లాంగ్‌లివ్ పిల్లి
సమ్‌థింగ్ స్పెషల్
పిల్లి జీవిత కాలం సుమారు 10-12 ఏళ్లు. మహా అంటే కొన్ని పిల్లులు 20 ఏళ్లు బతుకుతాయి. కానీ ఈ ఆస్ట్రేలియా పిల్లి వయసు పాతికేళ్లు! పైగా ఇది 12వేల మైళ్ల దూరం ప్రయాణించి ఉత్తర ఐర్లాండ్‌కు చేరి, అక్కడి కౌంటీ ఆర్మాగ్‌లోని పిల్లుల సంరక్షణ సంస్థ కంటపడింది. వారు ఈ గోధుమ రంగు పిల్లిని పరీక్షల కోసం పశువైద్యుల వద్దకు పంపారు. ఆ సందర్భంలో ఈ పిల్లికి ఆస్ట్రేలియాలో ఎవరో ఓ మైక్రో చిప్‌ను అమర్చినట్టు డాక్టర్లు గుర్తించారు.
అందులోని సమాచారం ప్రకారం ఆ పిల్లి 1989లో పుట్టిందని, దాని పేరు టిగ్గర్ అని ఉంది. తర్వాత ఆర్మాగ్ పిల్లుల సంరక్షణ సంస్థ ఉద్యోగులు దానికి ‘ఒజ్జీ’ అని పేరు పెట్టి ముద్దుగా చూసుకుంటున్నారు. అలాగే ఆ సంస్థ అధికారులు ఈ పిల్లి ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దాంతో పాటు పిల్లికి అమర్చిన మైక్రోచిప్‌లో దాని యజమానుల వివరాలేవీ లేవని, వెంటనే ఒజ్జీ యజమానులు తమను సంప్రదించాలని కోరారు ఆర్మాగ్ పిల్లుల సంరక్షణ అధికారులు.