సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెల పంపిణీ విజయవంతంగా కొనసాగుతుం డటంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గొర్రెల పంపిణీపై సీఎంఓ అధికారు లతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఇప్పటిదాకా 1,00,860 మందికి 21,18,060 గొర్రెలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇంత తక్కువ వ్యవధిలో 21 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం దేశ చరిత్రలోనే మొదటి సారని అధికారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి తదితరులను అభినందించారు.
వచ్చే ఏడాది హరితహారం నిర్వహణకు గ్రామానికో నర్సరీ ఏర్పా టు చేయాలని సీఎం ఆదేశించారు. వాటిని స్థాని క సంస్థలు నిర్వహించాల న్నారు. ‘‘కొత్తగా ఏర్పడే పంచాయతీలతో కలిపి 10 వేల గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు కావాలి. రానున్న నగర పంచాయితీలను కలుపుకుని 100 వరకున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డులవారీగా నర్సరీలు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో డివిజన్‌కు 4 నర్సరీలుండాలి. వాటికి విత్తనాలను, సాంకేతిక సహకారాన్ని అటవీ శాఖ అందించాలి. మొక్కలను ప్రజలకు పంచి నాటించాలి. అడవుల పరిరక్షణ, పునరుద్ధరణపై అటవీ అధికారులు దృష్టి పెట్టాలి’’ అని ఆదేశించారు.