Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు? | West Bengal Lok Sabha Elections 2024 Matua voters in Bongaon | Sakshi
Sakshi News home page

Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?

Published Fri, May 17 2024 9:18 PM | Last Updated on Fri, May 17 2024 9:18 PM

West Bengal Lok Sabha Elections 2024 Matua voters in Bongaon

పశ్చిమ బెంగాల్‌లోని బన్‌గావ్‌ నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది. టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. సీఏఏ అనుకూల ప్రచారంతో బీజేపీ.. వ్యతిరేక ప్రచారంతో టీఎంసీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. మరి.. ఎక్కువ సంఖ్యలో ఉన్న మథువాల మద్దతు ఎవరికి ఉంది..? బీజేపీ సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకుంటుందా..? లేక టీఎంసీ మళ్లీ పుంజుకుంటుందా..?

బన్‌గావ్‌.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ సరిహద్దులోని లోక్‌సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గంలో మథువాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పార్టీల గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. దీంతో బీజేపీ, తృణమూల్‌ ఈ రెండూ పార్టీలు మథువా సామాజికవర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. గత ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శంతను కుమార్‌ బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా.. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి బిశ్వజిత్‌ దాస్‌ రంగంలో దిగారు.

బన్‌గావ్‌ లోక్‌సభ స్థానం 2009లో ఏర్పడింది. స్వాతంత్య్రం అనంతరం, 1971లో హిందూ శరణార్థులు భారీగా బనగావ్‌ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధ సమయంలో ఎక్కువ మంది వలస వచ్చారు. వీరిలో అత్యధికులు మథువాలే. ప్రస్తుతం బన్‌గావ్‌ ఓటర్లలో 67 శాతం దాకా వాళ్లే ఉన్నారు. ఇప్పుడు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తేవడంతో సహజంగానే వీరంతా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు.

ఇక.. బన్‌గావ్‌ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్‌ ప్రచారాన్ని బన్‌గావ్‌ నుంచి ప్రారంభించిన మోదీ.. మథువా సామాజికవర్గానికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన అత్యధిక ఓట్లు బీజేపీకే పడ్డాయి. అలా బన్‌గావ్‌లో తొలిసారి బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి శంతను ఏకంగా లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

అటు.. బన్‌గావ్‌ రాజకీయాలను బీనాపాణి దేవి కుటుంబం శాసిస్తోంది. 1947లో బీనాపాణి దేవి, ఆమె భర్త ప్రమథ్‌ రంజన్‌ ఠాకూర్‌ బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చి దక్షిణ కోల్‌కతాలోని బల్లిగంజ్‌లో స్థిరపడ్డారు. ప్రమథ్‌ ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. మథువాల హక్కుల కోసం పోరాడారు. వలస వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం కోసం.. స్థానిక ఠాకూర్‌ నగర్‌లో ఆయన భూమి కొనుగోలు చేశారు.

 ఆ స్థలంలో శరణార్థుల కోసం తొలి ప్రైవేట్‌ కాలనీ నిర్మించారు. ఆ తర్వాత ప్రమథ్‌ 1962లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా హన్స్‌ఖాలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలవగా.. కుమారుడు కపిల్‌ కృష్ణ ఠాకూర్‌ 2014లో ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం భార్య మమత 2015 ఉప ఎన్నికలో గెలిచారు. చిన్న కుమారుడు మంజుల్‌ కృష్ణ ఠాకూర్‌ టీఎంసీ ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆయన కుమారుడే బీజేపీ అభ్యర్థి శంతను.

మరోవైపు.. సీఏఏను తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మథువా వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపిందని మండిపడుతోంది. మథువాలకు ఇప్పటికే పౌరసత్వం, ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డు ఉండగా.. మళ్లీ కొత్తగా పౌరసత్వం ఇస్తామని బీజేపీ ఎలా చెబుతోందంటూ టీఎంసీ ప్రశ్నిస్తోంది. అసలు మథువాలు భారతీయ పౌరులు కాకపోతే.. వారు ఓటు ఎలా వేశారు..? ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్‌కు.. బెంగాల్‌ అసెంబ్లీకి ఎలా ఎన్నికయ్యారు అని నిలదీస్తోంది. మొత్తానికి హోరాహోరీగా ప్రచారం చేస్తున్న రెండు పార్టీల్లో మథువాలు ఎవరికి మద్దతుగా నిలుస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement