micro chip
-
Lok Sabha Elections 2024: ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై కొందరు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తంచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈవీఎంలలోని మైక్రో–కంట్రోలర్ చిప్‌లు ట్యాంపరింగ్‌కు గురయ్యాయో లేదో తనిఖీ చేయాలని ఆయా లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ఆరు రాష్ట్రాల పరిధిలోని ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులుసహా ఎనిమిది దరఖాస్తులు ఈసీకి అందాయి. తమిళనాడు, హరియాణాలో చెరో రెండు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధప్రదేశ్, తెలంగాణలో చెరో స్థానంలో ఇలా మొత్తంగా 8 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. పేపర్ బ్యాలెట్ విధానానికి మారుదామంటూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ, ఈవీఎం విధానాన్ని సమర్థిస్తూ ఏప్రిల్ 26వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువడిన వేళ ఇలా ఈసీకి అభ్యర్థనలు రావడం గమనార్హం. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఓడి రెండో, మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థులు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేస్తే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్‌గా ఐదు శాతం ఈవీఎంలను చెక్‌చేసేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఈ వెసులుబాటును వినియోగించుకుంటూ ఓడిన అభ్యర్థులు కొందరు తాజాగా ఈసీని ఆశ్రయించగా ఆయా వివరాలను ఈసీ వెల్లడించింది. ఆరు రాష్ట్రాల్లో కలిపి 92 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను చెక్ చేయనున్నారు. అయితే ఒక్కో ఈవీఎం సెట్‌ను తనిఖీచేయడానికి నిర్వహణ ఖర్చుగా రూ.47,200ను ఆ అభ్యర్థి ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుందని జూన్ ఒకటో తేదీన ఈసీ ఒక ప్రకటన జారీచేయడం తెల్సిందే. ఈవీఎంల తనిఖీ ఖర్చును భారత్ ఎలక్ట్రానిక్స్ (బెల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్)లు రూ.40,000 నిర్ణయించగా జీఎస్టీ 18 శాతం(రూ.7,200) కలుపుకుంటే ఖర్చు రూ. 47,200గా తేలింది. అయితే ఈవీఎంల తరలింపు, వాటిని తనిఖీని రికార్డ్ చేసేందుకు సీసీటీవీల ఏర్పాటు, విద్యుత్ చార్జీలు, వీడియోగ్రఫీ, జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో ఇతర నిర్వహణ ఖర్చులు అదనంగా ఉండొచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి సంజయ్ రాధాకృష్ణ విఖే పాటిల్ 40 పోలింగ్ కేంద్రాల్లో తనిఖీ చేయాలని దరఖాస్తుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక లోక్‌సభ పరిధిలోని 4 పోలింగ్ స్టేషన్లను, హరియాణాలోని రెండు లోక్‌సభ స్థానాల్లోని 6 పోలింగ్ స్టేషన్లను, తమిళనాడులోని 2 లోక్‌సభ స్థానాల్లోని 20 పోలింగ్ స్టేషన్లను అభ్యర్థులు తనిఖీకి ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలను తనిఖీ చేయాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరారు. గజపతినగరం అసెంబ్లీ స్థానంలో ఒక పోలింగ్ స్టేషన్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్ స్టేషన్లను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎంచుకున్నారు. తెలంగాణలోని జహీరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న నారాయణ్‌ఖేడ్‌లో 7 , జహీరాబాద్‌లో 7, ఆందోల్‌లో 6 పోలింగ్ స్టేషన్లను బీజేపీ అభ్యర్థి ఎంచుకున్నారు. ఒడిశాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 13 పోలింగ్ స్టేషన్లను బీజేడీ అభ్యర్థి ఎంచుకున్నారు. -
