
సాక్షి, హైదరాబాద్: జీవాలకు సేవ చేయడం ఎంతో అదృష్టమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. జీవాలకు అవసరమైన వైద్యం సకాలంలో అందించడంతో పాటు గ్రాసం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పశుసంవర్థక శాఖ అధికారుల నూతన డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పశుసంవర్థక శాఖలో నూతన నియామకాలు చేపట్టడంతో పాటు, పదోన్నతులు ఇచ్చామని తెలిపారు.
రానున్న రోజుల్లో శాఖ మరింత అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశు వైద్య సేవలను మెరుగుపర్చడంతో పాటు ఆస్పత్రులలో మౌలిక వసతులు కల్పించామన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఇటీవల బదిలీ అయిన పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా శాఖ అభివృద్ధికి ఎంతో కృషిచేశారని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, అదనపు కార్యదర్శి రేణుకాదేవి, టీఎస్‌ఎల్‌డీఏ సీఈవో మంజువాణి, పశుసంవర్థక శాఖ అధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బేరీ బాబు, వీఏఎస్‌ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పెంటయ్య, డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment