రేషన్ బియ్యం తరహాలో గొర్రెలు కూడా రీసైక్లింగ్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి తెలంగాణ పల్లెలకు.. ఇక్కడ్నుంచి మళ్లీ ఆంధ్రా సంతలకు.. అక్కడ్నుంచి మళ్లీ తెలంగాణ గొర్రెల కాపర్ల ఇంటి ముందరకు గింగిరాలు కొడుతున్నాయి. పథకం తొలి రోజుల్లో తీసుకొచ్చిన గొర్రెలనే రెండు రాష్ట్రాల మధ్య చక్కర్లు కొట్టిస్తున్నారు. మొదట్లో గొర్రెలను పకడ్బందీగానే సేకరించిన అధికారులు ఆ తర్వాత చేతులెత్తేయడంతో పరిస్థితి దిగజారింది. దళారుల ప్రమేయం పెరిగిపోయి రీసైక్లింగ్‌కు తెరలేచింది. అధికారులు లక్షల సంఖ్యలో గొర్రెలను పంపిణీ చేసినట్టు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ లెక్కలతో పొంతన కుదరడం లేదు. చాలాచోట్ల దళారులే లబ్ధిదారుల నుంచి గొర్రెలను గుండుగుత్తగా రూ.50 వేల నుంచి రూ.55 వేల మధ్య కొనేస్తున్నారు. అవే గొర్రెలను పాలమూరు జిల్లాలోని గద్వాల, పెబ్బేరు కేంద్రంగా ఆంధ్ర, రాయలసీమలకు తరలిస్తున్నారు. అక్కడి సంతల్లో మళ్లీ వాటినే కొని తెలంగాణ పశుసంవర్థక శాఖ అధికారులకు అంటగడుతున్నారు. దారితప్పిన గొర్రెల పథకంపై ‘సాక్షి’ ఈవారం ఫోకస్..
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు, హైదరాబాద్
దళారీలదే రాజ్యం
ఈ ఆధార్ కార్డు కర్నూలు జిల్లా శిరివెల్ల మండలం చెన్నారం గ్రామానికి చెందిన కొర్రపాటి సుబ్బరాయుడు తండ్రి కాశన్నది. ఆయన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా, ఆయన చిన్నాన్నకు చెందిన ఆంధ్రా బ్యాంకు ఖాతాలో తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.23 లక్షల వరకు జమ చేసింది. ఒక్కరికే ఇంత పెద్దమొత్తంలో గొర్రెలు ఉన్నా యా? అని ఆరా తీస్తే.... సుబ్బరాయుడు గత ఎనిమిదేళ్లుగా పశువుల దళారీగా పనిచేస్తున్నట్టు తేలింది! ఈయన ఒక సంతలో గొర్రెలను కొని మరో సంతలో అమ్ముతుంటాడు. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పథకం తెచ్చిన నేపథ్యంలో కర్నూలు జిల్లా దీబగుంట్ల సంతలో అడ్డా వేసి.. మన అధికారులకు బోను పెట్టాడు. మొదట్లో గొర్రెల కాపరుల దగ్గర్నుంచి గొర్రెలు సేకరించి అధికారులకు అమ్మేవాడు. ఇప్పుడు గద్వాల నుంచి లబ్ధిదారుల నుంచే టోకున గొర్లు తెచ్చి అదే సంతలో మన అధికారులకే అమ్మేస్తున్నాడు. ఇప్పుడు మన అధికారులకు ఆయనకు మధ్య బాగా పరిచయం పెరిగింది. హైదరాబాద్ నుంచి అధికారులు ఒక్క ఫోన్ కొడితే చాలు.. దీబగుంట్ల సంతలో గొర్రెలు సిద్ధం చేస్తున్నాడు.
