో కరపత్రం రూపంలో ముద్రించి అందజేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బల్క్‌మిల్క్ చిల్లింగ్ సెంటర్ల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు అధికారులు స్థానిక డెయిరీతో కూడిన 300 బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పాడిగేదెల కొనుగోళ్లకు వెళ్లే లబ్ధిదారుల ఎంపిక తదితర బాధ్యతలను ఆయా డెయిరీ ఫెడరేషన్ చైర్మన్లు చేపట్టాలని మంత్రి సూచించారు. విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి ఈ కార్యక్రమాన్ని ఇతర డెయిరీల చైర్మన్లతో సమన్వయం చేస్తారన్నారు. కొనుగోలు చేసిన ప్రతి గేదెకు తప్పనిసరిగా బీమా చేస్తామని తలసాని చెప్పారు. ఇప్పటికే పాడిరైతులను ప్రోత్సహించేందుకు లీటర్ పాలకు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకోవాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశమని వివరించారు. లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ.. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన అన్ని విలీన గ్రామాల్లో నివసిస్తున్న గొల్ల, కురుమలకు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, వనపర్తి, కొల్హాపూర్ల్లో నివసిస్తున్న వారికి పంపిణీ చేయడానికి వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా మంత్రి తలసాని ఆదేశించారు. గతేడాది జూన్ 20వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు రూ. 3,700 కోట్లతో 65 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు చెప్పారు. -
పది జిల్లాల్లో వంద శాతం గొర్రెల పంపిణీ: తలసాని
సాక్షి, హైదరాబాద్: జాబితా ఏ కింద ఇప్పటికే 10 జిల్లాల్లో వంద శాతం గొర్రెల పంపిణీ పూర్తయిందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. జీవాలకు వైద్యసేవలు అందించే పశు వైద్యశాలలను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం రూ.12.50 కోట్లు కేటాయించిందని వివరించారు. సోమవారం ఆయన సచివాలయం నుండి జిల్లా పశు వైద్యాధికారులు, పంచాయతీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తలసాని మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో మందులు, దాణా నిల్వ చేసేందుకు గోదాముల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ప్రతి వైద్యశాలలో మంచినీటి నల్లా కనెక్షన్ కోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు దరఖాస్తు చేయాలని చెప్పారు. చనిపోయిన గొర్రెలకు ఈ నెలాఖరులోగా క్లెయిమ్‌లు పరిష్కరించాలని మంత్రి సూచించారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల సమాఖ్య ఎండీ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోతులకు కు.ని. ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్: కోతుల బెడదను నివారించేందుకు ప్రభుత్వం సరికొత్త ఉపాయం కనిపెట్టింది. దశలవారీగా కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని నిర్ణయించింది. హిమాచల్ ప్రదేశ్ మాదిరిగా కోతులకు ఇంజెక్షన్లు ఇచ్చి సంతతి పెరగకుండా నివారించే విధానం చర్చకు వచ్చింది. ఈ మేరకు సోమవారం ఇక్కడ కోతుల బెడద నివారణపై నిపుణుల కమిటీ అరణ్యభవన్‌లో సమావేశమైంది. పంటలను ధ్వంసం చేయటం, గ్రామాల్లో వీటి ఆగడాలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిపుణుల కమిటీని నియమించారు. అటవీ, వ్యవసాయ, మున్సిపల్, హార్టికల్చర్, అధికారులతోపాటు అటవీ జంతువులపై పరిశోధనలు చేస్తున్న సంస్థల ప్రతినిధులకు కమిటీలో చోటు కల్పించారు. వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో రానున్న నెల రోజుల్లో కోతుల బెడద, తీవ్రతపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఏఏ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి.. ఏ రకమైన పంటలను కోతులు నాశనం చేస్తున్నాయి.. వాటి నివారణ, మానవ ఆవాసాలపై కూడా కోతుల బెడద ఏ మేరకు ఉందన్న విషయాల ఆధారంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. అటవీ ప్రాంతంతోపాటు, జనావాసాల్లో కూడా కోతులకు తినే పదార్థాలు పెట్టడం వల్ల అడవులను వదిలి బయటకు వచ్చేందుకు మక్కువ చూపుతున్నాయని, ప్రజలు కోతులకు ఫీడింగ్ పెట్టకుండా ఉండటం మంచిదని నిపుణులు అభిప్రాయపడ్డారు. కోతులపై అధ్యయనం, కుటుంబ నియంత్రణ చర్యలకు ఉద్దేశించిన ప్రత్యేక సెంటర్ నిర్మల్‌లో త్వరలోనే ప్రారంభమౌతుందని, స్టెరిలైజేషన్ చేసిన కోతులను విడతలవారీగా అడవుల్లోకి వదిలిపెట్టేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తదుపరి కార్యాచరణపై మరో వారం, పదిరోజుల్లో మరోసారి కమిటీ సమావేశం జరగనుంది. సమావేశంలో ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పి.కె.ఝా, పీసీసీఎఫ్‌లు పృథ్విరాజ్, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నిటీ అధికారి వెంకటేశ్వర రెడ్డి, సీసీఎంబి డైరెక్టర్ డాక్టర్ ఉమాపతి, వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
థర్డ్ పార్టీ వెరిఫికేషన్ రద్దు?
సాక్షి, హైదరాబాద్: గొర్రెల అక్రమార్కులకు ఊతం ఇచ్చేలా పశు సంవర్ధకశాఖ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేకచోట్ల గొర్రెల రీసైక్లింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమాలపై థర్డ్ పార్టీ సర్వే చేపట్టాలని ఇటీవలే తీసుకున్న నిర్ణయాన్ని ఆ శాఖ వెనక్కు తీసుకున్నట్లు సమాచారం. థర్డ్ పార్టీ సర్వే కోసం ఆర్థిక సామాజిక అధ్యయనాల కేంద్రం (సెస్)కు అనుమతిస్తూ ప్రభుత్వం గత డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ఆ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ‘తనిఖీల కోసం ఉత్తర్వులు వచ్చాయా? వస్తే చూపించండి. ఆ విషయం నాకు తెలియదే. అయినా మనమంతా మానవులం. అక్కడక్కడ తప్పులు జరగడం సహజం. అయినా ఏదో ఒక సంస్థకు తనిఖీల బాధ్యత అప్పగిస్తే అంతా సవ్యంగా చేసినట్లే అవుతుందా? లక్షలాది గొర్రెలను, లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసే శక్తి సంస్థలకు ఎంత ఉంటుంది?’అంటూ కొత్తగా బాధ్యతలు చేపట్టిన పశు సంవ ర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా వ్యాఖ్యానించడం గమనార్హం. రాజకీయంగా ఇబ్బందనా.. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ సెస్‌కు అప్పగిస్తూ సురేశ్‌చందా ఉత్తర్వులు ఇవ్వడంపై పైస్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనట్లు సమాచారం. సందీప్‌కుమార్ సుల్తానియాకు బాధ్యతలు అప్పగించడంతో ఆయన తనిఖీ ని పక్కన పెట్టేసినట్లు అర్థమవుతోంది. గత జూన్‌లో ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేపట్టింది. ఇతర రాష్ట్రాల్లో గొర్రెల లభ్యత లేకపోవడం, దళారుల ప్రవేశం, పశు వైద్యుల చేతివాటంతో అక్రమాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం కొందరు అధికారులపై వేటు కూడా వేసింది. అయితే థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేపడితే తన తప్పును తానే ఒప్పుకున్నట్లు అవుతుందని పెద్దలు భావించారు. అక్రమాలు జరిగినట్లు సెస్ నివేదిస్తే రాజకీయంగానూ నష్టం జరుగుతుం దని సర్కారు భావించింది. దీంతో సెస్‌కు ఇచ్చిన తనిఖీ బాధ్యతలను రద్దు చేసే యోచనలో సర్కారు ఉంది. 42 లక్షల గొర్రెల పంపిణీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ ప్రక్రియ జోరందుకుంది. ఇప్పటివరకు 42 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ ఎండీ వి.లక్ష్మారెడ్డి సోమవారం వెల్లడించారు. 2 లక్షలకు పైగా గొల్లకుర్మలకు ఒక్కొక్కరికి 20+1 చొప్పున 75 శాతం సబ్సిడీపై పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ వాటా రూ.1,877 కోట్లు, లబ్ధి0్దదారుల వాటా రూ.625 కోట్లు మొత్తం రూ.2,502 కోట్లు గొర్రెల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. 15.50 లక్షల గొర్రె పిల్లల పునరుత్పత్తి జరిగి సుమారు రూ. 700 కోట్ల సంపద గొల్ల కుర్మలకు చేరిందన్నారు. 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 సంచార పశు వైద్య అంబులెన్సులను అందుథబాటులోకి తీసుకువచ్చామన్నారు. -
ఉద్యోగం కన్నా ప్రకృతి సేద్యం మిన్న