హైదరాబాద్‌లో మైక్రోచిప్ ఆఫీసు
సాక్షి, సిటీబ్యూరో: కార్యాలయ స్థలాల లావాదేవీలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ ఆఫీసు స్పేస్‌ను కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన సెమీకండకర్ల తయారీ కంపెనీ మైక్రోచిప్ టెక్నాలజీ కోకాపేటలోని వన్ గోల్డెన్ మైల్ టవర్‌లో 1.68 లక్షల చదరపు అడుగుల గ్రేడ్-ఏ ఆఫీసు స్థలాన్ని కొనుగోలు చేసింది. డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఈ లావాదేవీలకు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సలహాదారుగా వ్యవహరించింది. అమెరికాలోని ఆరిజోనా ప్రధాన కేంద్రంగా ఉన్న మైక్రోచిప్‌కు మన దేశంలో హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నైలలో డెవలప్మెంట్ సెంటర్లున్నాయి. తాజా పెట్టుబడులు వచ్చే 10 ఏళ్లలో కంపెనీ సామర్థ్యాల విస్తరణ, నియామకాలు, అభివృద్ధి ప్రణాళికలకు సరిపోతాయని మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ శ్రీకాంత్ శెట్టికెరె అన్నారు. 66 మీటర్ల ఎత్తయిన వాణిజ్య సముదాయంలో సుమారు 5 లక్షల చ.అ. గ్రేడ్-ఏ ఆఫీసు స్థలం ఉంది. ఆరియన్, ఎస్కార్, టెర్మినస్‌లు ఈ ప్రాపర్టీని కో-ప్రమోటర్లుగా ఉన్నాయి. యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్జీబీసీ) నుంచి ఎల్ఈఈడీ గోల్డ్ రేటింగ్ సర్టిఫికెట్‌ను దక్కించుకుందని వన్ గోల్డెన్ మైల్ మేనేజింగ్ పార్టనర్ పుష్కిన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆర్ధిక మాంద్యం, లేఆఫ్‌లు వంటి వ్యాపార ఒత్తిడి నేపథ్యంలోనూ హైదరాబాద్‌లో ప్రీమియం ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం సానుకూల దృక్పథమని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ హైదరాబాద్ ఎండీ వీరాబాబు తెలిపారు. -
‘ఇస్మార్ట్’ క్రికెట్
సిడ్నీ : సాంకేతికత పుణ్యమా అని క్రికెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం నుంచి ప్రస్తుతం డీఆర్ఎస్ వరకు ఆధునిక క్రికెట్ రూపాంతరం చెందుతోంది. టెక్నాలజీ రాకతో అంపైర్ల పని కూడా సులువైంది. అల్ట్రా ఎడ్జ్, హకాయ్, హాట్‌స్పాట్, స్టంప్ మైక్రొఫోన్, బాల్ ట్రాకింగ్ వంటివి క్రికెట్లో అతిసాధారణమైనవిగా మారిపోయాయి. తాజాగా క్రికెట్లో మరో పెను మార్పుకు కూకాబుర్ర సంస్థ శ్రీకారం చుట్టింది. అన్నీ కుదిరితే త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో ఇస్మార్ట్(స్మార్ట్) బంతులను చూస్తాం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్ర సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఈ బంతులను అన్ని విధాల పరీక్షించామని.. త్వరలో బిగ్‌బాష్ లీగ్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలించి అంతర్జాతీయ స్థాయిలో ఫలితాలు ఎలా ఉంటాయో అంచనావేస్తామని పేర్కొంది. ఇస్మార్ట్ బంతులు అంటే? మామూలు కూకాబుర్రా బంతుల్లాగే ఉంటాయి. కానీ ఆ బంతుల్లో మైక్రో చిప్‌లను అమర్చుతారు. అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్లు అత్యంత