ఫోన్‌పైనే లారీల కొద్దీ గొర్రెలను పంపుతున్నాడు. మెదక్, సంగారెడ్డి, పాలమూరు జిల్లాలకు మొదటి విడతలో 10 యూ నిట్లు, ఆ తర్వాత 8 యూనిట్లు, తాజాగా 6 చొప్పున మొత్తం 22 యూనిట్ల గొర్లు ఇచ్చాడు. ‘సాక్షి ప్రతినిధి’ ఈయనకు ఫోన్ చేసి పశుసంవర్థక శాఖ అధికారిగా పరిచయం చేసుకొని మాటల్లో పెట్టింది. మాకు ఇంకెన్ని గొర్రెలు ఇవ్వగలవు అని అడగ్గా.. ‘తన చిన్నాన్న, తన వద్ద కలిపి ఇంకో 35 యూనిట్ల(735) గొర్రెలు ఉన్నాయి’ అని చెప్పాడు. ఎక్కడికి రావాలని అడిగితే.. ఎప్పుడు తీసుకునే చోటే దీబగుంట్ల సంతకు రమ్మన్నాడు. ‘పాత ఆరు యునిట్లకు ఇంకా బ్యాంకుల దుడ్లు పడలేదు.. తొందరగా వేయించండి సారూ..’ అని ప్రాధేయపూర్వకంగానే అర్థించాడు. ఈయనే కాదు బనగానపల్లి మండలం యనకండ్లలో చౌట లక్ష్మిదేవి, చౌట లక్ష్మయ్య భార్యాభర్తల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూ.40 లక్షల డబ్బులు పడ్డాయి. గోస్పాడు మండలం యాలూరులో చాకలి ఓబులేసు, కోడుమూరులో కుర్వ గిడ్డాంజనేయులు, కోయిలకొండలో గురప్పలు కూడా లక్షల్లో డబ్బులు డ్రా చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన 21 మంది గొర్రెలు అమ్మిన వారి పేర్లను సేకరించి క్షేత్రస్థాయిలో విచారిస్తే వారిలో 16 మంది దళారులే అని తేలింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొందరు వైశ్యులు కూడా గొర్రెలు అమ్మినట్లు నివేదికలు ఉన్నాయి. వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, వేలేరుపాడు, సత్తుపల్లి ప్రాంతాలకు గొర్రెలను ఇచ్చినట్టు రికార్డుల్లో ఉంది.
ఫోన్ల మీదనే సేకరణ..
అధికారిక నివేదికల ప్రకారం ఇప్పటి వరకు 24.85 లక్షల గొర్రెలు రాష్ట్రానికి చేరాయి. ఇందులో 65 శాతం కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచే తెచ్చారు. నిబంధనల ప్రకారం పశు సంవర్థక శాఖ అధికారులు పొరుగు రాష్ట్రాల్లో గొర్రెల లభ్యతపై సర్వే నిర్వహించి, నాణ్యమైనవాటినే ఎంపిక చేయాలి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా గొర్రెల కాపర్ల నుంచే కొనాలి. లబ్ధిదారులను కూడా వెంట తీసుకెళ్లి వారి సమక్షంలోనే కొనుగోళ్లు జరపాలి. పథకం తొలి రోజుల్లో అధికారులు కొంతమేర పకడ్బందీగానే గొర్రెలను సేకరించి లబ్ధిదారులకు అప్పగించారు. అయితే క్రమంగా గొర్రెల లభ్యత తగ్గిపోవటం, స్థానికంగా ఒత్తిడి పెరగటంతో అధికారులు చేతులెత్తేశారు. ఫలితంగా అవినీతికి బీజం పడింది. రైతుల వద్ద నుంచి గొర్రెలు సేకరించడం మానేసి దళారీ వ్యవస్థను ప్రోత్సహించారు. దళారులు కొన్ని రోజుల పాటు స్థానిక గొర్రెల కాపరుల నుంచి జీవాలను సేకరించి విక్రయించారు. క్రమంగా ఇరువర్గాల మధ్య పరిచయాలు పెరగడంతో అవినీతి వట వృక్షంగా మారింది. అధికారులు క్షేత్ర స్థాయి పర్యవేక్షణ తగ్గించి, దళారుల ఫోన్లపై ఆధారపడ్డారు. తెలంగాణ నుంచి బయల్దేరే ముందు దళారికి ఫోన్ చేస్తే కావాల్సినన్ని గొర్రెలు సిద్ధం చేసి పెడుతున్నారు. ప్రతి యూనిట్‌పై రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ముట్టజెపుతున్నట్టు దళారుల మాటలను బట్టి తెలుస్తోంది.
ఏపీ టు తెలంగాణ.. తెలంగాణ టు ఏపీ
గొర్రెల పథకంలో రెండు రాష్ట్రాల్లోనూ దళారులది ఇష్టారాజ్యంగా మారిపోయింది. గొర్రెల కంటే ముందే దళారులే లబ్ధిదారుడి ఇంటికి వస్తున్నారు. తెచ్చిన గొర్రెలను తెచ్చినట్టు తీసేసుకుంటున్నారు. యూనిట్ గొర్రెలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.1.15 లక్షల దాకా వెచ్చిస్తుంటే కేవలం రూ.50 వేల నుంచి రూ.55 వేలకే కొనుగోలు చేస్తున్నారు. లారీల్లో వచ్చిన గొర్రెలను వచ్చినట్టే అమ్మితే రూ.50 వేలు, వారం పది రోజుల పాటు మేపితే రూ.55 వేల చొప్పున చెల్లిస్తున్నారు. ఏపీలో గొర్రెలు అమ్ముతున్న దళారులు.. లబ్ధిదారుల్లో కొందరి ఫోన్ నంబర్ తీసుకొని పరిచయం పెంచుకుంటున్నారు. చివరికి వారిని కూడా తమ అక్రమ వ్యాపారంలోకి దింపుతున్నారు. ఇలా ప్రస్తుతం తెలంగాణలో ప్రతి మండలంలో కనీసం ముగ్గురు నుంచి నలుగురు లబ్ధిదారులే దళారులుగా అవతారం ఎత్తి సబ్సిడీ గొర్రెలను టార్గెట్ చేస్తున్నారు.
ఇలా కొనుగోలు చేసిన గొర్రెలను రాత్రికి రాత్రే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్, పెబ్బేరుకు తరలిస్తున్నారు. అక్కడ కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన దళారులు సిద్ధంగా ఉంటారు. 10 నుంచి 15 నిమిషాల్లో బేరం పూర్తి అవుతోంది. స్థానిక దళారులు ప్రతి యూనిట్(20 గొర్రెలు, ఒక పొట్టేలు)పై రవాణా ఖర్చులు, లేబర్ చార్జీలు పోను రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు లాభం చూసుకుంటున్నారు. ఈ లెక్కన రూ.65 వేల నుంచి రూ.70 వేల ధరకు యునిట్ గొర్రెలను ఏపీ నుంచి వచ్చే దళారులకు ఇచ్చేస్తున్నారు. వాళ్లు నేరుగా తమ ప్రాంతాలకు తీసుకెళ్లి సంత సమీపంలో దించి మళ్లీ తెలంగాణ అధికారులకు ఫోన్ చేసి రమ్మంటున్నారు. ప్రతి యూనిట్‌పై రూ.25 వేల నుంచి రూ.30 వేల నికర లాభంతో గొర్రెలను తిరిగి మన అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ వలయాకార ప్రక్రియ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నిత్యకృత్యంగా మారిపోయింది.
పుల్కల్‌లో మాటేస్తే...
సబ్సిడీ గొర్రెలను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రాత్రి 10 గంటల సమయంలో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని ఓ నిర్జన ప్రదేశంలో కాపుగాశాం. పుల్కల్ పట్టణంతో పాటు సమీప గ్రామాలు చెక్రియాల్, బస్వాపూర్, ముద్దాయ్‌పేట, సింగూరు, అక్సాన్‌పల్లి, కోర్పోల్, కోడూర్ తదితర గ్రామాల నుంచి ట్రాలీల్లో గొర్రెలు తెచ్చి ఇక్కడ పోగేస్తున్నారు. వచ్చిన గుంపును వచ్చినట్టే డీసీఎంలు, లారీల్లోకి ఎక్కిస్తున్నారు. ఒక లారీ, ఐదు డీసీఎంలలో గొర్రెలను ఎక్కించారు. ఒకదాని వెంట ఒకటి వెళ్లిపోతున్నాయి. చివరగా ఒక డీసీఎం మిగిలింది. సింగూరు నుంచి రావాల్సిన ట్రాలీ ఆలస్యంగా రావటంతో ఆ డీసీఎం కాస్త ఆలస్యంగా బయల్దేరింది. మేం ధైర్యం చేశాం. డీసీఎంకు అడ్డంపోయి ఆపేశాం. డ్రైవర్‌ను కిందకు దించి వివరాలడిగాం. డీసీఎం సమీపంలోని మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిదని చెప్పాడు. తాను డ్రైవర్‌ను మాత్రమే అన్నాడు. ఉదయం 6.30 నుంచి 8 గంటల మధ్య గద్వాలకు గొర్రెలను చేర్చాలని పుల్కల్‌కు చెందిన దళారీ చెప్పినట్లు వివరించాడు. గత 20 రోజుల నుంచి ఇదే పని చేస్తున్నానని, ఇప్పటికే చాలా ట్రిప్పులు వేశానని తెలిపాడు. వెంటనే గద్వాల్ ‘సాక్షి’ నెట్‌వర్క్‌ను అప్రమత్తం చేయగా.. గద్వాల పట్టణంలోని మార్కెట్ వెనక ఉన్న సంత స్థలంలో కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వచ్చిన దళారులు సిద్ధంగా ఉన్నట్టు తేలింది. ఎప్పుడు చేస్తున్న పనే కాబట్టి పెద్దగా బేరసారాలు లేకుండానే క్రయవిక్రయ తంతు ముగించేశారు. ఇలా లారీల నుంచి గొర్రెలను దించకుండానే బేరం కుదిరిపోతోంది.