ఇంటికి దూరంగా వెళ్లి చిన్నా చితకా ఉద్యోగాలు చేయటం కన్నా ఇంటి పట్టునే ఉండి సొంత భూమిలో ప్రకృతి వ్యవసాయం చేసుకోవడమే మిన్న అని భావించాడా యువకుడు. అతని పేరు కె. వేణుగోపాలనాయుడు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం కె. సీతారాంపురం గ్రామం అతని స్వస్థలం. వ్యవసాయ కుటుంబానికి చెందిన వేణు మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన తర్వాత వైజాగ్‌లో ఆర్నెల్లు ఉద్యోగం చేశారు. ఈ లోగా తమ లచ్చయ్యపేటలోని చెరకు ఫ్యాక్టరీ ఆవరణలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా తరగతులు జరగడంతో తండ్రి రత్నాకర్‌తో కలసి ఆసక్తిగా హాజరయ్యారు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి తండ్రికి తోడుగా ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేయాలని వేణు నిర్ణయించుకున్నారు. ఆ విధంగా 9 నెలల క్రితం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 4 ఎకరాల్లో కో–4, కో–3 పశుగ్రాసం, ఎకరంలో వరి, 15 సెంట్లలో యాపిల్ బెర్ను సాగు చేయడం ప్రారంభించారు. పశుగ్రాసం సాగుకు ప్రభుత్వం నుంచి సహాయం పొందారు. సాళ్ల మధ్య 2.5 అడుగులు, మొక్కల మధ్య అడుగు దూరంలో పశుగ్రాసం నారును 4 నెలల క్రితం నాటారు. వారం, పది రోజులకోసారి స్వయంగా తానే తయారు చేసుకునే జీవామృతాన్ని డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. ఎకరంలో పెంచే పశుగ్రాసాన్ని ఇతర రైతులకు చెందిన 8 పాడి పశువులకు పచ్చిమేతగా కిలో రూ.1 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ. 9వేల కౌలు, రూ. 40 వేలను ప్రోత్సాహకంగా అందజేస్తున్నదని తెలిపారు. రెండేళ్ల వరకు ఇలా రైతులకు పచ్చిమేత ఇవ్వాల్సి ఉంటుందని, పదేళ్ల వరకు పచ్చిగడ్డి వస్తూనే ఉంటుందని వేణు తెలిపారు. తెలిసిన రైతు దగ్గర నుంచి 40 ఆపిల్ బెర్ మొక్కలు తెచ్చి ఎటు చూసినా 8 అడుగుల దూరంలో 15 సెంట్లలో నాటుకున్నారు. తొలి కాపుగా చెట్టుకు 3–5 కిలోల నాణ్యమైన ఆపిల్ బెర్ పండ్ల దిగుబడి వచ్చింది. జీవామృతం క్రమం తప్పకుండా డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. పురుగు కనిపించినప్పుడు అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం పిచికారీ చేశారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఈ పండ్లు రుచిగా ఉన్నాయన్నారు. తొలి పంట కాబట్టి అందరికీ పంచిపెట్టానని తెలిపారు. నీలగిరి మొక్కల వల్ల పొలం పాడవుతున్నదని గ్రహించి, ఆ మొక్కలను పీకించి చెరువు మట్టి తోలించారు. ఎకరంలో వరిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ప్రకృతి సేద్యంలో తొలి పంట కావడంతో 18 (80 కిలోలు) బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని వేణు తెలిపారు. ఇతరులు ఎరువులు, పురుగుమందులకు ఎకరానికి రూ. 7–8 వేలు ఖర్చు చేశారని, తనకు రూ. వెయ్యి వరకు ఖర్చయిందని తెలిపారు. మొత్తం మీద ప్రకృతి వ్యవసాయం తొలి ఏడాది కూడా తమకు లాభదాయకంగానే ఉందని, మున్ముందు దిగుబడులు మరింత పెరుగుతాయని భావిస్తున్నట్లు యువ రైతు వేణు(96403 33128) సంతృప్తిగా తెలిపారు. – పోల కోటేశ్వరరావు, సాక్షి, సీతానగరం, విజయనగరం జిల్లా -
జీవాలకు సేవ చేయడం అదృష్టం: తలసాని
సాక్షి, హైదరాబాద్: జీవాలకు సేవ చేయడం ఎంతో అదృష్టమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. జీవాలకు అవసరమైన వైద్యం సకాలంలో అందించడంతో పాటు గ్రాసం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పశుసంవర్థక శాఖ అధికారుల నూతన డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పశుసంవర్థక శాఖలో నూతన నియామకాలు చేపట్టడంతో పాటు, పదోన్నతులు ఇచ్చామని తెలిపారు. రానున్న రోజుల్లో శాఖ మరింత అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశు వైద్య సేవలను మెరుగుపర్చడంతో పాటు ఆస్పత్రులలో మౌలిక వసతులు కల్పించామన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఇటీవల బదిలీ అయిన పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా శాఖ అభివృద్ధికి ఎంతో కృషిచేశారని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, అదనపు కార్యదర్శి రేణుకాదేవి, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, పశుసంవర్థక శాఖ అధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బేరీ బాబు, వీఏఎస్‌ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పెంటయ్య, డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
గొర్రెకు..గొర్రె!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వివిధ కారణాల వల్ల మరణించిన రాయితీ గొర్రెల స్థానంలో మళ్లీ గొర్రెలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది రాష్ట్రవ్యా ప్తంగా 3.62 లక్షల లబ్ధిదారులకు 75 శాతం రాయితీపై ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేస్తున్న విషయం విదితమే. సుదూర ప్రాంతాల నుంచి వందల కిలోమీటర్ల మేర జీవాలను వాహనాల్లో తీసుకొస్తున్నారు. ఫలితంగా తీవ్ర అలసటతో మార్గమధ్యంలో, కాపరి వద్దకు వచ్చాక పలు రకాల రోగాల బారినపడటం, స్థానిక పరిస్థితులకు అల వాటు పడకపోవడం తదితర కారణాల వల్ల అధిక సంఖ్య లో గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా కాపరులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రతి గొర్రెకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించినప్పటికీ.. దాని ఫలాలు అందుతాయో లేవోనన్న బెంగ లబ్ధిదారులను తొలుత వెంటాడింది. బీమా పరిహారంగా నగదు చెల్లిస్తారని కాపరులు భావించారు. అయితే బీమా పరిహారం నేరుగా లబ్ధిదారునికి చెల్లిస్తే.. ఇతర ఖర్చులకు వినియోగించుకునే అవకాశం లేకపోలేదు. తద్వారా ఆర్థిక పరిపుష్టి కలగాలన్న సదుద్దేశం గాడి తప్పే ప్రమాదం లేకపోలేదు. దీనిపై నిశితంగా ఆలోచించిన సర్కారు.. చనిపోయిన గొర్రె స్థానంలో మరో గొర్రెను అంద జేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా, సుమారు 53 వేల గొర్రెలు చనిపోయినట్లు పశు సంవర్థక శాఖాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రాయితీ గొర్రె మరణం వాస్తవమేనని కంపెనీ నిర్ధారించుకున్న తర్వాత అందుకు సంబంధించిన బీమా పరిహారాన్ని జిల్లా కలెక్టర్ ఖాతాలో బీమా కంపెనీ జమ చేస్తుంది. ఈ మొత్తంతో సదరు లబ్ధిదారునికి మరొక గొర్రె కొనుగోలు చేసి అందజేస్తారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో చనిపోయిన వెయ్యి గొర్రెల వివరాలను బీమా కంపెనీకి అందజేయగా.. ఇందులో 34 క్లెయిమ్స్‌కు ఆమోదం లభించింది. -
గొర్రెల రీ సైక్లింగ్ నిజమే!
పుల్కల్ (అందోల్): గొర్రెల రీసైక్లింగ్‌ను అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ‘అక్కడా.. ఇక్కడా అదే గొర్రె.. బకరా ఎవరు’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’ ప్రధాన సంచిక లో ప్రచురితమైన కథనానికి స్పందించిన మంత్రి శ్రీనివాస్‌యాదవ్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలో పశు సంవర్ధక శాఖ అధికారులే కాకుండా కలెక్టర్ ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో విచారణ జరిపించారు. ఈ క్రమంలో పుల్కల్ మండలంలో ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను విక్రయించింది వాస్తవమే అని విచారణలో తేలింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు కలెక్టర్‌కు ఇటీవల నివేదిక సైతం సమర్పించారు. గొర్రె లను అమ్మిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని కలెక్టర్ ఆదేశించడంతో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు సోమవారం పుల్కల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. గొర్రెలు ఎవరు తీసుకున్నారు? ఎవరికి అమ్మారు? ఎక్కడికి తీసుకెళ్లారు? అనే దాంతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన పుల్కల్ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్నీ సేకరి స్తున్నట్లు తెలిసింది. పుల్కల్లో ఐదుగురు, అక్సాన్‌పల్లి, సింగూరులో పలువురిపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. -
ఎవరు బకరా..!
రేషన్ బియ్యం తరహాలో గొర్రెలు కూడా రీసైక్లింగ్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి తెలంగాణ పల్లెలకు.. ఇక్కడ్నుంచి మళ్లీ ఆంధ్రా సంతలకు.. అక్కడ్నుంచి మళ్లీ తెలంగాణ గొర్రెల కాపర్ల ఇంటి ముందరకు గింగిరాలు కొడుతున్నాయి. పథకం తొలి రోజుల్లో తీసుకొచ్చిన గొర్రెలనే రెండు రాష్ట్రాల మధ్య చక్కర్లు కొట్టిస్తున్నారు. మొదట్లో గొర్రెలను పకడ్బందీగానే సేకరించిన అధికారులు ఆ తర్వాత చేతులెత్తేయడంతో పరిస్థితి దిగజారింది. దళారుల ప్రమేయం పెరిగిపోయి రీసైక్లింగ్‌కు తెరలేచింది. అధికారులు లక్షల సంఖ్యలో గొర్రెలను పంపిణీ చేసినట్టు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ లెక్కలతో పొంతన కుదరడం లేదు. చాలాచోట్ల దళారులే లబ్ధిదారుల నుంచి గొర్రెలను గుండుగుత్తగా రూ.50 వేల నుంచి రూ.55 వేల మధ్య కొనేస్తున్నారు. అవే గొర్రెలను పాలమూరు జిల్లాలోని గద్వాల, పెబ్బేరు కేంద్రంగా ఆంధ్ర, రాయలసీమలకు తరలిస్తున్నారు. అక్కడి సంతల్లో మళ్లీ వాటినే కొని తెలంగాణ పశుసంవర్థక శాఖ అధికారులకు అంటగడుతున్నారు. దారితప్పిన గొర్రెల పథకంపై ‘సాక్షి’ ఈవారం ఫోకస్.. – వర్ధెల్లి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ దళారీలదే రాజ్యం ఈ ఆధార్ కార్డు కర్నూలు జిల్లా శిరివెల్ల మండలం చెన్నారం గ్రామానికి చెందిన కొర్రపాటి సుబ్బరాయుడు తండ్రి కాశన్నది. ఆయన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా, ఆయన చిన్నాన్నకు చెందిన ఆంధ్రా బ్యాంకు ఖాతాలో తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.23 లక్షల వరకు జమ చేసింది. ఒక్కరికే ఇంత పెద్దమొత్తంలో గొర్రెలు ఉన్నా యా? అని ఆరా తీస్తే.... సుబ్బరాయుడు గత ఎనిమిదేళ్లుగా పశువుల దళారీగా పనిచేస్తున్నట్టు తేలింది! ఈయన ఒక సంతలో గొర్రెలను కొని మరో సంతలో అమ్ముతుంటాడు. