
పుల్‌కల్ (అందోల్): గొర్రెల రీసైక్లింగ్‌ను అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ‘అక్కడా.. ఇక్కడా అదే గొర్రె.. బకరా ఎవరు’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’ ప్రధాన సంచిక లో ప్రచురితమైన కథనానికి స్పందించిన మంత్రి శ్రీనివాస్‌యాదవ్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలో పశు సంవర్ధక శాఖ అధికారులే కాకుండా కలెక్టర్ ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో విచారణ జరిపించారు. ఈ క్రమంలో పుల్‌కల్ మండలంలో ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను విక్రయించింది వాస్తవమే అని విచారణలో తేలింది.
ఈ మేరకు సంస్థ ప్రతినిధులు కలెక్టర్‌కు ఇటీవల నివేదిక సైతం సమర్పించారు. గొర్రె లను అమ్మిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని కలెక్టర్ ఆదేశించడంతో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు సోమవారం పుల్‌కల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. గొర్రెలు ఎవరు తీసుకున్నారు? ఎవరికి అమ్మారు? ఎక్కడికి తీసుకెళ్లారు? అనే దాంతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన పుల్‌కల్ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్నీ సేకరి స్తున్నట్లు తెలిసింది. పుల్‌కల్‌లో ఐదుగురు, అక్సాన్‌పల్లి, సింగూరులో పలువురిపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.