టీచరు.. హోంగార్డు.. మెకానిక్ కూడా లబ్ధిదారులే..
పుల్కల్‌లో మొత్తం 900 మంది లబ్ధిదారులను గుర్తించాం. వారి ఇళ్లకు వెళ్లి చూడగా.. 394 మంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసినట్లు తేలింది. పుల్కల్ మండల కేంద్రంలో 46 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఎంత మంది దగ్గర సబ్సిడీ గొర్రెలు ఉన్నాయో పరిశీలించగా.. విస్తుబోయే విషయాలు వెల్లడయ్యాయి. గొర్రెలు పొందిన వారిలో ఉపాధ్యాయుడు, హోంగార్డు, డిగ్రీ విద్యార్థి, ఫ్యాక్టరీ కార్మికుడు, హైదరాబాద్‌లో స్థిరపడిన మెకానిక్ తదితరులు ఉన్నారు. మొత్తం 23 ఇళ్లు తిరగగా.. 15 మంది గొర్రెలను అమ్మేసుకున్నారు. రూ.31.5 వేల పెట్టుబడి పోను రూ.20 వేల లాభానికి అమ్ముకున్నట్లు వారిలో కొందరు చెప్పారు. పుల్కల్‌కే చెందిన ఓ లబ్ధిదారుడు దళారీగా అవతారం ఎత్తి గొర్రెలను గుండుగుత్తగా కొనుగోలు చేసి గద్వాలకు తరలిస్తున్నాడు. డీసీఎం చెప్పిన దళారీ పేరు, ఇక్కడ లబ్ధిదారులు చెప్పిన బ్రోకర్ పేరు ఒకటే కావడం గమనార్హం. అలాగే మనూరులో 53 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయగా.. ‘సాక్షి’ పరిశీలనలో 11 యూనిట్లు మాత్రమే ఉన్నట్టు తేలింది.
రూ. 55 వేలకు గొర్రెలు ఇవ్వడానికి సిద్ధం
ముద్దాయిపల్లి గ్రామంలో 10 యూనిట్ల గొర్రెలు వచ్చాయంటే ఆ గ్రామానికి వెళ్లాం. ఊరు చివరిలో ఓ గొర్రెల కాపరి కనిపించాడు. ‘సర్కారు గొర్రెలు ఉంటే అమ్ముతారా..? పెద్దాయనా..’ అని అడిగాం. ‘మాకు ఇంకా రాలేదు బిడ్డా... ఫలానా వాళ్లకు వచ్చాయి. అమ్ముతమనే అంటున్నారు. వెళ్లి కలవండి’ అని సూచించాడు. ఊరు చివర చెరువు కొమ్మున గొర్రెలు మేపుతున్న వాళ్ల దగ్గరకు మమ్ముల్ని తీసుకెళ్లాడు. ఓ లబ్ధిదారుడి కోసం ప్రయత్నం చేస్తే ఐదుగురు జమయ్యారు. అందరూ గొర్రెలు అమ్ముడానికి ముందుకొచ్చారు. యూనిట్ గొర్రెలను మొత్తంగా రూ.50 వేలు ఇస్తామని బేరం మొదలుపెట్టాం. వాళ్లు రూ.62 వేలు అన్నారు. మేం మరో వెయ్యి పెంచాం. వాళ్లు రూ.2 వేలు తగ్గారు. మొత్తానికి 56 వేల దగ్గర బేరం ఆపేశాం. ఇంకా కిందకు దిగితే బేరం కుదిరేటట్టు ఉంది. దీంతో పుల్కల్‌లో పని ఉందని, మళ్లీ వస్తామని చెప్పాం. ఇంతకీ ఎందుకు అమ్ముకుంటున్నారని వారితో మాట కలిపాం. ‘రూ.80 వేలకు వచ్చే గొర్రెలను, రూ.1.25 లక్షలకు అంటగడుతుండ్రు. గుంపులోంచి మూడు నాలుగు గొర్రెలు వచ్చీ రావడంతోనే చస్తున్నాయి. ఇంకెన్ని చస్తాయో తెల్వదు. వీటికి మందులు వేయడానికి డాక్టర్లు రారు. ఏ మందు వేయాలో మాకు తెల్వదు. నష్టపోవడం కంటే ఇంత లాభం వచ్చేటప్పుడు అమ్ముకునుడే నయం..’ అని లబ్ధిదారులు వివరించారు.
ఉద్‌గిరిలో గొర్రెలు ఎట్లా పుడుతున్నాయబ్బా?