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పథకం తెచ్చిన నేపథ్యంలో కర్నూలు జిల్లా దీబగుంట్ల సంతలో అడ్డా వేసి.. మన అధికారులకు బోను పెట్టాడు. మొదట్లో గొర్రెల కాపరుల దగ్గర్నుంచి గొర్రెలు సేకరించి అధికారులకు అమ్మేవాడు. ఇప్పుడు గద్వాల నుంచి లబ్ధిదారుల నుంచే టోకున గొర్లు తెచ్చి అదే సంతలో మన అధికారులకే అమ్మేస్తున్నాడు. ఇప్పుడు మన అధికారులకు ఆయనకు మధ్య బాగా పరిచయం పెరిగింది. హైదరాబాద్ నుంచి అధికారులు ఒక్క ఫోన్ కొడితే చాలు.. దీబగుంట్ల సంతలో గొర్రెలు సిద్ధం చేస్తున్నాడు. ఫోన్‌పైనే లారీల కొద్దీ గొర్రెలను పంపుతున్నాడు. మెదక్, సంగారెడ్డి, పాలమూరు జిల్లాలకు మొదటి విడతలో 10 యూ నిట్లు, ఆ తర్వాత 8 యూనిట్లు, తాజాగా 6 చొప్పున మొత్తం 22 యూనిట్ల గొర్లు ఇచ్చాడు. ‘సాక్షి ప్రతినిధి’ ఈయనకు ఫోన్ చేసి పశుసంవర్థక శాఖ అధికారిగా పరిచయం చేసుకొని మాటల్లో పెట్టింది. మాకు ఇంకెన్ని గొర్రెలు ఇవ్వగలవు అని అడగ్గా.. ‘తన చిన్నాన్న, తన వద్ద కలిపి ఇంకో 35 యూనిట్ల(735) గొర్రెలు ఉన్నాయి’ అని చెప్పాడు. ఎక్కడికి రావాలని అడిగితే.. ఎప్పుడు తీసుకునే చోటే దీబగుంట్ల సంతకు రమ్మన్నాడు. ‘పాత ఆరు యునిట్లకు ఇంకా బ్యాంకుల దుడ్లు పడలేదు.. తొందరగా వేయించండి సారూ..’ అని ప్రాధేయపూర్వకంగానే అర్థించాడు. ఈయనే కాదు బనగానపల్లి మండలం యనకండ్లలో చౌట లక్ష్మిదేవి, చౌట లక్ష్మయ్య భార్యాభర్తల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూ.40 లక్షల డబ్బులు పడ్డాయి. గోస్పాడు మండలం యాలూరులో చాకలి ఓబులేసు, కోడుమూరులో కుర్వ గిడ్డాంజనేయులు, కోయిలకొండలో గురప్పలు కూడా లక్షల్లో డబ్బులు డ్రా చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన 21 మంది గొర్రెలు అమ్మిన వారి పేర్లను సేకరించి క్షేత్రస్థాయిలో విచారిస్తే వారిలో 16 మంది దళారులే అని తేలింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొందరు వైశ్యులు కూడా గొర్రెలు అమ్మినట్లు నివేదికలు ఉన్నాయి. వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, వేలేరుపాడు, సత్తుపల్లి ప్రాంతాలకు గొర్రెలను ఇచ్చినట్టు రికార్డుల్లో ఉంది. ఫోన్ల మీదనే సేకరణ.. అధికారిక నివేదికల ప్రకారం ఇప్పటి వరకు 24.85 లక్షల గొర్రెలు రాష్ట్రానికి చేరాయి. ఇందులో 65 శాతం కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచే తెచ్చారు. నిబంధనల ప్రకారం పశు సంవర్థక శాఖ అధికారులు పొరుగు రాష్ట్రాల్లో గొర్రెల లభ్యతపై సర్వే నిర్వహించి, నాణ్యమైనవాటినే ఎంపిక చేయాలి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా గొర్రెల కాపర్ల నుంచే కొనాలి. లబ్ధిదారులను కూడా వెంట తీసుకెళ్లి వారి సమక్షంలోనే కొనుగోళ్లు జరపాలి. పథకం తొలి రోజుల్లో అధికారులు కొంతమేర పకడ్బందీగానే గొర్రెలను సేకరించి లబ్ధిదారులకు అప్పగించారు. అయితే క్రమంగా గొర్రెల లభ్యత తగ్గిపోవటం, స్థానికంగా ఒత్తిడి పెరగటంతో అధికారులు చేతులెత్తేశారు. ఫలితంగా అవినీతికి బీజం పడింది. రైతుల వద్ద నుంచి గొర్రెలు సేకరించడం మానేసి దళారీ వ్యవస్థను ప్రోత్సహించారు. దళారులు కొన్ని రోజుల పాటు స్థానిక గొర్రెల కాపరుల నుంచి జీవాలను సేకరించి విక్రయించారు. క్రమంగా ఇరువర్గాల మధ్య పరిచయాలు పెరగడంతో అవినీతి వట వృక్షంగా మారింది. అధికారులు క్షేత్ర స్థాయి పర్యవేక్షణ తగ్గించి, దళారుల ఫోన్లపై ఆధారపడ్డారు. తెలంగాణ నుంచి బయల్దేరే ముందు దళారికి ఫోన్ చేస్తే కావాల్సినన్ని గొర్రెలు సిద్ధం చేసి పెడుతున్నారు. ప్రతి యూనిట్‌పై రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ముట్టజెపుతున్నట్టు దళారుల మాటలను బట్టి తెలుస్తోంది. ఏపీ టు తెలంగాణ.. తెలంగాణ టు ఏపీ గొర్రెల పథకంలో రెండు రాష్ట్రాల్లోనూ దళారులది ఇష్టారాజ్యంగా మారిపోయింది. గొర్రెల కంటే ముందే దళారులే లబ్ధిదారుడి ఇంటికి వస్తున్నారు. తెచ్చిన గొర్రెలను తెచ్చినట్టు తీసేసుకుంటున్నారు. యూనిట్ గొర్రెలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.1.15 లక్షల దాకా వెచ్చిస్తుంటే కేవలం రూ.50 వేల నుంచి రూ.55 వేలకే కొనుగోలు చేస్తున్నారు. లారీల్లో వచ్చిన గొర్రెలను వచ్చినట్టే అమ్మితే రూ.50 వేలు, వారం పది రోజుల పాటు మేపితే రూ.55 వేల చొప్పున చెల్లిస్తున్నారు. ఏపీలో గొర్రెలు అమ్ముతున్న దళారులు.. లబ్ధిదారుల్లో కొందరి ఫోన్ నంబర్ తీసుకొని పరిచయం పెంచుకుంటున్నారు. చివరికి వారిని కూడా తమ అక్రమ వ్యాపారంలోకి దింపుతున్నారు. ఇలా ప్రస్తుతం తెలంగాణలో ప్రతి మండలంలో కనీసం ముగ్గురు నుంచి నలుగురు లబ్ధిదారులే దళారులుగా అవతారం ఎత్తి సబ్సిడీ గొర్రెలను టార్గెట్ చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన గొర్రెలను రాత్రికి రాత్రే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్, పెబ్బేరుకు తరలిస్తున్నారు. అక్కడ కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన దళారులు సిద్ధంగా ఉంటారు. 10 నుంచి 15 నిమిషాల్లో బేరం పూర్తి అవుతోంది. స్థానిక దళారులు ప్రతి యూనిట్(20 గొర్రెలు, ఒక పొట్టేలు)పై రవాణా ఖర్చులు, లేబర్ చార్జీలు పోను రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు లాభం చూసుకుంటున్నారు. ఈ లెక్కన రూ.65 వేల నుంచి రూ.70 వేల ధరకు యునిట్ గొర్రెలను ఏపీ నుంచి వచ్చే దళారులకు ఇచ్చేస్తున్నారు. వాళ్లు నేరుగా తమ ప్రాంతాలకు తీసుకెళ్లి సంత సమీపంలో దించి మళ్లీ తెలంగాణ అధికారులకు ఫోన్ చేసి రమ్మంటున్నారు. ప్రతి యూనిట్‌పై రూ.25 వేల నుంచి రూ.30 వేల నికర లాభంతో గొర్రెలను తిరిగి మన అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ వలయాకార ప్రక్రియ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నిత్యకృత్యంగా మారిపోయింది. పుల్కల్లో మాటేస్తే... సబ్సిడీ గొర్రెలను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రాత్రి 10 గంటల సమయంలో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని ఓ నిర్జన ప్రదేశంలో కాపుగాశాం. పుల్కల్ పట్టణంతో పాటు సమీప గ్రామాలు చెక్రియాల్, బస్వాపూర్, ముద్దాయ్పేట, సింగూరు, అక్సాన్‌పల్లి, కోర్పోల్, కోడూర్ తదితర గ్రామాల నుంచి ట్రాలీల్లో గొర్రెలు తెచ్చి ఇక్కడ పోగేస్తున్నారు. వచ్చిన గుంపును వచ్చినట్టే డీసీఎంలు, లారీల్లోకి ఎక్కిస్తున్నారు. ఒక లారీ, ఐదు డీసీఎంలలో గొర్రెలను ఎక్కించారు. ఒకదాని వెంట ఒకటి వెళ్లిపోతున్నాయి. చివరగా ఒక డీసీఎం మిగిలింది. సింగూరు నుంచి రావాల్సిన ట్రాలీ ఆలస్యంగా రావటంతో ఆ డీసీఎం కాస్త ఆలస్యంగా బయల్దేరింది. మేం ధైర్యం చేశాం. డీసీఎంకు అడ్డంపోయి ఆపేశాం. డ్రైవర్‌ను కిందకు దించి వివరాలడిగాం. డీసీఎం సమీపంలోని మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిదని చెప్పాడు. తాను డ్రైవర్‌ను మాత్రమే అన్నాడు. ఉదయం 6.30 నుంచి 8 గంటల మధ్య గద్వాలకు గొర్రెలను చేర్చాలని పుల్కల్కు చెందిన దళారీ చెప్పినట్లు వివరించాడు. గత 20 రోజుల నుంచి ఇదే పని చేస్తున్నానని, ఇప్పటికే చాలా ట్రిప్పులు వేశానని తెలిపాడు. వెంటనే గద్వాల్ ‘సాక్షి’ నెట్‌వర్క్‌ను అప్రమత్తం చేయగా.. గద్వాల పట్టణంలోని మార్కెట్ వెనక ఉన్న సంత స్థలంలో కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వచ్చిన దళారులు సిద్ధంగా ఉన్నట్టు తేలింది. ఎప్పుడు చేస్తున్న పనే కాబట్టి పెద్దగా బేరసారాలు లేకుండానే క్రయవిక్రయ తంతు ముగించేశారు. ఇలా లారీల నుంచి గొర్రెలను దించకుండానే బేరం కుదిరిపోతోంది. టీచరు.. హోంగార్డు.. మెకానిక్ కూడా లబ్ధిదారులే.. పుల్కల్లో మొత్తం 900 మంది లబ్ధిదారులను గుర్తించాం. వారి ఇళ్లకు వెళ్లి చూడగా.. 394 మంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసినట్లు తేలింది. పుల్కల్ మండల కేంద్రంలో 46 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఎంత మంది దగ్గర సబ్సిడీ గొర్రెలు ఉన్నాయో పరిశీలించగా.. విస్తుబోయే విషయాలు వెల్లడయ్యాయి. గొర్రెలు పొందిన వారిలో ఉపాధ్యాయుడు, హోంగార్డు, డిగ్రీ విద్యార్థి, ఫ్యాక్టరీ కార్మికుడు, హైదరాబాద్‌లో స్థిరపడిన మెకానిక్ తదితరులు ఉన్నారు. మొత్తం 23 ఇళ్లు తిరగగా.. 15 మంది గొర్రెలను అమ్మేసుకున్నారు. రూ.31.5 వేల పెట్టుబడి పోను రూ.20 వేల లాభానికి అమ్ముకున్నట్లు వారిలో కొందరు చెప్పారు. పుల్కల్కే చెందిన ఓ లబ్ధిదారుడు దళారీగా అవతారం ఎత్తి గొర్రెలను గుండుగుత్తగా కొనుగోలు చేసి గద్వాలకు తరలిస్తున్నాడు. డీసీఎం చెప్పిన దళారీ పేరు, ఇక్కడ లబ్ధిదారులు చెప్పిన బ్రోకర్ పేరు ఒకటే కావడం గమనార్హం. అలాగే మనూరులో 53 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయగా.. ‘సాక్షి’ పరిశీలనలో 11 యూనిట్లు మాత్రమే ఉన్నట్టు తేలింది. రూ. 55 వేలకు గొర్రెలు ఇవ్వడానికి సిద్ధం ముద్దాయిపల్లి గ్రామంలో 10 యూనిట్ల గొర్రెలు వచ్చాయంటే ఆ గ్రామానికి వెళ్లాం. ఊరు చివరిలో ఓ గొర్రెల కాపరి కనిపించాడు. ‘సర్కారు గొర్రెలు ఉంటే అమ్ముతారా..? పెద్దాయనా..’ అని అడిగాం. ‘మాకు ఇంకా రాలేదు బిడ్డా... ఫలానా వాళ్లకు వచ్చాయి. అమ్ముతమనే అంటున్నారు. వెళ్లి కలవండి’ అని సూచించాడు. ఊరు చివర చెరువు కొమ్మున గొర్రెలు మేపుతున్న వాళ్ల దగ్గరకు మమ్ముల్ని తీసుకెళ్లాడు. ఓ లబ్ధిదారుడి కోసం ప్రయత్నం చేస్తే ఐదుగురు జమయ్యారు. అందరూ గొర్రెలు అమ్ముడానికి ముందుకొచ్చారు. యూనిట్ గొర్రెలను మొత్తంగా రూ.50 వేలు ఇస్తామని బేరం మొదలుపెట్టాం. వాళ్లు రూ.62 వేలు అన్నారు. మేం మరో వెయ్యి పెంచాం. వాళ్లు రూ.2 వేలు తగ్గారు. మొత్తానికి 56 వేల దగ్గర బేరం ఆపేశాం. ఇంకా కిందకు దిగితే బేరం కుదిరేటట్టు ఉంది. దీంతో పుల్కల్లో పని ఉందని, మళ్లీ వస్తామని చెప్పాం. ఇంతకీ ఎందుకు అమ్ముకుంటున్నారని వారితో మాట కలిపాం. ‘రూ.80 వేలకు వచ్చే గొర్రెలను, రూ.1.25 లక్షలకు అంటగడుతుండ్రు. గుంపులోంచి మూడు నాలుగు గొర్రెలు వచ్చీ రావడంతోనే చస్తున్నాయి. ఇంకెన్ని చస్తాయో తెల్వదు. వీటికి మందులు వేయడానికి డాక్టర్లు రారు. ఏ మందు వేయాలో మాకు తెల్వదు. నష్టపోవడం కంటే ఇంత లాభం వచ్చేటప్పుడు అమ్ముకునుడే నయం..’ అని లబ్ధిదారులు వివరించారు. ఉద్గిరిలో గొర్రెలు ఎట్లా పుడుతున్నాయబ్బా? సబ్సిడీ పథకం ప్రారంభానికి ముందే సంగారెడ్డి జిల్లా పశు సంవర్థక శాఖ అధికారులు మహారాష్ట్రలోని ఉద్గిరి తాలూకాలో గొర్రెల లభ్యతపై ఒక సర్వే చేశారు. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఉద్గిరి తాలూకా సరిహద్దుగా ఉంది. అక్కడ గొర్రెల లభ్యతపై వివరాలు సేకరించగా.. 2,500లకు మించి గొర్లు లభించే పరిస్థితి లేదని తేల్చారు. దీంతో ఈ ప్రాంతం నుంచి గొర్రెలు సేకరించలేమని అధికారులు కర్నూలు వైపు ప్రయాణించారు. కానీ విచిత్రంగా ఉద్గిరి నుంచే కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ, పిట్లం, బిచ్కుంద ప్రాంతాలకు వేల సంఖ్యలో గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఇన్ని వేల గొర్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయని అడిగితే ఏ అధికారి వద్ద సమాధానం లేదు. చావులకు ప్రయాణమే కారణమా? ఇంటికి వచ్చిన వారం రోజుల లోపు ప్రతి యూనిట్లో సగటున మూడు గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. చనిపోతున్న గొర్రెల్లో 6 నెలల లోపు పిల్లలు, ఐదేళ్లకు పైబడిన గొర్రెలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ మరణానికి కారణం అధిక ప్రయాణమేనని పశువైద్య అధికారులు అంటున్నారు. కానీ విషయం బయటికి చెప్పడానికి బయపడి ‘ఫుట్రాట్’ వ్యాధి అని చెబుతున్నారు. లారీల్లో గొర్రెలను తరలిస్తుండగా.. నిలబడేందుకు ఆధారం దొరక్క కిందపడిపోయి కొన్ని, తొక్కిసలాటలో కొన్ని గాయపడుతున్నాయి. ప్రయాణం చేసినంతసేపు జీవాలు నరాలు బిగపట్టుకొని నిలబడటంతో జబ్బున పడుతున్నాయి. ఇవి తిరిగి మామూలు స్థితికి చేరుకోవడానికి కనీసం 15 రోజుల సమయం పడుతుంది. కానీ 15 రోజులు తిరక్క ముందే గొర్రెల కాపర్లు మళ్లీ దళారీల చేతిలో పెడుతున్నారు. జూలై 20 నుంచి ఇప్పటి వరకు ఈ మూడు నెలల కాల వ్యవధిలో ప్రతి గొర్రె సగటున 2,500 కి.మీ. దూరం ప్రయాణం చేసి ఉండొచ్చని అంచనా. ఈ సుదీర్ఘ ప్రయాణం వల్లే చిన్న పిల్లలు, వయసు మీద పడిన గొర్రెలు చనిపోతున్నాయి. మొదటి దశలో పెద్దగా ప్రాణనష్టం లేదు గానీ, రెండో దశలో అధిక ప్రాణనష్టం ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80 వేల దాకా గొర్రెలు మృత్యువాత పడ్డట్లు సమాచారం. సంతకు తరలిస్తున్న సబ్సిడీ గొర్రెల పట్టివేత కోదాడ రూరల్: కోదాడ నుంచి ఏపీలోని చిల్లకల్లు సంతకు రెండు వాహనాల్లో తరలిస్తున్న 48 గొర్రెలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం సమీపంలో రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద తనిఖీల సందర్భంగా వీటిని పట్టుకున్నారు. వీటిలో సాధారణ గొర్రెలతోపాటు ఇటీవల సర్కారు అందజేసిన సబ్సిడీ గొర్రెలు కూడా ఉన్నట్లు గుర్తించారు. స్థానిక పశువైద్యాధికారి నాగేంద్రబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు. చెక్‌పోస్టులను బలోపేతం చేశాం గొర్రెల రీసైక్లింగ్ ఘటనలు మా దృష్టికి కూడా వచ్చాయి. అందుకే పశుసంవర్థక, పోలీస్, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో కలిపి టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. సరిహద్దు చెక్‌పోస్టులను బలోపేతం చేశాం. ఇప్పటికే కొన్ని లారీలు సీజ్ చేశాం. గొర్రెలు అమ్ముకున్న వారిపై, కొనుగోలు చేసిన దళారులపై కేసులు పెడుతున్నాం. వాతావరణ మార్పుల వల్లే అక్కడక్కడ కొన్ని గొర్లు చనిపోతున్నాయి. – వి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీ -
విజయవంతంగా గొర్రెల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెల పంపిణీ విజయవంతంగా కొనసాగుతుం డటంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గొర్రెల పంపిణీపై సీఎంఓ అధికారు లతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఇప్పటిదాకా 1,00,860 మందికి 21,18,060 గొర్రెలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇంత తక్కువ వ్యవధిలో 21 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం దేశ చరిత్రలోనే మొదటి సారని అధికారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి తదితరులను అభినందించారు. వచ్చే ఏడాది హరితహారం నిర్వహణకు గ్రామానికో నర్సరీ ఏర్పా టు చేయాలని సీఎం ఆదేశించారు. వాటిని స్థాని క సంస్థలు నిర్వహించాల న్నారు. ‘‘కొత్తగా ఏర్పడే పంచాయతీలతో కలిపి 10 వేల గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు కావాలి. రానున్న నగర పంచాయితీలను కలుపుకుని 100 వరకున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డులవారీగా నర్సరీలు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో డివిజన్‌కు 4 నర్సరీలుండాలి. వాటికి విత్తనాలను, సాంకేతిక సహకారాన్ని అటవీ శాఖ అందించాలి. మొక్కలను ప్రజలకు పంచి నాటించాలి. అడవుల పరిరక్షణ, పునరుద్ధరణపై అటవీ అధికారులు దృష్టి పెట్టాలి’’ అని ఆదేశించారు. -
ఈ ముఖ్యకార్యదర్శి వద్దు
సాక్షి, అమరావతి: పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిపై సిబ్బంది తిరుగుబాటు ప్రకటించారు. సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన ఆ అధికారి.. అయిన వాళ్లకు ఆకుల్లో, కానివారికి మూకుళ్లలో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై ఇటీవల బాధ్యతలు చేపట్టిన పశుసంవర్ధకశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆయన్ని తక్షణమే తమ శాఖ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రమోషన్లు వస్తాయని భావించిన సిబ్బందికి ఆయన పట్టించుకోకపోవడం శాపంగా మారింది. ప్రమోషన్లు ఇవ్వమని ఇచ్చిన జీవో (నంబర్ 126, ఫైనాన్స్ 29/6/2016)ను అమలు చేయకుండా పాలనను కుంటుపరుస్తున్నారన్న విమర్శలున్నాయి. ట్రిబ్యునల్ ఆదేశించినా.. బేఖాతరు రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రమోషన్లపై ఆశతో చాలామంది అందరికంటే ముందే అమరావతి బాట పట్టారు. డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రమోషన్లు వస్తాయని భావించారు. అయితే అప్పటి వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరు చెప్పి ఆయన పేషీలోని కొందరు లంచా లు డిమాండ్ చేశారన్న ఆరోపణలు రావడంతో ఆగిపోయాయి. ఈ వ్యవహారం లో ప్రత్తిపాటికి ఓఎస్డీగా వ్యవహరించిన ఓ వ్యక్తి తన ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈలోపు మంత్రితో పైరవీలు చేయించుకున్న ఒకరిద్దరికి ఈ ఉన్నతాధికారి ప్రమోషన్లు ఇవ్వడం వివాదాస్పదమైంది. వారిలో ఒకరు డాక్టర్ కొండలరావు కాగా మరొకరు జి.సోమశేఖరం. కొండలరావు ఆరోగ్య కారణాల రీత్యా పశుసంవర్ధకశాఖ అదనపు డైరెక్టర్‌గా వ్యవహరించేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి తనకు సన్నిహితంగా ఉండే సోమశేఖరా న్ని అదనపు డైరెక్టర్‌ను చేసి చక్రం తిప్పుతున్నారు. వాస్తవానికి ఈ ప్రమోషన్ కె.కృష్ణమూర్తికి దక్కాల్సి ఉంది. ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కృష్ణమూర్తికి ఇవ్వమని గత డిసెంబర్ 12న ఉత్తర్వులిచ్చింది. ఆ ఉన్నతాధికారి పట్టించుకోకుండా ప్రత్తిపాటిని ప్రసన్నం చేసుకునేందుకు సోమశేఖరానికి ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్లు ఎవరెవరికీ రావాలంటే ప్రమోషన్లు ఆశించి భంగపడిన సిబ్బంది తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ పనుల్ని జాప్యం చేస్తున్నారు. ప్రమోషన్ల కోసం చూస్తున్న వారిలో 90 మంది డాక్ట ర్లు, 80 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, 10 మంది డిప్యూటీ డైరెక్టర్లు.. ఎంతోమంది సిబ్బంది ఉన్నారు. ఈ విషయమై ఏపీ పశుసంవర్థకశాఖ అధికారుల సేవాసంఘం నేతలు గతంలో ఈ శాఖ మంత్రి ప్రత్తిపాటికి, పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. -
నేస్తాలు
