జత రూ.3 లక్షలు పలికిన ధర
శనివారం నాటి సంతలో ఒక్కరోజే రూ.20 కోట్ల దాకా వ్యాపారం
మూడు రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు
రాష్ట్రంలోనే పొట్టేళ్ల సంతగా బైరెడ్డిపల్లి ప్రత్యేకత
బైరెడ్డిపల్లి/పలమనేరు( చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లిలో పొట్టేళ్ల సంతకు ప్రసిద్ధి. ఈ నెల 16న బక్రీద్ పండగను పురస్కరించుకుని ముందస్తుగానే కొందరు మాంసాహారం కోసం పొట్టేళ్లను ఇక్కడకొచ్చి కొనడం ఆనవాయితీ. ఆ మేరకు శనివారం జరిగిన వారపు సంతలో జత పొట్టేళ్లు గరిష్టంగా రూ.3 లక్షల దాకా పలికాయి. సాధారణంగా జత పొట్టేళ్లు్ల రూ.40 వేల దాకా ఉంటాయి.
రాష్ట్రంలోనే పొట్టేళ్ల వారపుసంతగా పేరొందిన సంత చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో జరుగుతుంది. ఇక్కడ లభించే నాణ్యమైన, రుచికరమైన పొట్టేళ్ల కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి వచ్చి వ్యాపారులు పొట్టేళ్లను కొని తీసుకెళుతుంటారు. పండుగకు ముందు సంత కావడంతో పొట్టేళ్లను విక్రయించే రైతులు, కొనే వ్యాపారులతో సంత ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది.
ఇక వాహనాలైతే మూడు కిలోమీటర్ల మేర బారులుతీశాయి. ముఖ్యంగా కాశ్మీరీ మేకపోతులు, స్థానికంగా పెంచిన పొట్టేళ్లు మాత్రం లక్షల్లో ధరలు పలకడం విశేషం. బక్రీద్ నేపథ్యంలో శనివారం జరిగిన వారపుసంతకు పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు సుమారుగా 40 నుంచి 50 వేల దాకా వచ్చాయి. మొత్తం మీద ఇక్కడ పండుగ సంతలో రూ.20 కోట్ల దాకా క్రయ, విక్రయాలు జరిగాయి. వచ్చే శనివారమూ ఇదే స్థాయిలో వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
దళారులకు పండగే..
ఇక్కడి పొట్టేళ్ల సంతలో పండుగసంత కావడంతో దళారుల హవా కొనసాగింది. మొత్తం వ్యవహారం చేతిరుమాళ్ల ద్వారా రహస్య వ్యాపారాలతోనే జరిగింది. అటు రైతులు, ఇటు వ్యాపారులకు మధ్య బేరం కుదర్చడంలో దళారులే ఇక్కడ కీâ¶లకం. వీరికి ఇరువైపుల నుంచి నిర్ణయించిన మేర కమీషన్లు దక్కుతాయి.
కేవలం బక్రీద్ పండుగకు పొట్టేళ్లను పెంచి మంచి ధరలకు అమ్ముకోవడం రైతులకు మంచి ఆదాయంగా మారింది. దీంతో చిత్తూరు, అనంతపురం జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో బక్రీద్ పొట్టేళ్ల పెంపకం సాగుతోంది. ఏటా మేలో మంచి పొట్టేళ్ల కోసం రైతుల అన్వేషణ మొదలవుతుంది.
కందూరు, సోమల, సదుం, పీలేరు, అంగళ్లు, బైరెడ్డిపల్లె, బంగారుపేట(కర్ణాటక) తదితర ప్రాంతాల నుంచి మంచి గొర్రె పొట్టేళ్లను రైతులు కొనుగోలు చేస్తారు. అప్పటికే వీటి ధర రూ.10 వేల దాకా ఉంటుంది. ఆ తర్వాత వీటిని బాగా సంరక్షిస్తారు. పచి్చగడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి ఏడాది పాటు సాకుతారు. దీంతో బక్రీద్ పండుగకల్లా కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి.
ఇక్కడి పొట్టేళ్ల మాంసం చాలా రుచి
నేను బైరెడ్డిపల్లి సంతంలో 30 ఏళ్ల నుంచి బక్రీద్ పొట్టేళ్లను కొంటున్నా. మా ప్రాంతంలో బైరెడ్డిపల్లి పొట్టేళ్లకు భలే డిమాండ్. వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఫారాల్లో మేపే పొటేళ్లలో ఈ రుచి రాదు. అందుకే ఇక్కడి కొచ్చి కొంటుంటాం. – అబ్దుల్ బాషా, గుడియాత్తం, తమిళనాడు
ఇక్కడి పొట్టేళ్లకు భలే డిమాండ్
ఈ ప్రాంతంలోని రైతులు కొండల్లో, బీడు భూముల్లో పొట్టేళ్లను మేపుతుంటారు. దీంతో ఫామ్‌లో ఉండే వాటి కన్నా వీటి శరీరం దృఢంగా ఉంటుంది. దీంతో పాటు రుచి బాగుంటుంది. ఇక మేకలను అటవీప్రాంతంలో మేపుతారు. అవి అడవుల్లోని పలురకాల ఔషధ గుణాలున్న ఆకులను తినడంతో వీటికీ డిమాండ్ ఎక్కువగా ఉంది. – డా.వేణు, గొర్రెల పరిశోధన కేంద్ర చీఫ్ సైంటిస్ట్, పలమనేరు
Comments
Please login to add a commentAdd a comment