కచ్చితత్వంతో నిర్ణయాలు ప్రకటించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్ర సంస్థ మైక్రో చిప్‌లతో (స్మార్ట్ బంతి) కూడిన క్రికెట్ బంతుల్ని తయారు చేస్తోంది. ఈ ప్రత్యేకమైన బంతులు వేగం, బౌన్స్ తదితర అంశాలను సాధారణ రాడార్ కన్నా మరింత కచ్చితత్వంతో అందిస్తాయని కూకాబుర్ర ప్రకటించింది. ఇక స్పిన్నర్లకు ఎన్ని డిగ్రీల్లో బంతి టర్న్ అవుతోంది?. బంతిని ఎక్కడ విసిరితే ఎలా టర్న్ అవుతుంది? వంటి వివరాల్ని ఇవ్వనుంది. డీఆర్ఎస్, క్యాచ్‌ల విషయంలో ఈ స్మార్ట్ బంతులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ స్మార్ట్ బంతి తయారీ కోసం కూకాబుర్రతో స్పోర్ట్‌కోర్ అనే సంస్థ చేతులు కలిపింది. ఆస్ట్రేలియా మాజీ పేసర్ మైకెల్ కాస్ప్రోవిజ్ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న టీ20 క్రికెట్ లీగుల్లో ఈ బంతిని పరీక్షించాలని ఆ సంస్థలు కోరుకుంటున్నాయి. అందులో భాగంగానే మొదట బీబీఎల్‌లో ప్రయోగించనున్నారు. -
ఇక స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్‌లు
న్యూఢిల్లీ: దేశమంతటా ఒకే రకమైన డ్రైవింగ్ లైసెన్స్‌లను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఎక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా అన్నీ ఒకే పరిమాణం, రంగు, రూపురేఖలు, భద్రతా సౌకర్యాలతో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది జూలై నుంచి ఈ రకమైన కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు దేశంలోని అన్ని రోడ్డు రవాణా కార్యాలయాల్లోనూ జారీ అవుతాయని తెలుస్తోంది. ఆ తర్వాత కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారితోపాటు పాత వాటిని రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఈ కొత్త ఫార్మాట్లోనే లైసెన్స్‌లను జారీ చేయనున్నారు. ఈ లైసెన్స్‌లపై జాతీయ, సబంధిత రాష్ట్ర చిహ్నాలు ఉంటాయి. భద్రత కోసం కార్డుల్లో మైక్రో చిప్‌లను అమర్చి, క్యూఆర్ కోడ్లను కూడా ముద్రించనున్నారు. లైసెన్స్‌దారుడి సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ప్రస్తుతం మెట్రోరైళ్ల స్మార్ట్‌కార్డుల్లో వాడుతున్న ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) టెక్నాలజీని కూడా కొత్త డ్రైవింగ్ లైసెన్సుల్లో వాడొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఫార్మాట్లలో డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తుండటంతో ఇతర రాష్ట్రాల్లోని ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. -
కొత్త మోసాలకు తెర!
సాక్షి, గుంటూరు: రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల్లో ఉన్న అత్యాశను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు తెగబడుతున్నారు. లాటరీ టికెట్లు, లక్కీ డ్రాలో గిఫ్ట్‌లు గెలుచుకున్నారు, బ్యాంక్ అధికారుల మంటూ ఫోన్లు, మెసేజ్‌లు చేసి క్రెడిట్, డెబిట్ కార్డుల పాస్వర్డులు తెలుసుకుని అకౌంట్లు ఖాళీ చేయడం ఇప్పటి వరకూ మనం చూశాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా కొందరు కేటుగాళ్లు టెక్నాలజీని వినియోగించి పోలీసులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. పేక ముక్కలు, చేతి వాచీలకు మైక్రో చిప్‌లు అమర్చి సెల్‌ఫోన్ స్కానర్ల ద్వారా పేకాటరాయుళ్లని బురిడి కొట్టించి రూ. లక్షల్లో డబ్బు దోచేయ్యడం, నౌకరీ డాట్ కామ్ ద్వారా పరిచయమై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేయడం వంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఘరాన మోసాలు.. ఇటీవల తెనాలి–2టౌన్ పరిధిలో ఇద్దరు యువకులు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సెల్‌ఫోన్‌కు మైక్రోచిప్‌లను అనుసంధానం చేశారు. వాటిని ప్రత్యేకంగా పేక ముక్కల్లో అమర్చి నకిలీ పేకలను తయారు చేయించారు. ఆపై వాటిని వినియోగిస్తూ, చేతివాచీ, నడుం కెమెరా, డబ్బు కట్టల్లో స్కానర్లు, ఎదుటి వారి పేకల వివరాలను సునా యాసంగా తెలుసుకునేలా రూపొందిం చారు. ఒకవేళ సెల్‌ఫోన్‌ను పేకాట వద్ద అనుమతింకపోతే కీచైన్‌లో అమర్చిన స్కానర్ల తో సెల్‌ఫోన్ నుంచి బ్లూటూత్ ద్వారా వచ్చే సమాచారం ద్వారా తెలుసుకుంటూ ఎదుటి వారిని మోసం చేస్తూ సొమ్ము చేసుకుని గుంటూరు రూరల్ పోలీసులకు పట్టుబడ్డారు. ముఠా చేసిన మోసానికి రేపల్లేకు చెందిన ఒక వ్యక్తి రూ. 40 లక్షలు మోసపోయి ఆత్మహత్యకు యత్నించాడు. ఇదే తరహాలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి రూ. 15లక్షలు మోసపోయాడు ఇలా వీరి చేతిలో మోసపోయిన వారి చిట్టా చాలనే ఉంది. ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమూల్యా అనే వ్యక్తి నౌకరీ డాట్ కామ్ అనే జాబ్ అలర్ట్స్ వెబ్ సైట్ ద్వారా జిల్లాకు చెందిన కొందరికి పరిచయమై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని వి«విధ జిల్లాలోని నిరుద్యోగుల నుంచి రూ. కోటికిపైగా వసూలు చేసిన ఘటన సైతం ఈ కోవకు చెందినదే. ఆందోళనలో పేకాట రాయుళ్లు, నిరుద్యోగులు వరుస ఘటనల నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని పేకాట శిబిరాల్లో కొత్త వ్యక్తులకు ప్రవేశం ఇవ్వడానికి ఆయా యజమానులు భయపడుతున్నట్టు తెలుస్తోంది. పేకాటరాయుళ్లు సైతం పరిచయం లేని వ్యక్తులతో పేకాట ఆడేందుకు సుముఖత చూపడం లేదని తెలుస్తోంది. ఏ వైపు నుంచి ఎలాంటి మోసం చేస్తారోనని పేకాటరాయుళ్లు, శిబిరాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగులు సైతం ఉద్యోగం ఇంటర్నెట్లో వచ్చే వివిధ రకాల జాబ్ అలర్ట్‌లు నమ్మడానికి వెనుకాడుతున్నారు. ప్రైవేటు వెబ్సైట్లలో కేటుగాళ్లు కాచుకు కూర్చుని మోసాలకు పాల్పడుతుండటంతో కొత్త వ్యక్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వచ్చినా ఆ ఉద్యోగాల్లో చేరేందుకు భయపడుతున్నారు. బంధువులు, స్నేహితుల ద్వారా రెఫరెన్సులు పెట్టించుకుని ఉద్యోగాల్లో చేరేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా వచ్చే జాబ్ అలర్ట్స్‌ను మా త్రమే యువత పా టించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ వెబ్సైట్లలో మాత్రమే కచ్చితమైన సమాచారం ఉంటుంది. ఎవరూ మోసాలకు పాల్పడ్డానికి అవకాశం ఉండదు. వెబ్సైట్ల ద్వారా పరిచయమై ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారిని నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలి.– సీహెచ్. వెంకటప్పలనాయుడు, రూరల్ ఎస్పీ -
ట్రంప్‌కిచ్చిన గిఫ్ట్‌లో మైక్రోచిప్..!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య హెల్సింకిలో జరిగిన సమావేశం సంచలనాలు రేకెత్తిస్తోంది. ఈ సదస్సులో పుతిన్, ట్రంప్‌నకు ఫుట్‌బాల్‌ను ప్రెజెంట్ చేశారు. అయితే, బంతిలో మైక్రోచిప్ ఉందంటూ అమెరికా సెనేటర్ లిండ్స్ గ్రాహమ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఇది నిజమేనని తేలింది. ఫుట్‌బాల్‌లో మైక్రోచిప్ ఉంది. అది రష్యా అమర్చినది కాదు. అడిడాస్ కంపెనీ తయారు చేసిన ఆ బంతిలో చిప్‌ను అమర్చినట్లు కంపెనీ ప్రకటించింది ప్రపంచకప్ సందర్భంగా బంతిని ప్రత్యేకంగా తయారు చేసినట్లు పేర్కొంది. అందులో అమర్చిన చిప్ ద్వారా తన్నడానికి దగ్గరకు వచ్చిన ఆటగాడి వివరాలను ప్రేక్షకులకు చేరవేసేందుకు ఇలా చేశామని తెలిపింది. కాగా, పుతిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఫుట్‌బాల్‌ను ట్రంప్ 12 ఏళ్ల బారన్(ట్రంప తనయుడు)కు ఇచ్చారు. -
లాంగ్‌లివ్ పిల్లి
సమ్‌థింగ్ స్పెషల్ పిల్లి జీవిత కాలం సుమారు 10-12 ఏళ్లు. మహా అంటే కొన్ని పిల్లులు 20 ఏళ్లు బతుకుతాయి. కానీ ఈ ఆస్ట్రేలియా పిల్లి వయసు పాతికేళ్లు! పైగా ఇది 12వేల మైళ్ల దూరం ప్రయాణించి ఉత్తర ఐర్లాండ్‌కు చేరి, అక్కడి కౌంటీ ఆర్మాగ్లోని పిల్లుల సంరక్షణ సంస్థ కంటపడింది. వారు ఈ గోధుమ రంగు పిల్లిని పరీక్షల కోసం పశువైద్యుల వద్దకు పంపారు. ఆ సందర్భంలో ఈ పిల్లికి ఆస్ట్రేలియాలో ఎవరో ఓ మైక్రో చిప్‌ను అమర్చినట్టు డాక్టర్లు గుర్తించారు. అందులోని సమాచారం ప్రకారం ఆ పిల్లి 1989లో పుట్టిందని, దాని పేరు టిగ్గర్ అని ఉంది. తర్వాత ఆర్మాగ్ పిల్లుల సంరక్షణ సంస్థ ఉద్యోగులు దానికి ‘ఒజ్జీ’ అని పేరు పెట్టి ముద్దుగా చూసుకుంటున్నారు. అలాగే ఆ సంస్థ అధికారులు ఈ పిల్లి ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతో పాటు పిల్లికి అమర్చిన మైక్రోచిప్‌లో దాని యజమానుల వివరాలేవీ లేవని, వెంటనే ఒజ్జీ యజమానులు తమను సంప్రదించాలని కోరారు ఆర్మాగ్ పిల్లుల సంరక్షణ అధికారులు. -
కేన్సర్ లక్షణాలను గుర్తించే స్మార్ట్‌ఫోన్!
కేన్సర్ లక్షణాలను స్మార్ట్ఫోన్లు గుర్తిస్తాయంటే మీరు నమ్మగలరా? ఇప్పటికైతే కష్టమేమో గానీ.. రాబోయే రెండేళ్లలో ఇది సాధ్యం కాబోతోంది. కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసే ఒక చిన్న పరికరం ఈ మొత్తం పని పూర్తి చేస్తుంది. శాస్త్రవేత్తలు 'డిసీజ్ బ్రీతలైజర్' అనే చిన్న డెస్క్‌టాప్ పరికరం ఒకదాన్ని రూపొందించారు. అది బాగా పనిచేస్తున్నట్లు కూడా నిర్ధరించుకున్నారు. ఇక రెండేళ్ల వ్యవధిలో తాము దీన్ని మొబైల్ ఫోన్‌కు అనుసంధానం చేసేంత చిన్న పరిమాణంలోకి మార్చేస్తామని, కేవలం దానికి పెట్టుబడులు సాధించడమే ఇప్పుడు మిగిలిందని ఈ పరిశోధనలో పాల్గొన్న బిల్లీ బోయల్ తెలిపారు. ఈ పరికరంలో ఒక వేలి గోరంత పరిమాణంలో ఉండే మైక్రోచిప్ ఒకటి ఉంటుంది. దానికి రసాయనాలను గుర్తుపట్టేలా ప్రోగ్రామింగ్ చేయచ్చు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న రసాయనాలను కూడా ఇది ఇట్టే పసిగడుతుంది. దానివల్ల కేన్సర్ లాంటి వ్యాధుల లక్షణాలు ప్రాథమిక దశలోనే తెలిసిపోతాయి. రెండేళ్ల తర్వాత వచ్చే ఈ పరికరం కేన్సర్ చికిత్సలో ఓ పెద్ద విప్లవం కానుంది. ఇప్పటివరకు వ్యాధి బాగా ముదిరితే తప్ప కేన్సర్ లక్షణాలు బయటపడేవి కావు. దానివల్ల చికిత్స కూడా కష్టమయ్యేది, దానికి వ్యయం ఎక్కువ అవుతోంది, వ్యాధి కూడా ఒక పట్టాన లొంగట్లేదు. అదే ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే.. చికిత్స మరింత సులభతరం అవ్వడమే కాకుండా, రోగి త్వరగా కోలుకోడానికి కూడా అవకాశం ఉంటుంది.