పెరుగుతున్న పెట్ సంస్కృతి మూగ జీవాలను అక్కున చేర్చుకుంటున్న ప్రజలు విశ్వాసపాత్రమైన జంతువుల్లో కుక్క ప్రధానం. శునకం ఇంటి యజమానికి విశ్వాసంగా, నమ్మకంగా, అతి సన్నిహితంగా కుటుంబంలో ఓ సభ్యునిలా ఉంటూ ఇంట్లో అందరి ఆదరాభిమానాలు చూరగొంటోంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కుక్కల పెంపకాన్ని ఇష్టపడతారు. అయితే ఒకప్పుడు సంపన్న హోదాకు చిహ్నంగా అతి కొద్ది మంది ధనికులు మాత్రమే తమ ఇళ్లలో శునకాలను పెంచుకునేవారు. మారిన పరిస్థితుల్లో నేడు మధ్యతరగతితోపాటు సామాన్యులు సైతం కుక్కలను పెంచుకుంటున్నారు. సమాజంలో నేడు వీటి పోషణ సాధారణంగా మారింది. ఆ మూగ జీవుల యజమానులు వాటి ఆరోగ్యం కాపాడుకోవడానికి తిరుపతి గంగమ్మగుడి సమీపంలోని పశువైద్యశాలను సంప్రదిస్తున్నారు. అక్కడ వైద్యులు సైతం వాటికి సేవలు అందిస్తున్నారు. తిరుపతి మెడికల్: జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె తదితర నగరాల్లో గత కొంతకాలంగా పెంపుడు జంతువుల పెంపకం సంస్కృతి పెరుగుతోంది. మానవతావాదులు మూగ జీవాలను కన్నబిడ్డలా పోషిస్తున్నారు. వీటిలో ప్రధానమైనవి కుక్కలే. నగరాల్లో పెరుగుతున్న ‘పెట్’ సంస్కృతి రోజు రోజుకూ పెరుగుతోంది. పెంపుడు జంతువుల (పెట్)ను పెంచుకోవడం గొప్ప కాదు. వాటిని సరైన పద్ధతిలో ఒక క్రమశిక్షణతో ఆ రోగ్యంగా పెంచితే వాటితో పాటు ఆ యజ మాని కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నగరంలోని పలువురు సంపన్నులు అరుదైన జాతులకు చెందిన కుక్క పిల్లలను పెంచుకుంటున్నారు. అలాంటి వారు వాటి పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య నియమాలు తప్పనిసరి ఒక కుక్క పిల్లను పుట్టినప్పటి నుంచి పెంచుకుంటుంటే దానికి 15 రోజుల వయసు రాగానే పురుగుల నివారణ మందు తాగించాలి. ఆరు నెలల పాటు నెలకోసారి విధిగా తాగించాలి. అది కూడా కుక్క బరువు ఆధారంగా సంబంధి త డాక్టర్‌ను సంప్రదించిన తరువాతే తాపాలి. పుట్టిన 45 రోజులకు రక్త బేదులు, దగ్గు, జలుబు, నరాల బలహీనత వంటి వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. ఆపై అదే టీకాలను 3 నుంచి 4 వారాల తరువాత, మరోసారి 3 నెలల వయసులో వేయించాలి. కుక్కకు 2 సంవత్సరాల నుంచి బతికున్నంత వరకు క్రమం తప్పకుండా టీకాలు వేయించా ల్సి ఉంటుంది. పెంపుడు కుక్కను ఏదైనా వీధి కుక్క కరిస్తే నిర్లక్ష్యంగా చేయకూడదు. ముందుగా గాయం వద్ద సోపుతో శుభ్రంగా కడగాలి. ఆపై 24 గంటల్లోగా దగ్గరలోని సంబంధి త పశువైద్యుని వద్ద వైద్యం చేయించాలి. తొలిరోజు నుంచి 3, 7, 14, 28 ఐదు సార్లు టీకాలు వేయించడం ఉత్తమం. ఆహార నియమమూ అవసరమే చాలా మంది మైదాపిండితో చేసిన బిస్కెట్లను కుక్కలకు పెడుతుంటారు. అది ప్రమాదమే అంటున్నారు వైద్యులు. బి స్కెట్ల వల్ల ఆకలి మందగించడంతోపాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బిస్కెట్ల బదులు డ్రైఫుడ్ (పెల్లెట్స్), చూస్టిక్స్లను తినిపిస్తే ఆరోగ్యంతో పాటు దంత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే చాలా మంది కుక్కలకు లై ఫ్ బాయ్ లాంటి కార్బొటిక్ యాసిడ్ వంటివి వాడుతుం టా రు అలాంటివి వాడకూడదు. కుక్కలకు సంబంధించిన ప్ర త్యేకమైన సోపును వాడాలి. అలాగే మనుషులు వాడే షాం పులు కాకుండా, కుక్కల షాంపును మాత్రమే ఉపయోగించా లి. బొచ్చు కుక్కలకు రోజూ రెండు సార్లు దువ్వెనతో దువ్వా లి. తద్వారా శరీరంలో రక్తప్రసరణ సాఫీగా ఉంటుంది. వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి మనం ఎంతో ముచ్చటగా పెంచుకునే కుక్కలకు మనకు తెలియకుండానే వ్యాధుల బారిన పడతాయి. అయితే ముం దుగానే ఆ వ్యాధి లక్షణాలను పసిగట్టి వైద్యుడికి చూపిస్తే మొదటిలోనే ఆ వ్యాధిని నయం చేయవచ్చు. ప్రధానంగా వచ్చే వ్యాధులలో జీర్ణకోశ వ్యాధి, చర్మ వ్యాధి, పాల్కోడి, హెపటైటిస్, లెప్టోస్పైరా, రేబీస్‌తో పాటు శ్వాస కోశ వ్యాధులు వస్తుంటాయి. ముందస్తుగా టీకాలు, వైద్య సేవలు అందిస్తే జబ్బులకు చెక్ప్టెచ్చు. మా ‘చిట్టి’కి పెద్ద కథే ఉంది మాకు చిట్టి(కుక్కపేరు) రో డ్డుపై దొరికిన అపురూపం. ఎందుకం టే దానికి ఓ కథ ఉంది. చిట్టి త ల్లి (వీధికుక్క)కి మొత్తం ఐదు పి ల్లులు. చిట్టికి నెల వయసులో తల్లి తో పాటు మిగిలిన నాలుగు పిల్లలు చనిపోవడంతో చిట్టి ఒంటరైంది. దీన్ని వీధి కుక్కలు కర వడంతో చనిపోయిందని కుప్పతొట్టిలో పడేశారు. ఈ దృ శ్యం నన్ను కలచివేసింది. వెళ్లి చూడగా బతికే ఉంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే బతకదన్నారు. ఎలాగోలా ఆపరేషన్ చేశారు. ఇంటికి తీసుకెళ్లి 2 నెలలు కంటికి రెప్పలా కాపాడుకుంటే కోలుకుంది. అప్పటి నుంచి చిట్టే నా ప్రాణంగా మారిపోయింది. – సుధీర్, పెద్ద కాపు వీధి, తిరుపతి ప్రేమకు ప్రతిరూపమే ‘బ్రౌని’ లాసిక్ జాతికి చెందిన 4 నెలల బ్రౌని మా కుటుంబానికి ఒక వెలుగు లాంటిది. మాతో ఎం తో అన్నోన్యంగా ఉంటూ, ప్రే మానురాగాలను చూపిస్తుం టుం ది. ఒక వేళ మేము బ్రౌనిని వదిలి ఎక్కడికైనా బయటకు వెళుతున్నామంటే ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అలుగుతుంది. బయటకు వెళ్లి ఇంటికి వచ్చామంటే పైకి ఎగబడుతూ ప్రేమను చూపిస్తుంది. ఆ సమయంలో రక్తబంధం కంటే ఎక్కువగా బ్రౌనిపై ఆత్మీయతను చూపిస్తాం. బ్రౌనీ అంటే అంతటి అభిమానం. – మాధవి, ఎస్వీ నగర్, తిరుపతి వేసవిలో ‘ పెట్ ’ జాగ్రత్త సుమా... వాతావరణంలో ఉష్ణోగ్రతలు మారే కొద్దీ ఇళ్లలోని పెంపు డు జంతువుల ఆరోగ్యంపై యజమానులు దృష్టి సారిం చాలి. ప్రధానంగా వేసవిలో వడదెబ్బ నుంచి మూగ జీవులను కాపాడుకోవాలి. చల్లటి నీ రు, ఎలక్ట్రోలైట్, ఉప్పుతో మజ్జిగ, కొబ్బరి నీళ్లను తర చూ తాగించడం మంచిది. ముఖ్యంగా వేడి ప్రాంతంలో ఉండకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే వడ్డదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ పీ ఈశ్వర ప్రసాద్, అసోసియేట్ డీన్, వెటర్నరీ కళాశాల మూగ జీవాలకు వైద్యం ఎంతో పుణ్యం మూగ జీవాలకు వైద్యం చేయడం ఎంతో పుణ్యంగా భావిస్తాను. కుక్క పాలు కొవ్వులేకుండా పలుచగా ఉంటాయి. తల్లి లేని పిల్లలకు కొవ్వు శాతం తక్కువగా ఉన్న పాలను మాత్రమే తాగించాలి. తద్వారా కుక్క పిల్లలకు జీర్ణం బాగా అవడంతో పాటు ఆరోగ్యంగా పెరుగుతుంది. చాలా మందికి కుక్కలకు పెరుగన్నం పెట్టకూడదన్న అపోహ ఉంది. అది సరైంది కాదు. 2,3 నెలల వయసు దాటిన కుక్కలకు మాత్రమే పెరుగన్నం తినిపించాల్సి ఉంటుంది. అదికూడా కారం, మసాలాలు ఉన్న ఆహారం పెట్టకుండా, ఉప్పు, పసుపు వేసిన మాంసాన్ని ఉడికించి పెట్టాలి. – డాక్టర్ కామినేని సురేష్, అసోసియేట్ ప్రొఫెసర్, వెటర్నరీ వైద్యశాల -
గొర్రెల మేతకు ఖాళీ భూముల వెతుకులాట
పంట, ఖాళీ భూముల వివరాల సేకరణలో ఏఈవోలు లక్ష యూనిట్ల గొర్రెల పంపిణీకి సర్కారు కసరత్తు సాక్షి, హైదరాబాద్: గొర్రెల మేతకు ఖాళీ భూములను వెతికేపనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. ఇటీవల నియమితులైన వెయ్యి మంది వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)తో భూముల వివరాల సేకరిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం లక్ష యూనిట్ల గొర్రెలను గొర్రెల కాపరులకు, సంబంధిత సామాజిక వర్గాలకు సరఫరా చేయనుంది. వాటి మేతకు సమస్య తలెత్తకుండా గ్రామాల్లో పంట, బీడు, కొండలు, గుట్టలతో కూడిన భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. గుర్తించిన ఖాళీ భూములను గొర్రెల మేతకు ఉపయోగిస్తారు. ఒక్కో యూనిట్లో 20+1 గొర్రెలుంటాయి. అందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కోట్లు ఖర్చు చేయనుంది. దీనికి సంబంధించి జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) నుంచి రూ.1400 కోట్లు రుణం తీసుకురానుంది. 21 లక్షల గొర్రెలను ఎక్కడెక్కడి నుంచి తీసుకురావాలన్న దానిపై అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. పది రోజుల్లో పూర్తి వివరాల సేకరణ పశు సంవర్థకశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లోని వివిధ సంతలకు వెళ్లి మేలుజాతి గొర్రెలను అధ్యయనం చేసి వచ్చారు. లబ్ధిదారులను ఎంపిక చేశాక గొర్రెలను ఇక్కడకు తీసుకొస్తారు. భారీగా వాటిని తీసుకురావడంతో మేతకు అనువైన ప్రాంతాల అధ్యయనం కొనసాగుతోంది. ఇటీవల నియమితులైన ఏఈవోలకు వారి పరిధిలో ఉండే 2,500 హెక్టార్ల భూమిలో ప్రతీ ఎకరాపైనా సమగ్రంగా నివేదిక తయారు చేస్తారు. పంట పండే భూములు, బీడు భూముల వివరాలను సమగ్రంగా తయారు చేస్తారు. ఇప్పటికే మూడు రోజుల నుంచి భూముల వివరాలపై కసరత్తు సాగుతోంది. మరో వారం, పది రోజుల్లో వివరాలను సేకరించాక వ్యవసాయశాఖకు నివేదిక పంపుతారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. గ్రామాలవారీగా ఖాళీ భూముల వివరాలు తెలిశాక లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. వారు ఎక్కడెక్కడ గొర్రెలను మేపుకోవచ్చో తెలియపరుస్తారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రతీ గొర్రెల పెంపకందారునికి గొర్రెలను సరఫరా చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అందుకోసం దాదాపు రూ. 7 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలని యోచిస్తోంది. -
త్వరలో 450 చూడి పశువుల పంపిణీ
∙ 7 వేల పెరటికోâýæ్ల పెంపకం యూనిట్ల మంజూరు ∙ పశుశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ ఠాగూర్ అనంతపురం అగ్రికల్చర్ : డీఆర్డీఏ – ఐకేపీ సహకారంతో 450 చూడి పశువులు త్వరలో పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్ ‘సాక్షి’కి తెలిపారు. అందుకు సంబంధించి ఐకేపీ ఆధ్వర్యంలో లబ్ధిదారుల గుర్తింపు పూర్తయిందన్నారు. ఒక్కో చూడిపశువు లేదా గేదె విలువ రూ.60 వేలుగా నిర్ణయించామని, అందులో లబ్ధిదారుల వాటా రూ.15 వేలు కాగా మిగతాది పశుశాఖ రాయితీగా ఇస్తుందని తెలిపారు. మేలుజాతి పశువులు తమిâýæనాడు రాష్ట్రం కరూరు జిల్లా, కర్నాటక రాష్ట్రం కోలార్, అలాగే ముర్రా జాతి గేదెలు హర్యానా నుంచి తెప్పించడానికి ఇప్పటికే ఏడీ, డాక్టర్లతో కూడిన స్క్రీనింగ్ బృందం వెళ్లిందన్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్న వాటిని ఎంపిక చేస్తారన్నారు. ఆ తర్వాత లబ్ధిదారులను పిలుచుకెళ్లి వారు కోరుకున్న వాటిని అందజేస్తామన్నారు. దీంతో పాటు జిల్లాకు 7 వేల వరకు పెరటికోâýæ్ల పెంపకం యూనిట్లు (బ్యాక్‌యార్డ్ ఫౌల్ట్రీ) మంజూరైనట్లు తెలిపారు. ఒక్కో పెరటి కోళ్ల యూనిట్ విలువ రూ.3,060 కాగా లబ్ధిదారులు తమ వాటాగా రూ.810 చెల్లించాలన్నారు. ఒక యూనిట్ కింద 45 కోడిపిల్లలు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానిస్తామని చెప్పారు. -
వర్గోన్నతి సరే.. వైద్యులు ఏరి..!
ఏలూరు (ఆర్ఆర్ పేట) : పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్ జిల్లావ్యాప్తంగా ఉన్న 12 పశు చికిత్సా కేంద్రాలను పశువైద్యశాలలుగా, 15 గ్రామీణ పశువైద్య కేంద్రాల ను (రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్లు) పశు చి కిత్సా కేంద్రాలుగా వర్గోన్నతి కల్పిం చిం ది. అయితే ఆ స్థాయిలో వైద్యుల ని యా మకం జరగలేదు. ప్రస్తుతం 31 మంది ఏడీలకు 19 మంది మాత్రమే సేవలం దిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్గోన్నతి పొందిన వైద్యశాలలకు నిధులు, మందులు, సౌకర్యాలు పెంచినా ఫలితం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏడీల కొరత నిబంధనల మేరకు వర్గోన్నతి పొం దిన పశు వైద్యశాలలకు వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. పశు చికిత్సా కేంద్రాలకు పశు వైద్యాధికారులను నియమించాలి. అయితే జిల్లాలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో 31 మంది ఏడీలకు గాను 19 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకూ వారితోనే ఎలాగోలా నెట్టుకొచ్చేస్తుం డగా, ఇప్పుడు వర్గోన్నతి పొందిన పశువైద్యశాలలకు మరో 12 మంది ఏడీల అవసరం ఉంది. ఇప్పటికే 12 మంది ఏడీల కొరత ఉండగా అదనంగా 12 మంది ఏడీలను ఎక్కడి నుంచి తీసుకువస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక పశు చికిత్సా కేంద్రాలుగా వర్గోన్నతి పొందినా ఇప్పటివరకూ కాంపౌండర్ స్థాయి ఉద్యోగులతో నడుస్తున్న కేంద్రాలకు వారినే ఇన్చార్జిలుగా వాడుకోవాల్సిన ప రిస్థితి ఏర్పడింది. వర్గోన్నతి పొందిన చికిత్సా కేంద్రాలివే.. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ పశు చికిత్సా కేంద్రాలుగా సేవలందిస్తున్న నిడదవోలు, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, ఉండి, పోడూరు, అత్తిలి, గణపవరం, పెనుగొండ, నల్ల జర్ల, ధర్మాజీగూడెం, దెందులూరు కేంద్రాలు పశు వైద్యశాలలుగా మారనున్నాయి. వీటితో పాటు గ్రామీణ పశువైద్య కేంద్రాలుగా ఉన్న ఆచంట వేమవరం, మత్స్యపురి, తడికలపూడి, పెదకడిమి, శనివారపు పేట, పోతవరం, పశి వేదల, ఎల్బీ చర్ల, కోరుమామిడి, వెంకటాపురం, దొరమామిడి, ఆరుగొల ను, రేలంగి, మోగల్లు, ఆగడాలలంక కేం ద్రాలు పశు చికిత్సా కేంద్రాలుగా రూ పాంతరం చెందనున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ ఉన్న 11 పశువైద్యశాలలతో వర్గోన్నతి పొందిన 12 కలిపి మొత్తం 23 పశు వైద్యశాలలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా లో 102 పశు చికిత్సా కేంద్రాల్లో వర్గోన్నతి పొందిన 12 కేంద్రాలు పోను 95 చికిత్సా కేంద్రాలు అందుబాటులో ఉం టాయి. వీటికి వర్గోన్నతి పొందిన మరో 15 గ్రామీణ కేంద్రాలు కలిపి మొత్తంగా 105 కేంద్రాలు సేవలందించనున్నాయి. -
పశు, మత్స్యశాఖలకు నిధులు పెంచుతాం
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్లో పశు, మత్య్స శాఖలకు భారీగా నిధులు కేటాయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ శాఖలు ఎంతో ప్రాధాన్యత కలిగినవిగా గుర్తింపు సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సచివాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీయన్స్ అసోసియేషన్ డైరీని సోమవారం ఆయన ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. పశుసంవర్థక, మత్స్యశాఖల అభివృద్ధికోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు. 161 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ లను నియమించామని, త్వరలో మరో 180 మంది నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు. -
గ్రామ స్థాయిలో పశుమిత్రల నియమాకం
జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ శ్రీధర్‌కుమార్ నెల్లూరు రూరల్ : గ్రామ స్థాయిలో పశుసంవర్థక శాఖ సేవలు విస్తృతం చేసేందుకు పశుమిత్రలను నియమించనున్నట్లు జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్‌కుమార్ తెలిపారు. స్థానిక రైల్వేఫీడర్స్ రోడ్డులోని ఆశాఖ కార్యాలయంలో ఎంపిక చేసిన పశుమిత్రలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పశువైద్యశాలలు, గామీణ ఆరోగ్య కేంద్రాలు, గోపాలమిత్రలు లేని 597 గ్రామ పంచాయితీల్లో పశుమిత్రలను నియమిస్తున్నట్లు చెప్పారు. తొలి విడతగా 167 మందిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తున్నామన్నారు. మిగిలి వారిని త్వరలో నియమిస్తామని చెప్పారు. పశుమిత్రలకు వేతనాలు ఇవ్వడం లేదని, పాడి రైతులకు వారు అందించే సేవల ఆధారంగానే యూజర్ చార్జీలను తమ శాఖ ద్వారా చెల్లిస్తామన్నారు. పశుసంవర్థక శాఖ అమలు చేస్తున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించడం, రోగాల నివారణకు టీకాలు వేయడం, గొర్రెలకు నట్టల నివారణ మందులు తాపించడం, గొడ్డుమోతు పశువులకు ప్రత్యేక చికిత్స, సమీకృత పోషణ పథకం, ఉపాధి హామీ పథకం ద్వారా పశుగ్రాసాల పెంపకం కార్యక్రమంలో పశుమిత్రలను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు వెటర్నరీ పాలి క్లినిక్ డీడీ డాక్టర్ పెద్దస్వామి, పశుమిత్రలు పాల్గొన్నారు. -
జిల్లాలో వెయ్యి మినీ డెయిరీల ఏర్పాటు
– పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్‌కుమార్ బనగానపల్లె రూరల్: జిల్లాలో వెయ్యి మినీ డెయిరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్‌కుమార్ తెలిపారు. సోమవారం మండలంలోని పాతపాడు గ్రామంలో డ్వాక్రా మహిళతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలదిగుబడిని పెంచేందుకు, డ్వాక్రా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు డీఆర్డీఏ, పశుసంవర్ధక శాఖ ద్వారా జిల్లాలో మినీ డెయిరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్క మహిళా రైతుకు ఐదు గేదెల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఉపాధిహామీ పథకం కింద పశువుల హాస్టల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గేదెల కొనుగోలుకు ఆసక్తి ఉన్న మహిళలు 25 శాతం వాటా చెల్లిస్తే, మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డీఆర్డీఎ ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు. మాదసుపల్లె, పాతపాడు గ్రామాల్లో పశువుల హాస్టల్ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను వారు పరిశీలించారు. డీఆర్డీఏ ఏపీవో డాక్టర్ అచ్చన్న, తహసీల్దార్ అనురాధ, ఈవోఆర్డీ నాగేశ్వరరెడ్డి, ఏపీఎం శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి శ్రీను, గ్రామ సర్పంచ్ పాపారాయుడు తదితర వెలుగు సీసీలు పాల్గొన్నారు. -
పశుసంవర్ధక శాఖ జేడీగా సుదర్శన్‌కుమార్
– డీడీ నుంచి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు – రెగ్యులర్ జేడీగా బాధ్యతల స్వీకరణ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పశుసంవర్ధకశాఖ ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ సుదర్శన్‌కుమార్‌ను పూర్తిస్థాయి జేడీగా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లా బహుళార్ధ పశువైద్యశాలలో డిప్యూటి డైరెక్టర్‌గా ఉన్న సుదర్శన్‌కుమార్ పూర్తి అదనపు బాధ్యతలతో ఏడాదిగా జిల్లా జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు డిప్యూటి డైరెక్టర్లకు జేడీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీఓ నెంబర్ 228 జారీ చేసింది. ఇందులో డాక్టర్ సుదర్శన్ కుమార్ కూడా ఉన్నారు. రెగ్యులర్ జేడీగా డాక్టర్ సుదర్శన్‌కుమార్ వెంటనే బాధ్యతలు స్వీకరించారు. ఖాళీ అయిన డీడీ స్థానాన్ని అక్కడి సీనియర్ ఏడీతో భర్తీ చేయనున్నారు. జేడీగా పదోన్నతి పొందిన సుదర్శన్‌కుమార్‌ను డీడీ చెన్నయ్య, ఏడీలు విజయుడు, రామచంద్రయ్య, చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్.నాగరాజు, జిల్లా నేతలు పార్థసారథి, రామసుబ్బారెడ్డి, టెక్నికల్ అధికారి డాక్టర్ శ్యాంప్రసాద్ తదితరులు అభినందించారు. -
కామధేను కేంద్రానికి అంతర్జాతీయ గుర్తింపు
పశుసంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నెల్లూరు(పొగతోట): కామధేను బ్రీడింగ్ కేంద్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పశుసంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ మన్మోహన్సింగ్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరి మాట్లాడారు. చింతలదేవిలో ఏర్పాటు చేస్తున్న నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్లో ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు పూర్తి చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పేరు వస్తుందన్నారు. 2400 ఎకరాల్లో కేంద్రం నిధులతో నిర్మిస్తున్న కామధేను సెంటర్లో గ్రామీణ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పశువుల దాణాకు, నీటికి కొరత లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సెంటర్లో ఉపాధి హామీ పధకం ద్వారా పంటగుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. సెంటర్లో దేశవాళీ పశువులను అభివృద్ధి చేయడంతోపాటు రైతుల విజ్ఞానకేంద్రంగా వినియోగించాలన్నారు. దేశవాళీ పశువుల జాతుల రిసెర్చ్ సెంటర్‌గా విస్తృత పరిశోధనలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. సెంటర్ చుట్టు బయోఫెన్సింగ్ నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు మాట్లాడుతూ వివిధ శాఖల అ«ధికారులు సెంటర్‌ను స్వయంగా పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లీవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ డాక్టర్ కొండలరావు మాట్లాడుతూ పశువుల దాణాకు ఉపయోగించే వివిధ రకాల వృక్షాలు, గడ్డిజాతులను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ జేడీ శ్రీధర్‌కుమార్, డ్వామా పీడీ హరిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి బ్రూసెలోసిస్ వ్యాధి నిరోధక టీకాలు
అనంతపురం అగ్రికల్చర్: గురువారం నుంచి మూడు రోజుల పాటు బ్రూసెలోసిస్ వ్యాధి టీకాలు ఉచితంగా వేసే కార్యక్రమం చేపట్టినట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ కె.జయకుమార్, పశువ్యాధి నిర్ధారణ కేం ద్రం ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా 6 నుంచి 8 నెలల వయస్సున పెయ్యదూడలకు టీకాలు వేయించుకోవాలని సూచించా రు. ఈనెల 31వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో 4,500 పెయ్యదూడలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
'మటన్ తింటే మంచిది'
బెంగళూరు: మటన్ తినండి.. రోగ నిరోధక శక్తి పెంచుకోండి' అంటున్నారు కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి ఎ. మంజు. మేక మాంసం తింటే ఇమ్యునిటీ పెరుగుతుందని ఆయన భరోసాయిస్తున్నారు. అయితే ఇది శాస్త్రీయంగా నిర్ధారించి చెబుతున్న విషయం కాదని, తన వ్యక్తిగత అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో కేంద్రం నిర్వహిస్తున్న మేకల పెంపకం కేంద్రాన్ని పరిశీలించిన తర్వాత ఆయనీ అభిప్రాయం వ్యక్తం చేశారు. మేక మాంసంలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయన్నారు. 'మేకలు అన్నిరకాల పచ్చగడ్డిని తింటాయి. మటన్ లో యాంటిబాడీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తినేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంద'ని మంజు పేర్కొన్నారు. యూపీఏ ఏర్పాటు చేసినట్టుగానే తమ రాష్ట్రంలోనూ మేకల పెంపకం కేంద్రాలు నెలకొల్పనున్నట్టు చెప్పారు. -
జీవం లేదు
* నిర్జీవంగా మారిన పశు సంవర్ధక శాఖ * వైద్యులు, సిబ్బంది, నిధులు లేక నిర్వీర్యం ఏలూరు (టూ టౌన్) : కీలకమైన శాఖల్లో పశు సంవర్ధక శాఖ ఒకటి. ప్రతి గ్రామంలోనూ పశువులకు వైద్యసేవలు అందించాల్సిన బృహత్తర బాధ్యత దీనిపై ఉంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో గేదెలు, ఆవులు, ఎద్దులు, మేకలు, గొర్రె లు, పందులు వంటి జీవాలు 15,03,807 ఉన్నాయి. కోళ్లు, శునకాలను లెక్కిస్తే ఈ సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగా పశు వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో సేవ లు ప్రశ్నార్థకంగా మారారుు. జిల్లాలో 100 పశు వైద్యశాలలు, వాటి పరిధిలో 93 సబ్ సెం టర్లు ఉన్నాయి. వీటికి 106 మంది పశు వైద్యు లు అవసరం కాగా, ప్రస్తుతం 65 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 41 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 201 మంది కాంపౌండర్లు, ఇతర సిబ్బందికి గాను 129 మంది మాత్రమే ఉన్నారు. 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యులు, సిబ్బంది కొరతతో మూగ జీవాలకు సరైన వైద్య సేవలు అందటం లేదు. ఆసుపత్రులు, సబ్ సెంటర్లలో తగిన సదుపాయూలు సైతం లేవు. జీవాల సంఖ్య ఇలా జిల్లాలో మొత్తం 6,71,303 గేదెలు, 1,97, 303 ఆవులు, ఎద్దులు, 4,38,281 గొర్రెలు, 1,86,887 మేకలు, 10,033 పందులు ఉన్నాయి. ఇవి అధికారిక లెక్కలు కాగా, అనధికారికంగా వీటి సంఖ్య ఎక్కువేనని చెబుతున్నారు. వీటికి సీజనల్‌గా వచ్చే వ్యాధులను ఎప్పటికప్పుడు గుర్తించి వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరు. 185 మంది గోపాల మిత్రలను నియమించటంతో కొంతమేర ఉపశమనం కలుగుతున్నప్పటికీ, పశువులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. దీనికి తోడు ఏలూరు, భీమవరం, పెంటపాడు, నిడదవోలు డివిజన్ల పరిధిలోని పశువుల ఆసుపత్రుల్లో మందులు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండ టం లేదు. దీంతో పశు పోషకులు మందుల్ని బయట కొనుగోలు చేయూల్సి వస్తోంది. ప్రభుత్వం తగిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. -
