కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఒక సిట్టింగ్ ఎంపీ సహా ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను రద్దు చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. వారి నామినేషన్లు పత్రాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిషన్‌ని ఆశ్రయించింది.
బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోల్‌కతా-దక్షిణ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలా రాయ్ ఎంపీగానే కాకుండా కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారని పేర్కొన్నారు. లాభదాయకమైనదిగా పరిగణించే ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె ఈసారి నామినేషన్ దాఖలు చేశారని చటోపాధ్యాయ చెప్పారు.
మరో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హత్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న హాజీ నూరుల్ ఇస్లాం నామినేషన్‌ను కూడా రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నూరుల్ ఇస్లాం ఇదే నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు.
నామినేషన్ దాఖలు చేసేవారెవరైనా ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వ, శాసనసభ లేదా పార్లమెంటరీ హోదాలో ఉన్నట్లయితే తమ నామినేషన్‌తో పాటు గత 10 సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుందని, కానీ నూరుల్ ఇస్లాం ఆ నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించలేదని బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీర్భూమ్ లోక్‌సభ నియోజకవర్గానికి తమ మొదటి అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి దేబాసిష్ ధర్ నామినేషన్‌ను ఇదే కారణంతో రద్దు చేశారని ఛటోపాధ్యాయ గుర్తు చేశారు. దీంతో తాము అభ్యర్థిని మార్చవలసి వచ్చిందన్నారు. రాయ్, ఇస్లాం నామినేషన్లలో ఈ లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే ఈసీని ఆశ్రయించామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు సహా ఎంత వరకూ అయినా వెళ్తామని చటోపాధ్యాయ స్పష్టం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఎటువంటి స్పందన లేదు.
Comments
Please login to add a commentAdd a comment