సబ్సిడీ పథకం ప్రారంభానికి ముందే సంగారెడ్డి జిల్లా పశు సంవర్థక శాఖ అధికారులు మహారాష్ట్రలోని ఉద్‌గిరి తాలూకాలో గొర్రెల లభ్యతపై ఒక సర్వే చేశారు. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఉద్‌గిరి తాలూకా సరిహద్దుగా ఉంది. అక్కడ గొర్రెల లభ్యతపై వివరాలు సేకరించగా.. 2,500లకు మించి గొర్లు లభించే పరిస్థితి లేదని తేల్చారు. దీంతో ఈ ప్రాంతం నుంచి గొర్రెలు సేకరించలేమని అధికారులు కర్నూలు వైపు ప్రయాణించారు. కానీ విచిత్రంగా ఉద్‌గిరి నుంచే కామారెడ్డి జిల్లాలోని బాన్స్‌వాడ, పిట్లం, బిచ్‌కుంద ప్రాంతాలకు వేల సంఖ్యలో గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఇన్ని వేల గొర్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయని అడిగితే ఏ అధికారి వద్ద సమాధానం లేదు.
చావులకు ప్రయాణమే కారణమా?
ఇంటికి వచ్చిన వారం రోజుల లోపు ప్రతి యూనిట్‌లో సగటున మూడు గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. చనిపోతున్న గొర్రెల్లో 6 నెలల లోపు పిల్లలు, ఐదేళ్లకు పైబడిన గొర్రెలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ మరణానికి కారణం అధిక ప్రయాణమేనని పశువైద్య అధికారులు అంటున్నారు. కానీ విషయం బయటికి చెప్పడానికి బయపడి ‘ఫుట్‌రాట్’ వ్యాధి అని చెబుతున్నారు. లారీల్లో గొర్రెలను తరలిస్తుండగా.. నిలబడేందుకు ఆధారం దొరక్క కిందపడిపోయి కొన్ని, తొక్కిసలాటలో కొన్ని గాయపడుతున్నాయి. ప్రయాణం చేసినంతసేపు జీవాలు నరాలు బిగపట్టుకొని నిలబడటంతో జబ్బున పడుతున్నాయి. ఇవి తిరిగి మామూలు స్థితికి చేరుకోవడానికి కనీసం 15 రోజుల సమయం పడుతుంది. కానీ 15 రోజులు తిరక్క ముందే గొర్రెల కాపర్లు మళ్లీ దళారీల చేతిలో పెడుతున్నారు. జూలై 20 నుంచి ఇప్పటి వరకు ఈ మూడు నెలల కాల వ్యవధిలో ప్రతి గొర్రె సగటున 2,500 కి.మీ. దూరం ప్రయాణం చేసి ఉండొచ్చని అంచనా. ఈ సుదీర్ఘ ప్రయాణం వల్లే చిన్న పిల్లలు, వయసు మీద పడిన గొర్రెలు చనిపోతున్నాయి. మొదటి దశలో పెద్దగా ప్రాణనష్టం లేదు గానీ, రెండో దశలో అధిక ప్రాణనష్టం ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80 వేల దాకా గొర్రెలు మృత్యువాత పడ్డట్లు సమాచారం.
సంతకు తరలిస్తున్న సబ్సిడీ గొర్రెల పట్టివేత
కోదాడ రూరల్: కోదాడ నుంచి ఏపీలోని చిల్లకల్లు సంతకు రెండు వాహనాల్లో తరలిస్తున్న 48 గొర్రెలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం సమీపంలో రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద తనిఖీల సందర్భంగా వీటిని పట్టుకున్నారు. వీటిలో సాధారణ గొర్రెలతోపాటు ఇటీవల సర్కారు అందజేసిన సబ్సిడీ గొర్రెలు కూడా ఉన్నట్లు గుర్తించారు. స్థానిక పశువైద్యాధికారి నాగేంద్రబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు.
చెక్‌పోస్టులను బలోపేతం చేశాం
గొర్రెల రీసైక్లింగ్ ఘటనలు మా దృష్టికి కూడా వచ్చాయి. అందుకే పశుసంవర్థక, పోలీస్, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో కలిపి టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. సరిహద్దు చెక్‌పోస్టులను బలోపేతం చేశాం. ఇప్పటికే కొన్ని లారీలు సీజ్ చేశాం. గొర్రెలు అమ్ముకున్న వారిపై, కొనుగోలు చేసిన దళారులపై కేసులు పెడుతున్నాం. వాతావరణ మార్పుల వల్లే అక్కడక్కడ కొన్ని గొర్లు చనిపోతున్నాయి.
– వి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీ
Comments
Please login to add a commentAdd a comment