కెరీర్ రైట్... వెటర్నరీ సైన్స్
భారత్ పూర్వకాలం నుంచీ ప్రధానంగా పశుపోషణపై ఆధారపడిన దేశం. పారిశ్రామికంగా పురోగమిస్తున్నప్పటికీ.. నేటికీ గ్రామాల్లో ఎక్కువ మంది ప్రజల జీవనాధారం పశుపోషణే! పాల ఉత్పత్తిలో మనదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలో పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పశుపక్ష్యాదులకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూసే నిపుణులకు ప్రాధాన్యత పెరుగుతోంది. పశువైద్యం, చికిత్సలో నిష్ణాతులను తయారు చేసే కోర్సే.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండ్రీ. నగర శివార్లలో పశువుల పెంపకం జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వెటర్నరీ సైన్స్ కోర్సులను అందించే సంస్థలు.. అర్హతలు, ఎంపిక, కెరీర్‌పై ఫోకస్.. గ్రామాల ఆర్థిక పరిపుష్టిలో పశువులదే ప్రధాన పాత్ర. పల్లెల్లో దాదాపు ప్రతి ఇంటిలోనూ గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్లు ఉండాల్సిందే. ఇటీవల కుందేళ్లు, గిన్నెకోళ్లు, నిప్పుకోళ్ల పెంపకంపట్ల కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇక సిటీలో చూస్తే మధ్య తరగతి, ఉన్నత వర్గాల ప్రజలు తమ స్థాయికి తగినట్లుగా దేశీయ, విదేశీ శునకాలను పెంచుకుంటున్నారు. వాటిని తమ ప్రాణ సమానంగా భావిస్తున్నారు. మరికొంతమంది పక్షి ప్రేమికులు.. చిలుకలు, పావురాలు, నెమళ్లు, పిచ్చుకలను కూడా మచ్చిక చేసుకుంటున్నారు. వాటికి చిన్న బాధ కలిగినా విలవిల్లాడిపోతున్నారు. వాటికి వైద్యం అందించే పశువైద్య నిపుణుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే వెటర్నరీ సైన్స్.. ఏ కోర్సులకూ తీసిపోని ఎవర్గ్రీన్ కెరీర్‌గా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం ఐదు కళాశాలల్లో మాత్రమే వెటర్నరీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు పూర్తిచేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు కోకొల్లలు. కోర్సులు.. అర్హతలు వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా స్థాయిలో యానిమల్ హస్బెండ్రీ కోర్సు ఉంది. రెండు రాష్ట్రాల్లో మొత్తం పది కళాశాలల్లో 205 సీట్లున్నాయి. పదో తరగతిలో నిర్దేశిత గ్రేడ్పాయింట్తో ఉత్తీర్ణత సాధించినవారు ఈ కోర్సుకు అర్హులు. కోర్సు వ్యవధి రెండేళ్లు. బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండ్రీ(బీవీఎస్సీ అండ్ ఏహెచ్), మాస్టర్స్ డిగ్రీ స్థాయిలో మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్(ఎంవీఎస్సీ), డాక్టోరల్ స్థాయిలో పీహెచ్డీ కోర్సులున్నాయి. ఇందులో బీవీఎస్సీ అండ్ ఏహెచ్‌కు అర్హత.. 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ బైపీసీ ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి ఐదేళ్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో హైదరాబాద్(రాజేంద్రనగర్), తిరుపతి, కోరుట్ల(కరీంనగర్ జిల్లా), గన్నవరం(కృష్ణా జిల్లా), ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా)లో వెటర్నరీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో సీట్ల సంఖ్య 240. ఎంసెట్(మెడికల్) ద్వారా ప్రవేశం ఉంటుంది. ఎంసెట్ ప్రకటన ప్రతిఏటా మార్చి/ఏప్రిల్‌లో వెలువడుతుంది. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో 18 అంశాల్లో బోధన ఉంటుంది. ఎంబీబీఎస్ మాదిరిగానే అనాటమీ, ఫిజియూలజీ, గైనకాలజీ, జెనెటిక్స్ తదితర అంశాలను చదవాలి. ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. కేవలం జంతు సంరక్షణపైనే కాకుండా.. పౌల్ట్రీ, బ్రీడ్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లోనూ విద్యార్థులకు శిక్షణనిస్తారు. పీజీ, పీహెచ్‌డీలో స్పెషలైజేషన్లు ఎన్నో.. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ పూర్తయ్యాక చేసే మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్(ఎంవీఎస్సీ)లో ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. వెటర్నరీ అనాటమీ అండ్ హిస్టాలజీ; యానిమల్ రిప్రొడక్షన్, గైనకాలజీ అండ్ ఆబెస్టెట్రిక్స్, క్లినికల్ వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ పారాసిటాలజీ, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, వెటర్నరీ సర్జరీ అండ్ రేడియాలజీ, వెటర్నరీ మైక్రోబయాలజీ, యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రిషన్, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, లైవ్‌స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ బయోకెమిస్ట్రీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్, వెటర్నరీ ఎపిడిమియాలజీ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండ్రీ ఎక్స్టెన్షన్, వెటర్నరీ బయోటెక్నాలజీ. పీహెచ్‌డీలో కూడా ఈ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన స్కిల్స్: మూగజీవాల పట్ల జాలి, దయ ఉండాలి. వివిధ సీజన్ లకనుగుణంగా వాటికొచ్చే వ్యాధులపై అవగాహన అవసరం ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న పశు చికిత్సలు, వ్యాధినివారణ మందుల గురించి తెలుసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పనిచేయాలి. అవకాశాలు: వెటర్నరీ సైన్స్ కోర్సు పూర్తి చేసుకున్నవారికి క్లినికల్ విభాగంతో పాటు పరిశోధన, ఫార్మాస్యూటికల్ తదితర రంగాల్లో అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. పశు సంవర్థక శాఖలో, ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్స్, జూ పార్క్స్, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, బర్డ్స్ శాంక్చురీస్లో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తారుు. సొంత క్లినిక్‌ల ఏర్పాటు ద్వారా కూడా ఆదాయం పొందొచ్చు. పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తించవచ్చు. జంతు సంరక్షణకు ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయి. వేతనాలు: ప్రభుత్వ సర్వీసులో క్లాస్-1 ఆఫీసర్ హోదాలో వెటర్నరీ సర్జన్‌గా నెలకు రూ.45 వేల వేతనం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనంగా అందుకోవచ్చు. ఇక సొంతంగా ఆస్పత్రి పెట్టుకుంటే మరింత ఆదాయం గడించొచ్చు. ఖాళీ సమయాల్లో ఆయా గ్రామాల్లో పర్యటించడం ద్వారా ఎక్కువ మొత్తం ఆర్జించొచ్చు. శాస్త్రవేత్తలకు రూ.లక్షల్లో వేతనాలు ఉంటాయి. బోధన రంగంలో ఉన్నవారు నెలకు రూ.20,000 నుంచి రూ.40,000 వరకు పొందొచ్చు. జాతీయస్థాయిలో ప్రముఖ పరీక్షలు ఆల్ ఇండియా ప్రీ వెటర్నరీ టెస్ట్ (ఏఐపీవీటీ): దేశవ్యాప్తంగా వివిధ వెటర్నరీ కళాశాలల్లో బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో ప్రవేశాలకు ఏఐపీవీటీ నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆయా కళాశాలల్లో 15శాతం సీట్లను భర్తీ చేస్తారు. 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు. ఈ ర్యాంకు ద్వారా తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సెన్సైస్ యూనివర్సిటీ - చెన్నై, పాండిచ్చేరి యూనివర్సిటీ, సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ - ఇంఫాల్, ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయ - రాయ్‌పూర్, జవహర్లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయ - జబల్పూర్, కర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీ సెన్సైస్ యూనివర్సిటీ - బీదర్, అస్సాం అగ్రికల్చరల్ యూనివర్సిటీ వంటి విద్యా సంస్థల్లో చేరొచ్చు. ఈ పరీక్షకు ప్రతి ఏటా జనవరి/ఫిబ్రవరిలో ప్రకటన విడుదలవుతుంది. జేఎన్‌యూ కంబైన్డ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ.. ఎంవీఎస్సీ కోర్సులో ప్రవేశాలకు ప్రతి ఏటా ఆల్ ఇండియా కంబైన్డ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తోంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా.. లాలా లజపతిరాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సెన్సైస్ - హిస్సార్, జి.బి.పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ - పంత్నగర్, నానాజీ దేశ్‌ముఖ్ పశు చికిత్స విజ్ఞాన్ విశ్వవిద్యాలయ - జబల్పూర్, గురు అంగద్ దేవ్ వెటర్నరీ అండ్ యానిమల్ సెన్సైస్ యూనివర్సిటీ - లూధియానా, మహారాష్ట్ర యానిమల్ అండ్ ఫిషరీ సెన్సైస్ యూనివర్సిటీ - నాగ్‌పూర్, అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీ వంటివాటిలో ఎంవీఎస్సీ కోర్సులో చేరొచ్చు. నిర్దేశిత మార్కులతో బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సు ఉత్తీర్ణులు ఈ ప్రవేశపరీక్షకు అర్హులు. ఈ పరీక్షకు ప్రతి ఏటా ఫిబ్రవరి/మార్చిలో ప్రకటన వెలువడుతుంది. పశువైద్య రంగంలో అవకాశాలెన్నో... ‘‘మారుతున్న అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కోర్సును ఎంపిక చేసుకుంటే కెరీర్లో వెంటనే స్థిరపడొచ్చు. పశు వైద్యం అనేది భిన్నమైన కోర్స. దీన్ని విజయవంతంగా పూర్తిచేస్తే అవకాశాలకు కొదవలేదు. విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా, పశుై వెద్యశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో కొలువులున్నాయి. పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారికి బోలెడు అవకాశాలున్నాయి. సీసీఎంబీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సైంటిస్ట్‌గా చేరొచ్చు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేయొచ్చు’’ -డాక్టర్ జి.త్రివేణి, పీఆర్ఓ ఇన్‌ఛార్జి, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి -
పాడి పశువుల పోషణలో శాస్త్రీయ పద్ధతులు అవసరం
శంషాబాద్ రూరల్ : శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో పశు పోషణ చేపడితే అధిక పాల దిగుబడి సాధించవచ్చని పశుసంవర్ధక శాఖ ఏడీ వీరనంది తెలిపారు. గురువారం మండలంలోని చిన్నగోల్కొండలో పాడి పశువుల పోషణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ వీరనంది మాట్లాడుతూ.. పాడి పశువులకు తగిన మోతాదులో పోషకాలతో కూడిన దాణా, మేతను అందిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పశు పోషణ చేపడితే ఆర్థికంగా నిలదొక్కుకుంటారని తెలిపారు. యాజమాన్య పద్ధతులతో పాడిని లాభసాటిగా మార్చుకోవచ్చని తెలిపారు. బహువార్షిక గడ్డి సాగుతో పశువులకు మేత కొరత తీరుతుందని పేర్కొన్నారు. దూడలకు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. చాలా మంది రైతులు దూడల పోషణపై దృష్టి పెట్టకపోవడంతో పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. పశువులకు, దూడలకు సకాలంలో టీకాలు, సీజన్‌వారీగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి ఉమాకాంత్, వైద్యులు రవిచంద్ర, వంశీకృష్ణ పాల్గొన్నారు. -
పశుపోషణలో
జోగిపేట: పశు సంపద వల్ల రైతులకు అనేక లాభాలున్నాయి. అయితే వీటికి వచ్చే సీజనల్ వ్యాధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టాలు తప్పవని పశువైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. అంటు వ్యాధుల బారి నుంచి పశువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధులను తొలి దశలోనే గుర్తించి చికిత్సలు చేయించాలని జోగిపేట పశువైద్య శాఖ ఏడీ శ్రీనివాసరావు, సెల్: 8374255444 తెలి పారు. వర్షాకాలంలో పరిసరాల ప్రభావం, వరద నీరు తాగడం, వ్యాధి కారక పురుగులున్న మేతను మేయడం వల్ల గేదెలు, మేకలు, గొర్రెలు రకరకాల వ్యాధుల బారిన పడి చనిపోయే ప్రమాదం ఉందన్నారు. గొంతు వాపు వ్యాధి... ఈ వ్యాధిని గురక వ్యాధి అని కూడా పిలుస్తారు. కలుషితమైన నీరు, మేతను తీసుకోవడం వల్ల పశువుల్లో రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడుతాయి. ఇది అంటు వ్యాధి కావడం వల్ల ఇతర పశువులకు సోకుతుంది. గొంతు కిందకు నీరు దిగి గొంతువాపు వస్తుంది. నోటి నుంచి చొంగ కారుస్తూ గురక, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. కళ్లు రావడంతో పాటు ఊసులు తోడుతుంటాయి. నివారణ... వర్షాకాలం ప్రారంభ సమయమైన జూన్, జూలైలో పశువులు విధిగా గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వ్యాధి బారిన పడిన పశువులను కట్టేసే దొడ్డిని క్రిమి సంహారక మందులతో శుభ్రం చేయాలి. వ్యాధి ఇతర పశువులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమీప పశువుల వైద్యాధికారిని సంప్రదించి తగిన మందులు వాడాలి. గాలికుంటు వ్యాధి... ఇది వైరస్ సోకడం లేదా కలుషితమైన గాలి ద్వారా వస్తుంది. తల్లి పాల ద్వారా దూడలకు సంక్రమించే ప్రమాదం ఉంటుంది. నోరు గిట్టల మధ్య బొబ్బలు, నోటి నుంచి సొంగ కారుతుంది. దీని నివారణకు నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిజరిన్ కలిపి రాయాలి. గిట్టల మధ్య పుండ్లకు పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి వేపనూనె రాయాలి. వ్యాధుల బారిన పడిన పశువులను మందతో తీసుకెళ్లకుండా విడిగా ఉంచి చికిత్సలు చేయించాలి. ఆరోగ్యంగా ఉన్న పశువుల లక్షణాలు ఆరోగ్యంగా ఉన్న పశువులు తోక, చెవులను ఎప్పుడూ ఆడిస్తూ నెమరు వేస్తూ చురుగ్గా ఉంటాయి. పాల ఉత్పత్తిలో మార్పు ఉండదు. పేడ ఆకు పచ్చగా ఉంటుంది. అనారోగ్యం బారిన పడ్డ పశువుల లక్షణాలు వ్యాధుల బారిన పడిన పశువుల మూత్రం వరిగడ్డి రంగులో ఉంటుంది. నెమరు వేయదు. జ్వరం ఉంటుంది. చర్మం మొద్దుబారి వెంట్రుకలు పైకిలేస్తాయి. కళ్ల నుంచి నీరు కారుతుంటుంది. చెవులు కిందకు జారి అలసిపోయినట్లుగా కనిపిస్తాయి. -
ఎదకు రాని పశువులకు హోమియో చికిత్స!
