థర్డ్‌ పార్టీ వెరిఫికేషన్‌ రద్దు? | Cancel Third Party Verification? | Sakshi
Sakshi News home page

థర్డ్‌ పార్టీ వెరిఫికేషన్‌ రద్దు?

Published Tue, Feb 6 2018 2:15 AM | Last Updated on Sat, Jun 2 2018 8:44 PM

Cancel Third Party Verification? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గొర్రెల అక్రమార్కులకు ఊతం ఇచ్చేలా పశు సంవర్ధకశాఖ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేకచోట్ల గొర్రెల రీసైక్లింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమాలపై థర్డ్‌ పార్టీ సర్వే చేపట్టాలని ఇటీవలే తీసుకున్న నిర్ణయాన్ని ఆ శాఖ వెనక్కు తీసుకున్నట్లు సమాచారం. థర్డ్‌ పార్టీ సర్వే కోసం ఆర్థిక సామాజిక అధ్యయనాల కేంద్రం (సెస్‌)కు అనుమతిస్తూ ప్రభుత్వం గత డిసెంబర్‌ 30న ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.

ఈ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ఆ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ‘తనిఖీల కోసం ఉత్తర్వులు వచ్చాయా? వస్తే చూపించండి. ఆ విషయం నాకు తెలియదే. అయినా మనమంతా మానవులం. అక్కడక్కడ తప్పులు జరగడం సహజం. అయినా ఏదో ఒక సంస్థకు తనిఖీల బాధ్యత అప్పగిస్తే అంతా సవ్యంగా చేసినట్లే అవుతుందా? లక్షలాది గొర్రెలను, లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసే శక్తి సంస్థలకు ఎంత ఉంటుంది?’అంటూ కొత్తగా బాధ్యతలు చేపట్టిన పశు సంవ ర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా  వ్యాఖ్యానించడం గమనార్హం. 

రాజకీయంగా ఇబ్బందనా..
థర్డ్‌ పార్టీ వెరిఫికేషన్‌  సెస్‌కు అప్పగిస్తూ సురేశ్‌చందా ఉత్తర్వులు ఇవ్వడంపై పైస్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనట్లు సమాచారం. సందీప్‌కుమార్‌ సుల్తానియాకు  బాధ్యతలు అప్పగించడంతో ఆయన తనిఖీ ని పక్కన పెట్టేసినట్లు అర్థమవుతోంది. గత జూన్‌లో ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేపట్టింది. ఇతర రాష్ట్రాల్లో గొర్రెల లభ్యత లేకపోవడం, దళారుల ప్రవేశం, పశు వైద్యుల చేతివాటంతో అక్రమాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం కొందరు అధికారులపై వేటు కూడా వేసింది. అయితే థర్డ్‌ పార్టీ వెరిఫికేషన్‌ చేపడితే తన తప్పును తానే  ఒప్పుకున్నట్లు అవుతుందని పెద్దలు భావించారు. అక్రమాలు జరిగినట్లు సెస్‌ నివేదిస్తే రాజకీయంగానూ నష్టం జరుగుతుం దని సర్కారు భావించింది. దీంతో సెస్‌కు ఇచ్చిన తనిఖీ బాధ్యతలను రద్దు చేసే యోచనలో సర్కారు ఉంది. 

42 లక్షల గొర్రెల పంపిణీ
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ ప్రక్రియ జోరందుకుంది. ఇప్పటివరకు 42 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్‌ ఎండీ వి.లక్ష్మారెడ్డి సోమవారం వెల్లడించారు. 2 లక్షలకు పైగా గొల్లకుర్మలకు ఒక్కొక్కరికి 20+1 చొప్పున 75 శాతం సబ్సిడీపై పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ వాటా రూ.1,877 కోట్లు, లబ్ధి0్దదారుల వాటా రూ.625 కోట్లు మొత్తం రూ.2,502 కోట్లు గొర్రెల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. 15.50 లక్షల గొర్రె పిల్లల పునరుత్పత్తి జరిగి సుమారు రూ. 700 కోట్ల సంపద గొల్ల కుర్మలకు చేరిందన్నారు. 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 సంచార పశు వైద్య అంబులెన్సులను అందుథబాటులోకి తీసుకువచ్చామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement