
హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం
బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌పై మండిపాటు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది.
మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం టీఎంసీ ప్రభుత్వానికి షాక్ వంటిదని చెబుతున్నారు.
ఎంపిక ప్రతి దశలోనూ పాల్పడిన అక్రమాలను కప్పిపుచ్చుకు నేందుకు డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ చేసిన అతి ప్రయత్నాల వల్ల ప్రస్తుతం పరిశీలన, ధ్రువీకరణ అసాధ్యంగా మారాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవకత వకల కారణంగా మొత్తం ఎంపిక ప్రక్రియ ఉద్దేశపూర్వకంగా లోపభూయిష్టంగా మారిందని నమ్ముతున్నట్లు స్పష్టం చేసింది. కోల్‌కతా హైకోర్టు మొత్తం నియామకాలను రద్దు చేస్తూ 2024 ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును సమర్థించింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, ఒక్క వ్యక్తి చేసిన తప్పిదానికి అందరినీ ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. మానవీయ కోణంలో ఈ తీర్పును అంగీకరించబోనంటూనే సుప్రీం ఆదేశాలను అమలు చేస్తానని, న్యాయవ్యవస్థను గౌరవిస్తానంటూ ప్రకటించారు.