పశు సంరక్షణలో హోమియో మందులతో సత్ఫలితాలు గుజరాత్‌లోని సర్డా కృషినగర్ హోమియో కళాశాలలో విజయవంతమైన పరిశోధన ‘ఒక జాతి గొప్పతనం జంతువులతో ఆ జాతి వ్యవహరించే తీరులోనే వ్యక్తమౌతుంది’ అంటారు జాతిపిత మహాత్మగాంధీ. మూగజీవుల ఆర్తిని అర్థం చేసుకోగలిగేవారే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారన్నది ఆయన మాటల్లో వ్యక్తమయ్యే భావన. మన చుట్టూ జంతువులు లేని లోకాన్ని ఉహించనే లేం. పెంపుడు జంతువులు విశ్వసనీయ సహచరుల్లా, రక్షకులుగా ఒకానొక సందర్భంలో పోషకులుగా వ్యవహరిస్తాయి. వాటి సంరక్షణలోనే రైతు సౌభాగ్యం ఇమిడి ఉందంటే అతిశయోక్తి లేదు. మానవ ఆరోగ్యం పట్ల అనుసరించే సహజ సంరక్షణ విధానాలనే పశు సంతతికి వర్తింప జేస్తే.. వాటి పోషణ, రక్షణలలో మరింత భరోసా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా హోమియో వైద్య విధానంతో పశు సంతతికి చికిత్స చేస్తున్నారు. అనేక యూరోపియన్, ఆసియా దేశాల్లో హోమియో ఔషధాలతో పశుగణాభివృద్ధికి కృషి చేస్తున్నారు. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే అక్కడక్కడా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. మన దేశంలో పాడి పశువులపై జరిగిన ఓ పరిశోధన ఫలితాలను పాఠకుల అవగాహన కోసం అందిస్తున్నాం.. పశువులో పునరుత్పత్తి శక్తి సాధారణంగా ఉంటేనే రైతుకు పాడి, దూడ దక్కేది. ఎదకు రాని పశువులకు మేపు, కాపు రెండూ దండగే అంటారు పాడి రైతులు. పశువైద్యులు కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపలేక పెదవి విరిచినప్పుడు.. రైతులు మనసు చంపుకొని పశువులను కబేళాలకు అమ్ముకునే దృష్టాంతాలున్నాయి. ఈ సమస్యకు ఇంగ్లిషు వైద్యవిధానంలో పరిష్కారం అందని సందర్భాల్లో హోమియో వైద్య విధానం దారి చూపించింది. పశువు గొడ్డుపోవడానికి రెండు ప్రధాన కారణాలుంటాయి. ఒకటి సక్రమంగా అండం విడుదల కాకపోవడం, రెండు గర్భవిశ్ఛితి జరగడం. ఇలాంటి పశువులను రైతు పూర్తిగా గొడ్డుపోయిన వాటిగా భావించలేడు. అలా అని వాటిని పొలం పనుల్లో వినియోగించనూ లేడు. వదులుకోలేక.. సాదుకోలేక.. ఇబ్బంది పడే పరిస్థితిలో రైతులకు కమ్మని కబురందిస్తోంది హోమియో వైద్య విధానం. హోమియో మందులు వాడడం వలన పశువు పునరుత్పత్తి క్రమం సాధారణ స్థాయికి వస్తుందని గుజరాత్‌లోని సర్డాకృషినగర్ పశు వైద్య కళాశాలలో నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. రాబర్ట్స్, పేంద్‌ల్రు సర్డా కృషినగర్ పశు వైద్య కళాశాల సహకారంతో 100 సంకర జాతి ఆవులు, 85 గేదెలపై అధ్యయనం చేశారు. వీటిలో పది ఆవులు, పది గేదెలకు ఎలాంటి మందులు ఇవ్వలేదు. 90 ఆవులు, 75 గేదెలకు హోమియో మందులతో చికిత్స చేశారు. వీటికి వరుసగా 21 రోజుల పాటు అల్టేరీస్ ఫరినోసా-30, ఆరమేట్-30, ఎపిస్మెల్-30, బోరెక్స్-30, కల్కేరియాఫాస్-30, కోలోసెంథిస్-30, ఫోలికులినమ్-30, ఐయోడిన్-30, మూరెక్స్-30, ఓఫోరియమ్-30, పల్లాడియం-30, ప్లాటీనియం-30, పల్సాటిల్లా-30, సెపియా-200ల సమ్మేళనంతో తయారు చేసిన మాత్రలిచ్చారు. చికిత్స మొదలు పెట్టిన తరువాత 16 రోజుల్లోనే 50 ఆవులు ఎదకు వచ్చాయి. వీటికి 2 నెలల తర్వాత గర్భనిర్ధారణ పరీక్షలు చేయగా గర్భం నిలిచినట్లు నిర్ధారణ అయింది. తక్కిన 40 ఆవుల్లో 30 ఆవులు చికిత్స పూర్తయిన వారం రోజుల్లో ఎదకు వచ్చాయి. మిగిలిన పదింటికి మరోసారి ఇదే మందు వాడారు. వాడడం ప్రారంభించిన 15 రోజుల్లో ఎనిమిది ఆవులు ఎదకొచ్చినట్లు గుర్తించారు. వీటన్నిటికీ గర్భం నిలిచి చక్కటి దూడలను ఈనాయి. ఇక హోమియో మందులు ఇవ్వని 10 ఆవుల్లో ఏ ఒక్కటీ ఎదకు రాలేదు. పరీక్షలు నిర్వహించడానికి ఎంపిక చేసుకున్న సంకరజాతి గేదెలకు జరిపిన చికిత్సల్లో తొలి విడత ఔషధ వినియోగం తర్వాత 65 ఎదకు వచ్చాయి. తక్కిన 10 రెండోసారి చికిత్స ప్రారంభించిన తర్వాత ఎదకు వచ్చాయి. గేదెలన్నిటికీ గర్భం నిలిచి దూడలను ఈనాయి. అసలు ఏ మందూ ఇవ్వని 10 గేదెల్లో ఏ ఒక్కటీ ఎదకు రాలేదు. పశువుల్లోని ఎండ్రోకైన్ గ్రంధిని ఉత్తేజపర్చడం ద్వారానే పునరుత్పత్తి చక్రం సాధారణ స్థితికి వచ్చినట్లు పరిశోధకులు రాబర్ట్, పేంద్‌ల్రు నిర్ధారణకు వచ్చారు. పేంద్ ్రఅప్పటికే హోమియో వైద్య విధానంలో ఎం.డీ. కోర్సు ఉత్తీర్ణుడు. డెయిరీ ఆవుల పునరుత్పత్తి సమస్యలపై చేసిన పరిశోధనలకుగాను బుడాపెస్ట్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టాపుచ్చుకున్నారు. రాబర్ట్స్ పశువుల గర్భధారణ సమస్యల మీద పరిశోధన చేశారు. - జిట్టా బాల్‌రెడ్డి -
ఇదో కం‘త్రీ’ వ్యవహారం
కాకినాడ: పశు సంవర్ధకశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 33 మంది నిరుద్యోగుల నుంచి రూ.45 లక్షలు స్వాహా చేసిన ఉదంతమిది. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో సొమ్ము చెల్లించినవారు నిందితురాలిపై చేయిచేసుకోవడం, అమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం గుట్టురట్టయింది. కాకినాడ వెటర్నరీ పాలిక్లినిక్‌లో కాకర్ల వరప్రసాద్ అలియాస్ వేళంగి వరప్రసాద్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన వేళంగి పశువైద్యశాల ఇన్చార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. కాకినాడ వెటర్నరీ పాలిక్లినిక్లోనే అటెండర్‌గా పనిచేస్తున్న శీరం లలితాదేVelangi veterinary polyclinicవి పశుసంవర్ధకశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురికి వలవేసింది. 33 మంది నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష, లక్షన్నర చొప్పున మొత్తం రూ.45 లక్షలు వసూలు చేసింది. వసూళ్లు సాగిస్తున్న సమయంలో కరప మండలం పెరుగుదురుకు చెందిన పిల్లి వీర్రాజును డాక్టర్ వరప్రసాద్‌గా నిరుద్యోగులకు పరిచయం చేసి అతని ద్వారానే ఉద్యోగాలు వస్తాయంటూ నమ్మబలికింది. అయితే మూడు నెలలుగా ఎదురుచూస్తున్నా ఉద్యోగాలు వచ్చే సూచనలు కన్పించకపోవడంతో బాధితులు లలితాదేవిని నిలదీశారు. కొంతమంది ఆమెపై చేయిచేసుకుని, తమ సొమ్ములు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె తల్లి పద్మావతి సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు లలితాదేవి, డాక్టర్ వరప్రసాద్, పిల్లి వీర్రాజులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాను వసూలు చేసిన సొమ్ము డాక్టర్ వరప్రసాద్‌కే ఇచ్చానని లలితాదేవి చెపుతుండగా, ఆమె ఎవరో తనకు తెలియదని, ఆమెను ఎప్పుడూ చూడలేదని డాక్టర్ వరప్రసాద్ అంటున్నాడు. తనకు కూడా ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ పెడితే డాక్టర్లా నటించానని వీర్రాజు పేర్కొంటున్నాడు. ఈ ముగ్గురిలో కంత్రీలు ఎవరో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.