8 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు
మైక్రో కంట్రోలర్ చిప్‌ల ట్యాంపరింగ్‌పై అనుమానాలు వ్యక్తంచేస్తూ ఈసీకి అభ్యర్థనలు
ఏపీ, ఒడిశా అసెంబ్లీలకు సంబంధించి మూడు దరఖాస్తులు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై కొందరు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తంచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈవీఎంలలోని మైక్రో–కంట్రోలర్ చిప్‌లు ట్యాంపరింగ్‌కు గురయ్యాయో లేదో తనిఖీ చేయాలని ఆయా లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు.
ఇలా ఆరు రాష్ట్రాల పరిధిలోని ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులుసహా ఎనిమిది దరఖాస్తులు ఈసీకి అందాయి. తమిళనాడు, హరియాణాలో చెరో రెండు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధప్రదేశ్, తెలంగాణలో చెరో స్థానంలో ఇలా మొత్తంగా 8 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయి.
పేపర్ బ్యాలెట్ విధానానికి మారుదామంటూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ, ఈవీఎం విధానాన్ని సమర్థిస్తూ ఏప్రిల్ 26వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువడిన వేళ ఇలా ఈసీకి అభ్యర్థనలు రావడం గమనార్హం.
అయితే ఆయా నియోజకవర్గాల్లో ఓడి రెండో, మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థులు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేస్తే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్‌గా ఐదు శాతం ఈవీఎంలను చెక్‌చేసేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది.
ఈ వెసులుబాటును వినియోగించుకుంటూ ఓడిన అభ్యర్థులు కొందరు తాజాగా ఈసీని ఆశ్రయించగా ఆయా వివరాలను ఈసీ వెల్లడించింది. ఆరు రాష్ట్రాల్లో కలిపి 92 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను చెక్ చేయనున్నారు. అయితే ఒక్కో ఈవీఎం సెట్‌ను తనిఖీచేయడానికి నిర్వహణ ఖర్చుగా రూ.47,200ను ఆ అభ్యర్థి ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుందని జూన్ ఒకటో తేదీన ఈసీ ఒక ప్రకటన జారీచేయడం తెల్సిందే.
ఈవీఎంల తనిఖీ ఖర్చును భారత్ ఎలక్ట్రానిక్స్ (బెల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్)లు రూ.40,000 నిర్ణయించగా జీఎస్టీ 18 శాతం(రూ.7,200) కలుపుకుంటే ఖర్చు రూ. 47,200గా తేలింది. అయితే ఈవీఎంల తరలింపు, వాటిని తనిఖీని రికార్డ్ చేసేందుకు సీసీటీవీల ఏర్పాటు, విద్యుత్ చార్జీలు, వీడియోగ్రఫీ, జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో ఇతర నిర్వహణ ఖర్చులు అదనంగా ఉండొచ్చని తెలుస్తోంది.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి సంజయ్ రాధాకృష్ణ విఖే పాటిల్ 40 పోలింగ్ కేంద్రాల్లో తనిఖీ చేయాలని దరఖాస్తుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక లోక్‌సభ పరిధిలోని 4 పోలింగ్ స్టేషన్లను, హరియాణాలోని రెండు లోక్‌సభ స్థానాల్లోని 6 పోలింగ్ స్టేషన్లను, తమిళనాడులోని 2 లోక్‌సభ స్థానాల్లోని 20 పోలింగ్ స్టేషన్లను అభ్యర్థులు తనిఖీకి ఎంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో ఈవీఎంలను తనిఖీ చేయాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోరారు. గజపతినగరం అసెంబ్లీ స్థానంలో ఒక పోలింగ్ స్టేషన్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్ స్టేషన్లను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎంచుకున్నారు. తెలంగాణలోని జహీరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న నారాయణ్‌ఖేడ్‌లో 7 , జహీరాబాద్‌లో 7, ఆందోల్‌లో 6 పోలింగ్ స్టేషన్లను బీజేపీ అభ్యర్థి ఎంచుకున్నారు. ఒడిశాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 13 పోలింగ్ స్టేషన్లను బీజేడీ అభ్యర్థి ఎంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment